ఎన్నికల వేళ ఎక్కువగా ట్రెండింగ్ అయ్యే అంశం జంపింగ్స్. దీంతో రాష్ట్రంలో రాజకీయ నేతల జంపింగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. రానున్న ఎన్నికల్లో సొంత పార్టీల నుంచి అవకాశాలు రాకపోతే సాధారణ కార్యకర్తలు మొదలుకొని నియోజకవర్గ, మండల కీలక నేతల దాకా పార్టీలు మారేందుకు సిద్ధం అవుతున్నారు. పార్టీ మారడంతో పాటు ఆ పార్టీపై విమర్శలు చేస్తూ.. చేరిన పార్టీలోని అధినేతలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇతర పార్టీల నేతలకు గాలం వేయడం, పార్టీ వీడిన వారిని మళ్లీ సొంతగూటికి ఆహ్వానించడమే లక్ష్యంగా ఆయా పార్టీల అధినేతలు పెట్టుకున్నారు. అసలు ఇలా పార్టీ ఫిరాయింపులు చేయడం ఎప్పటి నుంచి వచ్చింది? దీనిపై చర్యలు ఏంటి? ప్రస్తుతం ఎవరెవరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో వివరంగా చర్చిద్దాం పదండి.
9 గంటల్లోనే మూడు పార్టీలకు జంప్
ఒక రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచి పదవులను పొందిన తరువాత అక్రమంగా మరొక పార్టీలో చేరడాన్ని ఫిరాయింపు అంటారు. ఫిరాయింపులను సమర్థవంతంగా నిరోధించడం కోసం 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చారు. దీనికి ప్రధాన కారణం 1967లో హర్యానాకు చెందిన గయాలాల్ అనే ఎమ్మెల్యే కేవలం 9 గంటల్లోనే మూడు పార్టీలు మారారు. దీంతో ఆ ఎమ్మెల్యేతోనే ఆయారాం, గయారాం అనే పేరు వచ్చింది. కాగా, అప్పటి నుంచి వివిధ పార్టీల ఎమ్మెల్యేలు వలసలు వెళ్లడం వల్ల ప్రభుత్వాలు చిన్నాభిన్నం అయ్యాయి. దీంతో 1985లో ప్రధాని రాజీవ్‌గాంధీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే, ఈ చట్టాన్ని తీసుకొచ్చినా.. వలస వెళ్లే పద్ధతి అయితే మారింది గానీ వారి తీరు ఇప్పటికీ మారలేదు. అలాంటి నేతలే ఇప్పుడు మనకు తరచూ కనిపిస్తున్నారు.
జంపింగ్స్ వర్కౌట్ అయ్యాయి
ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా చాలా మంది జంపింగ్ జపాంగ్‌లు కనిపించారు. 2019లో BRS పార్టీ తరుఫున గెలిచిన వేముల వీరేశం, జూపల్లి కృష్ణారావు, బీర్ల అయిలయ్య ఇలా కొంతమంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ వారికి టికెట్స్ ఇవ్వడంతో అనూహ్యంగా వారు అందరూ గెలిచారు. దీంతో అదే BRSకు పెద్ద మైనస్ కావడం, కాంగ్రెస్‌కు ప్లస్ కావడం జరిగింది. అయితే, ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరడంతో ఇటువంటి ఘటన ఎదురవుతుందని టికెట్ ఇవ్వని సిట్టింగ్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
జంపింగ్ జపాంగులు వీరే
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్, వల్లభనేని వంశీ… ఆ తర్వాత వైసీపీలో చేరారు. వీరిపై టీడీపీ అనర్హత పిటిషన్ ఇచ్చింది. వీరే కాకుండా వైసీపీ తరఫున గెలిచిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన తరపున గెలిచిన రాపాకకు కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అయితే, ఒకప్పుడు రోడ్లు విషయంలో సీఎం జగన్‌ను తిట్టిన కేశినేని.. ఇప్పుడు జగన్‌ను పొగుడుతూ.. చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టారు. ఇక వైసీపీ నుంచి చూస్తే.. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు(ఎంపీ) మొదలైనవారు సీఎం జగన్‌ను ఒకప్పుడు పొగిడి ఇప్పుడు అదే జగన్‌ను తిట్టడం మొదలు పెట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు ఓటములు ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంది.
మరుసటి రోజే పార్టీకి రాజీనామా..!
ప్రజలకు సేవ చేయడానికే వచ్చామంటూ.. ఎమ్మెల్యేలు ఒక పార్టీలో సీటు దొరకనప్పటికీ మరోక పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అంతేగాని పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి మాత్రం ధైర్యం చాలడం లేదు?. అంతేకాదు, ప్రజలు సమస్యలను పరిష్కరించమని అడిగినప్పుడు వాటి పరిష్కారానికి నెలలు కొద్ది పట్టిన సమయం.. పార్టీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం మరుసటి రోజే పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పటికీ.. ఇలా పార్టీలు మారే ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వాలు మారి ప్రజల తీర్పు అపహాస్యం అవుతుంది. ఒకవేళ ఇలా వచ్చిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుందాం అనుకున్నా.. వారు అధికార పక్షంలోకే రావడం వల్ల, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. కాబట్టి ప్రజలు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో సరైన నాయకులను ఎన్నుకునే ప్రయత్నం చేయాలి.