Telugu News

శ్రామిక వర్గాలకు సహాయం చేసే వేడుకగా “బాక్సింగ్‌ డే” ఉత్సవాలు

క్రిస్టియన్ పౌర సమాజం జరుపుకునే అత్యంత ప్రధాన పండుగైన “క్రిస్టమస్‌” వేడుకల తర్వాత 26 డిసెంబర్‌న నిర్వహించుకునే “బాక్సింగ్‌ దినోత్సవం లేదా బాక్సింగ్‌ డే” పండుగ రోజున సద్భావనలు కలిగిన సంపన్న/సహృదయ క్రిస్టియన్లు ఉదార స్వభావంతో కార్మిక శ్రామిక వర్గాలతో పాటు నిరు పేదలకు సహితం నగదు, ఆహార పదార్థాలు, బట్టలు, పలు బహుమతులను ప్రత్యేక ‘క్రిస్మస్‌ బాక్సు’ల్లో అమర్చి ఉచితంగా వితరణ చేస్తారు. 19వ శతాబ్దపు విక్టోరియా యుగంలో ఇంగ్లాండ్‌లో ప్రారంభమైన “బాక్సింగ్‌ డే” ఆదర్శప్రాయమైన ఆచార సంప్రదాయాలను నేడు విశ్వవ్యాప్త క్రిస్టియన్ సమాజం పాటించడం సంతోషదాయకం. 

దాతృత్వం, దయ, సద్భావనలకు చిరునామా క్రిస్మస్‌ బాక్సుల పంపిణీ:

సద్భావనలు, దయ, కరుణ, మానవత్వ పరిమాళాలలను వెదజల్లే దాతృత్వ వేడుకగా క్రిస్మస్‌ బాక్సుల కానుకలను అవసరార్థులకు పంపిణీలతో పాటు వ్యాపార వాణిజ్య వర్గాలు చేపట్టే డిస్కౌంట్‌ సేల్‌లో తమకు ఇష్టమైన వస్తువులను కొనుక్కోవడం కూడా ఆచారంగా వస్తున్నది. క్రీడాకారులు, క్రీడాభిమానులు కలిసి వనభోజనాలు, గుర్రపు స్వారీ, ఫూట్‌ బాల్‌, క్రికెట్, విలక్షణ దుస్తువులు ధరించి వేటకు వెళ్లడం, తక్కువ ధరలకు వస్తువుల అమ్మకాలు‌ లాంటి పలు కార్యక్రమాలను జనసందోహాల మధ్య నిర్వహించడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. 25 డిసెంబర్‌న నిర్వహించుకున్న “క్రిస్మస్‌ పండుగ”లో మిగిలిన ఆహార పదార్థాలు, కేకులతో పాటు మరి కొన్ని తినుబండారాలను చేసుకొని తినడం, బంధుమిత్రులను కలిసి శుభాకాంక్షలు తెలుపుకోవడం 26 డిసెంబర్‌ రోజున ఘనంగా జరుపుకుంటారు. 

 పరహిత భావనలను పోషించే పేదల పక్షపాతి, మానవతామూర్తి, రుషితుల్యులు, తొలి క్రిస్టియన్‌ అమరజీవి ‘సెయింట్‌ స్టీఫెన్’‌ త్యాగాలకు గుర్తుగా 26 డిసెంబర్‌ రోజును ‘సెయింట్‌ స్టీఫెన్‌ డే’గా కూడా భావించడం జరుగుతున్నది. ప్రతి ఏట బాక్సింగ్‌ డే రోజున క్రికెట్‌ మ్యాచ్‌లను నిర్వహించడం కూడా గమనిస్తున్నాం. పలు దేశాలు ప్రభుత్వం సెలవు దినంగా కూడా ప్రకటిస్తున్న బాక్సింగ్‌ డే రోజున ఏడాది పాటు సేకరించిన చందాలను చర్చిల్లో అర్హులైన పేదలకు అందజేయడం అనే సు‌సాంప్రదాయం కూడా కొనసాగడం హర్షదాయకం. ఆస్ట్రేలియా, ఇండియా క్రికెట్‌ జట్ల మధ్య బాక్సింగ్‌ డే టెస్ట్‌ మ్యాచ్‌ కూడా జరగనుందని మనకు తెలుసు. 

దయ, కరుణ, దాతృత్వం, మానవత్వం వికసింపజేస్తున్న పర్వదినం “బాక్సింగ్‌ డే” సందర్భంగా క్రిస్టియన్‌ సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేద్దాం, పేదలపాలిట పెన్నిధిగా మారుదాం.

Show More
Back to top button