
ఆయనొక రచయిత, దర్శకుడు, హేతువాది.. సంఘ సంస్కర్త కూడా.. తండ్రి నుంచి వచ్చిన రచనా స్ఫూర్తిని పునికి పుచ్చుకొని.. పలు రచనలు చేశాడు.. ఆయనే త్రిపురనేని గోపీచంద్..
సగటు మానవుడి జీవితపు సంఘర్షణల నుంచి పుట్టిన నిజజీవిత కథలే ఆయన రచనల్లో ప్రస్పుటిస్తాయి.
అటువంటి రచనల్లో ప్రధానమైంది.. ‘అసమర్థుని జీవయాత్ర’… అప్పటి కాలంలో వచ్చిన తొలి తెలుగు వైజ్ఞానిక నవల ఇది. ఈ అత్యుత్తమ నవల గురుంచి తెలియనివారు, చదవని వారు బహుశా ఉండరేమో..
ఆయన రచనలు చేసి ఇన్నాళ్లు గడిచినా ఆయన సాహిత్యం మాత్రం నేటికీ అందుబాటులో ఉండటం విశేషం. ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడా.. అట్టి రచనా విశేషాలను, రచయిత గురుంచి మనం క్లుప్తంగా తెలుసుకుందాం:
జీవిత నేపథ్యం…
1910 సెప్టెంబర్ 8న కృష్ణాజిల్లాలోని అంగలకుదురు గ్రామంలో జన్మించారు త్రిపురనేని గోపిచంద్. తండ్రి త్రిపురనేని రామస్వామి. ప్రముఖ సంఘ సంస్కర్త. చిన్ననాటి నుంచి తండ్రి నాస్తికత్వపు భావజాలాన్ని చూస్తూ పెరిగిన ఈయన పెద్దయ్యాక అస్తికునిగా మారారు. గోపీచంద్ రాసిన రచనల్లో అసమర్ధుని జీవయాత్ర, పండితపరమేశ్వర శాస్త్రి వీలునామా ప్రసిద్ధ నవలలుగా పేరుగాంచాయి. పరమేశ్వర శాస్త్రి వీలునామాకు సాహిత్య అకాడమీ అవార్డు లభించడం విశేషం. ఇక మనం ప్రత్యేకంగా చెప్పుకోబోతున్న అసమర్ధుని జీవయాత్ర తెలుగులో వచ్చిన మొదటి వైజ్ఞానిక నవల.
గడియ పడని తలుపులు, చీకటి గదులు, పరివర్తన యమపాశం, శిథిలాలయం, తత్వవేత్తలు, పోస్టు చేయని ఉత్తరాలు, మెరుపుల మరకలు.. ఇతర రచనలు.
రచయితగా ఒక స్థాయిని అందుకున్న గోపీచంద్… అనంతరం సినిమాలకు మాటల రచయితగానూ, మరికొన్ని సినిమాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. గోపీచంద్ కథ, మాటలు అందించిన సినిమాలు గొప్ప విజాయాన్ని అందుకున్నాయి. చదువుకున్న అమ్మాయిలు(మాటలు), గృహప్రవేశం(కథ)కు అలా సహకారం అందించినవే. అయితే ఆయన స్వీయ దర్శకత్వం వహించిన చిత్రాలేవీ విజయవంతం కాకపోవడం ఆశ్చర్యం! ఇలా సినిమారంగంలో పరాజయాలు చవిచూడటంతో అరవిందో ఆశ్రమానికి చేరి, అక్కడే సేద తీరారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ గా, ఆకాశవాణి ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాసిన నవలల్లోలాగానే అతని నిజజీవితంలోనూ అనూహ్యమైన మలుపులు, ఎత్తు పల్లాలు చోటు చేసుకున్నాయి. ఇలా 1962లో తన 52 ఏళ్ల వయసులో మరణించారు.
అయినా ఇప్పటికీ తెలుగునాట గొప్ప రచయితల జాబితాలో గోపీచంద్ పేరు అగ్రస్థానాన నిలిచింది. 2011 సెప్టెంబర్ 8న భారత ప్రభుత్వం గోపీచంద్ గౌరవార్ధం తపాలా బిళ్లను సైతం విడుదల చేసింది.
అసమర్థుని జీవయాత్ర…

తెలుగులో వచ్చిన తొలి మనో వైజ్ఞానిక నవల.. ఇందులో మానసిక స్థితిని చిత్రించడానికి బొమ్మలను వాడిన ప్రయోగాత్మక నవలగానూ దీనికి పేరుంది. తెలుగులో వచ్చిన అత్యుత్తమ నవలల్లో ఇది ఒకటిగా, మేటిగా చెప్పవచ్చు. గోపీచంద్ అత్యుత్తమ రచన శైలికి నిదర్శనం ఈ రచన.
నవలలో… అప్పటి మన పల్లెటూళ్లు, అక్కడి మానవ సంబంధాలు, వాటి చుట్టూ అల్లుకున్న పరిణామాలు అన్నీ తారసపడతాయి. జమీందారీ వ్యవస్థ ఎలా బీటలు వారుతుందో, మన సమాజంలో పెట్టుబడిదారీ బీజాలు ఎలా నాటుకుంటున్నాయో చక్కగా వివరించారు గోపీచంద్.
ఇక నవలలోకి వెళ్తే… ఈ నవలలోని ప్రధాన పాత్రధారుడు.. సీతారామారావు.. బాగా కలిగిన కుటుంబం. వారసత్వంగా వచ్చిన డబ్బును వంశ పేరు ప్రతిష్టలను నిలబెట్టే క్రమంలో అడిగినవారికీ కాదనకుండా దానధర్మాలు చేస్తాడు. పెళ్ళంటే ఇష్టం లేని తాను అనుకోకుండా ప్రేమలో పడి, ప్రేమ వివాహం చేసుకుంటాడు. ఈలోగా ఉన్న ఆస్తి అంతా హరించిపోతుంది. పిల్లనిచ్చిన మామ చూస్తూ వదిలేయలేక ఉద్యోగం ఇప్పిస్తడు. అది సరిగ్గా చేయలేక వదిలేశాడు. ఏ పనికీ ఏ సార్థకతా, పరమార్థమూ లేవని.. ఏ పనీ చేయకుండానే వృధాగా కాలం గడిపేస్తూ ఉంటాడు.
తన మేలుకోరే రామయ్య తాత ఇచ్చే సలహాల్ని పెడచెవిన పెడతాడు. ప్రతిదానిలోనూ ఏదో ఒక వితండవాదం చేస్తూ, అసహనం పెంచేసుకుంటూ అదే విధంగా భార్యనీ, కన్నకూతుర్ని కష్టపెడతాడు. వీటన్నింటి మధ్యలో తనమీద దాడి చేస్తున్న ఆలోచనల సుడిగుండంలో చిక్కుకొని.. బయటపడలేక.. అందర్నీ భయపెట్టి, ఆ తర్వాత శ్మశానంలో తనను తానే హింసించుకుని చచ్చిపోతాడు.
అసలు ఇక్కడున్న కథేంటి..? ఉన్నదంతా ఒక పాత్ర.. తన ఆలోచనల చుట్టూ ఆల్లుకునే జీవన విధానం..
ఒక అంతర్ముఖుడు తనలోకి తాను తొంగి చూసిన ఉన్మత్తపు జీవన విధానమే ఈ నవలలో మనకి గోచరిస్తుంది.
సుమారు 75 ఏళ్ళ క్రితమే ఈ పుస్తకం వచ్చి ఉంది. ఒకచోట నాయకుల గురించిన ప్రస్తావన ఇలా కనిపిస్తుంది. కుర్రతనంలో ఉండే ఉబలాటంకొద్దీ సంఘసేవ అని బయలుదేరి దానివల్ల ఏమీ లాభం లేదని తెలిసేసరికి అందులోనుండి వెనక్కి వచ్చే అవకాశం లేక, అప్పటికే వచ్చిన గౌరవాన్ని కాదనలేక.. అలాగే నాయకులుగా కొనసాగుతూ ఉంటారు. అప్పటివరకూ తాము చెప్పినవి తప్పని వారి మనసుకి తెలిసినా, దాన్ని బయటకు చెప్పలేకపోగా అదే తప్పుని మరింత బలంగా ప్రచారంలోకి తెచ్చే మనస్తత్వమే నాయకుల్లో అధికంగా కనిపిస్తుంటుంది.
వ్యక్తి అయినా, సంఘమైనా, ప్రకృతి అయినా.. ఎక్కడైనా ఘర్షణ అన్నది జీవనవికాసానికి తోడ్పడేలా ఉండాలి. అప్పుడే ఆదర్శవంతమైన జీవనయాత్ర కొనసాగుతుంది అన్న ఆలోచనను మనలోకి జొప్పించే మాటలని రామయ్య తాత పాత్రద్వారా చెప్తాడు రచయిత.
ఇవన్నీ మన జీవితంలోని ఏదోక పార్శ్వంలో మన మథనంలో నలిగినవే అన్న సంగతి స్వీయ తలంపునకు వస్తుంది.
ఒకపక్క సమాజ తీరును విశ్లేషిస్తూ, మరోపక్క మనిషిలోని దౌర్బల్యాన్ని కళ్లకి కట్టినట్లు చూపిస్తాడు ఇందులో రచయిత. ఆ మాటకొస్తే, ఈ కథలో సీతారామారావు కేవలం ఒక సాధనం మాత్రమే.. ఆ వంకతో ప్రతి పాఠకుడినీ తనలోకి తాను చూసుకునేలా, ఆత్మవిమర్శ చేసుకునేలా చేస్తాడు.
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవలది.. మరో శైలి. అభ్యుదయ భావాలున్న కేశవమూర్తి అనే పాత్రని గొప్ప నాయకునిగా నిలుపుతుంది ఈ నవల. స్వార్థపూరితమైన వ్యక్తుల మధ్య అతని జీవిత పోరాటం ఎలా సాగిందో మనకు విశదీకరిస్తుంది. ఈ నవలలో మార్క్సిస్టు భావజాలం పుష్కలంగా కనిపిస్తుంది. 1963లో దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా లభించింది. ఆ బహుమతిని అందుకున్న తొలి తెలుగు నవలగా ఘనతని దక్కించుకుంది.
పరిశీలిస్తే, గోపీచంద్ రచనల్లో క్రమేపీ మార్క్సిస్టు
ప్రభావం తగ్గి, తత్వశాస్త్రం, మానవతావాదాలకు సంబంధించిన ప్రభావం ఎక్కువగా కనిపించింది. అందువల్లేనేమో ఆయన ప్రముఖ తత్వవేత్తల గురించి ఏకంగా ‘తత్వవేత్తలు’ అనే గ్రంథాన్ని రాశారు.
అయితే గోపీచంద్ ‘ఎందుకు?’ అని ప్రశ్నించడం మానుకుని, ఒకానొక దశలో మూఢభక్తిని సైతం తత్వం.. అనుకునే స్థాయికి దిగజారాడన్న విమర్శలు రాకపోలేదు.
ఎన్నోసార్లు ప్రతి ముద్రణలు జరిగిన ఈ ప్రత్యేకమైన నవల నేటికీ మనకు ప్రముఖ ఆన్ లైన్ సైట్లలో అందుబాటులో దొరుకుతుంది.