Telugu Featured News

ఏపీలో తెదేపా పాగ వేయనుందా..?!

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్వయానా కోడలు..

తెదేపా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 

నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి..

పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందా.. అంటే, అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు.. ప్రస్తుతం ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. 

రాబోయే ఎన్నికలలో.. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాదు.. పార్లమెంటు స్థానాలలోనూ  విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు చంద్రబాబునాయుడు.. 

ఈ సందర్భంగా ఒకవైపు అధికార ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే.. మరోవైపు కొడుకు లోకేష్ పాదయాత్ర ద్వారా జగన్ సర్కారు పాలనను తూర్పార పడుతూ.. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పట్టిష్టమైన సన్నాహాలు చేపడుతున్న నేపథ్యంలో కీలకమైన ఎంపీ స్థానంలో బ్రహ్మణిని నిలబెట్టనున్నారు. అంతేకాక తెదేపా – జనసేన పొత్తు, బీజేపీ కాపు ఓట్లు చీల్చే ప్రక్రియ.. వైసీపీ వ్యూహాలు.. వంటి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కీలక రాజకీయ పరిణామాల గురించి ఈరోజు తెలుసుకుందామా:

వచ్చేది సార్వత్రిక ఎన్నికలు..

రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలను సాధించడమే తెలుగుదేశం పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యం..

ఆ ప్రకారమే, ఇప్పటికే అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడం అదేమంతా కష్టంకానీ విషయంగా భావిస్తున్నారు.

అన్ని వర్గాలూ తెలుగుదేశంవైపే మొగ్గు చూపుతాయన్న విశ్వాసం ఆయనలోనే కాదు, తెలుగుదేశం శ్రేణుల్లోనూ వ్యక్తమవుతోంది. 

దానికి తోడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ జనసేనా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్యేయం సైతం తెలుగుదేశం పార్టీకే ప్రయోజనకరంగా తోస్తుంది.

జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తు ఈపాటికే ఖాయమైందనీ, అధికారిక ప్రకటన ఒక్కటే తరువాయిగా భావిస్తున్న తరుణంలో..

చంద్రబాబు లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి.. కచ్చితంగా గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.  అయితే కీలకమైన ఒక్క విజయవాడ లోక్ సభ స్థానం విషయంలోనే ఆయన ఒక్కింత ఇబ్బంది ఎదుర్కొంటున్నారనీ, ఆ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు

తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

నారా బ్రహ్మణి పేరు తెరపైకి వచ్చిందిలా

గత ఎన్నికల నుంచి విజయవాడ ఎంపీగా ఎన్నికైన కేశినేని నాని, ఈసారి ఎన్నికల్లో ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ ల మధ్య సీటు కోసం పోటీ పడటంతో.. ఇద్దరి మధ్యన సామరస్యం కుదిరేలా లేకపోవడంతో.. విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో చంద్రబాబుకు తలనొప్పి తప్పలేదు. ఇందుకుతోడు కేశినేని నాని వ్యవహార శైలి పార్టీ శ్రేణుల్లో ఇబ్బందులు తలెత్తేలా చేస్తుంది. ఒకవేళ కేశినేని నానిని కాదని, సోదరుడిని ప్రోత్సహించినా.. కేశినేని నాని సహకారం లేకుండా విజయం సాధించే అవకాశం కనిపించట్లేదు. వీరిద్దరినీ కాదని కొత్త వారిని ఎంపిక చేస్తే.. ఎలా ఉంటుంది అన్న ఆలోచన మొదలు.. 

నారా బ్రాహ్మణి పేరు తెరమీదకు వచ్చింది.

నారా బ్రాహ్మణి.. పరిచయం అక్కర్లేని పేరు.. నందమూరి ఎన్టీఆర్ కు మనవరాలిగా, నటసింహం బాలకృష్ణ తనయగా.. నారా చంద్రబాబు నాయుడుకు కోడలిగా.. నారా లోకేష్ సతీమణి అయిన బ్రాహ్మణి ఇప్పటికే హెరిటేజ్ సంస్థల బాధ్యతల్ని స్వీకరించి.. మేటిగా నిలుస్తోంది. 

గత నెలలో నారా లోకేష్ చేపట్టిన యువగళంకు తోడు.. విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బ్రాహ్మణిని నిలబెట్టడమే శ్రేయస్కరమని భావిస్తున్నాయి పార్టీ శ్రేణులు..

దీంతో కేశినేని బ్రదర్స్ సైతం పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేస్తారని, ఆమె ఎంట్రీతో పార్టీకి కొత్త కళను తీసుకువస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే టీడీపీకి మరింత ఊపు వస్తుందని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అంటున్నారు. 

పార్టీ అధినేతగా చంద్రబాబు, అధికార జగన్ పాలనా వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. మున్ముందు పొత్తు  కుదిరితే, పవన్ కల్యాణ్ బస్సు యాత్ర సైతం తెలుగుదేశం గ్రాఫ్ ను మరింతగా పెంచేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

విద్యావంతురాలైన బ్రాహ్మణి.. లోక్ సభలో తెలుగుదేశం సభ్యురాలిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా గళం వినిపిస్తారని తెలుగుదేశం శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 

తెదేపాజనసేన పొత్తు

ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి సాగేందుకు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పవన్ పదే పదే అనడం వెనకున్న అంతరార్థం ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా తెలుగుదేశం, జనసేనల ఎన్నికల పొత్తు ఖాయమనే గోచరిస్తుంది.

పవన్‌, చంద్రబాబు ఇటీవల విజయవాడలో జరిగిన ఒక సంయుక్త సమావేశంలో కలుసుకొని.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతునట్లు, ఇందులో భాగంగానే త్వరలోనే రోడ్‌ మ్యాప్‌ రూపొందించబోతున్నట్లు వెల్లడించారు. 

జనసేన, బీజేపీ

ఇదిలా ఉంటే, జనసేన, బీజేపీల మైత్రి విషయం సంగతేమిటన్న చర్చ సైతం జరుగుతోంది.

ఇది దాదాపు వీగిపోయినట్లు తెలుస్తుంది.

బీజేపీతో మైత్రి కొనసాగినా, కొనసాగకపోయినా.. పెద్ద తేడా ఏమీ ఉండదని జనసేనాని భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఒకవేళ జనసేన, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే మాత్రం.. ఆ కూటమి విజయం అరటిపండు తిన్నంత తేలికగా భావిస్తున్నారు. దీనికి తోడు.. అధికార పార్టీ వైసీపీపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకత తెలుగుదేశం, జనసేన కూటమికి మరింత బలంగా మారుతుందన్నమాట.

ఈ నేపథ్యంలోనే ఇంత వరకూ గెలుపు ధీమాతో ఉన్న సీఎం జగన్ అన్ని రకాలుగా కార్యచరణలో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వరుస సమావేశాలను నిర్వహిస్తోంది జగన్ సర్కారు. ఎంత చేసినా ఈసారి గెలిచి నిలవడం కష్టమే అనిపిస్తుంది.

ఎందుకంటే ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలమైన ఓట్లుగా మార్చుకునేందుకు అవసరమయ్యే పార్టీ నిర్మాణం, యంత్రాగం, నెట్ వర్క్ తెలుగుదేశం పార్టీ సంసిద్ధం చేసుకుంటుంది. అందువల్ల తెలుగుదేశం, జనసేనల పొత్తు ప్రభంజనం సృష్టిస్తుందన్న భయం.. అధికార వైసీపీలో రోజురోజుకూ పెరిగిపోతుంది.

ఇక తెలంగాణ విషయానికొస్తే, అక్కడ తెలుగుదేశం పార్టీకి అధికారం చేజిక్కించుకునేంత బలం అయితే లేదు. కానీ కనీసం పాతిక, ముఫ్ఫై నియోజకవర్గాలలో గెలుపోటములను చూపగల సత్తా మాత్రం ఆ పార్టీకి ఉందనే చెప్పాలి. అంటే తెలంగాణలో బీజేపీ నిలబడ్డం కోసం తెలుగుదేశం సహాయం కోరడం, ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ సహకారం ఉండాలన్న ఒప్పందం దిశగా కమలం పార్టీపై ఒత్తిడి తీసుకురావడమే చంద్రబాబు ఎత్తుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాదు, ఎప్పటికీ అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోతుందన్న విషయం బీజేపీ నాయకత్వానికి తెలుసు. అయినా సరే అధికారం కోసం కాకపోయినా, ఒంటరిగా పోటీ చేయాలనుకుంటుంది. అలా చేస్తే, కనీసం ఒకటి, రెండు సీట్లు గెలుచుకోవడమనేది కూడా కమల దళానికి సమీపంలోనే కాక, భవిష్యత్తులోనూ ఆ అవకాశమే కనిపించడం లేదు.  ఈ విషయం మోదీ, అమిత్ షాలతో పాటు ఇతర బీజేపీ పెద్దలకు సైతం తెలుసు..

ఏపీలో కాపు ఓట్లు చీల్చడమే బీజేపీ లక్ష్యం

అయితే తెలుగుదేశం, జనసేన పొత్తును చెడగొట్టేందుకు వీలుగా.. కాపు ఓటును చీల్చి, వైసీపీకి మేలు చేసే దిశగా బీజేపీలోని ఒక వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. తెలుగు దేశం, జనసేన పార్టీలు చేతులు కలిపితే, ఇక కాపు ఓట్లన్నీ టీడీపీ, జేనసేన కూటమికే పడతాయన్నదే ఇందుకు ప్రధాన కారణం.

గత ఎన్నికల్లో పరిశీలిస్తే, టీడీపీ, జనసేన విడిగా పోటీ చేయడంవల్ల.. వైసీపీకి దాదాపు 50 నుంచి 55 నియోజకవర్గాల్లో స్వల్ప ఆధిక్యతతో కూడిన విజయం దక్కింది. అంతేకాక, 2019 ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూల ఓటు చీలిపోవడం వల్లనే.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అందుచేత వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటివరకు పొత్తులకు సంబంధించి బీజేపీతో సహా ఏ పార్టీ కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేసింది లేదు. కానీ  టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది.

అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, వైసీపీ అనుకూల బీజీపీ వర్గం..

కాపు ఓటును చీల్చేందుకు మూలంగా టీడీపీ, జనసేన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నంగా తోస్తుంది. ప్రస్తుత రాజకీయ, కులసమీకరణలోనూ కీలకంగా మారిన కాపు ఓటును మూడుముక్కలు చేసేందుకు మరో ప్రయత్నంగా తోస్తుంది.

ఇందులో భాగంగానే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కాపు కార్డుతో ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓబీసీ కోటాలో కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ అనే అంశానికి సంబంధించి రాజ్యసభలో ప్రస్తావించిన జీవిఎల్..  ఇప్పుడు గన్నవరం విమానశ్రయానికి రంగా పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం విస్మయానికి గురి చేస్తుంది.  

నిజానికి బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్రంలోనే కాక.. ఎప్పటికైనా ఏపీ రాష్ట్రంలోనూ పట్టు సాధించాలంటే కాపులను తమ వైపుకు తిప్పుకోవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది.

తెలుగుదేశం-జనసేన పొత్తు వల్ల వైసీపీ నష్టపోతుందన్న కారణంతో.. సాధ్యమైనమేరకు కాపుల ఓట్లలో చీలిక తీసుకురావడం ద్వారా ఈ పొత్తుకు గండి పడాలని అధికార పార్టీ యోచిస్తోన్నట్లుంది. బీజేపీ చేస్తున్న రాజకీయం, వేస్తున్న ఎత్తుగడలు కూడా వైసీపీకి అనుకూలంగా మారనున్నాయి. మొత్తానికి.. కాపు ఓటు చుట్టూ ప్రస్తుత రాష్ట్ర రాజకీయం నడుస్తోంది. మున్ముందు ఏం జరగనుందో తెలియాల్సి ఉంది. అంతే!

Show More
Back to top button