వర్షపు నీటి వలన కానీ, ఎత్తయిన పర్వతాలలో ఉండే మంచు కరిగిన నీటి వలన కానీ, నీరు చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే “నది” గా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. భారతదేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదు. నదులు దేశ ఆర్థిక, సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయాయి. అలా భాగమైపోయిన నదులలో గోదావరి ఒకటి. భారతదేశంలో ఒక ప్రసిద్ధిచెందిన నది. గంగా నది తర్వాత రెండవ పొడవైన నది గోదావరి.
గోదావరి నది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతం లో సంగమిస్తుంది. ఈ గోదావరి నది తూర్పు కనుమల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి ఉంది. వీటిని పాపికొండలు అంటారు.
పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులను రాల్చవు. ఈ ప్రాంతము ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. అందువలన ఈ పాపికొండలను ఆంధ్రా కాశ్మీరం అని కూడా పిలుస్తారు. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. ఈ పాపికొండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. (తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాల నడుమ ఉండేవి). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ లోని భద్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను ఈ పాపికొండలు విస్తరించి ఉన్నాయి.
నదుల పుట్టుక…
పూర్వం బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మూడడుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు తన మొదటి అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కివేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడంతో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను “విష్ణుపాదోద్భవి గంగా” అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని వస్తారు.
గోదావరి పుట్టుక (కథ సంక్షిప్తంగా..)
పూర్వం గౌతమ మహర్షి అరణ్య ప్రాంతంలో నివసిస్తుండేవారు. తన ఆశ్రమానికి దగ్గరలో ఒక పుష్కరిణి నిర్మించుకున్నాడు. కాలక్రమంలో ఒకసారి కరువు ఏర్పడి అది అలా 12 సంవత్సరాలు కొనసాగడంతో ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. దాంతో గౌతముడు వానదేవున్ని (వరుణ దేవుడుని) ప్రార్ధించగా ఆయన కరుణించలేదు. దాంతో గౌతముడు వరుణ దేవుడి లోకానికి వెళ్లి వరుణుడిని బంధించి, భూలోకానికి తీసుకువచ్చి నీటిగా మార్చి ఆయన నిర్మించిన పుష్కరణిలోకి వదిలాడు. అయితే అప్పుడు వరుణుడు గౌతముడితో ఇలా అన్నాడు, నీవు పుణ్యాత్ముడవు కనుక నీవు బంధిస్తే ఇక్కడే ఇలా ఉండిపోతున్నాను. నీకు కొంచెమైనా పాపం అంటుకున్నా నేను ఇక్కడి నుండి వెళ్లిపోతానని వరుణుడు గౌతముడితో చెప్పాడు.
అలా 12 సంవత్సరాల కరువు పూర్తైన తరువాత లోకంలో వానలు కురిపించాల్సిన బాధ్యత వరుణ దేవుడి పైన ఉండటంతో అప్పుడు వరుణుడు బ్రహ్మ దేవుడిని ప్రార్ధించాడు. ఒకనాడు పుష్కరిణి ప్రాంతంలోని వనంలోకి ఓ గోవు వచ్చింది. గౌతముడు గడ్డి పరకతో ఆ గోవును అదిలించాడు. దానికి ఆ గోవు చనిపోయింది. దీంతో గౌతముడికి గో హత్య పాతకం చుట్టుకోగా వెంటనే వరుణుడు గౌతముడి పుష్కరిణి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు గౌతముడు బ్రహ్మగిరి వెళ్లి శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. దాంతో శివుడు ప్రత్యేక్షమై వరం కోరుకోమని అడుగగా అప్పుడు గౌతముడు శివ జటాజూటం నుంచి గంగను విడువమని ప్రార్థించాడు.
అప్పుడు శివుడు నేలమీదకు వదిలిన గంగను గౌతముడు గోవు కళేబరం వద్దకు తీసుకుపోగా గంగ తాకగానే ఆ గోవు మళ్ళీ బ్రతికింది. దాంతో గౌతముడికి అంటుకున్న పాపం తొలగిపోయింది. ఆ తరువాత సప్తఋషులు గంగను వెంట తీసుకువెళ్లి సముద్రుడికి అప్పగించారు. గౌతమునికి అంటుకున్న గోహత్య పాతకం తొలగిపోగా శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంగా వెలిశాడని పురాణం. అయితే ఇక్కడ ఉన్న బ్రహ్మగిరి అనే ప్రాంతంలో గౌతమ మహర్షి కారణంగా ఆవిర్భవించిన ఈ నదికి గోదావరి అనే పేరు వచ్చింది అని చెబుతారు. మాఘశుద్ది దశమి నాడు పవిత్ర గంగా ప్రవాహం ఈ గోదావరి నదిగా వెలసిన రోజు. అందుకే ఈ రోజున ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మగిరిలో స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
పాపి కొండలు…
తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణినే పాపికొండలు అంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. కొండల మధ్య ప్రవహించే గోదావరి మనం జుట్టుకు తీసుకునే పాపిడిలా వుంటుందని పాపిడి కొండలు అన్నారట. అలా అలా పాపికొండలయ్యిందని అంటారు. ఈ పాపికొండలు అంతరించడానికి చేరువలో వున్న వివిధ మొక్కలు, పక్షులు, జంతువులతో జీవవైవిధ్యం గల ప్రదేశం. రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణ లోని భధ్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో వున్న ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తించబడింది.
ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ఇది ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణము కారణంగా ఆంధ్రా కాశ్మీరం అని పిలుస్తారు. ఈ ప్రాంత అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలం ఉంది. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉన్నాయి.
రెండు మార్గాలు…
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకంలో పాపికొండలు యాత్ర ఓ మధురానుభూతిని కలిగించే అద్భుత ప్రదేశంగా చెప్పుకోవచ్చు. చుట్టూ కొండలు, నడుమ గోదారమ్మ పరవళ్లు, దట్టమైన అటవీ సంపద, పక్షుల కీలకిలారావాలు మనసుకు ఎంతో ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాల నడుమ
ప్రశాంతంగా ఉండే గోదావరి నది చిత్రాలు ఎంత వర్ణించినా తక్కువనే చెప్పాలి. పాపికొండలు చేరుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్ళేవారికి ఒక మార్గము, తెలంగాణ ప్రజలకు మరో మార్గము కలదు. అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల మధ్య విస్తరించి ఉన్న ఈ పాపికొండల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ నుండి…
ఆంధ్ర నుండి పాపికొండలు వెళ్లేవారు
ముందుగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం చేరుకోవాలి. రాజమహేంద్రవరానికి 35 కిలోమీటర్ల దూరంలో దేవిపట్నం మండలంలో పురుషోత్తపట్నం వెళ్ళాలి. అక్కడినుండి మనకు బోటు లేదా లాంచి ద్వారా గోదావరి విహారం ప్రారంభమవుతుంది. బోటు బయలుదేరిన పది నిముషాల కల్లా నదికి ఎడమవైపున ఓ చిన్న కొండ దానిపై మహా నందీశ్వర ఆలయం కనువిందు చేస్తుంది. నాగార్జున నటించిన జానకిరాముడు చిత్రీకరణ సగం ఇక్కడే తీశారు. ఇక్కడినుండి కొంత దూరం వెళ్ళగానే గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కనిపిస్తుంది. అది దాటగానే నదికి కుడివైపున ఏటిపట్టున ఆనుకుని మరో చిన్న కొండ కనిపిస్తుంది. అదే కొండపై “శ్రీరామదాసు” చిత్రం లోని రామాలయ నిర్మాణ దృశ్యాలన్నీ సెట్ వేసి చిత్రించారు.
గండిపోచమ్మ ఆలయం…
పాపికొండలు ప్రయాణం లో ఓ చిన్న మజిలీ పూడిపల్లి వద్ధ వంపు తిరుగుతున్న గోదావరికి సమీపం ప్రాంతానికి రాగానే గండి పోచమ్మ ఆలయం కనిపిస్తుంది. అక్కడ 15 నిముషాలు పాటు అమ్మవారి దర్శనం కోసం బోటు ఆగుతుంది. కొద్దిసేపటి తరువాత పుడిపల్లి గ్రామం కనిపిస్తుంది. ఇక్కడే కృష్ణంరాజు హీరోగా నటించిన “త్రిశూలం”, బాలకృష్ణ హీరోగా నటించిన “బంగారు బుల్లోడు” ఇంకా చాలా చిత్రాలు ఇక్కడే చిత్రీకరణ జరుపుకున్నాయి. అక్కడే గోదావరి మధ్యలో ఉన్న ఓ లంక గ్రామంలో “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” చిత్రీకరణ జరుపుకుంది. పర్యటకులంతా అమ్మవారిని ముందుగా దర్శించుకుంటారు. అనంతరం ఈ పర్యాటక ప్రాంతానికి చేరుకుని పాపికొండల విహారయాత్ర ప్రారంభిస్తారు. రాజమహేంద్రవరం నుండి లాంచీలో చేసే ప్రయాణం పర్యాటకుల మనసును హత్తుకుంటుంది. ఆటపాటలతో, నృత్యాలతో చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా సరదాగా గడుపుతారు. ఇక ప్రయాణ వివరాలు తెలుసుకుందాం. బోటు వీక్షణలో పోలవరం ప్రాజెక్ట్ ఏరియా, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు చూడవచ్చు.
దేవిపట్నం మీదుగా…
ఉదయం అల్పాహారం మొదలు సాయంత్రం చాయ్ బిస్కెట్ వరకు అంతా ప్యాకేజీలో బాగామే. ముందుగా బోటు ప్రయాణం మొదలయ్యాక ఉదయం 9 గంటలకు అల్పాహారం, మినరల్ వాటర్‌తో, మద్యాహ్నం శాఖాహారం భోజనం, సాయంత్రం స్నాక్స్ చాయ్ ఉంటుంది. దేవిపట్నం వద్ద కొన్ని నిముషాలు బోటును నిలిపి ప్రయాణికుల వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో అందజేస్తారు. మన్యం వీరుడు “అల్లూరి సీతా రామ రాజు” తన దండుతో దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లిన పాత పోలీస్ స్టేషన్ కనబడుతుంది. బోటులో నుండే గోదావరి ఒడ్డున ఉన్న పాత పోలీస్ స్టేషన్ ను చూడవచ్చు. ఇక్కడి నుండి మొబైల్ ఫోన్లు పనిచేయవు. మళ్ళీ ఇటు వెనక్కి వచ్చిన తరువాత లేదా అటు భద్రాచలం చేరిన తరువాత మాత్రమే మొబైల్ ఫోన్లు పనిచేస్తాయి. రోడ్డు రవాణా, అత్యవసర సేవలకు కూడా అవకాశం ఉండదు.అక్కడినుండి రెండు కిలోమీటర్లు వెళ్ళాక నదికి ఎడమవైపున పేరంటాలపల్లి గ్రామానికి చేరుకుంటుంది. రామకృష్ణ ముని వాటిక (ఆశ్రమం) మరియు వీరేశ్వర స్వామి దేవాలయం మరియు శివుని దర్శనం ఉంటుంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం రేవుకు పడవలో తిరుగు ప్రయాణం ఉంటుంది.
తెలంగాణ నుండి…
పాపికొండలు టూర్ తెలంగాణ ప్రజలు వెళ్ళాలనుకుంటే ముందుగా భద్రాచలం చేరుకోవాలి. భద్రాచలం నుండి పాపికొండలు 60 కిలోమీటర్లు దూరం ఉంటుంది. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం వద్ద పాపికొండలు టూర్ ప్యాకేజి టికెట్స్ విక్రయిస్తారు. అక్కడ నుండి 60 కిలోమీటర్లు ప్రయాణించి ఉదయం 10 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్‌కు చేరుకోవాలి. పోచారం నుండి బోటింగ్ ఆరంభమౌతుంది. పాపికొండల మీదుగా సాయంత్రం 4 గంటలకు “పేరంటాల పల్లి” కి చేరుకుంటుంది. గంట విరామం తరువాత మళ్లీ భద్రాచలానికి మళ్లుతుంది. పోచారం బోటింగ్ పాయింట్‌కు తిరిగి వస్తుంది. సాయంత్రం 7 గంటలకు భద్రాచలానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ప్యాకేజిలో భాగంగానే అల్పాహారం, శాకాహార భోజనం, స్నాక్స్ అందుబాటులో ఉంటాయి. భద్రాచలం నుండి పాపికొండలు టూర్ కొయ్యలగూడెం, కన్నపురం, పోలవరం, సింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు, సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.
ప్రత్యేకమైన శివాలయం…
భద్రాచలం నుండి, అటు రాజమహేంద్రవరం నుండి ప్రారంభమైన బోట్లు పేరంటాలపల్లి వద్ద కాసేపు ఆగుతాయి. ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా చెప్పుకునే పరమేశ్వరుని ఆలయం ఉంది. రామకృష్ణ ముని ఆశ్రమం వద్ద వీరేశ్వర స్వామి దేవాలయం ఉంది. పర్యటకులంతా అక్కడ శివుని దర్శించుకుంటారు. ఆ ఆలయానికి ముఖ్య నియమాలు ఉన్నాయి. అక్కడ మాటలు వినిపించరాదు. అంతా నిశ్శబ్దంగా ఉండాలి. ఆలయం గంట ఒక్కసారి మాత్రమే కొట్టాలి. అక్కడ స్వామివారికి కానుకలు ఎట్టి పరిస్థితిలో సమర్పించరాదు.
ఆకర్షించే గిరిజన కళలు…
పేరంటాలపల్లి వద్ద గిరిజన ప్రజలు వెదురు కర్రలతో చేసే చేతి కళాకృతులూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. వివిధ రకాల బొమ్మలు, గృహోపకరణాలు వారు తమ స్వహస్తలతో తయారు చేసి విక్రయిస్తారు. అంతే కాదు అక్కడ బొంగులో వండే చికెన్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అత్యంత రుచికరమైన వంటకంగా చెప్పుకోవచ్చు.
కొల్లూరులో బస…
పాపికొండలు టూర్ చేసేవాళ్ళు ఒకరోజు బసచేయాలి అనుకుంటే వారికి కొల్లూరు వద్ద బస ఏర్పాట్లు ప్రభుత్వం కల్పించింది. ఒక రోజు మొత్తం అక్కడ బస చేయవచ్చు. చిన్న గుడిసెలో వసతి సదుపాయం కల్పిస్తారు. టిఫిన్, శాకాహారం భోజనం, రాత్రికి భోజనం కూడా ప్యాకేజీలో భాగమే. ఆ రాత్రి ప్రకృతి నడుమ గోదావరి నది ఒడ్డున చల్లని రాత్రి వెన్నెల నడుమ క్యాంప్ ఫైర్ ఉంటుంది. పర్యాటకులు ఆ క్యాంప్ ఫైర్ వద్ద ఆటలు పాటలతో సరదాగా గడుపుతారు.
మరువలేని విషాదం…
అత్యంత సుందరమైన, ఆహ్లాదకరమైన పర్యాటకమైనటువంటి పాపికొండలు కొందరికి విషాదం కూడా మిగిల్చింది. 16 సెప్టెంబరు 2019 నాడు రాజమహేంద్రవరం నుండి బయలుదేరి పాపికొండలు యాత్రకు వెళ్లే బోటు దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైంది. సుడిగుండాలు చుట్టూ ముట్టడంతో బోటు గోదావరిలో మునిగిపోయింది. వర్షాకాలం కావడం, డ్రైవర్ అవగాహనలేమితో ఈ ప్రమాదం సంభవించినట్లు వెల్లడయింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 43 మంది మరణించగా 15 మంది గల్లంతయ్యారు. కొందరి మృతదేహాలు ఇప్పటికి లభ్యం కాకపోవడం దురదృష్టకరం. సుమారు 300 అడుగుల లోతులో బోటు మునిగిపోయింది. ఈ బోటును నెలరోజుల తర్వాత అతి కష్టం మీద వెలికి తీశారు. ఎన్నో కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను పోగొట్టుకొని పాపికొండల విహారయాత్ర అంటే ఒక విషాదంగా గుర్తుండేలా నిలిచిపోయింది. ఈ ప్రమాదం జరగడంతో ఏపీ పర్యాటకం రెండు సంవత్సరాలపాటు పాపికొండల విహారయాత్రను నిలిపివేసింది. అనంతరం 07 నవంబరు 2021 నుండి పాపికొండలు విహారయాత్రను పునః ప్రారంభించింది.