Telugu Special Stories

తెలుగు తెరపై చెరగని నట సంతకం.. అక్కినేని నాగేశ్వరరావు..

అక్కినేని నాగేశ్వరరావు (20 సెప్టెంబరు 1924 – 22 జనవరి 2014)..

అక్కినేని నాగేశ్వరావు గారి వ్యక్తిగత జీవితం, నటనా జీవితం రెండు కూడా తెరిచిన పుస్తకాలే. వారు ఎక్కని శిఖరాలు లేవు, చూడని లోతులు లేవు. నటనకే నటన నేర్పిన మహానటుడు. ఆయన ముఖమే నటనకు నిఘంటువు. 75 సంవత్సరాల నటనా జీవితంలో 70 సంవత్సరాలు తెలుగు చలనచిత్ర వెండితెరపై నటించారు. ఇదొక అరుదైన రికార్డు. ప్రపంచంలో అత్యధిక సంవత్సరాలపాటు నటనా జీవితాన్ని కొనసాగించిన నటుడు అమెరికాకు చెందిన  మిక్కీ రోనీ. 1924 లో జన్మించిన తాను, రెండు సంవత్సరాల వయసునుండే నటన మొదలుపెట్టి 2010 వరకు సుమారు 90 సంవత్సరాల పాటు నటుడిగా కొనసాగారు. ఆ తరువాత ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాల పాటు నటుడిగా కొనసాగిన ఘనత అక్కినేని నాగేశ్వరావు గారికే దక్కుతుంది. తొంభై యేండ్ల జీవిత సౌధం, ఎనభై యేండ్ల నటనా సౌధం, 75 యేండ్ల వెండితెర సౌధం ఇంత వైభవంగా, ఇంత పటిష్టంగా, ఇంత వైభవోపేతంగా క్రమబద్ధంగా, క్రమశిక్షణగా తన జీవితాన్ని నిర్మించుకున్నారు అక్కినేని గారూ.

జననం…

అక్కినేని నాగేశ్వరరావు గారూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, గుడివాడ తాలూకా, నందివాడ మండలంలోని రామాపురంలో 20 సెప్టెంబరు 1924 లో అక్కినేని వెంకటరత్నం గారు, పున్నమ్మ దంపతులకు జన్మించారు. అక్కినేని నాగేశ్వరావు గారి తల్లితండ్రులు ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన వారు కావటం వలన ఆర్థిక పరిస్థితి అంతగా మెరుగ్గా లేకపోవడంతో ప్రాథమిక పాఠశాల విద్యను మాత్రమే పూర్తి చేసుకున్నారు.

బాల్యం..

అక్కినేని గారూ వాళ్ళ తల్లిదండ్రులకు అయిదుగురు మగ సంతానంలో ఆఖరివాడు. అందరిలోకెల్లా చిన్నవాడు. చిన్నతనంలోనే వీళ్ళ తండ్రి గారూ మరణించడం, ఎవరి ఆస్థి వాళ్ళు సమానంగా పంచుకోవడంతో, 25 ఎకరాలు వ్యవసాయం ఉన్న వీరి కుటుంబానికి, తన వాటాగా 5 ఎకరాలు పొలం వచింది. చిన్నప్పటి నుండి పాటలు పాడడం, కోలాటాలు, భజనలు చేసే వాళ్ళ వెంట తిరుగుతూ కాలక్షేపం చేసేవారు. పాఠశాలలో ఉన్నప్పుడు హరిశ్చంద్ర నాటకం వేసే క్రమంలో నారదుడి పాత్ర కోసం పాటలు, పద్యాలు పాడే అక్కినేని గారిని ఎంపిక చేసి వారితోనే ఆ పాత్ర వేయించడం జరిగింది. ఇదే నాటకాన్ని రెండవ సారి ప్రదర్శించేటప్పుడు అందులో చంద్రమతి అనే పాత్రలో అక్కినేని గారూ స్త్రీ పాత్ర ధరించారు. ఆ నాటకాన్ని చూడడానికి వచ్చిన అక్కినేని గారి తల్లి గారూ ఆడ వేషంలో ఉన్న తన కుమారుడిని చూసి ఎంతగానో మురిసిపోయారు. నాటకాలు వేసే క్రమంలో చదువుమీద శ్రద్ధ తగ్గిపోయింది.

సినీ ప్రస్థానం..

కుదరవల్లి నాటక సమాజంలో హార్మోనిస్టుగా ఉన్న వై.భద్రాచారి వద్ధ ఒక సంవత్సరం పాటు పద్యాలు పాడటం, రాగాలు తీయడం లాంటివి నేర్చుకున్నారు. మోటూరి వీర రాఘవయ్య దగ్గర కూడా కొంతకాలం పాటలు, పద్యాల కోసం శిక్షణ తీసుకున్నారు. తనకు మూడవ గురువు బుద్దిరాజు శ్రీరామమూర్తి. వీరిది గుడివాడ. వీరి వద్ధ కూడా పాటలు, పద్యలకోసం శిక్షణ తీసుకున్నారు. నాలుగో తరగతిలోనే చదువు ఆపేశారు.

1939 లో కన్నాంబ, కడారు నాగభూషణం గార్లు తీసే చిత్రం “తల్లిప్రేమ” లో అక్కినేని గారిని ఒక పాత్ర కోసం ఎంపిక చేసి, మద్రాసు తీసుకెళ్లారు. సినిమా మొత్తం అయిపోయేవరకు కూడా అక్కినేని గారికి ఆ చిత్రంలో సరైన పాత్ర దొరకలేదు. నాలుగు నెలలు మద్రాసులోనే ఉండిపోయారు. ఆ సమయంలో సినీ ప్రముఖులు కన్నాంబ గారూ, కడారు నాగభూషణం గారూ, సి.యస్.ఆర్ ఆంజనేయులు గారూ లాంటి నటులతో పరిచయం ఏర్పడింది. తల్లిప్రేమ చిత్ర నిర్మాణ సహాయకులు, మచిలీపట్నం కు చెందిన ద్రోణావజ్జుల లక్ష్మినారాయణ (డి.యల్.నారాయణ) గారితో పరిచయం అయ్యారు. వారింట్లోనే భోజనం చేస్తూ, చిత్ర షూటింగ్ కు వెళుతూండేవారు అక్కినేని గారూ. తల్లిప్రేమలో వేషం దక్కలేదు. దాంతో అక్కినేని గారికి నెలకు పాతిక రూపాయలు చొప్పున నాలుగు నెలలకు 100 రూపాయలు చెల్లించి వెనక్కి పంపించేశారు.

అప్పట్లో చిత్రాలు కొల్హాపూర్, కలకత్తా, బొంబాయి లోను నిర్మిస్తూ ఉండేవారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో నిర్మించే ధర్మపత్ని అనే చిత్రంలో నటించేందుకు గానూ అక్కినేని గారి అన్నయ్య, అక్కినేని గారిని కొల్హాపూర్ పంపించారు. దర్శకులు పి. పుల్లయ్య గారూ. వయసు తక్కువగా ఉండడంతో పిల్లలందరూ కలిసి పాడే ఒక పాటలో నటింపజేశారు. ఈ చిత్రం 1941 జనవరి 10 నాడు విడుదలయ్యింది.

“ధర్మపత్ని” భానుమతి గారికి కథానాయికగా మూడవ చిత్రం.  అక్కినేని గారూ, భానుమతి గారూ కలిసి చాలా చిత్రాలలో నటించారు. అక్కినేని గారికి నటించడానికి సినిమాలు లేవు. “ధర్మపత్ని”లో నటించినందుకు కూడా 100 రూపాయలు పారితోషికం తీసుకుని వెనక్కితిరిగి ఇంటికి వచ్చేసి, మళ్ళీ నాటకాలు వేయడం ప్రారంభించారు. సారంగధరలో చెలికత్తె వేషం, హరిశ్చంద్ర లో మాతంగకన్య వేషం ఇలా వేషం వేస్తూ వచ్చారు. భక్తకుచేల నాటకంలో అక్కినేని గారూ మోహినీ వేషం వేశారు. ఒక అమ్మాయి రుక్మిణీ వేషం వేసింది. ఆ అమ్మాయి పేరు అంజనీ కుమారి. కాలక్రమంలో ఆ అంజనీకుమారియే “అంజలీదేవి”గా ప్రసిద్ధి చెంది అక్కినేని గారితో సువర్ణసుందరి లాంటి చిత్రాలు తీశారు.

దుక్కిపాటి మధుసూదన రావు గారితో పరిచయం..

అక్కినేని గారికి దుక్కిపాటి మధుసూధన రావు గారి పరిచయం అక్కినేని గారి నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. గుడివాడ నుండి భీమవరం వెళ్లే దారిలో ముదినేపల్లి అనే ఊరు ఉంది. ఆ ముదినేపల్లికి సమీపంలో పెయ్యేరు అనే గ్రామం ఉంది. ఆ పెయ్యేరు గ్రామానికి చెందిన దుక్కిపాటి మధుసూదన రావు గారూ బి.ఏ వరకు చదువుకున్నారు. బ్రిటిషు వారు ఊరూరా  పెట్టించిన క్లబ్ లలో భాగంగా ముదినేపల్లిలో ఎక్సెన్సియర్ అనే క్లబ్ ను పెట్టించారు. పెయ్యేరు నుండి ముదినేపల్లి వచ్చిన దుక్కిపాటి మధుసూదనరావు గారికి క్లబ్ లో ఉన్న నాటక విభాగం వైపు ఆకర్షితులయ్యారు.

ఎక్సెన్సియర్ క్లబ్ లో ఎప్పుడూ “జయంత జయపాలం” అనే పౌరాణిక నాటకం వేసేవారు. “ఆశాజ్యోతి” అనే సాంఘిక నాటకాన్ని వ్రాయించిన దుక్కిపాటి గారూ ఎక్సెన్సియర్ క్లబ్ తరుపున నాటకం ప్రదర్శించారు. దానికి సంగీతం కూడా జత చేశారు. అప్పటిదాకా నాటకాలకు సంగీతం ఉండేది కాదు. ఈ నాటకానికి పెండ్యాల నాగేశ్వరావు గారూ సంగీతాన్ని సమాకూర్చారు. ఆశాజ్యోతి నాటకంలో నటించేందుకు ఆడ పాత్ర కోసం  వెతికే క్రమంలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారూ, కోడూరు అచ్చయ్య గారూ, పెండ్యాల నాగేశ్వరావు గారూ కలిసి, అక్కినేని గారి అన్నయ్య రామబ్రహ్మం గారిని  ఒప్పించి అక్కినేని గారిని తీసుకెళ్లారు.

“తన వెంట వస్తున్న పాలబుగ్గల కుర్రవాడు వెండితెరపై వన్నెలు చిలికించగలడని, వెన్నెల కురిపించగలడని, చరిత్రలు సృష్టించగలడని, చరిత్ర మార్చగలడని, ఎవ్వరూ ఊహించలేదు. అది ప్రయాణం. అది ప్రయాస. అది ప్రయత్నం. అది ప్రారంభం. ఈ సామాన్యుడు అసమాన్యుడై, అద్వితీయుడై, అందనివాడై, అందరివాడై, అఖిలాంధ్ర ప్రేక్షక జన హృదయాదినేతయై, సమున్నత, సముజ్వల, సమగ్ర, నటజీవిత వైభవ ప్రాభవాలను సొంతం చేసుకుని మహోన్నత హిమగిరులు సైతం శిరస్సులెత్తి చూడవలసినంతటి ఉన్నతికి ఊర్థ్వ శిఖరాలకు చేరుకుని తెలుగు చలనచిత్ర కీర్తిపతాకను అంబర చుంబితం గావించి జగద్విదుతుడై జగమెరిగిన బ్రాహ్మణుడై జగజ్జేయమానంగా ఎదుగుతాడని, వెలుగుతాడని దుక్కిపాటి మధుసూదన రావు కూడా తెలియదు” అని ఒక పాత్రికేయుడు వ్రాశారు.

తొలిసారి హీరోగా “శ్రీ సీతారామ జననం” చిత్రంలో..

విజయవాడ రైల్వే స్టేషనులో అక్కినేని గారిని చూసిన ఘంటసాల బాలరామయ్య గారూ తాను తీయబోయే “శ్రీ సీతారామ జననం” అనే సినిమాలో అక్కినేని గారిని కథానాయకునిగా నటింపజేసేందుకు గుడివాడ వచ్చి అక్కినేని గారి అన్న గారిని కలిసి ఒప్పించి 1944 మే 7 వ తేదీన అక్కినేని గారిని మద్రాసు తీసుకెళ్లారు. “శ్రీ సీతారామ జననం” చిత్రంలో అక్కినేని గారి ప్రక్కన తొలి కథానాయికగా  బాలా త్రిపుర సుందరి గారూ నటించారు. ఆ చిత్రం 1 డిసెంబర్ 1944 నాడు విడుదలయ్యింది.

అక్కినేని గారూ అనేక రకాల సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ పొందారు. దేవదాసు (1953) చిత్రంలో నటన తన సినీ జీవితాన్నే మార్చేసింది. పార్వతిని ప్రేమించిన దేవదాసుగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

విప్ర నారాయణ, తెనాలి రామకృష్ణ, మహాకవి కాళిదాసు, భక్త జయదేవ, అమర శిల్పి జక్కన్న, భక్త తుకారాం, శ్రీ రామదాసు, శ్రీ రామరాజ్యం,  చెంచు లక్ష్మి, భూకైలాస్, నారదుడు , శ్రీ కృష్ణార్జున యుద్ధము లాంటి పౌరాణిక చిత్రాలతో బాటు లైలా మజ్ను, దేవదాసు, అనార్కలి, బాటసారి, మూగ మనసులు, ప్రేమ నగర్, ప్రేమాభిషేకం, మరియు మేఘసందేశం, బాలరాజు, కీలు గుర్రం, అర్ధాంగి, దొంగ రాముడు, మాంగల్య బలం, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, ధర్మ దాత, దసరా బుల్లోడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు.

తెలుగు సినీ చరిత్రలో మొదట ద్విపాత్రాభినయం…

అదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఇద్దరు మిత్రులు”. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ పై దుక్కిపాటి మధుసూదన రావు గారూ నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని గారూ మొదటిసారిగా ద్విపాత్రాభినయం గల పాత్రలు ధరించారు. 1961లో విడుదల అయిన ఈ చిత్రం రజతోత్సవం (175 రోజులు) జరుపుకోవడం విశేషం..

“తొమ్మిది” పాత్రలు ధరించిన ఏకైక నటుడిగా అక్కినేని..

22-4-1966 నాడు విడుదలయిన చిత్రం ‘నవరాత్రి’. అక్కినేని నాగేశ్వరావు గారూ మొదటిసారిగా ప్రసాద్‌ ఆర్ట్‌పిక్చర్స్‌ సమర్పణలో,  సావిత్రి గారి స్వంత సంస్థ అయిన విజయ చాముండేశ్వరి పిక్చర్స్‌ వారి ‘నవరాత్రి’ చిత్రంలో తొమ్మిది పాత్రలను పొషించి మెప్పించారు. ఈ చిత్రంలో(1) భాగవతారు శ్రీనివాస్‌లుగా (2) కుష్టు రోగి సుందరామయ్య, , (3) పల్లెటూరు రైతు శాంతన్నగా (4) కోపిష్టి గోపన్న ( 5) ఆనందరావుగా (6) నవ ప్రేమికుడు వేణుగా, (7) దేవదాసుగా (8) డాక్టర్‌ కరుణాకర్‌గా (9) పోలిస్‌ ఆఫీసర్‌. ఇలా నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రలు పోషించిన ఏకైక తెలుగు నటులు మన అక్కినేని నాగేశ్వరావు గారూ.

అన్నపూర్ణ పిక్చర్స్..

అక్కినేని గారికి స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శకుడు మరియు గురువు అయిన దుక్కిపాటి మధుసూదనరావు గారూ అక్కినేని గారితో కలిసి తన పెంపుడు తల్లి పేరు మీదుగా 1951 లో అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపించారు. వీరితో బాటుగా కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు మరియు టి.వి.ఎ.సుబ్బారావు గార్లు కూడా ఈ సంస్థకు భాగస్వాములు. ఈ సంస్థకు అక్కినేని గారూ ఛైర్మన్ గానూ, మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరించిన ఈ బ్యానరుపై తొలిసారి అక్కినేని నాగేశ్వరావు గారూ కథనాయకులుగా, సావిత్రి మరియు జమున గార్లు కథానాయికలుగా 1955లో దొంగరాముడు అనే చిత్రాన్ని నిర్మించారు. ఇదేగాక తోడి కోడళ్లు, మాంగల్య బలం, వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం, పూల రంగడు, ఆత్మీయులు,  జై జవాన్, అమెరికా అబ్బాయి, పెళ్లీడు పిల్లలు, రాధా కృష్ణ, ప్రేమ లేఖలు, బంగారు కలలు, విచిత్ర బంధం, అమాయకురాలు లాంటి ఎన్నో విజయవంతమయిన చిత్రాలు నిర్మించారు.

వివాహం..

అక్కినేని గారిని పెళ్లాడిన అన్నపూర్ణ గారూ 14 ఆగస్టు, 1933 లో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కొల్లిపర వెంకటనారాయణ, నాగ భూషణమ్మ దంపతులకు జన్మించారు. అక్కినేని నాగేశ్వరావు, అన్నపూర్ణ గార్ల వివాహం 18 ఫిబ్రవరి 1949 లో జరిగింది. వీరికి అయిదుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున, సత్యావతి, నాగసుశీల, సరోజ. అక్కినేని వారు స్థాపించిన సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్ళు నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ లాంటి ఎంతోమంది నటీనటుల్ని పరిచయం చేశారు. అన్నపూర్ణ గారూ 28 డిసెంబరు 2011 నాడు మరణించారు.

పురస్కారాలు.. బిరుదులు..

1968 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది.

1977 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ బిరుదునిచ్చి గౌరవించారు.

1980 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు “రఘుపతి వెంకయ్య నాయుడు” అవార్డును ప్రధానం చేశారు.

1988 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ బిరుదునిచ్చి గౌరవించారు.

సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి వారు 1988 సంవత్సరంలో విశిష్ట వ్యక్తి అవార్డునిచ్చి సత్కరించారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు కాళిదాస్ సమ్మాన్ అనే అవార్డునిచ్చి గౌరవించారు.

కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు వారు 1989 వ సంవత్సరంలో రాజ్ కపూర్ స్మారక అవార్డునిచ్చి సత్కరించారు.

భారత రాష్ట్రపతి, ఆర్.వెంకట్రామన్ గారి చేతుల మీదుగా 1991లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డునిచ్చి సన్మానించారు.

1994 వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్ వారు “లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్” అవార్డు ఇచ్చి గౌరవించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, జయలలిత గారూ 1995 వ సంవత్సరంలో చెన్నైలో “అన్నా అవార్డు” ఇచ్చి సత్కరించారు.

1996 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందజేసి సన్మానం చేశారు.

2011 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం వారు పద్మవిభూషణ్ బిరుదునిచ్చి గౌరవించారు.

భారత తపాలా శాఖ 2018 వ సంవత్సరంలో అక్కినేని గారి 95 వ జన్మదినం సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసారు.

అక్కినేని గారి విశేష నటనకు గానూ నటసామ్రాట్ బిరుదు లభించింది.

దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు వారు డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డ్, ఇచ్చి గౌరవించారు.

మరణం…

అక్కినేని నాగేశ్వరరావు గారూ తన 91 సంవత్సరాల వయసులో అనగా, 22 జనవరి  2014 నాడు మరణించారు. 2013 అక్టోబర్ 19 నాడు అక్కినేని నాగేశ్వరరావు గారూ కాన్సర్ బారిన పడ్డారు. అప్పటికే తన ఆఖరి సినిమా “మనం” సినిమా కూడా అలాగే పూర్తి చేసారు. అర్థరాత్రి దాటాక 2.45 గంటల సమయంలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా తమ కుటుంబసభ్యులు    బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అలా తీసుకెళ్లిన పది నిమిషాలకే డా. సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతిచెందారని నిర్ధారణ అయింది.

తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పి అత్యున్నత శిఖరాలకు చేర్చిన వాళ్ళలో ముందువరసలో చెప్పుకోదగిన పేరు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. అభిమానులు, దర్శక నిర్మాతలు ప్రేమతో ఏఎన్ఆర్ అని పిలుచుకునే అభినయ ఆణిముత్యం ప్రస్థానంలో ఎప్పటికీ చెరిగిపోని మైలురాళ్ళూ ఎన్నో ఎన్నెనో.

Show More
Back to top button