Telugu Special Stories

రికార్డుల రారాణి.. విజయనిర్మల..

విజయ నిర్మల (20 ఫిబ్రవరి 1946 – 27 జూన్ 2019)

ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం చేస్తేనే ఏదైనా సిద్దిస్తుంది. ధైర్యవంతుల వద్దే లక్ష్మి నివాసం ఉంటుంది. పిరికివాడిని లక్ష్మి కూడా కనికరించదు. పుట్టుకతోనే ఎవరూ ధైర్యసాహసాల్ని వెంట తెచ్చుకోరు. పరిస్థితులు, అనుభవాలే మనిషిని అలా తీర్చిదిద్దుతాయి. అలాంటి కోవకు చెందినవారు ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారూ. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి కూడానూ. భానుమతి గారూ, సావిత్రి గారూ తాము నిర్మించిన చిత్రాలకే దర్శకత్వం వహించారు.

కానీ విజయనిర్మల గారూ తాను దర్శకత్వం వహించిన 44 చిత్రాలలో ఒకటి మలయాళం, ఒకటి తమిళ చిత్రం కాగా, 22 చిత్రాలు బయటి బ్యానర్ వాళ్లకు దర్శకత్వం వహిస్తే, 20 చిత్రాలు తమ సొంత బ్యానర్ లోనే దర్శకత్వం వహించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా “గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్” లో స్థానం సంపాదించారు. బాలనటిగా, కథనాయకిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, తన ప్రస్థానం కొనసాగిస్తూనే తెలుగు చిత్రసీమకు చేసిన విశేష సేవలకు గుర్తింపునిస్తూ “రఘుపతి వెంకయ్య” పురస్కారం అందుకున్నారు.

జననం..

విజయనిర్మల గారూ 20 ఫిబ్రవరి 1946 లో మద్రాసులో జన్మించారు. వీరి నాన్న గారూ రాంమోహన్ రావు గారూ, అమ్మ శకుంతల దేవి గారూ. వీరికి ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్లు. వీరి నాన్న గారూ ఆ రోజుల్లో మద్రాసులో వాహినీ స్టూడియోస్ లో సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండేవారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ గారూ, రాంమోహన్ రావు గారూ కలిసి ఒకే చోట పనిచేసేవారు. టాకీ సినిమాలు మొదలైన కొత్తలో నేపథ్య గాయనిగా రాణించిన “రావు బాల సరస్వతి” గారూ విజయనిర్మల గారికి స్వయానా మేనత్త కూతురు.

బాలనటిగా సినీ రంగ ప్రవేశం…

విజయనిర్మల గారి నాన్న గారి అక్కయ్య గారి కూతురు అయిన “రావు బాలసరస్వతి” గారి సలహా మేరకు, విజయ నిర్మల గారి నాన్న గారూ, విజయనిర్మల గారికి మూడేళ్ళ వయస్సు నుండే భారతనాట్యం నేర్పించడం మొదలుపెట్టారు. పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో “మత్శ్యరేఖ” అనే తమిళ చిత్రంతో బాలనటిగా విజయనిర్మల గారి సినీ ప్రస్థానం మొదలయ్యింది. తమిళ కథనాయకులు టి.ఆర్.రామలింగం గారు నటిస్తున్న “మత్శ్యరేఖ” చిత్రంలో కథనాయకుడి బాల్యంలో వచ్చే పాత్ర కోసం దర్శకులు పి.పుల్లయ్య గారి కోరిక మేరకు ప్రముఖ నేపథ్య గాయకులు “రావు బాలసరస్వతి” గారు విజయనిర్మల గారిని “మత్శ్యరేఖ”లో బాల నటిగా నటింపజేయడానికి ఆ చిత్రం షూటింగ్ కు తీసుకువచ్చారు.

“మత్శ్యరేఖ”లో బాల నటిగా నటిస్తున్నప్పుడు ఏడుపు సన్నివేశంలో ఏడవమంటే ఏడవలేదు. నవ్వమంటే నవ్వలేదు. దాంతో చిర్రెత్తిపోయిన పుల్లయ్య గారూ విజయనిర్మల గారిపై కోప్పడ్డారు. దాంతో విజయనిర్మల గారూ ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు పుల్లయ్య గారూ ఆ ఏడుపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. తరువాత కొద్దిసేపటికి తనకు తినుబండారాలు ఇచ్చారు. దాంతో విజయనిర్మల గారూ నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు నవ్వుతున్న సన్నివేశాలను చిత్రీకరించారు.

ఆ తరువాత పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో జెమిని గణేశన్, సావిత్రి గారూ నటించిన “మనం పోలె మంగళ్యం” చిత్రంలో బాలనటిగా రెండవసారి అవకాశం వచ్చింది. అందులో రైల్లో అడుక్కునే అనాథ బాలిక పాత్రలో విజయనిర్మల గారూ నటించారు. ఎన్టీఆర్ గారూ, ఏ.యన్.ఆర్ గారూ, జమున గారి కలయికలో 1958 లో వచ్చిన భూకైలాస్ చిత్రంలో అక్కినేని గారి చిన్ననాటి పాత్రలో “రాముని అవతారం రవికుల సోముని అవతారం” అనే పాటలో విజయనిర్మల గారూ బాలనటిగా నటించారు. ఎన్టీఆర్ గారూ నటించిన “పాండురంగ మహత్యం” లో “జయకృష్ణా ముకుందా మురారీ జయగోవింద బృందా విహారీ” అనే పాటలో విజయనిర్మల గారూ బాలనటిగా నటించారు. విజయనిర్మల గారికి బాలనటిగా “పాండురంగ మహత్యం” చివరి సినిమా.

కథనాయకిగా తొలి చిత్రం “భార్గవి నిలయం”..

బాలనటిగా చివరి చిత్రం పూర్తయిన తరువాత విజయనిర్మల గారూ చదుకోవడం, భరతనాట్యం సాధన చేయడం చేస్తుండేవారు. తన పదహారేళ్ళ ప్రాయంలో మద్రాసులో వాణిమహల్ లో తన నృత్య ప్రదర్శన ఇచ్చినప్పుడు అక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ గారూ, విజయనిర్మల గారి నృత్య ప్రదర్శనను మెచ్చుకుని ఒక స్టీలు గిన్నెను బహుమతిగా బహుకరించారు. అప్పుడే కొత్తగా ప్రారంభమైన ఆ స్టీలు గిన్నె తనకు అరుదైనదిగా భావిస్తూ చాలా జాగ్రత్తగా దాచుకున్నానని పలుమార్లు చెప్పుకొచ్చారు విజయనిర్మల గారూ. ఆ నృత్యం జరుగుతున్నప్పుడే విజయనిర్మల గారి అభినయాన్ని గుర్తించిన కెమెరామెన్ విన్సెంట్ గారూ (విజయనిర్మల గారి నాన్న గారి మిత్రులు) తాను చిత్రీకరించబోయే మలయాళం సినిమాలో కథనాయకిగా తీసుకున్నారు. ఆ చిత్రం “భార్గవి నిలయం”. అతీంద్రియ శక్తులు కలిగిన దెయ్యలు ఉన్నాయి అని చూపుతూ నిర్మించిన తొలి భారతీయ సినిమా “భార్గవి నిలయం” అనే మలయాళం చిత్రం. వైవిధ్యభరితమైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

తెలుగులో తొలి చిత్రం “రంగులరాట్నం”..

వాహినీ స్టూడియోస్ లో “భార్గవి నిలయం” చిత్రం ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు ఆ చిత్ర రషెస్ చూసిన బి.యన్.రెడ్డి గారూ విజయనిర్మల గారి అభినయానికి తన్మయం చెంది, తాను తీయబోయే “రంగులరాట్నం” చిత్రానికి ఎంపిక చేసుకోదలచి, మా చిత్రంలో నటిస్తావా అని విజయనిర్మల గారిని ఇంగ్లీషులో అడిగారట. అప్పుడు విజయనిర్మల గారూ నేను తెలుగు అమ్మాయినేనండి. మీ స్టూడియోలో పనిచేసే రాంమోహన్ రావు గారి కూతురును అని చెప్పారు. అప్పుడు రాంమోహన్ రావు గారి అనుమతితో “రంగులరాట్నం” చిత్రంలో ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు. నటులు చంద్రమోహన్ గారు నటించిన తొలి చిత్రం అయిన “రంగులరాట్నం” లో అంజలిదేవి, వాణిశ్రీ, త్యాగరాజు లాంటి వారితో కలిసి విజయనిర్మల గారూ నటించారు. ఇలా తొలిసారి విజయనిర్మల గారూ తెలుగులో నటించిన చిత్రం “రంగులరాట్నం”.

తొలి తమిళ చిత్రం “ఎంగ వీట్టు పెన్”…

“రంగులరాట్నం” చిత్రం చిత్రీకరణలో ఉండగానే “ఎంగ వీట్టు పెన్” అనే తమిళ చిత్రంలో (తెలుగులో “షావుకారు”) విజయనిర్మల గారికి అవకాశం వచ్చింది. ఈ చిత్రం కోసం నెల రోజులు తమిళం కూడా నేర్చుకున్నారు విజయ నిర్మల గారూ. అయితే ఈ చిత్రం షూటింగ్ లో ప్రముఖ నటులు యస్వీ.రంగారావు గారూ విజయనిర్మల గారిని చూసి, ఇంత బక్కగా పేలవంగా ఉన్న ఈమెతో నేను నటించనని చెప్పేశారు. దాంతో చిత్రీకరణ ఆపివేయగా విజయనిర్మల గారూ ఇంటికెళ్లారు. నిరాశతో తనకు అవకాశం చేజారిందని భావిస్తున్న తరుణంలో రెండో రోజు షూటింగ్ కు రమ్మని పిలుపొచ్చింది. తీరా వచ్చాక చూస్తే యస్వీ.రంగారావు స్థానంలో మరొకరిని తీసుకున్నారు. దర్శకులు చిత్రీకరణ పట్ల ఎంత స్పష్టతతో ఉండేవారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత చాలా సినిమాలలో యస్వీ.రంగారావు గారూ, విజయనిర్మల గారూ కలిసి నటించారు. ఆ రోజులలో దర్శకులలో ఎంత పట్టువిడుపు ఉండేదో ఈ సంఘటనే నిదర్శనం అని విజయనిర్మల గారూ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. మలయాళం, తెలుగు, తమిళం లో తీసిన మూడు చిత్రాలు కొద్ది నెలల తేడాతో విడుదలయ్యి అద్భుతమైన విజయాలు సాధించడంతో ఆమెకు కథనాయకిగా అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి.

దర్శకురాలిగా మొదలైన ప్రస్థానం..

బాపు గారూ తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం “సాక్షి”. చిత్రీకరణ గోదావరి నది ఒడ్డున ఉన్న పులిదిండి గ్రామంలో జరుగింది. ఇది రంగారావు గారికి నటుడిగా తొలిసినిమా. ఆ తర్వాత సినిమా టైటిల్‌ని తన పేరుకు ముందుగా పెట్టుకుని సాక్షి రంగారావుగా ప్రేక్షకులకు చేరువయ్యారు. 20 రోజుల్లోనే సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తయింది. బాపు గారే బొమ్మలు వేసుకుని, సన్నివేశాల్ని స్పష్టంగా నటీనటులకు వివరిస్తూ దర్శకత్వం చేయడం గమనించిన విజయనిర్మల గారూ తాను కూడా దర్శకత్వం చేయాలనుకుని తన కోరికను కృష్ణ గారికి తెలియజేశారు.

దర్శకురాలిగా తొలి చిత్రం “కవిత”

అప్పుడే విజయనిర్మల గారిని వివాహం చేసుకున్న కృష్ణ గారూ “నటించినవి కొన్ని చిత్రాలే కదా, కొంతకాలం నటించాక దర్శకత్వం చేయమని” సలహా ఇవ్వడంతో కృష్ణ గారి మాట ప్రకారం కొంత కాలం తరువాత 1971 – 72 ప్రాంతంలో మలయాళంలో సినిమా తీయాలని నిర్ణయించుకుని “సంగం మూవీస్” అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి విజయనిర్మల గారే దర్శక, నిర్మాతగా “కవిత” అనే మలయాళం సినిమాను తీశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది.

దర్శకురాలిగా తొలి తెలుగు చిత్రం “మీనా”..

దాంతో తెలుగులో యుద్దనపూడి సులోచనారాణి గారూ వ్రాసిన “మీనా” అనే నవల హక్కులు పొందిన దుక్కిపాటి మధుసూదన రావు గారి వద్ధ నుండి విజయనిర్మల గారూ హక్కులను పొందారు. మొదట యస్.వి.రంగారావు గారిని ఆ సినిమాలో తీసుకుందామని అనుకుకున్నారు విజయనిర్మల గారూ. దురదృష్టావశాత్తు యస్.వి.రంగారావు గారూ మరణించారు. అప్పుడు ఆ స్థానంలో గుమ్మడి గారిని తీసుకున్నారు. గుమ్మడి గారూ, యస్.వరలక్ష్మి గారూ, సూర్యకాంతం గారూ, చంద్రకళ గారూ, అల్లు రామలింగయ్య గారూ, జగ్గయ్య గారూ లాంటి పెద్ద పెద్ద నటీనటులను దర్శకత్వం చేయాల్సి వచ్చింది.

చిత్రికరణ శరవేగంగా సాగడం చూసి నటీనటులు అవాక్కయిపోయారు. నిజంగానే సినిమా తీస్తుందా లేదా అనే అనుమానాలు వారిలో మొదలయ్యాయి. సూర్యకాంతం గారిని ఇలా చెయ్యాలి. అలా నటించాలి అని చెబుతుంటే ఆ చేస్తాములే అని వెటకారంగా మాట్లాడేవారట. యస్.వరలక్ష్మి గారిది తల్లి పాత్రయితే, కథానాయకిలాగా అలంకరించుకుని వచ్చారట. అల్లు రామలింగయ్య గారికి డైలాగ్ డెలివరీ గురించి చెబితే, అలా కాదమ్మా ఇలాగా అని విజయనిర్మల గారికి ఎదురు చెప్పేవారట. గుమ్మడి గారూ ఆవిడ తీసిన చిత్రం రషెస్ చూస్తే గాని నమ్మలేనని చెప్పగా, ఆ రాత్రి తీసిన సినిమా వరకు ప్రాసెస్ చేసి మరునాడు ఉదయం గుమ్మడి గారికి చూపించారట.

అప్పుడు గుమ్మడి గారూ “హడావిడిగా తీస్తుంటే నమ్మలేక పోయాను. ఇంత పనిరాక్షసివేంటమ్మా నీవు” అని విజయనిర్మల గారిని అభినందించారు గుమ్మడి గారూ. మూడో రోజునుండి వారంతా విజయనిర్మల గారికి సినిమా చిత్రీకరణ పూర్తయ్యేలా చక్కగా సహాకరించారు. విజయకృష్ణ పతాకంపై పీ.వీ.రమణయ్య, జీ.పీ.మల్లయ్య గార్లు నిర్మించిన ఈ చిత్రం విజయనిర్మల గారి దర్శకత్వ ప్రతిభతో 1973, డిసెంబర్ 28న విడుదల అయిన “మీనా” చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. దాంతో దర్శకురాలిగా తనకు తిరుగులేదని నిరూపిస్తూ దాదాపు అత్యధికంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2002వ సంవత్సరంలో, ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది.

కృష్ణ గారితో తొలిసారిగా “సాక్షి” చిత్రంలో.. 

విజయనిర్మల గారూ సూపర్ స్టార్ కృష్ణ గారూ నటించిన ‘సాక్షి’ చిత్రంతో తొలిసారిగా కృష్ణ గారితో వెండితెరపై కలిసి నటించిన ఈ జంట ప్రేమించుకుని 1969లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి సినిమాల్లోకి రాకముందే 1962లో శ్రీమతి ఇందిరా దేవి గారితో పెళ్లి జరిగింది. తరువాత కాలంలో కృష్ణ గారి సినీ ప్రస్థానంలో విజయ నిర్మల గారితో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీళ్ళ కలయికలో అనేక విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీళ్లిద్దరి కలయికలో ఏకంగా 47 చిత్రాలు విడుదలయ్యాయి. విజయ నిర్మల గారూ దర్శకులుగా విజయవంతం అవ్వడంలో కృష్ణ గారి ప్రమేయం చాలానే ఉంది.

ప్రముఖ దర్శకులు బాపు గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ గారూ కథానాయకులుగా నటించిన తొలి సినిమా ‘సాక్షి’. కథనాయకుడిగా కృష్ణ గారికి అయిదో చిత్రమది. అందులో విజయ నిర్మల గారూ కథానాయిక. హీరో హీరోయిన్లుగా వాళ్ళిద్దరి కలయికలో తొలి చిత్రం కూడా అదే. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఇరువురికీ పరిచయం అయ్యింది.

కృష్ణ గారూ, విజయ నిర్మల గారి కలయికలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా, తొలి చిత్రం ‘సాక్షి’ వారిద్దరికీ చాలా అంటే చాలా ప్రత్యేకం. రాజమండ్రి దగ్గరలోని పులిదిండిలో గల ‘మీసాల కృష్ణుడు’ దేవాలయంలో ఆ చిత్రం యొక్క చిత్రీకరణ జరిగింది. ‘అమ్మ కడుపు చల్లగా… అత్త కడుపు చల్లగా… బతకరా బతకరా పచ్చగా’ అంటూ ‘సాక్షి’ సినిమా కోసం ఆరుద్ర గారూ వ్రాసిన పాట చిత్రీకరించారు. ఆ పాటలో వివాహ కార్యక్రమం మొత్తాన్ని కృష్ణ, విజయ నిర్మల గార్లపై శాస్త్రోకంగా చిత్రీకరణ చేశారు. ప్రముఖ హాస్య నటులు రాజబాబు గారూ ”ఈ దేవాలయం చాలా మహిమ గల శక్తివంతమైన దేవాలయం. ఇందులో జరిగిన మీ సినిమా పెళ్ళి త్వరలో నిజం పెళ్ళి అవుతుంది’ అని సరదాగా అన్నారట. అప్పుడు అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఆ మాటలకు సరదాగా నవ్వుకున్నారట. కానీ, ఆ తర్వాత నిజంగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం కాస్త పెళ్ళికి దారి తీసింది. మార్చి 24, 1969న తిరుపతిలో వారిరువురూ వివాహం చేసుకున్నారు.

విజయనిర్మల గారూ , సూపర్ స్టార్ కృష్ణ గారూ జంటగా నటించిన తెలుగు చిత్రాలు

సాక్షి, మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్ ప్రెస్, అత్తగారు కొత్తకోడలు, లవ్ ఇన్ ఆంధ్రా, టక్కరి దొంగ చక్కని చుక్క, విచిత్ర కుటుంబం, బందిపోటు భీమన్న, అక్కా చెల్లెలు, మా నాన్న నిర్దోషి, మళ్లీపెళ్లి, విధివిలాసం, అమ్మకోసం, తాళిబొట్టు, పెళ్లి సంబంధం, పెళ్లికూతురు, పగ సాధిస్తా, అగ్నిపరీక్ష, రెండు కుటుంబాల కథ, అల్లుడే మేనల్లుడు, మాస్టర్ కిలాడి, అనురాధ, మోసగాళ్లకు మోసగాడు, భలే మోసగాడు, పండంటి కాపురం, ప్రజా నాయకుడు, మంచివాళ్లకు మంచివాడు, దేవుడు చేసిన మనుషులు, మీనా, గాలిపటాలు, అల్లూరి సీతారామరాజు, ధనవంతుడు గుణవంతుడు, దేవదాసు, సంతానం – సౌభాగ్యం, పాడిపంటలు, రామరాజ్యంలో రక్త పాతం, దేవుడే గెలిచాడు, పంచాయితీ, పట్నవాసం, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమాహేమీలు, అంతం కాదిది ఆరంభం, రక్తసంబంధం, సాహసమే నా వూపిరి, ప్రజల మనిషి, బొబ్బిలి దొర, శ్రావణమాసం, నేరము-శిక్ష, శ్రీశ్రీ (2016)

సూపర్ స్టార్ కృష్ణ గారూ, విజయ నిర్మల గారూ కలిసి నటించిన చిత్రాలలో విజయం సాధించిన చిత్రాలు చాలా ఉన్నాయి. తన సినీ ప్రస్థానంలో విజయనిర్మల గారూ, సూపర్ స్టార్ కృష్ణ గారితోనే అత్యధిక చిత్రాలలో నటించారు. విజయ నిర్మల గారు దర్శకత్వం వహించిన చిత్రాలలో కృష్ణ గారూ సుమారు 30 చిత్రాలలో కథనాయకులుగా నటించారు. విజయనిర్మల గారి దర్శకత్వంలో “మీనా” నవల ఆధారంగా కృష్ణ గారూ కథనాయకులుగా తీసిన చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. సినీ పరిశ్రమకు విజయనిర్మల గారూ చేసిన సేవలకు గానూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 వ సంవత్సరంలో “రఘుపతి వెంకయ్య” అవార్డుతో సత్కరించింది. విజయనిర్మల గారి వారసుడిగా కుమారుడు నరేశ్ గారూ తెరంగేట్రం చేశారు. తెలుగు చిత్ర సీమలో హాస్య చిత్రాల కథానాయకుడిగా పేరు సాధించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు.

మరణం…

విజయనిర్మల గారూ హృదయ సంబంధిత వ్యాధితో కొంత కాలంగా బాధపడుతూ అస్వస్థతకు గురికావడంతో, వారిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్చారు. వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతూ 27 జూన్ 2019 అనగా బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. విజయనిర్మల గారూ తెలుగు, తమిళ, మలయాళంలో 200కు పైగా చిత్రాల్లో నటించారు.

Show More
Back to top button