ఈ ఏడాది.. 95వ ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి.. ఈ నెల 12(రేపు)న లాస్ ఏంజిల్స్.. ఆస్కార్ పురస్కారాలకు వేదిక కాబోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ కు ఇప్పటికే ఎన్నో ప్రశంసలు దక్కాయి. రివార్డులు, అవార్డులు వచ్చాయి. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన సందర్భంగా.. ఆస్కార్ అవార్డు చరిత్ర.. ఇప్పటివరకూ ఈ పురస్కారం పొందిన భారతీయులెవరు.. వంటి ఆసక్తికర విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
అది 1983.. 55వ ఆస్కార్ వేడుక…
1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకిగానూ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో.. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు భాను. జాతిపిత మహాత్మాగాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆంగ్ల చిత్రమది. దర్శకుడు సహా ఎక్కువమంది ఇంగ్లాండ్ దేశస్తులే.. అయితే ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ మొల్లో, భారత్ కు చెందిన భాను అథైయా పని చేశారు.
నేపథ్యం…
1929 ఏప్రిల్ 28న, మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో జన్మించారు భాను అథైయా. ఆమె అసలు పేరు భానుమతి అన్నాసాహెబ్ రాజోపాధ్యాయ్. తండ్రి పలు సినిమాలకు ఫొటోగ్రఫీ చేయడంతో, భానుకు చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెరిగింది. ఆర్టిస్ట్ అయ్యేందుకు ముంబయిలోని ‘జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చదువు పూర్తి చేసింది.
1951లో, ఆమె స్వయంగా రూపొందించిన ‘లేడీ ఇన్ రెస్పాన్స్’ అనే ఆర్ట్ వర్క్‌కు ఉషా దేశ్‌ముఖ్ గోల్డ్ మెడల్ వరించింది. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటూనే, ఆర్టిస్ట్‌గా కెరీర్ కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ‘ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్’లో సభ్యురాలైంది. ‘ఈవ్స్ వీక్లీ’, ‘ఫ్యాషన్ అండ్ బ్యూటీ’వంటి మహిళా మ్యాగజైన్స్‌కు ఫ్రీలాన్సర్‌గా పని చేసింది. ఆమె ప్రతిభను మెచ్చిన ఈవ్స్ మ్యాగజైన్ ఎడిటర్… కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారితే బాగుంటుందనీ సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే డిజైనర్ గా మారారు. 1956లో తెరకెక్కిన ‘సీఐడీ’ తొలి చిత్రం.. ఆ తర్వాత ‘ప్యాసా’, ‘మీరా’, ‘సుహాగ్’, ‘షాలీమార్’, ‘అబ్ క్యా హోగా’, ‘ఆక్రమణ్’, ‘గాంధీ’, ‘లగాన్’, ‘లేకిన్’ వంటి 100కిపైగా సినిమాల్లో తనదైన మార్క్ కాస్ట్యూమ్స్‌ను రూపొందించి, పలు జాతీయ అవార్డులను అందుకున్నారు. అనారోగ్య సమస్యతో 2020 అక్టోబరు 15న, ఆమె 91 ఏళ్ల వయసులో మరణించారు.
దర్శక దిగ్గజం.. సత్యజిత్ రే…
భారతీయ చలనచిత్ర జగత్తు దశ, దిశను మార్చిన దర్శక దిగ్గజం.. సత్యజిత్ రే.. స్కీన్ర్ ప్లే రచయిత, కథారచయిత, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, చిత్రకారుడు, కళాదర్శకుడు.. అంతేకాక కథలు, వ్యాసాలు, నవలలు రాసిన సాహిత్యకారుడు కూడా..
సినిమాకు సంబంధించి ప్రతి విభాగంలో ఆయన నిష్ణాతుడనే చెప్పాలి.
1992లో.. ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ఆయనకు ఆనరరీ అవార్డు (గౌరవ పురస్కారం)ను ప్రకటించింది. అనారోగ్యం వల్ల వేడుకల్లో పాల్గొనలేకపోయినా.. ఆయన చికిత్స పొందిన కోల్‌కతాలోని ఆస్పత్రిలోనే ఆస్కార్‌ను అందించింది అకాడమీ. ఈ ఆనరరీ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు కూడా సత్యజిత్ రేనే..
1992 ఏప్రిల్ 23న అనారోగ్యం వల్ల కన్నుమూశారు.
తీసిన సినిమాలు.. ‘పథేర్ పాంచాలి’, ‘అపరాజితో’, ‘పరశ్ పాథర్’, ‘దేవి’, ‘అపూర్ సన్‌సార్’, ‘కాంచన్‌జంగా’, ‘చారులత’ వంటి 36 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
*1992 అనంతరం.. భారతీయులు ఆస్కార్‌ను అందుకోవడానికి దాదాపు 17 ఏళ్లు పట్టిందంటే అతిశయోక్తి కాదు..
దీనికి ప్రత్యామ్నయంగా.. 2009లో 81వ ఆస్కార్ వేడుక జరిగింది.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు ఆస్కార్ అవార్డులను ముగ్గురు భారతీయులు అందుకోవడం విశేషం. అది కూడా ఒకే సినిమాకి! ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’.
ఈ చిత్రానికిగానూ.. ‘బెస్ట్ సౌండింగ్ మిక్సింగ్’ కేటగిరీలో రసూల్.. రిచర్డ్ ప్రైక్, ఇయాన్ ట్యాప్ లతో కలిసి ఆస్కార్ పురస్కారం స్వీకరించారు.
నేపథ్యం…
1971 మే 30న కేరళలోని కొల్లాం జిల్లా విళక్కుపర గ్రామంలో రసూల్ జన్మించారు. స్వగ్రామంలో పాఠశాల లేదు. దీంతో అతను నిత్యం ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి, పక్క గ్రామం స్కూల్‌లో చదువుకున్నారట.
1990లో కేరళలోని ఓ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. తండ్రి కోరిక మేరకు తిరువనంతపురంలోని ‘లా’ కాలేజీలో చేరారు. కానీ ఎదో అసంతృప్తి.. ఎల్.ఎల్.బిని మధ్యలోనే వదిలేసి, సౌండింగ్‌పై ఇష్టం పెంచుకున్నారు.. అంతటితో ఆగకుండా పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి, శిక్షణ పొందారు.
అనంతరం, లా కోర్సును సైతం పూర్తిచేశారు. 2004లో ‘ముసాఫిర్’ అనే హిందీ సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. హిందితోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు(పుష్ప, రాధేశ్యామ్) చిత్రాలకు సౌండ్ మిక్సింగ్ చేశారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌లో..
1934 ఆగస్టు 18న పంజాబ్‌లో జన్మించారు గుల్జార్. అతను గేయ రచయిత, కవి, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత కూడా..
1963లో ‘బాందిని’తో.. లిరిసిస్ట్‌గా సినీజీవితాన్ని మొదలుపెట్టిన గుల్జార్.. అది మొదలు వందకుపైగా చిత్రాలకు సూపర్ హిట్ పాటలను అందించారు. వాటిల్లోని ఒకటైన ‘జయహో.. స్లమ్‌డాగ్ మిలియనీర్‌లోని.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంపికై, ఆస్కార్‌ను గెలుపొందారు.
సంగీత దర్శకుడు.. ఎ.ఆర్.రెహమాన్..
సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు..
ఎ. ఆర్. రెహమాన్. రెండు అకాడమీ అవార్డులు గెలుచుకున్న తొలి భారతీయుడిగా.. రికార్డు పొందారు.
స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికిగానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్(జయహో), బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో కలిపి ఆయన ఆస్కార్ అందుకున్నారు. 1967 జనవరి 6న మద్రాసులో జన్మించారు రెహమాన్. చిన్నతనంలోనే సంగీతానికి ప్రభావితమై, ఆ దిశగా అడుగులు వేశారు. ‘రోజా’తో సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టారు.
ఆయన భారతీయ సినిమాలతోపాటు హాలీవుడ్ చిత్రాలకు స్వరాలు సమకూర్చి, విశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ ఏడాది.. 95వ ఆస్కార్..
ఈ ఏడాది.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మార్చి 12న జరగనుంది.. ఈ వేడుకలో ‘నాటు నాటు సాంగ్’కు లైవ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఎవరిస్తారన్న అంశం.. అందరిలోనూ ఆసక్తి రేపింది. సినిమాలో నటించి, ఈ సాంగ్ కు అద్భుతమైన స్టెప్స్ వేసిన స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లే.. ప్రదర్శన ఇవ్వబోతున్నారా అన్న విషయమై..
తారక్ ఇటీవలే ఈ విషయంపై క్లారిటీనిచ్చారు. ఆస్కార్ వంటి స్టేజిపై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కచ్చితమైన ప్రాక్టీస్ అవసరం. అలాంటిది తమకు రిహార్సల్స్ చేయడానికే సమయం కుదరలేదు అంటూ చెప్పుకొచ్చారు తారక్. దీంతో తారక్, చెర్రీ పర్ఫార్మ్ చేయడం లేదని తేలిపోయింది.
ఈ సందిగ్ధంలో.. తానే లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చేదంటూ.. అమెరికన్ డ్యాన్సర్, నటి లారెన్ గోట్లిబ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
ప్రముఖ అమెరికన్ డాన్స్ షో ద్వారా పాపులర్ అయింది.. ఈ నటి.
గతంలో.. ప్రభుదేవా నటించిన హిందీ మూవీ ఏబీసిడితో ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది కూడా. ఆ తరువాత బాలీవుడ్ లోని ప్రముఖ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా, జడ్జిగా చేసింది.
ఇప్పుడు ఆస్కార్ వేదికపై వరల్డ్స్ ఫేమస్ సాంగ్ ని పర్ఫార్మ్ చేసే అవకాశం దక్కించుకుంది. ఇదే స్టేజి పై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పాటు పాట పాడిన సింగర్స్ రాహుల్ సిప్లిగుంజ్, కాలభైరవ కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు..
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు కచ్చితంగా ఆస్కార్ వస్తుందనే ఆశాభావం అందరిలో ఉంది.
ఇతరాంశాలు…
ఆస్కార్ అవార్డులన్నిటిలో ప్రామాణికం.. ఈ ట్రోఫీకి గణనీయమైన చరిత్ర ఉంది. గోల్డెన్ స్టాచ్యూ ట్రోఫీని ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’ అంటారు.
ఫ్రాన్స్‌కి చెందిన డెకో స్టయిలో మొదటిసారి ఈ ఆస్కార్ ప్రతిమను తయారు చేశారు. అమెరికా డిజైనర్ కెడ్రిక్ గిబ్సన్ ఈ ట్రోఫీ డిజైన్‌ను స్కెచ్ వేయగా.. ఐరిష్ ఆర్ట్ డైరెక్టర్ జార్జ్ స్టాన్లీ ఆస్కార్ ట్రోఫీ బొమ్మను తొలిసారి తయారు చేశారు.
ట్రోఫీ 13.5 అంగుళాల ఎత్తు, 8.5 పౌండ్ల(450 గ్రాములు) బరువుతో ఉంటుంది. అయితే ఈ బొమ్మను కంచుతో తయారు చేసి, పైన బంగారు పూతను పూస్తారు. ఒక్కో విగ్రహం తయారీకి సుమారు ఐదు నుంచి 900ల డాలర్ల ఖర్చవుతుందట. ఇలా యాభై విగ్రహాల తయారీకి దాదాపు మూడు నెలల సమయం పడుతుందట.
*1929 నుంచి ఇప్పటిదాకా 3,160 ట్రోఫీలను ఇచ్చింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. 1939 వరకు అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ అనే ట్రోఫీని పిలిచేవాళ్లు. ఆ తర్వాతి కాలంలో అఫీషియల్‌గా ‘ఆస్కార్’ అని పిలవడం స్టార్ట్ చేశారు.
*అమెరికన్ నటి బెట్టె డేవిస్.. అప్పట్లో అకాడమీ ఆర్గనైజేషన్‌కి ప్రెసిడెంట్‌గా పని చేసింది. తన మొదటి భర్త పేరు హర్మన్ ఆస్కార్ నెల్సన్. ఆయన పేరు మీదుగానే.. ట్రోఫీలకు ఆ పేరు పెట్టిందని చెప్తారు కొందరు. మరో వెర్షన్ ఏంటంటే.. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్, ఆ ప్రతిమ రూపం.. తన అంకుల్ ఆస్కార్‌ని పోలి ఉండడంతో ఆమె ఆ పేరు పెట్టించిందని అంటుంటారు.
1934లో ట్రోఫీ అందుకున్న తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్ వాల్టర్ డిస్నీ(వాల్ట్ డిస్నీ) ఫస్ట్ టైం ‘ఆస్కార్’ అనే పదాన్ని వేదిక మీద ఉపయోగించడం విశేషం.
మొదటిసారి ఆస్కార్ అందుకున్న నటుడు ఎమిల్ జన్నింగ్స్. ది లాస్ట్ కమాండ్ అనే చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
మరీ గ్లోబల్ అవార్డుగా పేరుగాంచిన ఈ ఆస్కార్ భారతీయ సినిమాను వరించాలని ఆశిద్దాం.