ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు రెండూ ఒకేలా ఉంటాయి. కానీ, వీటిని గమనిస్తే చిన్న తేడా కనిపిస్తుంది. ఆర్థిక కోణంలో చూస్తే వాటి మధ్య తేడా తెలుస్తుంది. ఉచిత పథకాలనేవి దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా పరిణమిస్తాయి. కానీ సంక్షేమ పథకాలు పేద వర్గాలను పేదరికం నుంచి కొంత ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు సహాయపడతాయి. ఇదే సమయంలో పేద వర్గాల వారి కొనుగోలు శక్తిని పెంచేందుకు, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతాయి. కానీ, అధికారం కోసం ఆయా పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ఉచితాలను ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. ఉచితాలను పెట్టడం వల్ల రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి నిత్యవసర వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల వస్తువు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతోందని కొన్ని సర్వే సంస్థలు సైతం వెల్లడిస్తున్నాయి. ఇది దీర్ఘ కాలంలో మధ్యతరగతి వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇవే సర్వేలు చెబుతున్నాయి.
తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తోంది. అంటే టిక్కెట్ లేకుండా రాష్ట్రంలో మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఇక్కడ పేద, ధనిక తేడాలేదు. అంటే టిక్కెట్ కొనగల శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ వారు సైతం ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. వాస్తవానికి కర్ణాటకలో ఇలాంటి స్కీమ్ వల్ల రోడ్డు రవాణా సంస్థ మరింత నష్టాలలో కూరుకుపోతోంది. ఈ నష్టాన్ని భరించలేని ఓ కర్ణాటక మంత్రి అవసరంలేక పోయినా ఉచితం కాబట్టి మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలే వ్యాఖ్యానించే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణాలో కూడా అలాంటి పరిస్థితులే రావచ్చని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అదే విధంగా గృహజ్యోతి పేరుతో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని మరో ఉచిత హామీ కూడా ప్రకటించింది. ఈ రెండు హామీలతో కర్ణాటక ఆర్థిక వ్యవస్థ తీవ్ర స్థాయిలో దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఒక్క బస్సు ప్రయాణానికి ఏడాదికి రూ.4 వేల కోట్ల రూపాయలకు పైనే కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర ఆర్థిక ప్రభావం పడనుంది. కాబట్టి, ప్రభుత్వాలు ఎవరు నిజమైన పేదవారో గుర్తించి వారి జీవన ప్రమాణాలను పెంచే విధంగా కృషి చేస్తే.. వారి కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.