Telugu Cinema

తెలుగు చిత్ర పరిశ్రమలో అభ్యుదయ చిత్ర రథసారథి. గూడవల్లి రామబ్రహ్మం..

తన పేరు ఒక శతగ్ని.. తన జీవితమే ఒక సాహస గాథ.. తెలుగు సినిమా ఆద్యుల్లో ఒకరు, ఆరాధ్యనీయుల్లో ప్రప్రథముడు. 80 సంవత్సరాల క్రితమే సామజిక విప్లవానికి సినిమాను ఒక సాధనంగా మలచి ప్రజల మెప్పు పొంది చరితార్థుడైన ధైర్యశాలి. సాంఘిక దురాచారాలను కథా వస్తువులుగా చేసుకునే అభ్యుదయ వాది, చిత్ర నిర్మాణానికి కొత్తదారులు పరచిన దర్శక, నిర్మాత. తెలుగు టాకీల తొలి రోజుల్లో అనేకమంది ప్రముఖుల సినీ రంగ ప్రవేశానికి కారణమైన వ్యక్తి. పాత్రికేయుడు, వ్యాపారవేత్త, సంస్కారం, ఉన్నతమైన వ్యక్తిత్వం కలగలసిన వ్యక్తి. అలనాటి చలనచిత్ర ప్రముఖుడు స్వర్గీయ గూడవల్లి రామబ్రహ్మం గారు.

తెలుగు సినిమా మూకీ నుంచి టాకీలోకి ప్రయాణం ప్రారంభించినప్పుడు తొలిరోజుల్లో ఆనవాయితీగా పౌరాణిక కథాంశాలే ఇతివృత్తాలుగా ఉండేవి. ఆ ఆనవాయితీని బద్దలు కొట్టి సమకాలీన సమస్యలని తీసుకుని సినిమాలు రూపొందించారు రామబ్రహ్మం గారు. అలనాటి సమకాలీన సాంఘిక వ్యవస్థను చెదపురుగుల వలె పట్టిపీడిస్తున్న రుగ్మతలపై, ఛాందస భావాలపై, సినిమాను ఒక వజ్రాయుధంగా ఝలిపించిన మేధావి. సినిమాలు తీసినా, పత్రికను   నడిపినా, జాతీయోద్యమాలకు నాయకత్వం వహించినా, తనకంటూ ఒక స్థాయిని, తనదంటూ ఒక బాణి ని, తన వెంట వచ్చే అసంఖ్యాక శిష్యగణాన్ని సృష్టించి, తన పేరును చిరస్థాయిని చేసుకున్న ప్రతిభావంతుడు, ధీరుడు గూడవల్లి రామబ్రహ్మం గారూ.

సినీ కళారూపం కేవలం కాలక్షేపం కోసమే కాదు, దైవస్మరణ కోసమే కాదు, సాంఘిక ప్రయోజనం కోసం కూడా అని ఎలుగెత్తి చాటిన తొలి తెలుగు దర్శకులు గూడవల్లి గారు. తెలుగు సినిమా తొలి టాకీలు మొదలయిన కొత్తలో వచ్చిన తొలి సాంఘిక చిత్రం “ప్రేమ విజయం”, రెండవ సాంఘిక చిత్రం “గృహలక్ష్మి”, మూడవ సాంఘిక చిత్రం “మాలపిల్ల”. అశ్పృష్యత అనే దూరాచారం మీద విసిరిన డైనమేట్, మొత్తం సమాజాన్ని ఒక కుదుపు కుదుపేసిన చిత్రం “మాలపిల్ల”. జమీందారులనే నిర్మాతలుగా పెట్టి జమీందారులకు వ్యతిరేకంగా సినిమా తీసిన ధైర్యశాలి, సినిమాను అంచెలంచెలుగా విడుదల చేసే పద్ధతికి స్వస్తి చెప్పి, సినిమా మొత్తం ఒకేసారి 12 థియేటర్ లలో విడుదల చేసే సంప్రదాయానికి తెరతీసిన వారు గూడవల్లి రామబ్రహ్మం గారు.

సారథి పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ని స్థాపించి, కొన్ని చిత్రాలకు తానే దర్శకత్వం వహించారు. సినిమా అనేది కేవలం వినోద ప్రధానమే కాదని, సమాజ శ్రేయస్సు కోసం ఈ శక్తివంతమైన సినిమా మాధ్యమాన్ని వినియోగించుకోవచ్చునని నిరూపించిన గొప్ప దార్శనికుడు రామబ్రహ్మం గారు. సినిమా హాళ్లలోకి వచ్చే ప్రేక్షకుల మదిలో ఆలోచనలు రేకెత్తించే మంచి చిత్రాలు రూపొందించాలన్నదే గూడవల్లి గారి నిబద్దతకు నిదర్శనం. ఈ నిబద్దత ని తన ప్రతి చిత్రంలోనూ పాటించారు. ఆ తర్వాత సినిమా ప్రపంచంలోకి వచ్చిన ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయ్యారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    గూడవల్లి రామబ్రహ్మం

జననం    :    24 జూన్ 1898

స్వస్థలం   :    కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలములోని నందమూరు

తండ్రి   :   వెంకయ్య 

తల్లి     :  బాపమ్మ  

వృత్తి      :    ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు,

అఖిలాంధ్ర రైతు మహాసభ కు ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు,

ఆంధ్ర నాటక పరిషత్ చతుర్థ సమావేశాలకు కార్యదర్శి

ప్రసిద్ధి     :     ప్రఖ్యాత సినిమా దర్శకుడు , సంపాదకుడు, హేతువాది, స్వాతంత్ర్య సమరయోధుడు

భార్య        :   శారదాంబ 

మరణం   :   01 అక్టోబర్ 1946

జననం…

గూడవల్లి రామబ్రహ్మం గారు కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలో ఉంగుటూరు మండలంలో గల నందమూరు లో 24 జూన్ 1898 లో జన్మించారు. గూడవల్లి గారి అమ్మ గారి పేరు బాపమ్మ, నాన్న గారి పేరు వెంకయ్య. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అబ్బాయిలు చెల్లయ్య, కృష్ణయ్య, రామబ్రహ్మం. అమ్మాయిలు వెంకమ్మ, శేషమ్మ, రాజమ్మ. గూడవల్లి గారి నాన్నగారు నందమూరు లో మునసబు గా పనిచేసేవారు. చిన్నప్పటి నుండి తనకు కళలు అంటే ఎంతో ఆసక్తి.  రోజూ నడుచుకుంటూ వెళ్లి నందమూరు ప్రక్కనున్న ఇందుపల్లి లో విద్యాభ్యాసం కొనసాగించేవారు.  తాను పాఠశాల చదువుకునే రోజులలో తనలో సామాజిక స్ఫూర్తి, అభ్యుదయ భావాల పట్ల ఆసక్తి పెరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి వరకు కూడా ఊరేగింపులకు వెళ్లేవారు. 1918 సంవత్సరంలో కళాశాల చదువు కోసం బందరులోని జాతీయ కళాశాలకు ఇంటర్మీడియట్ చదువు కోసం వెళ్లారు. కళాశాల చదువుకునే రోజులలో విదేశీ వస్త్ర దానం లాంటివి చేస్తుండేవారు. ఈ ఉద్యమాల ఊరేగింపులో తాను చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది.

వివాహం…

గూడవల్లి గారికి 1920 వ సంవత్సరంలో హిందూపల్లె కు చెందిన కోగంటి నాగయ్య గారి కుమార్తె “శారదాంబ” తో వివాహం జరిపించారు. కోవెలమూడి గోపాలకృష్ణయ్య గారు గూడవల్లి గారి నాన్న గారికి మిత్రులు. గోపాలకృష్ణయ్య గారి కుమార్తె వివాహంలో బంధువులను ఆహ్వానించే కార్యక్రమం గూడవల్లి గారికి అప్పజెప్పారు. ఆ వివాహంలో కవి సమ్మేళనం పెట్టారు. ఆ కవి సమ్మేళనానికి వచ్చిన 16 సంవత్సరాలు కుర్రాడు (బాల కవి) గూడవల్లి గారికి పరిచయం అయ్యాడు. తాను కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. గూడవల్లి గారు తర్వాత కాలంలో దయనీయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన జీవితాన్ని ఒక మలుపు తిప్పి, ఆ మలుపు మరొక మలుపుకు కారణమైనారు కోసరాజు రాఘవయ్య చౌదరి గారు.  తండ్రి గారికి వ్యవసాయంలో సాయం చేయడం స్వతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం ఇవి గూడవల్లి గారి నిత్య కృత్యాలు.

ఫ్రెండ్స్ అండ్ కో వ్యాపారం…

1924లో తన ప్రాణ మిత్రుడు బుక్కపట్నం రాఘవాచార్యుల తో గుడివాడ లో ఒక నాటక శిక్షణ సంస్థ స్థాపించారు. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. తన కుటుంబాన్ని విజయవాడకు మార్చి వ్యాపారం ప్రారంభించి, దానికి “ఫ్రెండ్స్ అండ్ కో” అని పేరు పెట్టారు. గుండుసూది దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు అందులో అమ్మేవారు. వ్యాపారంలో నిజాయితీగా వ్యవహరించేవారు. మూడు నాలుగు సంవత్సరాలు నడిచిన తర్వాత షాపు దివాళా తీసింది.

సమదర్శిని పత్రిక లో సంపాదకుడిగా…

వ్యాపారం దివాళా తీయడం తో ఇంటికి వెళ్లి వ్యవసాయం చేయలేక, వ్యాపారం నడపలేక సతమతమవుతున్న సమయంలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు గూడవల్లి గారికి ఒక సలహా చెప్పారు. తెనాలి దగ్గరలో గల జాగర్లమూడిలో కుప్పుస్వామి చౌదరి వద్ద కొసరాజు గారు ఒక ఆస్థాన కవిలా ఉండేవారు. కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, గూడవల్లి గారిని కుప్పుస్వామి గారి వద్ద చేర్పించారు. కుప్పుస్వామి గారు గూడవల్లి గారి జీవనానికి సంబంధించిన సరుకులు అందించారు. కొసరాజు గారు రేపల్లె కు చెందిన ఒక కుర్రాడిని కూడా పరిచయం చేశారు. తానే సముద్రాల రాఘవాచార్య. తర్వాత కాలంలో గూడవల్లి గారు, కోసరాజు గారు, సముద్రాల గారు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు.

కుప్పు స్వామి చౌదరి కొలువులో త్రిపురనేని రామస్వామి చౌదరి, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి లాంటివారు “ఆంధ్రుల చరిత్ర” పుస్తకానికి అనుబంధంగా వారి సామాజిక వర్గానికి చెందిన చరిత్రను వ్రాయించాలని అనుకుని గూడవల్లి గారిని మద్రాసు పంపించారు. గూడవల్లి గారు మద్రాసు లో ఉన్న “ఓరియంటల్ లైబ్రరీ” లో ఉన్న పుస్తకాలు చదివి వాటిలో ఉన్న వ్యాసాలు వ్రాసుకునేవారు. మునుస్వామి నాయుడు గారికి జస్టిస్ పార్టీ తరఫున “సమదర్శిని” అనే పత్రిక ఉండేది.

గూడవల్లి గారు వ్రాసిన వ్యాసాలు చూసిన మునుస్వామి నాయుడు గారు సమదర్శిని పత్రికకు ఉపసంపాదకుడిగా గూడవల్లి గారిని నియమించుకున్నారు. సంపాదకులు తాపీ ధర్మారావు గారికి బొబ్బిలి రాజా వారు మందసారజ గారి నుండి ఆహ్వానం వచ్చి తన దగ్గరికి వెళ్లారు. దాంతో సమదర్శిని పత్రిక సంపాదకుడిగా గూడవల్లి గారు నియమింపబడ్డారు. సుమదర్శిని పత్రికలలో రాజకీయాలకు సంబంధించిన వ్యాసాలు ప్రచురించేవారు. మునుస్వామి నాయుడు పైనే వార్త వ్రాసి విమర్శలు ఎదుర్కొని ఆ పత్రిక కు రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. అక్కడి నుండి గూడవల్లి గారు మళ్ళీ విజయవాడకు వచ్చేశారు.

ప్రజామిత్ర పత్రిక సంపాదకుడిగా…

1932 – 33లో దేశంలో కరువు మొదలైంది. రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎన్జీ రంగా గారు రైతు రక్షణ సంఘాలు స్థాపించి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేపట్టడం మొదలుపెట్టారు. ఇవి గూడవల్లి గారికి బాగా నచ్చాయి. ఒక సంవత్సరం పాటు వాటితో నడిచారు. కుప్పు స్వామి చౌదరి గారి మిత్రుడు చల్లపల్లి రాజా గారు ( కృష్ణా జిల్లా చల్లపల్లి ) ప్రజామిత్ర అనే పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరపున ప్రజామిత్ర పత్రికను స్థాపించి దానికి గూడవల్లి గారిని “స్థాపక సంపాదకుడి” గా నియమించారు. 1932 లో ప్రారంభించిన పత్రిక 10 సంవత్సరాల పాటు నడిచింది. దీనిని మద్రాసు కు మార్చారు.

ప్రజామిత్ర పత్రిక కేవలం రాజకీయాలనే ప్రచురించకుండా సాహిత్యాన్ని కూడా ప్రచురించేవారు. ఆ పత్రిక కార్యాలయానికి అప్పుడప్పుడు ఒక కుర్రాడు వస్తూ పోతూ ఆ కబుర్లు వింటూ ఉండేవాడు. తానే బి.ఎన్.రెడ్డి గారు. బి.ఎన్.కే ప్రెస్ స్థాపించి ప్రజామిత్ర పత్రికను కూడా ఇదే భవనంలోకి మార్చారు. దాంతో గూడవల్లి గారు, బి.యన్.రెడ్డి గారు మిత్రులు అయిపోయారు. సముద్రాల గారు కూడా గూడవల్లి గారి దగ్గర ఉపసంపాదకుడిగా చేరారు. “ప్రజామిత్ర పత్రిక” శుక్రవారం విడుదలయితే, ముందుగానే బుధవారం నుండే దానికోసం పాఠకులు ఎదురుచూస్తూ ఉండేవారు. అవినీతి, అన్యాలను, కుంభకోణాలను ఎండగట్టి పత్రికలో ప్రచురించేవారు.

సాధారణంగా ఇలాంటివి వ్రాయాలంటే చాలా ధైర్యం ఉండాలి. బెదిరింపులకు భౌతిక దాడులకు తట్టుకొని గూడవల్లి గారు అవినీతిని ప్రశ్నిస్తూ పత్రికలో ప్రచురిస్తుండేవారు.

ఆనాటి రంగస్థలం నటులు స్థానం నరసింహారావు గారు నాటకం మద్రాసులో జరగబోతుంది.

ఆ నాటకం జరగడానికి సరిగ్గా ఒక వారం ముందు స్థానం నరసింహా వారి కుంభకోణం అని వారి మీద వ్యాసాన్ని వ్రాసి ప్రచురించారు.

అప్పట్లో అది పెద్ద సంచలనం అయ్యింది.

దావఖాన మీద ఫిర్యాదులతో “ధనవంతులకే ధర్మ ఆస్పత్రులు” అనే వ్యాసం వ్రాసి ప్రచురించారు. టాకీ సినిమాలు మొదలైన రోజులలో బోగస్ నిర్మాణ సంస్థలు ఉండేవి.

వాటి మీద వచ్చిన ఫిర్యాదులతో వాటిలో ఉన్న కుంభకోణం బయటపెట్టారు. 

ప్రజామిత్ర పత్రికలో సినిమాలకు సంబంధించిన వ్యాసాలు కూడా వ్రాస్తుండేవారు. సినిమా నిర్మాణం, ఖర్చులు వాటి మీద వార్తలు వ్రాసేవారు గూడవల్లి గారు.

సినిమా నిర్మాణానికి, సినిమా అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందనే విషయాలను కూలంకషంగా పరిశీలన చేసి తన పత్రికలో ప్రచురించేవారు.

సినిమాలు తీయాలంటే 50,000 ఖర్చు అవుతుంది. అందులోను కొల్హాపూర్, బొంబాయి, మద్రాసు లాంటి నగరాలలో ఉండే స్టూడియోలో మరీ ఎక్కువ.

కాబట్టి మీరే ఒక స్టూడియో కట్టుకుంటే లక్షన్నర ఖర్చు వస్తుంది. స్టూడియో నిర్మాణం పూర్తవుతుంది. తక్కువ ఖర్చుతో సినిమాలు తీయవచ్చు కదా అని వ్రాశారు.

“పవిత్ర సలలిత పూరితమగు కృష్ణ స్రవంతి భీకరమైన అరణ్యములు నయనానందకరమగు ఎత్తిపోతల విశాలమైన పచ్చిక బయళ్లు సుదీర్ఘమగు పర్వతశ్రేణులు చుట్టుకొని ఉన్న పరిసరములలో ఆంధ్రులు ఒక స్టూడియోను నిర్మించి ఆదర్శములైన టాకీలను తయారు చేయలేరా” అని వ్రాశారు.

ఇది గూడవల్లి గారి దూర దృష్టికి నిదర్శనం.

సినీ రంగం..

వ్యాపారవేత్త పినపాల వెంకట దాసు గారు బందరు లో మినర్వా టాకీస్, రేపల్లెలో కృష్ణ టాకీస్ నిర్మించారు.

మద్రాసులో నటరాజ్ అనే వ్యక్తి తో భాగస్వామిగా వేల్ పిక్చర్స్ స్థాపించారు.

పిఠాపురం రాజా వారి బంగ్లా ఆవరణాన్ని వేల్ పిక్చర్స్ ని కార్యాలయం గా చేసుకున్నారు.

ఆ క్రమంలో గూడవల్లి గారితో పినపాల వెంకట దాసు గారికి పరిచయం ఏర్పడింది.

గూడవల్లి గారు, పీ.వీ.దాసు గారికి సినిమాలకు సంబంధించిన సలహాలు ఇస్తూ, అంతరంగిక సలహాదారుడుగా, తనకు ఆత్మీయ మిత్రుడు గా దగ్గరయ్యారు.

గూడవల్లి గారి ప్రోత్సహంతో సముద్రాల గారు సినిమా ప్రకటనలు వ్రాసేవారు. “సీత కళ్యాణం” చిత్రాన్ని నిర్మించిన పీ.వి.దాసు గారు సముద్రాల గారితోనే ప్రకటనలు వ్రాయించేశారు. ఆ సినిమా విజయవంతం అయ్యింది.

ఆ తరువాత “శ్రీకృష్ణ లీలలు” చిత్రం కూడా తీశారు పీ.వి.దాసు గారు. అందులో హిరణ్యకశపుడిగా వేమూరు గగ్గయ్య గారు నటించారు.

తనకు ధీటైన బాలనటుడు కోసం వెతుకుతుండగా గూడవల్లి గారి సూచన మేరకు బాలనటుడు ప్రహ్లాదుడిగా సాలూరు రాజేశ్వరరావు గారిని పి.వి.దాసు గారిని తీసుకున్నారు.

ఈ చిత్రం కూడా విజయవంతమైంది. దాంతో గూడవల్లి గారిని తన సినీ నిర్మాణంలోకి ఆహ్వానించారు పీ.వి.దాసు గారు. కానీ గూడవల్లి గారు తానే స్వతంత్రంగా ఒక నిర్మాణ సంస్థను స్థాపించాలని అనుకున్నారు.

సరస్వతి టాకీస్ పై కురుకూరి సుబ్బారావు, పారుపల్లి శేషయ్య గార్లు తీయబోయే చిత్రానికి ప్రొడక్షన్ డైరెక్టర్ గా, ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరించి “ద్రౌపది వస్త్రాపహరణం” తీశారు.

ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. తర్వాత కనకతార (1937) తీశారు.  గూడవల్లి గారి ప్రోద్బలంతో ఈ చిత్రానికి సంభాషణలు, గీత రచన సముద్రాల రాఘవాచార్య గారు వ్రాశారు. బందరు కు చెందిన చేపలమడుగు రంగయ్య, షరాజ్ హకి అలీం సేట్, చల్లపల్లి రాజా గారు, భీమవరపు నరసింహారావు, గూడవల్లి గారు అంతా కలిసి 1935 డిసెంబర్ లో సారథి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి గూడవల్లి గారి దర్శకత్వం లో “మాలపిల్ల” అనే సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేశారు.

మాలపిల్ల…

గూడవల్లి గారి నిర్మాణ దర్శకత్వం లో అంటరానితనం నిర్మూలన, హరిజనుల దేవాలయ ప్రవేశం, కులాంతర వివాహం, సంస్కరణోద్యమం వంటి సాంఘిక అంశాలను ప్రధానంగా స్వీకరించి చిత్రీకరణ జరిపిన చిత్రం “మాలపిల్ల”. గుడిపాటి వెంకట చలం రాసిన అముద్రిత నవల “మాలపిల్ల” నవల ఆధారంగా ఈ చిత్ర కథను తయారు చేసుకుని సంపాదకులు, రచయిత తాపీ ధర్మారావు నాయుడును గారిని సినిమాకు రచయితగా పెట్టుకుని స్క్రీన్ ప్లే, సంభాషణలు వ్రాయించారు గూడవల్లి గారు. అప్పటికే ప్రాచుర్యం పొందిన బసవరాజు అప్పారావు గారు వ్రాసిన పాటలను మాలపిల్ల సినిమాలో ఉపయోగించుకున్నారు.

చలం గారు వ్రాసిన నవలలోని ప్రధానాంశం బ్రాహ్మణ యువకుడు, హరిజన యువతి ప్రేమించి పెళ్ళిచేసుకోవడం వరకే. కానీ గూడవల్లి రామబ్రహ్మం గారు తాపీ ధర్మారావు నాయుడు గారితో సమకాలీన అంశాలైన మద్యపాన నిషేధం, హరిజనుల దేవాలయ ప్రవేశం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి అంశాలతో కథను మరింతగా విస్తరించారు. చలం గారు వ్రాసిన సంభాషణలు కొన్ని మాత్రమే ఉంచేసి, అవసరమైనంత మేరకు మిగతా సంభాషణలు తాపీ ధర్మారావు గారు వ్రాసుకున్నారు.

గోవిందరాజులు సుబ్బారావు, కాంచనమాల, భానుమతి, పి.సూరిబాబు, గాలి వెంకటేశ్వరరావు లాంటి తారాగణం తో 01 మే 1938 నాడు ప్రముఖ రాజకీయ నేత, సాహిత్యవేత్త బెజవాడ గోపాలరెడ్డి చేతుల మీదుగా మాలపిల్ల చిత్రీకరణ ప్రారంభం అయింది.

మాలపిల్ల చిత్రీకరణ పూర్తి అయ్యేసరికి సినిమా బడ్జెట్ రూ.లక్షా పదివేలు.

అప్పట్లో తెలుగు సినిమాలు లక్ష రూపాయల లోపు బడ్జెట్ తో నిర్మించేవారు. ఆ ప్రమాణాల్లో మాలపిల్ల భారీ బడ్జెట్ సినిమాగా పేర్కొనవచ్చు.

ఈ సినిమా అత్యంత వివాదాస్పదమైన, వాద వివాదాలకు కారణమైంది.

కుల మౌఢ్యం అన్ని కులాల వారిలోనూ ఉండగా, కేవలం బ్రాహ్మణులనే కేంద్రంగా చేసుకుని ఈ చిత్రం తీశారని, సినిమాలో చౌదరి పాత్ర ద్వారా కమ్మవారు మాత్రమే సంస్కరణాభిలాషులు అన్నట్టుగా చూపిస్తున్నారన్న విమర్శతో బ్రాహ్మణులంతా ఈ సినిమాను వ్యతిరేకించారు.

కాకినాడ ఈశ్వర పుస్తక భాండాగారం వారు సినిమాను నిషేధించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ప్రతికూల ప్రచారాన్ని గూడవల్లి గారు తన సినిమా విజయానికి మలుచుకున్నారు.

సినిమా ప్రభావంతో కొన్ని పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించారు.

దాంతో పట్టణాలు, మున్సిపాలిటీలు సినిమా నిషేధించాలని అనేక ప్రయత్నాలు చేశాయి.

అయితే వీటివల్ల సినిమా నిషేధం కానీ, ప్రదర్శనలకు ఆటంకం కానీ కాలేదు.  విజయదశమి సందర్భంగా 1938 సెప్టెంబరు 25న మాలపిల్ల సినిమా విడుదల అయింది.

వాదోపవాదాలు, వివాదాలు అన్నీ చివరకు చిత్రంపై పలురకాల ఆసక్తి పెంచేందుకే పనికి వచ్చి “మాలపిల్ల” చిత్రం ఘన విజయం సాధించింది.

రైతు బిడ్డ…

రైతు సమస్యలపై వచ్చిన మొట్టమొదటి టాకీ చిత్రం రైతుబిడ్డ. మాలపిల్ల చిత్రం తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా గూడవల్లి రామబ్రహ్మం గారు రైతుబిడ్డ సినిమా తీసి తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం గారు రైతుబిడ్డ ను నిర్మించారు. ఈ చిత్రానికి రామబ్రహ్మం గారు స్వయంగా కథ సమకూర్చగా త్రిపురనేని గోపీచంద్ గారు మాటలు వ్రాశారు. కొసరాజు రాఘవయ్య చౌదరి పాటలు వ్రాయగా, జమీన్ రైతు ఉద్యమంలో నెల్లూరు వెంకట్రామనాయుడు గారు వ్రాసిన గీతాలను కూడా రైతుబిడ్డ సినిమాలో వాడుకున్నారు.

సంగీతం  బి.నరసింహారావు గారు అందించగా చిత్రానికి నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు దశవతారం అనే పాటలో కూచిపూడి నృత్యాన్ని ప్రవేశపెట్టారు. బళ్ళారి రాఘవాచార్య, గిడుగు, పి. సూరిబాబు, నెల్లూరు నగరాజారావు, టంగుటూరి సూర్యకుమారి, యస్. వరలక్ష్మి మొదలగు తారాగణం ఇందులో నటించారు. ఈ సినిమాకు సనాతన వర్గాలకంటే జమీందార్ల నుంచి బలమైన వ్యతిరేకత ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు.

మరో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ చిత్రాన్ని నిర్మించినది ఈ చిత్ర నిర్మాత జమీందారు చల్లపల్లి రాజా గారు. రాజా గారు జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకులు. విడుదలకు సిధ్ధంగా వున్న చిత్రాన్ని నిషేధించటనికి వెంకటగిరి, బొబ్బిలి జమీందారులు నోటీసులు కూడా ఇచ్చారు. సినిమా 27 ఆగస్టు 1939 నాడు విడుదల అయ్యింది.

ఆ రోజే జమీందార్ల లాయర్లు నెల్లూరు వచ్చి, చిత్రాన్ని చూసి నోట్సు వ్రాసుకొని వెళ్ళారు. అలాగే చిత్ర నిర్మాతలకు రిజిష్టర్డ్ నోటీసులు పంపారు.

చివరకు నెల్లూరు జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా వెంకటగిరి పట్టణం లోనే కాదు, తాలూకా లోనే కాదు పూర్తి గూడూరు డివిజన్ లోనే చిత్రాన్ని నిషేధించగలిగారు.

సెన్సారు బోర్డు సంపూర్ణంగా నిషేధించలేదు కాబట్టి వారిపై కూడా ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. కాని అక్కడ జమీందారుల ఆటలు కొనసాగలేదు.

మేజిస్ట్రేట్ చర్య న్యాయ బధ్ధం కానప్పటికి మద్రాసు ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు ప్రవర్తించటం గమనార్హం.

ప్రజల మీద సినిమాల ప్రభావం ఉంటుందని, సినిమాలు ప్రజల మీద ఒత్తిడి తీసుకురాగలవన్న నమ్మకం మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాలతోనే ఆరంభమైంది.

ఎంతటి సంచలనం రేపగలిగినా, అనేక అవాంతరాలవల్ల “రైతుబిడ్డ” సినిమా, “మాలపిల్ల” లాగా ఆర్ధికవిజయం సాధించలేకపోయింది.

నిషేధాలు, కోర్టులు, బెదిరింపులు, ఆర్ధికనష్టం లాంటివన్నీ రావటంతో ఎంత సాంఘిక చైతన్యం గల వ్యక్తిత్వం గల మనిషయినా కూడా రామబ్రహం గారు మరల అలాంటి ప్రయత్నం చేయలేకపోయారు.

ఇల్లాలు…

గూడవల్లి రామబ్రహ్మం గారు తీసిన మాలపిల్ల, రైతుబిడ్డ వంటి సంచలన చిత్రాల వల్ల ఏర్పడిన ఇబ్బందుల కారణంగా, “రైతుబిడ్డ” పై జమీందార్లు అలిగి ప్రింట్లు తగలబెట్టడం, నిషేధింప చేయడం వంటి అంశాలతో మనస్థాపం చెందారు. ఇలాంటి చిత్రాలతో వివాదాలతో బాటు, ఆర్థిక నష్టం వాటిల్లుతుండడంతో తన పంథా మార్చుకున్నారు. “ఇందిరా ఫిలింస్‌” అనే సంస్థకు దర్శకత్వం చేయడానికి అంగీకరించిన గూడవల్లి గారు “ఇల్లాలు” అనే చిత్రాన్ని రూపొందించారు.

ఈ చిత్రంలో అడ్వకేట్‌ ఉమా మహేశ్వర రావు గారిని హీరోగా, సాలూరి రాజేశ్వర రావు గారిని సంగీత దర్శకులు గా పరిచయం చేశారు. కథనయికగా కాంచనమాల గారిని తీసుకున్నారు. రావు బాల సరస్వతీ దేవి గారు ఇందులో నటించి పాటలు పాడటమే కాకుండా, కాంచనమాలను రాజేశ్వరరావు బాణికి అనుగుణంగా పాడేలా ఆమె ముందు సరస్వతి ఆలపించి ఆమె అలా పాడేలా చేసారు. 127 సెప్టెంబర్ 1940 లో విడుదల అయిన ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించలేక పోయింది.

అపవాదు…

ఇల్లాలు చిత్రం తరువాత గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వం లో 1941 వ సంవత్సరంలో “అపవాదు” అనే చిత్రం తెరకెక్కింది. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు కోవెలమూడి సూర్యప్రకాశరావు (కె.ఎస్.ప్రకాశరావు) గారికి నటన పరంగా తొలి చిత్రం. గూడవల్లి రామబ్రహ్మం గారి సినిమా 1940లో నిర్మించబడిన పత్నిలో ప్రకాశరావు గారి నటించినది తొలి పాత్రఅయినా అది 1942 వరకు విడుదల కాలేదు.

పత్ని…

తమిళ గాథ “శిలప్పదికారం” ఆధారంగా సారథీ పతాకం క్రింద తీసిన చారిత్రక సినిమా “పత్ని”. పూంపుహార్లో జరిగిన కోవలన్ – కణ్ణగి కథను సేకరించి గూడవల్లి రామబ్రహ్మం గారు పత్ని సినిమాను అపూర్వమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఒక అపురూప చిత్రం అని విమర్శకులు కూడా కొనియాడారు. కళా దర్శకుడు వాలి చిత్రకళా నైపుణ్యం దానిని ఆ చిత్రానికి వన్నె తెచ్చింది. కానీ ఈ చిత్రం కూడా ఆర్థికంగా నష్టాల పాలయ్యింది.

పంతులమ్మ…

సారధీ పిక్చర్స్ పతాకం పై గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వంలో పంతులమ్మ సినిమా నిర్మాణం జరిగింది. అవినీతికి ఆలవాలమైన పురపాలక సంఘ అధ్యక్షుల బ్రతుకులను బట్టబయలు చేసే కథతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో లక్ష్మీరాజ్యం, ఉమామహేశ్వరరావు, ముదిగొండ లింగమూర్తి, డాక్టర్ గిడుగు వెంకట సీతాపతి, డి.హేమలత గార్లు లాంటి వారు నటించారు. ఒక బాలిక పాత్రలో  పి.జి.కృష్ణవేణి (జిక్కి)ని గూడవల్లి గారు పరిచయం చేశారు. అందులో “ఈ తీరని నిన్నెరిగి పలుకగా – నా తరమా – జగదేక కారణా” అనే పాటను బాలగాయని జిక్కీ ఆలపించింది. సముద్రాల రాఘవాచార్య గారు ఈ పాటను వ్రాశారు. ఈ చిత్రానికి సంభాషణలు కూడా సముద్రాల గారే వ్రాశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారు జి.కె.మంగరాజు గారి పూర్ణా సంస్థ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రం కూడా ఆర్థికంగా విజయం సాధించలేదు.

మాయలోకం…

వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న గూడవల్లి గారికి “మాయలోకం” చిత్ర విజయం కొంత ఊరటనిచ్చింది అని చెప్పాలి.

కాంభోజరాజు కథ ఆధారంగా గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో 1945 లో సారథి ఫిలిమ్స్ నిర్మించిన నాటి తెలుగు జానపద చలన చిత్రం “మాయలోకం”.

గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, సి.ఎస్.ఆర్, శాంతకుమారి, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, గిడుగు సీతాపతి, లంక సత్యం, టి.జి.కమలాదేవి లాంటి భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

త్రిపురనేని గోపీచంద్ గారు సంభాషణలు వ్రాయగా, గాలిపెంచల నరసింహారావు గారు ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన రెండవ చిత్రం.

ఈ చిత్రంలోని ఏడుగురు చిన్న రాజకుమారులలో మొదటి వానిగా బాలనటుడు బి.పద్మనాభం గారు నటించారు.

వరుస పరాజయాలతో ఆర్థికంగా దెబ్బతిన్న సారథి పిక్చర్స్‌ను గట్టెక్కించడానికి తన అభిరుచికి స్వతాహాగా సరిపడకున్నా, ప్రేక్షకులు మెచ్చే జానపద ఫక్కీలో ఈ సినిమాని తీశారు గూడవల్లి రామబ్రహ్మం గారు.

మాయలు, మంత్రాలు, దేవతలు, రాక్షసులతో కూడిన ఈ సినిమాను భారీ పెట్టుబడితో మంచి నిర్మాణ విలువలతో నిర్మించినా తన భావాలకు విరుద్ధంగా తీసినందుకు రామబ్రహ్మం గారు అపరాధ భావనతో సిగ్గుపడ్డారు.

అయితే సినిమా మాత్రం ఆశించిన విధంగా ప్రజాదరణ సాధించి, ఆర్థికంగా ఘనవిజయం సాధించింది.

తదనంతర కాలంలో ఈ చిత్రం శోభన్ బాబు గారు కథానాయకుడుగా కాంభోజ రాజు కథ పేరుతో పునర్నిర్మించారు.

చిత్ర సమాహారం..

మాలపిల్ల (నిర్మాత, దర్శకుడు)..

రైతుబిడ్డ (రచయిత, దర్శకుడు)..

ఇల్లాలు (దర్శకుడు)..

అపవాదు (దర్శకుడు)..

పత్ని (దర్శకుడు)..

పంతులమ్మ (దర్శకుడు)..

మాయలోకం (దర్శకుడు)..

పల్నాటి యుద్ధం (దర్శకుడు)..

మరణం…

గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వం లో ఆఖరి చిత్రం “పల్నాటి యుద్ధం” సినిమా.

గోవిందరాజులు సుబ్బారావు, కన్నాంబ, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్. వరలక్ష్మి, వంగర, సురభి బాలసరస్వతి, ముదిగొండ లింగమూర్తి మొదలగు తారగణంతో   తెరకెక్కించారు.

కానీ దురదృష్టం ఏమిటంటే “పల్నాటి యుద్ధం” చిత్రీకరణ జరుగుతుండగా తనకు ఆకస్మాతుగా పక్షవాతం వచ్చి గూడవల్లి గారు అనారోగ్యానికి గురయ్యారు.

గూడవల్లి గారికి పిల్లలు లేని కారణంగా అక్కినేని గారిని తన సొంత కొడుకులా చూసుకుంటూ తన ఇంట్లోనే ఉంచేశారు.

అక్కినేని నాగేశ్వరావు గారిని పిలిపించిన గూడవల్లి గారు తన భవిష్యత్తు చూసుకొమ్మని నా వల్ల నీ సినీ జీవితం ఆగిపోకూడదని గూడవల్లి గారు సలహా ఇచ్చారు.

దాంతో అక్కినేని గారు గూడవల్లి గారి ఇంటినుండి వెళ్లి తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు.

అలా అనారోగ్యం తో బాధపడుతున్న గూడవల్లి గారు 30 సెప్టెంబర్ 1946 రాత్రి 01:30 నిముషాలకు అంటే 01 అక్టోబర్ 1946 నాడు మరణించారు.

గూడవల్లి గారు మరణించిన తరువాత ఆంధ్ర దేశమంతా తన సంతాప సభలు జరిగాయి. తాను సినిమా కు చెందిన వ్యక్తి మాత్రమే కాదు. అభ్యుదయ వాది కూడానూ.

విజయనగరం లో హరిజన సేవా సమితి వారు గూడవల్లి గారి విగ్రహం పెట్టాలని తీర్మానం కూడా చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

గూడవల్లి గారి అనారోగ్య కారణంగా “పల్నాటి యుద్ధం” చిత్రం పూర్తికావడంలో ఇబ్బందులు రాగా దర్శకులు ఎల్.వి. ప్రసాద్ గారు దర్శకత్వ భాద్యతలు చేపట్టి దానిని పూర్తి చేసారు. 1947లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.

Show More
Back to top button