కోవిడ్-19 మహా విపత్తు ప్రపంచ మానవాళికి కఠినమైన గుణపాఠం నేర్పింది. చైనాలో బయట పడిన కరోనా వైరస్ గంటల్లో ప్రపంచాన్ని కమ్మేసింది. అంటువ్యాధులకు దేశ సరిహద్దులు తెలియవు, వయోపరిమితులను సహితం లెక్క చేయవు. పిల్లలను, మహిళలను సహితం వదిలి పెట్టడం లేదు. ఎనిమిది బిలియన్లకు పైగా ప్రపంచ జనాభా ఇంట్లో కూర్చొని జగజగ వణికి పోయింది. కరోనా వైరస్ అంటువ్యాధి లక్షల ప్రాణాలను బలి తీసుకుంది.
కరోనా విపత్తు నేర్పిన పాఠాన్ని విశ్లేషించిన ఐరాస 27 డిసెంబర్ 2000 రోజున నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అంటువ్యాధుల కట్టడి, ఆరోగ్య సంరక్షణ పద్దతులు, వ్యాధి నిర్థారణ, చికిత్స విధానాలు లాంటి అంశాలను చర్చించడానికి ప్రతి ఏట 27 డిసెంబర్ రోజున ప్రపంచవ్యాప్తంగా “అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్”ను పాటించారని నిర్ణయించింది. గతంలో కలరా, ఎబోలా, మీసిల్స్, మలేరియా, హెచ్ఐవి-ఎయిడ్స్, పోలియో, క్షయ లాంటి వ్యాధులు ప్రపంచ జనాభాను తీవ్రంగా వణికించాయి. అంటువ్యాధులు, మహమ్మారి మహా విపత్తులు నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి, రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని వింటున్నాం.
వ్యక్తి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సమైక్య సహకారంతోనే అంటువ్యాధుల కట్టడి:
అంటువ్యాధులు ఎగిసి పడినపుడు వాటి కట్టడి మార్గాలు, నిర్థారణ పద్దతులు, సమర్థవంతమైన పర్యవేక్షణ, సత్వర వైద్య చికిత్సలు లాంటి అంశాలను అవగాహన పరచడానికి అంతర్జాతీయ అంటువ్యాధుల సణసిద్ధత దినం నిర్వహించడం 2000 తర్వాత ఆనవాయితీగా మారింది. ముసురుకుంటున్న అంటువ్యాధులను కట్టడి చేయడానికి అంతర్జాతీయ సంస్థలు, ప్రజారోగ్య వ్యవస్థలు, పౌర సమాజం, ప్రతి వ్యక్తి సంసిద్ధంగా, సంఘీభావంతో ఉంటూ సమైక్యంగా పోరాడవలసి ఉందని తెలుసుకోవాలి.
అంటువ్యాధులు ప్రబలడంతో దేశాల సామాజిక, ఆర్థిక అభివృద్ధులు దీర్ఘకాలికంగా చితికి పోవడం జరుగుతున్నది. అంతర్జాతీయ స్థాయి నుంచి కుటుంబం వరకు అందరూ అంటువ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలి. అంటువ్యాధుల జననం, విస్తరించడం, తీవ్ర ప్రభావాలను చూపడం బహు ముఖీన కోణంలో అర్థం చేసుకోవాలి. పర్యావరణ విధ్వంసం, జీవవైవిధ్యతకు విఘాతం కలిగించడం, వన్య సాదు జంతువుల సంరక్షణ, వ్యక్తిగత ఆరోగ్యం లాంటివి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటున్నాయి.
విస్తరిస్తున్న జునోటిక్ వ్యాధులు:
మానవులకు సంబంధించిన అంటువ్యాధుల్లో 60 – 75 శాతం వరకు జునోటిక్ (జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులు) వ్యాధులుగా గుర్తించారు. అంటువ్యాధుల వ్యాప్తి మనిషి, పర్యావరణం, జంతువుల మధ్య సంబంధాన్ని రుజువు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్త సహకారం కేంద్రంగా “వన్ హెత్ల్ అప్రోచ్” ద్వారా దేశ సరిహద్దులను దాటి సమైక్యంగా వ్యాధికారక సుక్ష్మజీవులపై యుద్ధం ప్రకటించాల్సి ఉన్నది. మానవాళి శ్రేయస్సే లక్ష్యంగా సురక్షిత నీరు, శక్తి వనరులు, ఆహారం, వాతావరణ మార్పులు లాంటి అంశాల్లో బహుముఖీన స్థాయిలో సానుకూల చర్యలు తీసుకోవాలి. పర్యావరణ వ్యవస్థలను విధ్వంసం చేయడం, అక్రమ వన్యప్రాణుల వ్యాపారాలు, సాదు జంతువుల పెంపకాల్లో అవలక్షణాలు, మానవాళి అనాలోచిత జీవన విధానాలు లాంటివి అంటువ్యాధులు రెచ్చిపోవడానికి కారణం అవుతున్నాయి.
వాతావరణ ప్రతికూల మార్పులు, జీవవైవిధ్య నష్టాలను కట్టడి చేయడానికి సుస్థిర వ్యవసాయ పద్దతులు, వన్యప్రాణులతో సంబంధాలు, సాదు జంతువుల సంరక్షణలు, నేల ఎడారీకరణ సమస్యలు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో ప్రతిబంధకాలు, ఆహార ఉత్పత్తుల వినియోగ అవలక్షణాలు, వ్యాధికారక పరాన్నజీవులు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ముందడుగు వేస్తేనే అంటువ్యాధులపై యుద్ధంలో మనిషి విజేత కాగలడని తెలుసుకొని బుద్దితో బతుకులు కొనసాగిద్దాం.