Telugu Special Stories

విశ్వనట సామ్రాజ్ఞి.. నటి బి.సరోజాదేవి

బి. సరోజాదేవి (జననం..1942 జనవరి 7).. బెంగుళూరు, కర్ణాటక..

తెలుగు కథానాయికలలో ‘అతిలోక సుందరి’ ఎవరంటే మొదటగా వినిపించే పేరు శ్రీదేవి. కానీ ఆమెకంటే ముందున్న తారల్లో ‘అతిలోక సుందరి’ ఎవరంటే మాత్రం ఎవరైనా సరే ఖచ్చితంగా బి.సరోజాదేవి పేరు చెప్పాల్సిందే. కనురెప్పలను టపటపలాడిస్తూ వెండితెరపై ఆమె చేసిన చూపుల విన్యాసాలు చూసి, అప్పటి కుర్రాళ్లు ఆమెకు వీరాభిమానులుగా మారిపోయారు.

అలనాటి కథానాయికలలో సావిత్రి గారికి ఎదురుండేది కాదు. గ్లామర్ పరంగా జమున, కృష్ణకుమారికి తిరుగుండేది కాదు. అలాంటి సమయంలోనే అందం, అభినయం రెండూ కలగలిసిన నాయికగా బి.సరోజాదేవి చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చారు.

“జగదేకవీరుని కథ” చూసిన ప్రేక్షకులు, నిజంగానే ఆమె దేవకన్య ఏమో అనుకున్నారు. “శకుంతల” చూసినవారు, దుశ్యంతుడు ఉన్నపళంగా మనసు పారేసుకోవడంలో అర్థం ఉందనుకున్నారు. “శ్రీకృష్ణార్జున యుద్ధం” చూసినవారు “సుభద్ర” ఇలాగే ఉండేదేమోనని అనుకున్నారు.  “అమరశిల్పి జక్కన్న” చూసినవారు, ఇంతటి సౌందర్య రాశిని అంత దగ్గరగా చూసినవాళ్లు కవులో, శిల్పులో కావడంలో ఆశ్చర్యం ఏముందిలే అనుకున్నారు. “పెళ్లికానుక” సినిమాలో ఆమె రెండు జడలు వేసుకుని సైకిల్ పై కాలేజ్ కి వెళుతుంటే, ఆ కాలేజ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలామంది కుర్రాళ్లు ఉబలాటపడ్డారు, ఉత్సాహ పడ్డారు.

veteran-actress-b-sarojadevi-biography
veteran-actress-b-sarojadevi-biography

ఆ రోజుల్లో అందాలనటిగా రాజ్యమేలిన బి.సరోజాదేవి తెరపై కనిపిస్తే చాలు అభిమానుల మది పరవశంతో చిందులు వేసేది. చిలుక పలుకులు వల్లిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ, చూపరులను తమ కళ్ళతో ఇట్టే ఆకట్టుకొనే రూపంతో, తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి.సరోజాదేవి గారూ. తన చిలిపి నవ్వులతో, ముద్దుముద్దు మాటలతో, పడుచు హృదయాలపై పదనిసలు పలికించిన కథానాయిక బి.సరోజాదేవి గారూ.

కన్నడ సీమలో పుట్టిన సరోజాదేవి గారూ, తెలుగు రాకపోయినా, పదాలను పట్టి పట్టి పలికేవారు. అయినా అది ఆమె బాణీగా భాసిల్లింది. ఆ ముద్దుమోములో పలికే తెలుగు పలుకు మరింత ముద్దుగా ఉండేదని ఆ నాటి అభిమానులు ఈ నాటికీ గుర్తు చేసుకుంటారు. ఆనాటి రోజుల్లో ముఖ్యంగా సరోజాదేవి గారి స్టార్ డమ్, ఆవిడ గారి మీద విపరీతమైన మోజులో ఆ తరంలో ఆడవారు ఆమె వస్త్రధారణను విపరీతంగా ఆరాధించేవారు. సరోజాదేవి గారూ కట్టే చీరలు, బ్లౌజ్‌లు, ఆభరణాలు, కేశాలంకరణను అప్పటి రోజుల్లో అమ్మాయిలు, మహిళలు క్రేజీగా అనుసరించేవారు.

జననం.. 

బి. సరోజాదేవి గారూ 1940 జనవరి 7వ తేదీన బెంగళూరులో జన్మించారు.  వీరి తండ్రి గారి పేరు భైరప్ప, తల్లి గారి పేరు రుద్రమ్మ. తండ్రి గారూ పోలీస్ శాఖలో పెద్ద పేరు మోసిన ఉద్యోగి. వీరికి ముగ్గురు అక్కలు. పార్వతి, కమల, సిద్ధ మూగంబిగ లు. నాటక ప్రదర్శనలు ఇవ్వడం వాళ్ళ నాన్న గారికి అలవాటు. మాతృభాషా కన్నడమే అయినా కాన్వెంట్లో చదవడం వల్ల ఇంగ్లీషు, ఇరుగుపొరుగు వల్ల తెలుగు భాష పరిచయం ఉండేది. వీరి అసలు పేరు బి.సరోజాదేవి. బి అంటే బెంగళూరు. మా నాన్నగారి పేరు బైరప్ప. బెంగళూరు సరోజదేవి అన్నా, భైరప్ప సరోజినీదేవి అన్నా బావుండదని బి.సరోజదేవి గానే పిలిపించుకునేవారు. అదే పేరుతో పిలవడం అందరికీ అలవాటైపోయింది. సరోజాదేవి నాన్నగారు పెద్ద ఉద్యోగంలో ఉండడం వలన మొదటి నుంచి వారు కాస్త డబ్బు ఉన్న కుటుంబమే.

బాల్యం..

veteran-actress-b-sarojadevi-biography
veteran-actress-b-sarojadevi-biography

సరోజాదేవి గారి కాన్వెంట్ జీవితం చాలా హాయిగా గడిచిపోయేది. ఆవిడకు విమల అని  ప్రాణ స్నేహితురాలు ఉండేది. ఆ అమ్మాయితో కలిసి ఆడుకోవడం పాడుకోవడం ఇదే సరోజాదేవి గారి జీవితం. ఆ వయస్సులో సరోజాదేవి గారికి చిన్నప్పటి నుండి కూడా సినిమాలు చూడమంటే పెద్ద ఆసక్తి ఉండేది కాదు. వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకెళ్తే అతీకష్టం మీద వెళ్ళేవారు. అయితే శాస్త్రీయ సంగీతాన్ని చాలా శ్రద్ధగా వినేవారు. కొంతకాలం సంగీతం, నృత్యం రెండు కూడా సాధన చేశారు. మరి కొంతకాలం వీణ కూడా నేర్చుకున్నారు.

సరోజాదేవి గారి చదువుకునే వయస్సులో ఒక పోలీస్ ఫంక్షన్ జరిగింది. ఉన్నట్టుండి వాళ్ళ నాన్నగారు సరోజాదేవి గారిని పిలిచి నువ్వు ఒక పాట పాడాలి అన్నారట. ఆ మాట వింటూనే సరోజాదేవి గారూ ఉలిక్కిపడ్డారు. ఈ సభ ఏమిటి నేను పాడడం ఏమిటి అని భయపడ్డారు. కానీ నాన్నగారికి ఎదురు చెప్పలేకపోయారు. కొద్దిసేపటికి సరోజాదేవి గారిని వేదికపైకి పిలిచారు. అటూ ఇటూ చూసుకుంటూ సరాసరి వేదికపైకి ఎక్కి మైక్ ముందు నిల్చున్నారు. పాట పాడుదామని నోరు విప్పారు. ఆమెకున్న భయానికి పెదవులు విడిపడ్డాయి, కానీ పాట బయటికి రాలేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని మళ్లీ ప్రయత్నం చేశారు. ఈసారి పాట వచ్చింది గాని శృతి తప్పింది. ఆవిడ గారికి మతి కూడా తప్పింది. ఆ పాట అనార్కలి (హిందీ) చిత్రంలోని “ఏ జిందగీ” అన్న లతామంగేష్కర్ గారి పాట. “ఏ” ఎక్కడుందో, “జిందగీ” ఎక్కడో ఉన్నాయి. గొంతు జీరబోతోంది. అపస్వరాలు పడిపోతున్నాయి. సరోజదేవి గారికి కంగారు మరింత ఎక్కువైపోయింది. నా వీక్షకులు “ఓ” అని గోలగోల చేస్తున్నారు.

ఆ దృశ్యం కళ్లారా వీక్షిస్తున్న సరోజాదేవి గారికి ఎక్కడలేని రోషం పుట్టుకొచ్చింది. తన గొంతును సవరించుకున్నారు. ఈసారి సరైన శ్రుతిలో సక్రమంగా పాడినారు. పాట అయిపోగానే ఆహుతులందరూ చప్పట్లు కొట్టి “ఒన్స్ మోర్” అన్నారు. సరోజాదేవి గారూ మాత్రం అవేవీ పట్టించుకోకుండా అందరికీ నమస్కారం చేసి గబగబా వచ్చి తన సీట్లో  కూర్చున్నారు.

వాట్ బ్రదర్. మీ అమ్మాయి ఇంత బాగా పాడుతుందని మాకు ఏనాడూ చెప్పలేదు. సూపర్, సింప్లీ, మార్వలెస్ అని అందరూ సరోజాదేవి గారి నాన్నగారిని అభినందిస్తుండగా, ఒకతను మాత్రం సరోజాదేవి గారి దగ్గరకు వచ్చి నీ పేరేమిటమ్మా అని అడిగారు. తన చిరునామా కూడా అడిగి తీసుకున్నారు. ఆ మరుసటి ఉదయం ఆయన సరోజాదేవి గారి నాన్న గారితో మాట్లాడుతూ సరోజాదేవి గారి ఇంట్లో కనిపించారు. తాను ఎందుకు వచ్చారో సరోజాదేవి గారికి అర్థం కాలేదు. వాళ్ళ అమ్మాయి పెళ్లికి సరోజాదేవి గారూ పాట కచేరి చేయాలేమో అనుకున్నారు. కానీ వచ్చినతను “హొన్నప్ప భాగవతార”ని పెద్ద దర్శక, నిర్మాత అని సరోజాదేవి గారికి వాళ్ళ నాన్న గారూ చెప్పారు.

కాళిదాసు అని ఒక సినిమా తీస్తున్నారట. అందులో నువ్వు వేషం వేయాలట, అని సరోజాదేవి గారితో వాళ్ళ నాన్న గారూ చెప్పారట. సినిమాలంటేనే ఏమాత్రం ఆసక్తిలేని సరోజాదేవి గారికి నేను సినిమాలో వేషమేయడం ఏంటి అని ఆలోచనలో పడ్డారు.

సినీ రంగ ప్రవేశం…

నువ్వు చాలా అందంగా ఉన్నావు అమ్మాయ్. నీ గొంతు కూడా బావుంది. నీ చేత నటింపజేయడం పెద్ద కష్టమేమీ కాదు, నాది పూచి అన్నారు దర్శక, నిర్మాత హొయప్ప భాగవతార్ గారూ.సరోజాదేవి గారిని సినిమాల్లో నటించమని అమ్మ నాన్న ఇద్దరు తనని  ప్రోత్సహించారు. ఇంకా చెప్పాలంటే బలవంతంగా సరోజాదేవి గారిని ఒప్పించారు. చివరికి సరోజాదేవి గారూ ఒప్పుకోక తప్పలేదు. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు కదా. సరోజాదేవి గారూ సినిమానటి అవుతారని ఎప్పుడూ ఊహించలేదు,  కావాలని కలలు కనలేదు. పైగా చిన్నప్పుడు సినిమాలకు వెళ్లడం అంటేనే చిరాకుగా భావించే సరోజాదేవి గారూ, వెళ్లినా కూడా ఏమైనా ప్రేమ సన్నివేశాలు వస్తే గట్టిగా కళ్ళు మూసుకునేవారు.

విశ్వనట సామ్రాజ్ఞి.. నటి బి.సరోజాదేవి..
విశ్వనట సామ్రాజ్ఞి.. నటి బి.సరోజాదేవి..

కానీ ఆ తర్వాత సరోజాదేవి గారూ వారి నటజీవితంలో ఎన్నో ప్రేమ సన్నివేశాల పాత్రలలో నటించారు. అదే జీవితంలో ఉండే తమాషా. హొన్నప్ప భాగవతార్ “మహాకవి కాళిదాసు” అనే కన్నడ చిత్రంలో కథానాయకి విద్యాధరి పాత్రలో నటింపజేశారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించడంతో సరోజాదేవి గారికి మంచి పేరు వచ్చింది. తెలుగులో సరోజదేవి గారి మొదటి చిత్రం రిపబ్లిక్ ప్రొడక్షన్స్ సీతారాం గారి పెళ్లి సందడి (1959)

అందులో సరోజాదేవి గారూ పింగ్లా పాత్రను ధరించారు. అప్పుడే నందమూరి తారకరామారావు గారు “పాండురంగ మహత్యం” లో కళావతి (వేశ్య)పాత్రకు సరోజాదేవి గారిని ఎంపికచేసుకున్నారు. సరోజాదేవి గారి మొదటి చిత్రం పెళ్లిసందడి అయినా, ముందుగా మాత్రం “పాండురంగ మహత్యం” చిత్రం విడుదలైంది. ఎన్టీఆర్ తో కలిసి “జగదేకవీరుని కథ”, “మంచి చెడు”, “దాగుడుమూతలు”, “ప్రమీలార్జునీయం” “శకుంతల” వంటిఎన్నో విజయవంతమైన చిత్రాలలో సరోజాదేవి గారూ నటించారు. ఎన్టీఆర్ గారి సొంతంగా నిర్మించే చిత్రాలలో సరోజాదేవి గారికి తప్పకుండా వేషం ఇచ్చేవారు ఎన్టీఆర్ గారూ.

“సీతారామ కళ్యాణం”,  “దానవీరశూరకర్ణ” వగైరా ఎన్ఏటి చిత్రాల్లో సరోజాదేవి గారూ నటించారు. తెలుగులో సరోజాదేవి గారి చివరి చిత్రం రామారావు గారి సొంత చిత్రమైన సామ్రాట్ అశోక (1992). సినిమా పరిశ్రమకు నిఘంటువు లాంటివారు అక్కినేని నాగేశ్వరరావు గారు.   సెట్ లో చాలా సరదాగా ఉండే వారితో కలిసి చాలా మంచి చిత్రాలు చేశారు సరోజాదేవి గారూ. పెళ్లి కానుక (1960), “ఆత్మబలం”, “అమరశిల్పి జక్కన్న”, “రహస్యం” వంటి చిత్రాలు వీరిద్దరి కలిసి నటించినవే.

ఇప్పటివరకు సరోజాదేవి గారూ సుమారు 200 చిత్రాల్లో నటించారు. వాటిలో తెలుగు 26 తమిళం 94 హిందీ 15 కన్నడ 40 చిత్రాల్లో నటించారు.

తెలుగులో సరోజాదేవి గారికి జయంతి పిక్చర్స్ వారి “శ్రీకృష్ణార్జునయుద్ధం” (1963) చిత్రం అంటే చాలా ఇష్టం. అటు ఎన్టీఆర్, ఇటు ఏఎన్ఆర్ తో కలిసి ఒకేసారి నటించే భాగ్యం ఆ చిత్రంలో కలిగింది సరోజాదేవి గారికి. అందుకే ఆ చిత్రం అంటే ఆవిడ గారికి ప్రత్యేక అభిమానం. ఆవిడ గారికి అప్పటికీ తెలుగు సరిగ్గా రాదు. అయినా ముద్దు ముద్దుగా మాట్లాడేవారు. “జగదేకవీరుని కథ” లో హలా, తర్వాత “శ్రీకృష్ణార్జునయుద్ధం” లో సుభద్ర పాత్రలో చిన్నన్నియ్యా అనే డైలాగ్ అప్పట్లో చాలా పాపులర్. సరోజాదేవి గారికి తెలుగులో బాగా ఇష్టమైన దర్శకులు కే.వీ.రెడ్డి గారు. వారికి సరోజాదేవి గారంటే చాలా అభిమానం. అలాగే మహా మేధావి పింగళి నాగేంద్రరావు గారికి కూడా సరోజాదేవి గారంటే విపరీతమైన అభిమానం.

తమిళ చిత్రాలలో…

ఇంకా చెప్పాల్సింది సరోజాదేవి గారి తమిళ చిత్రాల గురించి. “కచదేవయాని” కన్నడ చిత్రం షూటింగ్ సమయంలో సరోజాదేవి గారికి ఎం.జి.రామచంద్రన్ గారితో పరిచయభాగ్యం కలిగింది. ఎం.జి.ఆర్ గారూ స్వయంగా సరోజాదేవి గారి గురించి తెలుసుకొని తాను నటించే చిత్రంలో సరోజాదేవి గారిని తీసుకోమని నిర్మాతలకు సిఫార్సు చేశారు. నిజంగా ఆ రోజు ఇప్పటికీ మరవలేకపోతున్నాను అని సరోజాదేవి గారూ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఎంజీఆర్ గారు సరోజాదేవి గారిని సిఫార్సు చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఆ రోజుల్లో ఎంజీఆర్ గారు ఎంత అందంగా ఉండేవారు అంటే, బంగారు రంగు దేహ ఛాయతో దగదగా మెరిసిపోతుండేవారు.

ఎంజీఆర్ గారితో సరోజాదేవి గారూ నటించిన తొలి చిత్రం “నాడోడి మన్నన్” షూటింగ్లో ఒక సంఘటన జరిగింది. సరోజాదేవి గారూ ధరిస్తున్న పాత్రను ఒక పెద్ద కొండచిలువ చుట్టుకోవాలి. అప్పుడు కథానాయకుడు వచ్చి కొండచిలువను చంపి  కథనాయికను రక్షిస్తాడు. ఆ సన్నివేశానికి తగ్గట్టు సరోజాదేవి గారికి కొండచిలువను చూడగానే భయమేసిందట. ముచ్చెమటలు పట్టేశాయట. అయినా భయాన్ని పైకి కనిపించనివ్వక ధైర్యంగా నిలుచున్నారట సరోజాదేవి గారూ. అంతా నిశ్శబ్దం పైనుండి పాము పడే ఎఫెక్ట్ కు ఎవరో ఆ కొండచిలువను దబీమని ఆవిడ గారి పైకి విసిరారు. విసిరీ విసరడంతోనే ఆ సర్పం సరోజాదేవి గారిని చుట్టేసింది. అంతే ఆవిడ గారికి ఒంటి మీద స్పృహ లేదు. పది పదిహేను నిమిషాలకు ఆవిడ గారూ కళ్ళు విప్పి చూశారు. సరోజాదేవి గారి చుట్టూ మనుషులు ఆందోళన పడుతూ కనిపించారు. ఒంటి మీద చూసుకుంటే పాము కనిపించలేదు. దిక్కున లేచి కేకవేశారు. ఆ సంఘటనను ఇప్పుడు తలుచుకున్న శరీరం జలదరిస్తుంది అని చెప్పుకొచ్చేవారు సరోజాదేవి గారూ. “నాడోడి మన్నన్” తమిళంలో సరోజాదేవి గారిని తారాపథానికి చేర్చింది.

ఒక్క ఎంజీఆర్ గారితోనే 26 చిత్రాలలో నటించారు సరోజాదేవి గారూ. శివాజీ గణేషన్ గారితో “శభాష్ మీనా”, “పుదియ పరవై”, “బాగప్పిరవినై”, “ఆలయమణి” వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. జెమినీ గణేశన్ తో “కళ్యాణ పరిసు”, తేన్ నువు వంటి చిత్రాలలో నటించారు. సరోజాదేవి గారూ తెలుగులో తక్కువ చిత్రాలలో, తమిళంలో ఎక్కువ చిత్రాలలో నటించారు. అయినా ఆవిడ గారికి తెలుగు, తమిళంలో రెండు భాషల్లోనూ సమాన స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి రెండు వేరువేరు కారణాలు ఉన్నాయని ఊహించవచ్చు. తెలుగులో ఆవిడ గారిపై మంచి మంచి పాటలు చిత్రీకరించబడ్డాయి. నీవని నేనని తలచితిరా (పాండురంగ మహత్యం), భైఠో భైఠో పెళ్లి కొడకా (పెళ్లి సందడి), వాడుక మరిచెదవేలా (పెళ్ళికానుక), జలకాలాటలలో (జగదేకవీరుని కథ),  వానకాదు వానకాదు (భాగ్యచక్రం), చిటపట చినుకులు (ఆత్మబలం),  కనులు మాటలాడునని (మాయని మమత), రేపంటి రూపం కంటి (మంచి చెడు) వంటి అజరామర పాటలు, ఆవిడ గారి ముద్దు ముద్దు మాటల వల్లే సరోజాదేవి గారూ తెలుగులో నిలబడ్డారు.

అయితే తమిళంలో మహోన్నతమైన పాత్రలలో నటించారు. ముఖ్యంగా శివాజీ గణేషన్ గారితో నటించిన “ఇరువర్ ఉళ్లం”లో ఆత్మాభిమానం గల ఉపాధ్యాయురాలి లాంటి ఉదాత్త పాత్రల్లో నటించారు.  మళ్లీ ముప్పై ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన “వన్స్ మోర్” చిత్రంలో కూడా శివాజీ గారితో సరోజాదేవి గారే నటించారు. తెలుగులో పాటలు, తమిళంలో కథలు గొప్పగా ఉండటంతో ఈ రెండు రంగాలలో అద్భుతంగా రాణించగలిగారు. సరోజాదేవి గారికి 1963 సంవత్సరం తన జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఆ యేడు ఢిల్లీలో జరిగిన ఓ సభకు అతిథిగా వెళ్లారు సరోజాదేవి గారూ. అక్కడ ఎవరో ఆవిడ గారిని జవహార్ లాల్ నెహ్రూ గారికి పరిచయం చేశారు. నెహ్రూ గారూ, మీరు చాలా అందంగా ఉన్నారు అని సరోజాదేవి గారిని ప్రశంసించారు. ఆ ప్రశంసకు ఆవిడ గారి హృదయం పరవశించిపోయింది. ఒక దేశ ప్రధాని నన్ను నా అందాన్ని పొగిడిన సంఘటన నా జీవితంలో మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయిందని పలు సందర్భాలలో సరోజాదేవి గారూ చెప్పుకొచ్చారు.

వైవాహిక జీవితం..

సరోజాదేవి గారూ చిత్రరంగంలోకి వచ్చిన పదేళ్లకు 01 మార్చి 1967 నాడు ఇంజనీర్ శ్రీహర్ష తో సరోజాదేవి గారి వివాహం జరిగింది. శ్రీ హర్ష, ఒక ఇంజనీర్. ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లో పనిచేసేవారు. ఆ సమయంలో సరోజాదేవి గారూ ఆర్థిక సంక్షోభంతో పాటు ఆదాయపు పన్ను శాఖ నుండి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సరోజాదేవి భర్త గారూ ఈ సమస్యలను అధిగమించడంలో ఆవిడ గారికి సహాయం చేశాడు.  అలాగే ఆవిడ గారికి ఆర్థిక నిర్వహణను ఎలా నిర్వహించాలో నేర్పించాడు. సరోజాదేవి అమ్మ గారూ సరోజాదేవి గారి పెళ్లి అవగానే సినిమాలు మానేసి హాయిగా కాపురం చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ సరోజాదేవి భర్త గారూ మాత్రం సినిమాలు మానేయ్యవద్దని, అదే వృత్తిని కొనసాగించమని ప్రోత్సాహించారు. శ్రీహర్ష గారూ ఎంతో మంచి మనసు గలవారు. ఎనాడూ షూటింగ్ కు వచ్చేవారు కాదు. ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు అని ఎప్పుడూ సరోజాదేవి గారిని అడిగేవారు కాదు. సరోజాదేవి గారంటే అంత నమ్మకం. సంసారానికి పునాది నమ్మకమే కదా. తన భార్యకు ఒక వ్యక్తిగత హోదా ఉండాలని, ఆయన ఉన్నా లేకున్నా తన భార్యగా సరోజాదేవి గారూ ఎప్పుడూ గొప్పగా బతకాలని, పెద్దపెద్ద భవంతుల్లో ఉండాలని శ్రీహర్ష గారూ కోరుకునేవారు. 26 ఏప్రిల్ 1986 తేదీన శ్రీహర్ష గారూ గుండెపోటుతో మరణించారు. సరోజాదేవి గారికి అదో పెద్ద షాక్. భర్త మరణంతో దిగ్భ్రాంతికి లోనైన సరోజాదేవి గారూ, చాలా కాలం నటనకు గ్యాప్ తీసుకున్నారు.

తర్వాత మళ్లీ తాయ్ మేల్ ఆనై, ఆడిమైనిలంగు, పరంపరై చిత్రాల్లో నటించారు. తర్వాత “గంగా యమున సరస్వతి” వంటి సీరియల్స్ లో కూడా నటించారు. మంచి పాత్రలు వస్తే సినిమాల్లోనే కాదు బుల్లితెర మీద కూడా నటించేవారు. ఆర్థికంగా సరోజాదేవి గారికి లోటు లేదు. కాబట్టి పేరొచ్చే మంచి పాత్రలే పోషించేవారు. సరోజాదేవి గారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, అబ్బాయి గౌతం. వాళ్లు కూడా ప్రయోజకులై సరోజాదేవి గారి గౌరవాన్ని, ప్రశాంతతను కాపాడారు. కనుక ఒక నటిగా,  ఒక ఇల్లాలుగా, ఒక తల్లిగా ఏ విధంగా చూసినా సరోజాదేవి గారిది ఒక సంతృప్తికరమైన జీవితమే. ఇక వ్యక్తిగా ఆవిడగారు తన భర్త పేరుతో, కూతురు పేరుతో ఎన్నో ఛారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేశారు. సరోజాదేవి గారి అమ్మ గారి పుట్టిల్లు “దశవర” గ్రామంలో ప్రైమరీ, సెకండరీ పాఠశాలలు నిర్మించారు. బెంగళూరు యూనివర్సిటీలో మెరిట్ విద్యార్థులకు ప్రతీ ఏడాది స్కాలర్షిప్ లు ఇస్తున్నారు.

పురస్కారములు..

జాతీయ అవార్డులు..

భారత ప్రభుత్వంచే 2008లో జీవితకాల సాఫల్య పురస్కారం భారతదేశ 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇవ్వడం జరిగింది.

1992 లో భారత ప్రభుత్వం వారు పద్మ భూషణ్ పురస్కారాన్నిచ్చి సత్కరించారు..

1969లో బి.సరోజాదేవి గారికి పద్మశ్రీ అవార్డును ప్రధానం చేశారు..

రాష్ట్ర అవార్డులు..

veteran-actress-b-sarojadevi-biography
veteran-actress-b-sarojadevi-biography

కర్ణాటక రాష్ట్రం వారు 1965 సంవత్సరానికి గాను అభినయ సరస్వతి బిరుదునిచ్చి గౌరవించారు..

1969 సంవత్సరానికి గాను కుల విళక్కు చిత్రానికి ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది..

కర్ణాటక రాష్ట్రం వారిచే అభినందన-కాంచన మాల అవార్డును 1980లో అందుకున్నారు..

కర్ణాటక ప్రభుత్వ రాజ్యోత్సవ 1988లో అవార్డు లభించింది..

తమిళనాడు ప్రభుత్వం యొక్క 1993లో MGR అవార్డునిచ్చి గౌరవించారు..

1994 సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ఫేర్ వారు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డునిచ్చి సత్కరించారు..

చెన్నైలోని సినిమా ఎక్స్‌ప్రెస్ ద్వారా 1997లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రధానం చేశారు..

2001 – 2001 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎన్టీఆర్ జాతీయ అవార్డునిచ్చి సత్కరించారు..

2003 సంవత్సరానికి గాను ఆల్ రౌండ్ అచీవ్ మెంట్ కోసం దినకరన్ అవార్డు వరించింది..

బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి 2006 సంవత్సరానికి గాను గౌరవ డాక్టరేట్ ను పొందారు..

తమిళ సినిమాకి చేసిన కృషికి 2006లో విజయ్ అవార్డు వరించింది..

కర్నాటకలోని తెలుగు అకాడమీ ద్వారా 2007లో తన విశేషమైన విజయానికి ఎన్టీఆర్ అవార్డునిచ్చారు..

ఛారిటబుల్ ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ చెన్నైచే రోటరీ శివాజీ అవార్డు 2007లో ప్రధానం చేశారు.

తమిళనాడు ప్రభుత్వం వారు 2009లో కలైమామణి జీవితకాల సాఫల్య పురస్కారం అందజేశారు..

2009 లో కర్ణాటక ప్రభుత్వం వారు డాక్టర్ రాజ్‌కుమార్ గారి జీవితకాల సాఫల్య పురస్కారంను ఇచ్చి సత్కరించారు…

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు 2009లో రెండవ సారి ఎన్టీఆర్ జాతీయ అవార్డునిచ్చి గౌరవించారు..

తమిళ చిత్రసీమ , భరత్ కలాచార్ చెన్నై ద్వారా 2009 లో నాట్య కళాధర్ అవార్డునిచ్చి సన్మానించారు..

1969 లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ తీసుకున్నారు. ఇక ప్రాంతీయంగా అందుకున్న అవార్డులు, సన్మానాలకు లెక్కేలేదు. చేపట్టిన వృత్తి ఏదైనా సరే దానిని గౌరవిస్తూ క్రమశిక్షణతో జీవించగలిగితే ఎవరికీ కష్టంగా ఉండదనేది సరోజాదేవి గారి అభిప్రాయం. ఆవిడ గారూ రోజంతా తీరికలేకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. సాయంకాలం 6 గంటలు దాటాక మాత్రం కొంచెం సేపు ధ్యానం చేసుకుంటారు. వృత్తిపరమైన జ్ఞాపకం ఏది మనసులో ఉంచుకోరు. ఇంటికి వచ్చిన ఎవ్వరినీ కలవడానికి ఇష్టపడరు. ఇక బెంగళూరులో ఆవిడగారి స్నేహితుల విషయానికొస్తే జయంతి, కృష్ణకుమారి ఆవిడ గారికి దగ్గరగానే ఉంటారు కనుక అప్పుడప్పుడు వాళ్ళ ఇళ్లళ్లకు వెళ్ళొస్తుంటారు సరోజాదేవి గారూ. సరోజాదేవి గారి ఇన్నేళ్ల సినిమా జీవితంలో ఒక్క కట్టు కథ గానీ, పుకారు గానీ, గాసిప్ గానీ, ఆవిడ గారిపై ఎవరూ అల్లలేదు. నిష్కలంకంగా జరుగుతోంది నా జీవితం. అది నేను చేసుకున్న పుణ్యం అని పలుమార్లు చెప్పుకొచ్చేవారు సరోజాదేవి గారూ.

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button