
మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు మొత్తం ఆహారంలో భాగంగా తీసుకునే ప్రోటీన్లు ఇందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అల్పాహారంలో వీటినీ ఉండేలా చూసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు… అవేంటంటే…
బొప్పాయి.. ఇందులో ప్రోటీన్లు, పీచు పుష్కలంగా లభిస్తాయి. ఉదయం అల్పాహారంగా ఈ పండును తీసుకుంటే ప్రొటీన్లు బాగా అందుతాయి. అంతేకాక జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయే చెడు కొవ్వు పదార్థాలను బయటకు పంపి, హెల్తీగా ఉంచుతుంది.
పుచ్చకాయ… ఇందులో తొంభై శాతం నీరే ఉంటుంది. కాబట్టి పొద్దున తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల రోజుకు సరిపడా మినరల్స్, ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. ఆపై తక్షణ శక్తి లభిస్తుంది.
బాదంపప్పు… డ్రైనట్స్ అన్నిటిలో మేలైంది బాదంపప్పు… రాత్రిపూట నీళ్లలో నానబెట్టిన బాదంపప్పును ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. అలాగే ఉదయం పూట ఓ పిడికెడు బాదంపప్పును తీసుకుంటే చాలు.
కూరగాయల రసం.. ప్రతి రోజు ఉదయం కూరగాయల రసం తాగితే కూడా చాలా మంచి జరుగుతుంది. క్యారెట్, బీట్ రూట్, కీరదోస, టమాట, సొరకాయ, బీరకాయ వంటి కూరగాయలను అన్నింటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి, ఆరోగ్యం మెరుగవుతుంది.