ఆర్థరైటీస్ వల్ల లైంగిక జీవనంపై ఎటువంటి ప్రభావం ఉండదు. కాకపోతే ‘మిథోట్రెక్సేట్’ వంటి మందులు వాడుతున్నప్పుడు గర్భం ధరించకూడదు. ఆ మందు ఆపేసిన.. 3 నెలలు తర్వాత మాత్రమే గర్భధారణకు అనువైన సమయం. కీళ్లవాతం వచ్చి తొలిదశలో కీళ్ల మీద పైపొర మాత్రమే దెబ్బతింటుంది. వ్యాధి ముదురుతున్న కొద్దీ కీళ్లను, లోపలి ఎముకలను కొరికేస్తుంది. ఇంకా తీవ్రమైతే కీళ్ల మధ్య ఖాళీ తగ్గిపోతుంది. దీంతో ఎముకల రాపిడి కారణంగా నొప్పి వస్తుంది.
కొన్నాళ్లకు కీళ్లు మొత్తం దెబ్బతింటాయి. గుండె చుట్టూ, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం వంటి ఇబ్బందులూ ఎదురవ్వవచ్చు. లాలాజల గ్రంథులు దెబ్బతింటే నోరు ఎండిపోతుంది. దీంతో పిప్పిపళ్లు వచ్చి, త్వరగా దంతాలు ఊడిపోతాయి. నాడుల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినటం వల్ల కాళ్లలో తిమ్మిరి, స్పర్శ తగ్గిపోవటం వంటివి మొదలవుతాయి. చర్మం మీద పుండ్లు పడటం, నాడులు దెబ్బతిని న్యూరోపతి రావొచ్చు.
* ఆర్థరైటిస్‌ను నివారించే మార్గాలు
నొప్పి నివారిణి మందులు, వ్యాధి నియంత్రణ మందులు, బయోలాజికల్స్ చికిత్స, వ్యాయామం, ఫిజియోథెరఫీ లాంటి వాటితో ఈ వ్యాధి 4-6 నెలల్లో తగ్గించుకోవచ్చు.
*కీళ్ల నొప్పులపై అవగాహన పెంచుకొని వ్యాధిని గుర్తించి వైద్యం వెంటనే ప్రారంభిస్తే దుష్ఫలితాలు అరికట్టవచ్చు.
*నిర్ణీత సమయాల్లో రక్త పరీక్షలు, ఎక్స్‌రే తీయించుకొని, వైద్యుల సలహాతో మందులు వాడాలి.
*శరీర బరువు నియంత్రించుకోవడం
*ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం
*వైద్యుల సలహాతో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
*యోగాసనాలు, వ్యాయామం బాగా పని చేస్తాయని శాస్త్రీయపరంగా నిరూపించబడింది.
*బరువులు ఎత్తడం మాత్రం చేయకూడదు.