గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కువగా టీడీపీనే గెలిచింది. 1983, 1985 ఎన్నికల్లో అన్నాబత్తుని సత్యనారాయణ.. 1994లో రావి రవీంద్రనాథ్, 1999లో గోగినేని ఉమ, 2014లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ టీడీపీ నుంచి గెలిచారు. 1989లో నాదెండ్ల భాస్కర్‌రావు, 2004, 2009 ఎన్నికల్లో ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ విజయబావుటా ఎగురవేశారు.
2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం అన్నాబత్తుని, నాదెండ్ల కుటుంబాలు పోటీ పడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు గెలిచిన నాదెండ్ల మనోహర్ ఈసారి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.
ఇక్కడ టీడీపీకి మంచి ఓటు బ్యాంక్ ఉన్నా కూటమిలో భాగంగా జనసేన పార్టీకి టిక్కెట్ కేటాయించారు. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన ఓటు బ్యాంక్ నాదెండ్ల మనోహర్ గెలుపు కోసం కీలకంగా మారనుంది. మరోవైపు వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌కు స్థానికంగా మంచి క్రేజ్ ఉండటంతో ఆయన కూడా గెలుపు రేసులో ఉన్నారు. మరి వరుసగా రెండోసారి అన్నాబత్తుని శివకుమార్‌కే ప్రజలు పట్టం కడతారా లేదా నాదెండ్ల మనోహర్‌కు మద్దతు ఇస్తారా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.