కథకుడిగా, నవలాకారుడిగా, నాటక రచయితగా, పద్మరాజు ప్రముఖ తెలుగు రచయితగా.. ఇలా ఎన్నో ప్రక్రియల్లో విశేషంగా పేరు గడించారాయన..
వీటితోపాటు..
విద్యాధికుడు.. వృత్తిరీత్యా కళాశాలలో రసాయనశాస్త్ర ఉపన్యాసకులు..
అన్నిటికి మించి తెలుగు కథానికకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన శతాధిక కథారచయిత..
శ్రీ పాలగుమ్మి పద్మరాజు…
వాస్తవికతకు, మనిషి సహజత్వాన్ని అద్ది.. తనదైన శైలిలో రచనలు చేసిన గొప్ప కవి..
కట్టుబాట్లు, సమాజం విధించిన నియమాలు అన్నిసారు మనిషిని కట్టిపడేయలేవంటూ.. పరిస్థితులే అన్నిటికీ మూలాలు అంటూ.. ఆయన చిత్రీకరించిన పాత్రల ద్వారా చెప్పకనే చెప్పారు. కథలు, నవలలు, నాటకాలు, రేడియో నాటికలు, వ్యాసాలు.. వీటితో పాటు సినిమాలకు మాటలు పాటలు అందించిన సినీ, గేయరచయిత కూడా…
అటువంటి రచయిత, కవి జయంతి.. ఈ నెల(జూన్ 24)న కావడంతో, ఈ సందర్భంగా ఆయన జీవిత, సాహిత్య విశేషాలను గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
బాల్యం, చదువు…
1915 జూన్ 24న, పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు తాలూకాలోని తిరుపతిపురంలో సాంబమూర్తి, సీతమ్మ దంపతులకు జన్మించారు పద్మరాజు. ఆయనే తొలి సంతానం. ప్రాథమిక విద్య అత్తిలిలో, హై స్కూల్ విద్య కొవ్వూరులో పూర్తి చేశారు. బాల్యంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. అనంతరం ఐదుగురు సోదరులతో కలిసి తాతగారి వద్దకు వచ్చేశారు. కుటుంబంలో తండ్రి తర్వాత పద్మరాజు పెద్దవాడిగా ఉంటూ ఇంటి బాధ్యతలను నిర్వర్తించారు. సంప్రదాయిక ఛందోరీతిలో వృత్తాలను రచించారు. ఇదే ఆయన తొలి రచన. పాఠశాలలో ఉన్నప్పుడు సైతం కొన్ని పద్యాలను రచించారు. అలా తన మిత్రుడైన చాగంటి కామేశ్వరరావుతో కలిసి ‘రాజశేఖర కవులు’ పేరిట పద్యాలు, కవితలు రాశారు. అప్పట్లో అవి ‘కృష్ణా పత్రిక’లో ప్రచురితమయ్యాయి.
ఆ తర్వాత రాజమండ్రిలో బీఎస్సీ చేశారు, ఎమ్మెస్సీ చదివేందుకు కాశీలోని హిందూ విశ్వద్యాలయం(బెనారస్ విశ్వ విద్యాలయం)లో చేరారు. అప్పటి పాశ్చాత్య సాహిత్య ప్రభావం ఆయనను ఎంతగానో ఆకర్షించింది. దీంతో పద్య రచనకు ముగింపు పలికి, కొత్త పంథాలో ప్రాచీన సంస్కృతికి, ఆధునికతను జోడిచ్చి ఒక రచన చేశారు. అదే 1937లో రాసిన ‘సుబ్బి’ కథ. ఆపై తనదైన శైలిలో కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు.. రాయడం మొదలుపెట్టారు.
ఎమ్మెస్సీ పూర్తయ్యాక, కాకినాడలోని పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో కొంతకాలం పని చేశారు. అక్కడ మానేసి, భీమవరం కళాశాలలోనూ రసాయన శాస్త్ర ప్రధానోపన్యాసకులుగా పనిచేశారు. అదే సమయంలో ఆయన రాసిన ‘గాలివాన’ అనే కథ ఎంతో ప్రాచుర్యం పొందింది.
సాహిత్య కృషి…
పద్మరాజుగారు విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే రాయడం మీద ఆసక్తి పెరిగింది.. అప్పుడప్పుడు రాసిన కవితలు, పద్యాలు.. ఆయనకు కొంత ఆర్థిక వెసులుబాటును సైతం ఇచ్చాయి.
14 ఏళ్లప్పుడు.. ఆనాటి కాలంలో తిరుపతి కవులుగా ప్రసిద్ధులైన వారిలో.. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు ఒకరు. అయితే ఆ మహాకవిని కలిసి, పద్య కవిత్వం వినిపించి.. వారి ఆశీస్సులు అందుకున్నారట.
అలా తిరుపతి కవుల స్ఫూర్తితోనే…
ఎంఎస్సీ చదివే సమయంలోనూ కథానికలవైపు దృష్టి సారించారు.
1937లో ‘సుబ్బి’ అనే పేరుతో రాసిన కథ.. ఆయన తొలి రచన. ఇది మొదలు.. దాదాపు మొత్తంగా 60 కథలు, 8 నవలలు, 30 కవితలు రాశారు. ఇంకెన్నో నాటికలు, నాటకాలు రచించారు.
1952లో రాసిన ‘గాలి వాన’ కథకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.
గాలివాన కథేంటంటే…
ఈ కథలో ప్రధాన పాత్ర పేరు.. రావుగార. నిక్కచ్చి మనిషి. సొంత అభిప్రాయాలు కలిగిన వ్యక్తి. ఒక ప్రసంగానికి హాజరయ్యేందుకు.. వేరే ఊరికి పయనమై, రైళ్లో బయలుదేరుతాడు. రైల్లో ఎక్కినప్పుడు ఒక బిచ్చగత్తె కనిపిస్తుంది. ఆమెను చూసి ఛీదరించుకుంటాడు రావు. ఒక్కసారిగా ఉన్నటుండి తుఫాను రావడంతో… చివరకు ఆమే.. ఆసరా అవుతుంది. ఆమె స్పర్శలో ఆయన అప్పటివరకు విధించుకున్న భావాలు, నియమాలు అన్నీ చెల్లాచెదురైపోతాయి. ఇది ప్రధాన కథనం.
ఈ కథ కల్పితం కాదు. నిజజీవితంలో ఎదుర్కొన్న సంఘటన, మనోవేదన నుంచి పుట్టుకొచ్చిన కథ…
*1948లో పాలగుమ్మివారు ఉద్యోగం చేస్తున్న సమయంలో కళాశాల యాజమాన్యం ఉచితంగా ఇచ్చిన స్థలంలో నాలుగైదు అడుగుల ఇటుక గోడపైన తాటాకులతో కూడిన ఇల్లును ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నారు. ఓ అర్థరాత్రి పెద్దపెట్టున వచ్చిన గాలివానకు ఆయన ఇంటితోపాటు సహోద్యోగుల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు సైతం నేలకూలాయి. ఇటుక గోడలు కూడా పడిపోవడంతో.. పద్మరాజు గారు, ఆయన భార్య ఇద్దరు.. ఇంటి నుంచి బయటపడాలనుకున్నారు.
కానీ భార్య సత్యానందంగారు త్వరగా బయటికి రాలేకపోయారు. ఈలోగా ఇటుక గోడలు పడిపోయి, ఇంటి పైకప్పు మొత్తం పెళపెళమంటూ కూలిపోయింది. ఆమె ఆ శిథిలాలల్లోనే చిక్కుకుపోయారు. దీంతో ఆయనకు విపరీతమైన ఆందోళన.. దీనికి తోడు చుట్టూ చీకటి.. తానొక్కడు ఏమీ చేయలేరు.. భార్య పరిస్థితి ఏమిటో అనుకుంటూ.. అలానే చూస్తూ ఉండిపోయారట. ఈలోగా హాస్టల్ విద్యార్థులు, తోటి లెక్చరర్లు… టార్చిలైటు వెలుగులో పరుగెత్తుకొచ్చి శిథిలాలు తొలగించి, ఆమెను బయటికి తీశారు. ఇలా ఈ సంఘటన నేపథ్యంలో ఆయనలోని కలిగిన భయాందోళనలు, ఆవేదన, మనసును కలిచివేసిన అనుభవాలు, అనుభూతులతో… ‘గాలివాన’ కథకు రూపమిచ్చారు.
అటువంటి ఈ కథకు 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వారు నిర్వహించిన ప్రపంచ కథల పోటీకి ఎంపికైంది. మొత్తం 23 దేశాలకు చెందిన 59 కథలు ఎంపిక కాగా, వాటిలో మన దేశానికి సంబంధించి గాలివాన సహా మరో మూడు కథలున్నాయి. ఆ తర్వాత ప్రపంచంలోని అన్ని భాషల్లోకి ఈ కథ అనువాదం అయ్యిందంటే అతిశయోక్తి కాదు.
వీరు రాసిన మరో కథ.. పడవ ప్రయాణం. ఇది కూడా మంచి ఆదరణ పొందింది.
అణగారిన సమాజంలో జీవించే మనుషుల్లో మంచి,చెడు రెండూ ఉంటాయి. అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్న వారిలో కూడా ఈ రెండు స్వభావాలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే.. సహజంగా మనిషి, మనిషే కదా.. అనేది వీరి కథల్లో మనం చూడొచ్చు.
*వాసనలేని పువ్వు, హెడ్ మాస్టారు, కొలవరానిదూరం.. ఇవి ప్రాచుర్యం పొందిన ఇతర కథలు.
*ఇక నవలల విషయానికి వస్తే… బతికిన కాలేజి, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ల పాలన… వంటి ఇలా దాదాపు ఎనిమిది నవలలను రాశారు. వీరి రచనలు ప్రకృతి, సమాజంపై పూర్తి అవగహనను కలిగిస్తాయి. మనుషుల మధ్య ఉన్న సంఘర్షణ తాలూకూ వాస్తవాలను విశదీకరిస్తాయి.
వీరి కవితలు, గేయాలు లలితమైన పదాలతో, అచ్చెరువొందెలా ఉంటాయి. మచ్చుకు..
పైరు గాలికి నాట్యమాడే
పైట రాపిడి తగిలి చిటుకున
పండిపోయిన దానిమ్మొకటి
పగిలి విచ్చింది
పండుదొండకు సాటివచ్చే
పడతి పెదవులలోన దాగిన
పండ్లముత్తెపు తళుకులన్నీ
పక్కుమన్నాయి…
అప్పుడు నేననుకున్నాను
అందానికి అర్థం ఇదేనని.. అంటూ ఇలా హృద్యంగా, మనసుకు హత్తుకునేలా ప్రకృతిని వర్ణించే తీరు ఆయన రచన శైలీని మెచ్చుకోకుండా ఉండగలమా!
సినీ రంగంలో…
1954లో ప్రఖ్యాత దర్శక- నిర్మాత బీఎన్ రెడ్డి పిలుపు మేరకు వాహిని ప్రొడక్షన్ నిర్మించిన ‘బంగారు పాప’ అనే చిత్రానికి మాటలు రాశారు. సినిమాకి రచన చేయడం ఇదే తొలిసారి. అప్పటివరకు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా సైతం చేశారు. సుమారు మూడు దశాబ్దాలపాటు పలుచిత్రాలకు కథ, మాటలు, పాటలు రాయడంతో పాటు రచనా సహకారాన్ని అందించారు.
ఆయన రాసిన నల్లరేగటి నవల… ‘మనవూరి కథ’ పేరుతో సినిమాగా వచ్చింది. ‘పడవ ప్రయాణం’ కథ… ‘స్త్రీ’ పేరుతో చిత్రీకరణ పనుల వరకు జరిగినా.. తర్వాతి రోజుల్లో విడుదలకు నోచుకోలేదు.
ఈయన ముఖ్యంగా…
బంగారుపాప,
భక్తశబరి,
బంగారు పంజరం,
రంగులరాట్నం,
శ్రీ రాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్,
సర్దార్ పాపారాయుడు… వంటి చిత్రాలకు పని చేశారు.
ఈయన కృష్ణశాస్త్రికి మంచి మిత్రుడు, అలానే దాసరి నారాయణరావు దగ్గర ఘోస్ట్ రైటర్ గా పనిచేశారట. ఆయన పేరు వెలుగులోకి రాకపోయిన.. ఆయన సహకారం మాత్రం మెండుగా ఉందేదిట. బికారి రాముడు చిత్రానికి స్వీయదర్శకత్వం కూడా వహించారు. కానీ ఈ చిత్రం విజయవంతం కాలేదు.
*ఈయన భార్య పేరు సత్యానందం. వీరికి ఇద్దరు కుమార్తెలు. సీత, రత్న.
ఆకాశవాణిలో పనిచేసిన లలిత సంగీత ప్రయోక్త, గేయ రచయిత, గొప్ప వీణావిద్వాంసుడు… అయిన శ్రీ పాలగుమ్మి విశ్వనాథంగారు వీరి తమ్ముడే!
*పాలగుమ్మి పద్మరాజు గారు జాతీయ చలనచిత్ర అవార్డుల సంఘం జ్యూరీ సభ్యుడిగా ఢిల్లీ వెళ్లారు. అప్పుడే అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు అప్పటికే ఆస్తమా లక్షణాలు కూడా ఉండడంతో విపరీతమైన చలి ప్రభావాన్ని తట్టుకోలేక…
1983 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. మదరాసులోని మైలాపూర్ శ్మశానవాటికలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి.
వీరి మరణానంతరం, 1985లో ‘గాలివాన’ కథకు గానూ కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది.