మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగనుంది. దీని మేరకు తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారతాయి అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీంతో జగన్తో పాటు వారి నాయకుల్లో దడ పుడుతున్నట్లు ప్రతిపక్ష నేతలు అంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ అవలంభించిన విధానాల వంటివే జగన్ అమలు చేయడం వల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ హయాంలో ప్రజాధనంతో నిర్మించిన సాంస్కృతిక భవనాన్ని పడగొట్టడంతో ప్రారంభమైన కక్షపూరిత రాజకీయాలు.. తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చె నాయుడు, కొల్లు రవీంద్ర, చివరికి చంద్రబాబు అర్టెస్టు వరకు వెళ్లిందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక రోడ్ల దుస్థితి చెప్పలేనిది కాదు. చాలా ప్రాంతాల్లో నాలుగైదు రోజులకు గాని తాగునీరు సరఫరా కాని పరిస్థితి ఉంది. ఆసుపత్రులలో డాక్టర్ ఉంటే సౌకర్యాలు లేవు, సౌకర్యాలు ఉంటే డాక్టర్లు లేరు. మందులు అరకొర ఉన్నాయి. దిక్కుతోచక రోగులు ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారని టీడీపీ నుంచి వస్తున్న వాదన.
ఇకపోతే రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరగడం, అభివృద్ధిని పక్కనపెట్టి మరీ ఉచిత పథకాలను ఇవ్వడం జగన్ ఓటమికి కారణాలు అవుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఉచితాలను పెట్టడం వల్ల రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి నిత్యవసర వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల వస్తువు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతోందని కొన్ని సర్వే సంస్థలు సైతం వెల్లడిస్తున్నాయి. ఇది దీర్ఘ కాలంలో మధ్యతరగతి వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అదే సర్వేలు చెబుతున్నాయి.
ఇకపోతే ఏపీలో 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎం వైఎస్ జగన్కు విపరీతమైన సహకారం అందించారని ఇప్పటికీ రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. కేసీఆర్ సాధ్యమైనంత వరకు ఆర్థిక సాయం చేశారని ప్రచారం. అంతేకాదు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి మంత్రులు ఏపీకి వెళ్లి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అనంతరం ఏపీలో వైసీపీ విజయదుందుభి మోగించడం చకచకా జరిగిపోయాయి.
అయితే, ఇప్పుడు తెలంగాణ ఫలితాలు ఏపీలో టీడీపీ పుంజుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని రాజకీయంగా ప్రచారం జరుగుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఎలాగైతే తెలంగాణకు ఉపయోగపడిందో అలాగే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఏపీలో టీడీపీకి కలిసొస్తుందని..వైసీపీకి ప్రతికూలంగా మారబోతుందని ప్రచారం జరుగుతుంది. స్కిల్ స్కాం కేసులో ఇప్పటికే చంద్రబాబు జైలుకెళ్లి బయటకొచ్చారు. దీంతో చంద్రబాబుపై విపరీతమైన సానుభూతి ఉంది. తాజాగా తెలంగాణలో జగన్కు సహకరించే బీఆర్ఎస్ ఓడిపోవడంతో అది మరింత కలిసి వస్తోందని టీడీపీ భావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇస్తారో వేచి చూడాలి.