శిల్పకళలో కాకతీయులు సుప్రసిద్ధులు. కాకతీయుల పేరు చెబితే గుర్తుకొచ్చేది గొలుసు కట్టు చెరువులు, శైవ దేవాలయాలు అయితే వాళ్లు కట్టిన దేవాలయాలు చాలవరకూ ముస్లిం రాజుల చేతిలో ధ్వంసం చేయబడ్డాయి. రామప్ప, వేయి స్తంభాల దేవాలయాలు కాకతీయ కట్టడాలలో చాలా ఫేమస్. రామప్ప దేవాలయానికి అయితే ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో గుర్తింపు కూడా లభించింది. కానీ చరిత్రలో నిలవాల్సిన ఒక కాకతీయ కట్టడం మాత్రం కనీస ఆదరణ లేక కనుమరుగవుతుంది అదే కోటగుళ్ళు. ఈ ఆలయ శిల్పకళ రామప్ప ఆలయాన్ని పోలి ఉంటుంది. రామప్ప, వేయి స్తంభాల ఆలయాలను ఒకేసారి చూసినట్టు అనుభూతి కలుగుతుంది.
కాకతీయుల పూర్వ వైభవానికి చిహ్నాలుగా వరంగల్ పరిధిలో ఎన్నో కట్టడాలు, ప్రాకారాలు, పురాలు, తటాకాలు ఇంకా మన కళ్ల ఎదుట ఉన్నాయి. నాటి మహోత్సవాలమైన సామ్రాజ్యంలో మనం లేనప్పటికీ ఆనాటి అపరూప పరిపాలనకు ఆనవాళ్లుగా వరంగల్ పరిధిలో అనేక ప్రాచీన కట్టడాలు సజీవంగా నిలిచి ఉన్నాయి. ఎన్నో దండయాత్రలు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని అవి మనల్ని ఆశ్చర్యాన్ని గొల్పుతున్నాయి. అటువంటి వాటిలో ఘనపురం కోటగుళ్ళు ఒకటి.
ఇవి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం ములుగు జిల్లాలోని పరకాల, మహదేవపూర్ జాతీయ రహదారి వెంబటి ఉంది. పరకాల నుండి 20 కిలోమీటర్ల ప్రయాణించిన తర్వాత గాంధీనగర్ వస్తుంది. ఇక్కనుండి సుమారు తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణిస్తే కోట గుళ్ళు చేరుకోవచ్చు. వరంగల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ములుగుకు దగ్గర్లో గణపురంలోని కాకతీయ చక్రవర్తుల అపూర్వ శిల్పకళా వైభవశాల ఈ ఘనపేశ్వరాలయ సముదాయం. అదే కోట గుళ్ళు. అబ్బురపరిచే శిల్ప సౌందర్యంతో శతాబ్దాలుగా అలరిస్తోంది ఈ ఆలయ సముదాయం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట శిల్ప సంపదకు ఈ కోట గుళ్ళు ఏమాత్రం తీసిపోదు.
దక్షిణ భారతదేశంలోని ఓరుగల్లును రాజధానిగా చేసుకుని ఘనంగా పాలించిన కాకతీయ చక్రవర్తిలో అగ్ర ఘన్యుడైన గణపతి దేవ చక్రవర్తి పేరున క్రీస్తు శకం 1234లో ఘనపురం, గణపేశ్వరాలయం, ఘనప సముద్రం నిర్మితమయ్యాయి. ఆ కాలంలో ఒక నగరం ఉందంటే నగరం, నగరం చివరన ఒక చెరువు, నగరంలో ఓ దేవాలయం నిర్మింప చేసేవారు. ఘనప సముద్రం అంటే చెరువు. గనుపేశ్వరాలయం అంటే కోటగుళ్లు. ఘనపురం అంటే నగరం. ఆ చెరువు ఘనపురం ఎంట్రన్స్ లో ఉంటుంది.
రామప్ప దేవాలయాన్ని నిర్మించిన కాకతీయ సర్వ సైన్య అధ్యక్షుడు రేచర్ల రుద్రారెడ్డి మూడవ కుమారుడు ఘనపురం సామంతుడు గణపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు జరిగాయి. గణపేశ్వరాలయంతో పాటు చుట్టూ 21 ఆలయాలు చాలా గొప్పగా నిర్మింపచేశారు. ఓరుగల్లుపై దాడి చేసిన దేవగిరి మహారాజును 15 రోజులు యుద్ధం చేసి ఓడించినందుకు గుర్తుగా కాకతీయ అష్టమ చక్రవర్తి రాణి రుద్రమదేవి మక్తగజ కుంభస్థలంపై లంకించే సింహం, దాన్ని నిర్మిస్తున్నట్లుగా గజకేసరి శిల్పాన్ని తన యుద్ద విజయ చిహ్నాలుగా ప్రతిష్టింప చేసింది. మక్తగజం అంటే ఏనుగు. అంటే ఏనుగులాంటి మహాదేవులను సింహం లాంటి తాను అంటే రుద్రమదేవి అణచివేసినట్లుగా ఉన్న విగ్రహాలు.
రామప్ప దేవాలయంలో మాదిరిగానే ఇక్కడ కూడా సాలభంజికలు గజకేశవ విగ్రహాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఈ విగ్రహాలు చక్కబడి ఉంటాయి. ఇక్కడ శివారాధన అద్భుతంగా జరుగుతుంది. ప్రతిరోజు వివిధ రకాల పుష్పాలతో అద్భుతంగా తీర్చిదిద్ది పూజ కార్యక్రమాలను అర్చకులు నిర్వహిస్తారు.
గణపేశ్వరాలయ ప్రాంగణంలో శత్రు రాజులతో జరిగే యుద్ధ సమయాల్లో రుద్రమదేవి ప్రతాపరుద్ర చక్రవర్తులకు సహాయంగా యుథ్థంలో పాల్గొని విజయం చేకూర్చడానికి రెండువేల అశ్విక సైన్యం పోషించబడేది. ఆలయానికి దక్షిణంగా ఉన్న 60 స్తంభాల ఆలయాన్ని రంగం మండపంగా పిలిచేవారు. ప్రతిరోజు ఆలయం మండపంలో ఒక నర్తకి 16 మంది వాయిద్య కారులతో మాట ప్రదర్శనలు సంకీర్తనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే వారని చరిత్ర చెబుతోంది. ఆలయంలోబలా పైకప్పుకు పద్మాల గుర్తులు అందంగా చెక్కబడి ఉంటాయి.
ఇక్కడ ప్రధాన ఆలయానికి పక్కనే మరొక శివాలయం ఉంటుంది ఇదే తాటేశ్వరాలయం అని చెబుతారు. ఇది శిధిలావస్థలో ఉంది.
ప్రధాన ఆలయానికి దక్షిణ దిక్కుగా దాదాపు 60 స్తంభాలు గల మండపం నిర్మించబడింది. దీనిని స్తంభాల గుడి అని పిలుస్తారు. ఇది వేయి స్తంభాల గుడిని పోలి ఉంటుంది. బొంగు సున్నం, కరక్కాయ మిశ్రమంతో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ కిన్నెర, కిం పురుష, మందాకిని శిల్పాలు ఆలయ గోడలపై జంతు శిల్పాలు, రాతి స్తంభాలు చతురస్రం, దీర్ఘ చతురస్ర, వృత్తాకార శిల్పాలు ఉన్నాయి. కాకతీయులు ఈ కట్టడానికి వాడిన కొన్ని పనిముట్లను ఆలయం పై చెక్కారు. వీటి ద్వారా కాకతీయుల టెక్నాలజీ మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆ కట్టడాలన్ని శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. క్రీస్తు శకం 1323లో ప్రతాపరుద్రుడు మరణించిన తర్వాత ఈ కోటగుళ్ల సముదాయంపై అనేక దాడులు జరిగాయి.
క్రీస్తు శకం 15వ శతాబ్దం చివరలోనూ 16వ శతాబ్దం ప్రారంభ కాలంలో కూలి కూతుబ్, ఉల్ ముల్క దాడులలో దారుణంగా ధ్వంసం అయింది. 14వ శతాబ్దం నుండి 16 వ శతాబ్దం మధ్యకాలంలో ఢిల్లీ మహమ్మదీయుల సైన్యం కాకతీయుల రాజ్యంపై చేసిన దాడిలో కాకతీయుల సంపదను కొల్లగొట్టి గణపేశ్వరాలయాన్ని నాశనం చేసి ఘనప సముద్రానికి గండి కొట్టి కాకతీయుల సామ్రాజ్యానికి కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఆ సమయంలో మహమ్మదీయుల సైన్యం కంటపడకుండా కొన్ని విగ్రహాలను మట్టిలో పూడ్చిపెట్టారు. అవి కొన్ని తవ్వకాలలో ఇప్పుడు బయట పడుతున్నాయి. శిధిలమైన నంది, నర్తకి, సంగీత విద్వాంశకులు, ఆలయ పై కప్పులు, చెక్కబడిన గోడలు బేసి రిలీఫ్లు, ఇతర శిల్పాల అవశేషాలు సందర్షకుల కోసం ప్రదర్శనలు ఉంచబడ్డాయి. ఇటీవల కాలంలో 2011లో పురావస్థ పరిశోధకులు అక్కడ పరిపూర్ణ కొన్ని దేవాలయాలను పునర్నిర్మించారు. చరిత్ర గొప్పగా ఉన్న ఈ ఆలయం కనీస ఆదరణకు నోచుకోకపోవడం బాధాకరం.
ప్రకృతి బీభత్సాలకు, శత్రువుల దాడులకు అనేక విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. ఆలయాలు చాలవరకూ శిథిలమైన తర్వాత కూడా ఈ గుళ్ళు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి అంటే అవి సరిగా ఉంటే నాటి వైభవాన్ని ఊహించుకోవచ్చు. ఇంత అపురూప కళాఖండాలను రక్షించుకుని ఆలయాలను పునర్నిర్మిస్తే ఎంతటి అద్భుత కళా సంపద మనది అవుతుందో కదా.
కోటగుళ్ళకి ఆ పేరు రావడానికి కారణం బహుశా చుట్టూ ఉన్న కోట గోడ లాంటి రాతితో నిర్మించిన ప్రహరీ కావచ్చు. మీరు రామప్ప దేవాలయం దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఈ కోటగులను కూడా దర్శించుకోండి. రామప్ప దేవాలయం నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలోనే ఈ కోటగుళ్ళు ఉన్నాయి. ఈ ఆలయానికి రామప్ప దేవాలయానికి లభించిన దాంట్లో కొంతైనా ఆదరణ లభించాలని కోరుకుందాం.