
మన శరీరంలో గ్రంథులు హార్మోన్లను స్రవిస్తాయి. అందులో ఒకటైన కార్టికాయిడ్స్ హార్మోన్‌ను అడ్రినల్ అనే గ్రంథి విడుదల చేస్తుంది. ఇందులో గ్లూకోకార్టికాయిడ్స్, ఇతర కార్టికాయిడ్స్ అని రెండు రకాలు ఉంటాయి. వీటిని కృత్రిమంగా కూడా తయారు చేయవచ్చు. వివిధ రకాల చికిత్సల్లో వీటిని వైద్యులు ఉపయోగిస్తున్నారు. శరీరంలో ఉత్పత్తి అయ్యే స్టెరాయిడ్‌లు వివిధ విధులను నిర్వహిస్తాయి. శారీరకంగా కష్టపడి వ్యాయామం చేసినప్పుడు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా తయారువుతుంది.
ఈ షుగర్ లెవల్స్ వెంటనే తగ్గిపోవు. షుగర్ లెవల్స్‌ను స్టెరాయిడ్స్ నియంత్రిస్తాయి. రక్తపోటు స్థాయిలను, పల్స్ రేటును నిర్వహించడంలో కూడా స్టెరాయిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. స్టెరాయిడ్స్ హార్మోన్ ఎదైనా ప్రమాదం లేదా అనారోగ్యానికి గురైనప్పుడు ఏదైనా అవయవం అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోకుండా కాపాడతాయి. అందుకే జిమ్‌కు వెళ్లిన వాళ్లు ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ లేదా టాబ్లెట్ రూపంలో తీసుకుంటారు.
శరీరంలో స్టెరాయిడ్ల విధి
స్టెరాయిడ్స్‌కు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఏవైనా అనారోగ్యాలు ఎదురైనప్పుడు.. అవయవాల వాపుకు కారణమయ్యే రసాయనాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. దీంతో ఆయా అవయవాలు దెబ్బతినకుండా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, మెదడులో వాపు, బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడేవారికి సైతం.. వాపును కంట్రోల్ చేసేందుకు స్టెరాయిడ్స్‌ను వినియోగిస్తారు. రోగనిరోధక వ్యవస్థ శరీర కణాలపై దాడి చేసేందుకు కారణమయ్యే ఆటో- ఇమ్యూన్ వ్యాధులకు చికిత్సగా కూడా స్టెరాయిడ్స్ ఉపయోగిస్తారు. కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో వాపు ఏర్పడుతుంది. అందువల్ల దీన్ని నిరోధించేందుకు స్టెరాయిడ్లను రోగులకు ఇస్తున్నారు.
కృత్రిమ స్టెరాయిడ్స్‌తో ప్రమాదమే
సహజంగా మన శరీరంలో విడుదలయ్యే స్టెరాయిడ్స్ మేలు చేస్తాయి. కృత్రిమంగా తీసుకునే స్టెరాయిడ్‌లు శరీరం, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది మధుమేహానికి కారణమవుతుంది. స్టెరాయిడ్లు రక్తపోటు స్థాయిలను కూడా పెంచుతూ, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అంతే కాకుండా ఇవి మన ఎముకల్లో కాల్షియాన్ని తొలగిస్తాయి. ఫలితంగా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్) బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్లు ఎక్కువగా స్టెరాయిడ్‌లను సిఫార్సు చేయరు.
కొన్ని సందర్భాల్లో బాధితుల ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు మాత్రమే వైద్యులు స్టెరాయిడ్స్‌ను సిఫార్సు చేస్తారు. వీటిని అతిగా వాడితే మధుమేహం, రక్తపోటు వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురవుతాయి. అందువల్ల డాక్టర్ల సూచనలతోనే పరిమితంగానే స్టెరాయిడ్స్ వాడాలి. సొంత నిర్ణయాలతో వీటిని వాడవద్దు. చికిత్స నిమిత్తమే వినియోగించాలి.