2024-25 ఏడాదికిగాను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ రూ.47.65 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఎన్నికల ముందు వస్తున్న తరుణంలో మధ్య తరగతి వర్గం వారికి వరాలు జల్లు కురింపించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలతో పాటు దేశ ప్రజల వాస్తవిక ఆదాయం 50 శాతానికిపైగా పెరిగిందన్నారు.
కాగా.. ఈ బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజల కోసం గుడ్ న్యూస్ చెప్పారు నిర్మలా సీతారామన్. సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అదేవిధంగా యువతకు నామమాత్ర వడ్డీ లేదా అసలు వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణాలు ఇస్తాం అని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు నిర్మలా సీతారామన్. మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనుగోలు చేయడం, కట్టుకోవడం కోసం సాయం అందిస్తామని అన్నారు. యువత కోసం లక్ష కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తామని.. పేదలు, మహిళా సాధికారత, రైతులపై ఫోకస్ పెడతామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయ పన్ను శ్లాబులు యధాతదంగా ఉంటాయని చెప్పారు.
ఇక ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,138 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2009 నుంచి 2014 వరకు రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారని.. ప్రస్తుత బడ్జెట్లో రూ.9,138 కోట్లు కేటాయించామని.. ఇది 10 రెట్లు ఎక్కువ అన్నారు. ఏపీలో 98 శాతం విద్యుద్దీకరణ పూర్తయిందని వివరించారు. విశాఖ రైల్వేజోన్‌కు ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదని.. జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్ సిద్ధమైందన్నారు.
ఉద్యోగులకు ఊరట కలిగించే విషయాలు
- కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టిన కేంద్రం
- ఏడాదికి రూ.7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు
- ఆదాయ పన్నుల శ్లాబులు యథాతథం
- ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు
- కార్పొరేట్ ట్యాక్స్ 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గింపు
- ఇకపై 10 రోజుల్లోనే ట్యాక్స్ రిటర్న్స్ చెల్లింపులు
- ఆదాయపన్ను చెల్లింపులు సులభతరం చేస్తాం.
ఇక వివిధ విభాగాలకు కేటాయింపుల విషయానికి వస్తే.. క్రింది విధంగా ఉన్నాయి.
- హోం శాఖకు: రూ.2.03 లక్షల కోట్లు
- రైల్వే: రూ.2.55 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ది: రూ.1.77లక్షల కోట్లు
- రసాయనాలు, ఎరువులు: రూ.1.68 లక్షల కోట్లు
- కమ్యూనికేషన్లు: రూ.1.37 లక్షల కోట్లు
- వ్యవసాయం, రైతు సంక్షేమం: రూ.1.27 లక్షల కోట్లు
- రక్షణ రంగం: రూ 6.2 లక్షల కోట్లు
- ఉపరితల రవాణా, జాతీయ రహదారులు: రూ. 2.78 లక్షల కోట్లు
- వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ: రూ.2.13 లక్షల కోట్లు