HEALTH & LIFESTYLE

సులభమైన ఆసనాలతో.. ఎంతో ఆరోగ్యం

యోగాసనాలు వేయాలని చాలామంది అనుకుంటారు. కానీ, కొన్ని క్లిష్టమైన భంగిమలు చూసి ఆసనాలన్ని కష్టతరమని అనుకుంటారు. కొన్ని ఆసనాలు చాలా సులభంగా చేయవచ్చు. వాటితో మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవి ఏంటో చూద్దాం.
దండాసనం
సంస్కృతంలో దండ అంటే కర్ర. అంటే ఈ ఆసనంలో కర్రలా నిటారుగా L ఆకారంలో కూర్చొని(దండాసనం), పడుకొని (చతురంగ దండాసనం) రెండు విధాలు ప్రయత్నించవచ్చు. ఆ రెండు ఆసనాలు వేయడం చాలా సులభం. రోజూ ప్రాక్టీస్ చేస్తే వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న వారికి మంచి పరిష్కారం లభిస్తుంది. భుజాల్లో సత్తువ పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ, మూత్రపిండాలకు మంచి వ్యాయామంలా ఈ ఆసనాలు పని చేస్తాయి. దండాసనం కాళ్లలో కండరాలు సాగేటట్లు చేసి కాళ్లల్లో నొప్పిని నివారిస్తుంది. ఈ ఆసనాలు వేస్తే వీపు, వెన్నుపై  ప్రభావం చూపి వెన్నెముక సమస్యలు రాకుండా చేస్తూ.. సయాటికా నొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఈ ఆసనాన్ని చేయడం మంచిది.

దండాసనం వేసే విధానం
కాళ్లు బార్ల చాపి, సమాంతరంగా నేలపై కూర్చోవాలి. పిరుదుల కింద ఎత్తు పెట్టుకొని వెన్ను నిటారుగా ఉండేట్లు కూర్చోండి. వెన్ను వంకరగా పెట్టకుండా నిటారుగా చేసి తొడ, కాళ్ళ కండరాలను బిగించాలి. మీ అరచేతులు మోకాలి పై ఉంచి చేతులు తొడలకు సమాంతరంగా ఉంచాలి. ఇలా 30సెకన్ల పాటు ఉంచి.. తర్వాత చేతులు గాల్లోకి ఎత్తి నడుము, ఛాతీ పైకి సాగేలా చేయాలి. ఇలా మరో 30సెకన్లు ఉండాలి. తర్వాత చేతులు కిందకు దించి ఎడమ, కుడి వైపులకు నడుము పై భాగాన్ని తిప్పండి.

చతురంగ దండాసనం వేసే విధానం
బోర్లా పడుకొని పాదాల నుంచి తల వరకు సమాంతరంగా ఉంచి శరీరాన్ని అరచేతులపై నేలకు ఆనించకుండా ఎత్తులో ఉంచాలి. ఈ సమయంలో శ్వాస తీసుకొని పొట్టలో గట్టిగా పట్టిఉంచాలి. మోచేతులను బెండ్ చేస్తూ శరీరాన్ని కిందకి తెచ్చి అరనిమిషం పాటు ఆ భంగిమలో ఉండాలి. తర్వాత మోకాళ్లు కింద పెట్టి విశ్రాంతి తీసుకోవాలి.


Show More
Back to top button