
దాట్ల దేవదానం రాజు (20 మార్చి 1954)..
“రవిగాంచని చోట కవి గాంచును” అని తెలుగులో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు మొదలగున్నవి ఏవైనా సూర్యుడైనా చూడకపోవచ్చేమో కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన, ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వీకరించి వెలుగులోకి తీసుకువచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. వారిలో దాట్ల దేవదానం రాజు గారూ ఒకరు..
కవిగా, కథకుడిగా ఈ తరం ప్రతిభావంతులలో ఒకరిగా గుర్తింపు పొందిన దాట్ల దేవనం రాజు గారూ యానాంలో ఉపాధ్యాయులుగా ఉంటూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు పొందిన దేవదానం రాజు గారూ వారం వారం సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తున్నారు. వీరు వ్రాసిన “వానరాని కాలం” కవితా సంపుటి విమర్శకుల మెప్పు పొందింది.
కథకుడిగా ప్రయాణం మొదలుపెట్టి శిఖామణి అనే సాహసయాత్రికుడి సహచర్యం వల్ల కథల నుండి కవితల్లోకి తన ప్రస్థానాన్ని మళ్ళించి వందలాది కవితలు వ్రాసిన కథకుడిగా గుర్తింపు నిలబెట్టుకొని తెలుగు పాఠకులకు చిర పరిచితులయ్యారు దాట్ల దేవదానం రాజు గారూ. ఒకవైపు ఉత్తమ ఉపాధ్యాయునిగా, మరోవైపు కథకునిగా, కవిగా రెండు కథా సంపుటాలు, ఐదు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, ఒక చరిత్ర గ్రంథం వెలువరించారు.
జీవిత విశేషాలు..

జననం.. 20 మార్చి 1954..
స్వస్థలం.. తూర్పుగోదావరి జిల్లా లోని కోలంక
తండ్రి.. వెంకటపతిరాజు..
తల్లి .. సూర్య నారాయణమ్మ..
భార్య… ఉదయభాస్కరమ్మ..
పిల్లలు : డి.వి.యస్. రాజు,
శశికాంత వర్మ,
శిరీష
నివాసము : యానాం..
పురస్కారాలు… ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కారం (2022)..
జననం..
దాట్ల దేవదానం రాజు గారూ 22 మార్చి 1954 లో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కోలంకలో జన్మించారు. వీరి తండ్రి దాట్ల వెంకటపతి రాజు గారూ, తల్లి సూర్యనారాయణమ్మ గారూ. వీరిది వ్యవసాయ కుటుంబం. దాట్ల దేవదానం రాజు గారి కంటే ముందు వాళ్ళ అమ్మ నాన్నలకు పదకొండు మంది సంతానం. పదకొండు మంది సంతానం పుట్టినవాళ్ళు పుట్టినట్టే సంవత్సరం లోపే చనిపోయేవారు. ఇలా 11 మందిని సుమారు 99 నెలలు మోసిన సూర్యనారాయణమ్మ గారిది 99 నెలల గర్భశోకం. ఎవరు ఎక్కడి వెళ్లి పురుడు పోసుకోమంటే అక్కడికి వెళ్లే వాళ్ళు సూర్యనారాయణమ్మ దంపతులు.
చివరికి పిఠాపురం మిషన్ ఆస్పత్రిలో డాక్టర్ వైనింగ్ అమృత హస్తాలతో పురుడుపోయగా దాట్ల దేవదానం రాజు గారూ బ్రతికి బట్టకట్టగలిగారు. కృతజ్ఞతగా ఆ డాక్టరు గారి పేరు పెట్టుకుందామని అనుకున్నారు. దాంతో ఆవిడ వారించి ఆ బాబును చేతుల్లోకి తీసుకొని ప్రార్థనలు చేసి దేవుడు ఇచ్చిన దానం కాబట్టి దేవదానం అన్నారు. ఒకరకంగా భద్రత కోసమేమో అన్నట్లు దానికి కుల వాచకం రాజు తగిలించి దేవదానం రాజు గా నామకరణం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన దేవదానం రాజు గారి బాల్యం సహజంగానే అతి గారాబంగా గడిచింది. దిష్టి ఎక్కడ తగులుతుందో అన్న భయంతో వాళ్ళ అమ్మగారు దేవదానం రాజు గారి కాళ్లకు, చేతులకు, మెడకు, ఒళ్లంతా పూసల దండలు కట్టి సంరక్షించిన వెర్రి ప్రేమ ఆమెది. ఆ పూసల దండలు చూసి అందరూ దేవదానం రాజు గారిని పూసలోడు అనేవాళ్ళు.
విద్యాభ్యాసం..
దాట్ల దేవదానం గారి ప్రాథమిక విద్యాభ్యాసం కోలంకలోను, ఇంటర్మీడియట్ రామచంద్రపురం లోను, డిగ్రీ యానాం లోనూ చదివారు. దేవదానం రాజు గారికి తన అమ్మ బెంగ వల్ల తాను ఇల్లు విడిచే పరిస్థితి లేదు. అందువలన ఎకనామిక్స్, తెలుగులో ఎం.ఏ, ఆ తర్వాత ఎం.ఈ.డి దూరవిద్య ద్వారా పూర్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలంలోని నేలపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. తర్వాత పిల్లల చదువుల కోసం తన మకాం యానంకు మార్చారు.
దేవదానం రాజు గారి స్వగ్రామమైన కూలంకలో వారి ఇంటికి గురుతుల్యుడైన ఒక ముసలాయన వస్తూ ఉండేవారు. ఆయన భార్య కథలు బాగా చెప్పేవారు. ఆవిడ కథలు చెబుతుంటే దేవదానం రాజు గారూ ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేవారు. దానివల్ల దేవదానం రాజు గారికి కథల మీద అపేక్ష కలిగింది. పాఠశాలలో ఉండగా టామ్ సాయర్, హకిల్ బెరిఫిన్, డికౌంటు ఆఫ్ మౌంట్ క్రిస్టో చదివారు. యానం కాలేజీలో తెలుగు లెక్చరర్ కందర్ప వెంకటలక్ష్మీ నరసమ్మ గారి ప్రోత్సాహంతో స్నేహితుల పేరు మీద కళాశాల మ్యాగజైన్ కి చిన్నచిన్న కథలు వ్రాసేవారు.
కుటుంబం..
దాట్ల దేవదానం రాజు గారి శ్రీమతి ఉదయభాస్కరమ్మ. ఆవిడే దేవదానం రాజు గారి రచనలకు ప్రధమ శ్రోత. కవుల్ని, రచయితల్ని సమాదరించి దేవదానం రాజు గారికి ఎనలేని స్నేహ సంపద కలిగించినది ఆవిడ గారే. దేవదానం రాజు గారి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు డి.వి.ఎస్.రాజు హైదరాబాదులో ఏ.ఐ.ఆర్ వరల్డ్ వైడ్ ఇండియా అనే సంస్థలో డైరెక్టర్ గానూ, చిన్న కుమారుడు శ్రీకాంత్ వర్మ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. కుమార్తె శిరీష, అల్లుడు రాజేష్ లు విశాఖలో రియల్టర్ స్థిరపడ్డారు.
మొదటి కథ..
దేవదానం రాజు గారూ తన మొదటి కథగా “పేకాట బాగోతం” వ్రాశారు. ఆ కథను పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారూ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించారు. తన పిల్లల చదువుల కోసం దేవదానం రాజు గారూ 1987లో తన మకాంను కోలంక నుండి యానాంకి మార్చారు. యానాంలో శిఖామణితో దేవదానం రాజు గారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే దేవదానం రాజు గారిని కవిని చేసింది. నెల నెలా జరిగే “మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి” స్మారక సభల్లో చివరాఖర్లో కవి సమ్మేళనం జరిగేది. దానికోసం దేవదానం రాజు గారూ ప్రతి నెలా ఒక కవిత వ్రాసేవారు. తాను వ్రాసే కవితలకు పత్రికలు బాగా ప్రోత్సాహం ఇవ్వటంతో కథలు వ్రాయడం తగ్గించి పూర్తిస్థాయిలో కవిగా మారిపోయారు. 2002లో దాట్ల దేవదానం రాజు కథలు ప్రచురించబడ్డాయి. ఆ తర్వాత 2006లో “సరదాగా కాసేపు” అనే రాజకీయ వ్యంగ్య కథలు వ్రాశారు.
కథలకు ప్రేరణ..
వాస్తవానికి కథలు వ్రాయడం కష్టంతో కూడుకున్న పని. అయితే కథ రాయడం పూర్తయ్యాక మనసుకు కలిగే సంతృప్తిని దేనితోనూ కొలవలేము. మన అనుభవాల నుండి వచ్చినదే మంచి కథ అవుతుంది. కథకుడు ఏరుకోగలగాలే గానీ సమాజమే అనేక కథా వస్తువులకు నెలవు. దేవదానం రాజు గారికి నలుగురు మెచ్చి నాలుగు కాలాలపాటు నిలిచే కథలనే వ్రాయాలనేదే అభిలాష. తన అనుభవ పరిధి దాటి ఏ కథ కూడా వ్రాయలేదు. ఏ.ఎన్ జగన్నాధ శర్మ, కొలకలూరు ఇనాక్ వంటి కథకుల్లాగా చిన్న చిన్న వాక్యాలతో కథను నడిపిస్తూ వ్రాయాలని తన కోరిక.
రామాయణ విషవృక్షం చదివాక…
దేవదానం రాజు గారూ, రచయిత్రి రంగనాయకమ్మ గారి “రామాయణ విషవృక్షం” ముందుమాట చదివారు. అది చదివిన తర్వాత వారి ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. ఆ మార్పుతోనే హేతువాద దృష్టి, ప్రశ్నించే తత్వం, సమాజ పరిణామాన్ని పరిశీలించడం వారికి అలవాటయ్యాయి. కవిగా దేవదానం రాజు గారిపై ఎవరి ప్రభావం లేదు. ఎవరిలాగో వ్రాయాలని వారు అనుకోలేదు. “గుండె తెరచాపు” కవితా సంపుటిలో ప్రకృతి ప్రేమ ప్రస్ఫుటంగా కనిపించడంతో ఎవరికైనా ఇస్మాయిల్ గుర్తుకు రావచ్చు. కానీ అది మాత్రం యాదృచ్ఛికమే.
ఇతర రచనలు..
దేవదానం రాజు గారూ కథలు, కవితలు మాత్రమే కాకుండా అనేక పత్రికల్లో సాహితీ వ్యాసాలు, విమర్శలు, సమీక్షలు వ్రాసేవారు. రేడియో, దూరదర్శన్, మీడియాలో పలుమార్లు వీరి కథలు, కవితలు ప్రసారమయ్యాయి. స్థానిక చరిత్రలు, జాతీయ చరిత్రలో అంతర్భాగంగానే ఉంటాయి. వర్తమానం నుండి భవిష్యత్తులోకి నడవడానికి సరిపడా పాఠాలకు చరిత్రే పునాది అని భావించి, యానాంకి సంబంధించిన సమాచారం ఒక స్థిర రూపంగా మార్చే ప్రయత్నంగా “యానాం చరిత్ర” వ్రాశారు దేవదానం రాజు గారూ. తర్వాత ఫ్రెంచ్ వారి కాలం నుండి నేటి వరకు జరిగిన వివిధ సంఘటనలు సందర్భాలను ఉపయోగించి కాల్పనిక పాత్రలతో యానం కథలు వ్రాస్తున్నారు. స్థానీయతతో వ్రాసిన కథలు విశాలత సంతరించుకుంటాయని, ఒక మారుమూల ప్రాంత ప్రజల జీవనశైలి, సంఘర్షణలు, సమస్యలు కథలుగా చెక్కినప్పుడే సామాజిక చరిత్ర నమోదు చేసినట్లు అవుతుందనేది దేవదానం రాజు గారి విశ్వాసం.
సాహిత్యానికి దూరమైన నవతరం..
ప్రస్తుత పరిస్థితులలో నవతరం సాహిత్యానికి దూరంగా ఉన్నారని అనిపిస్తుంది. ఎక్కడైనా ఎప్పుడైనా సాహితీ సభలు జరిగితే 50 ఏళ్ల వయసు పైబడిన వారే కనిపిస్తుంటారు. కానీ యువతరం రచయితల నుండి కూడా మంచి మంచి కథలే వస్తున్నాయి. మాండలికంలో రచనలు చేయడం వల్ల ప్రయోజనం పరిమితంగా ఉంటుంది. సాధారణ పాఠకుడు మాండలికాన్ని ఆస్వాదించలేడు. భాషా శైలి, వస్తువు ఈ రెండు సమపాలలో ఉంటేనే రచన రక్తి కడుతుంది.
కథ ముగింపు ఎలా ఉండాలి
కథ యొక్క ముగింపు చాలా వరకు సానుకూల దృక్పథంతో ఉండాలి. విషాదం, అననుకూలత వంటివి జీవితంలో తప్పనిసరిగా ఉంటాయి. కానీ కథ యొక్క సందేశం మాత్రం తప్పనిసరిగా ఆత్మవిశ్వాసం కలిగించేటట్టు సానుకూల దృక్పథంతో ఉండాలి. కథలలో విషాదాంతాలు, ఆత్మహత్యలు పరిష్కారం చూపటం ప్రతికూల దృక్పథం కలిగిస్తాయి. అవి అంత మంచివి కాదు.
రచనా ప్రయోజనం..
మామూలుగానే రచనకు ఎప్పుడూ ప్రయోజనం ఉంటుంది. దేవదానం రాజు గారి కథలు, కవితలు చదివి స్పందించి ప్రేరణ పొందిన యువకులు చాలా మంది తాము రాయాలని ప్రయత్నించి కృతకృత్యులైన వారు ఉన్నారు. వారి కథల మీద ఎన్.సురేష్ కుమార్, మధురై కామరాజు యూనివర్సిటీ నుంచి ఎం.ఫిల్ పట్టా పొందారు. వారే దేవదానం రాజు గారికి సమగ్ర సాహిత్యం మీద పి.హెచ్.డి చేస్తున్నారు. ఇటీవల ప్రచురించిన దీర్ఘ కవిత “నాలుగో పాదం” ను తమిళంలోకి నాన్ గాన్ పాదమ్ పేరుతో శాంతాదత్ గారూ అనువదించారు.
ఎప్పుడూ చదువుకోవడం, రాయాలన్న తపన నిజాయితీగా ఉండడం. ఇతరులకు చేతనైన సాయం చేయడం ఎన్నడు ఎవరికి అపకారం తలపెట్టకపోవడమే దేవదానం రాజు గారి తత్వం. ఎన్ని సంక్షోభాలు, సంఘర్షణలు ఎదురైనా కూడా చుట్టూ ఉన్న అనుభవాలని మట్టి కాళ్ళు సాక్షిగా గుండె తెరచాప రెపరెపలాడిస్తూ, అక్షరాల్లోకి వొంపుకుంటూ పుటల మధ్య సేద తీరడమే తనకు సంతోషాన్ని కలిగిస్తుంది అంటారు దేవదానం రాజు గారూ.
రచనలు..
వానరాని కాలం.. (1997).. కవితా సంపుటి..
గుండె తెరచాప.. (1999).. కవితా సంపుటి..
మట్టికాళ్ళు.. (2002).. కవితా సంపుటి
లోపలి దీపం.. (2005).. కవితా సంపుటి..
నదిచుట్టూ నేను.. (2007).. కవితా సంపుటి..
యానాం కథలు.. (2012).. కవితా సంపుటి..
దాట్ల దేవదానం రాజు కధలు.. (2002).. కధా సంపుటి..
కళ్యాణ పురం.. (కథా సంపుటి)..
ముద్రబల్ల… (2004).. దీర్ఘకవిత..
నాలుగో పాదం.. (2010).. దీర్ఘ కవిత..
సరదాగా కాసేపు.. (2006).. రాజకీయ వ్యంగ్య కధనాలు..
యానాం చరిత్ర.. (2007)..
నాన్ గామ్ పాదమ్.. (2010)..(తమిళ అనువాదం)..
కథాసంపుటి.. నాల మతే పాదం (మలయాళ అనువాదం, ఎల్.ఆర్.స్వామి)..(2012)..
యానాం కథలు…
ప్రత్యేక సంచిక.. ఉదయిని 60 సంత్సరాలు నిండిన సందర్భంగా..
రహస్య మిత్రుడు.. కథానిక..
కథల గోదారి.. (కథలు)..
పురస్కారములు..
వానరాని కాలం కవితా సంపుటికి గానూ 1997లో ‘సరసం అవార్డు’ అందుకున్నారు..
1999 సంవత్సరానికి గానూ “జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు”ను అందుకున్నారు..
2000 సంవత్సరానికి గానూ “రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” ను స్వీకరించారు..
“మట్టికాళ్ళు(2002)” కవితా సంపుటికి గానూ 2003 సంవత్సరానికి గానూ “ఆంధ్ర సారస్వత సమితి అవార్డు” వరించింది..
2003 సంవత్సరంలో (పుదుచ్చేరి ప్రభుత్వం) ‘కళైమామణి’ అవార్డు ఇచ్చి సత్కరించారు..
2004 సంవత్సరంలో “రీజెన్సీ కళావాణి పురస్కారం” లభించింది..
2008 సంవత్సరానికి గానూ YOHVO వారు “ఉగాది ఉత్తమ కవి పురస్కారం” అందజేశారు..
2009 సంవత్సరానికి గానూ (పుదుచ్చేరి ప్రభుత్వం) వారు “తెలుగు రత్న” అవార్డును ఇచ్చి గౌరవించారు..
2010 సంవత్సరంలో సర్ ఆర్థర్ కాటన్ జలనిధి పురస్కారం లభించింది..
2012 సంవత్సరంలో గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు అందుకున్నారు..
2013 సంవత్సరంలో కొ.కు సాహిత్య మనిహార్ పురస్కారం లభించింది..
2013 సంవత్సరంలో రాష్ట్రస్థాయి ఉత్తమ కథా పురస్కారం వరించింది..
2022 సంవత్సరంలో డాక్టర్ పరుచూరి రాజారామ్ సాహితీ పురస్కారం అందుకున్నారు..
దాట్ల దేవదానం రాజు గారూ వ్రాసిన కవితలలో ఒకటి…
లోకాలు రెండు..
ఎక్కడివో కాసిన్ని నక్షత్రాల్ని
తెంపుకొచ్చి సిగలో తురుముకుని
అదే జీవితామనుకుంటావు
మెరుపు తీగల్లో దాక్కున్న
విద్యుత్తు కోసం అర్రులు చాచి
అదే భాగ్యమనుకుంటావు
ఏ బాధా చూపని నెత్తురు పదాల్ని
దోసిట్లో పోసుకుని
మానవత్వం వల్లె వేస్తావు
దేహమంతా దిగులుమయం కాగానే
శిథిల జ్ఞాపకాల్ని
అదే పనిగా తడుముకుంటావు
అటు నువ్వు ఇటు నేను
మధ్యలో చిరిగిన తెరలు
దారులు లేవు వంతెన కూడా లేదు
దారం తెగడానికేమో ఒక లిప్త చాలు
ఇక ఇప్పుడు నువ్వు
ఏ నిశ్శబ్దంలోంచి
శీతల పవనంలాంటి మాట పట్టుకుంటావ్?
ఏ వలయంలోంచి పాకుడు రాళ్లు మీదుగా
సర్రున జారిపోకుండా నిలబడతావ్
ఏ మట్టి రేణువులోంచి
ఏ జీవ ధాతువుల్లోంచి
తిరిగి మొలకెత్తుతావ్..??