భారతదేశం ధర్మానికి, త్యాగానికి ప్రతీక. అనేక మంది భారతీయ బిడ్డలు తమ రాజ్యంకోసం, ప్రజల ఆకాంక్ష కోసం, బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాడి గెలిచినా వారే. మాహా వీరులే కాకుండా, మహిళలు సైతం వీరనారిలా విజృంభించి ప్రాణ త్యాగాలు చేసి చరిత్ర పుటల్లో నిలిచారు. సాధారణంగా వీరనారి అనగానే మనందరికీ జాన్సీ లక్ష్మీ భాయి, రుద్రమదేవి, సమ్మక్క – సారక్కలు గుర్తొస్తారు. కానీ మన దేశ చరిత్ర చూసుకుంటే.. తమ రాజ్యాల కోసం వీరోచిత పోరాటాలు చేసిన రాణులు చాలామంది ఉన్నారు. అందులో ఒకరు మహారాణి అహిల్యా భాయి హోల్కర్. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అహిల్యాబాయి రాణిలా ఎలా మారింది.. పతనం అవుతున్న మరాఠాలు పరిపాలించిన మాల్వా రాజ్యాన్ని ఎలా కాపాడుకుందో ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.
అహిల్యా భాయి మాల్వా సామ్రాజ్యంలోని అహ్మద్ నగర్ లోని చోండి అనే గ్రామంలో జన్మించింది. తన తండ్రి మంకోజిరావు షిండే ఆ గ్రామానికి పెద్ద. ఆడపిల్లల విద్యను వ్యతిరేకించే ఆ రోజుల్లో అహిల్యా భాయికి తన తండ్రి ఇంటివద్దే చదవటం, రాయడం నేర్పించారు. ఒకరోజు అహిల్యా భాయికి 8 ఏళ్ళ వయసున్నప్పుడు ఆలయంలోపేద వారికీ అన్నం పెడుతుంటే మాల్వా రాజ్యానికి రాజైన మల్హర్ రావు ఆమెను చూశాడు. అహిల్యా భాయ్ సేవాగుణం చూసి తన కొడుకు ఖండేరావు హోల్కర్ కు అహిల్యా భాయితో వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు.
అనుకున్నదే తడవుగా వివాహ ప్రస్తావనను ముందుకు జరిగిలే కార్యాచరణ మొదలు పెట్టాడు. అలా 1733లో 8 ఏళ్ళ వయసులోనే అహిల్యా భాయికి వివాహం జరిగింది. కానీ 1754లో జరిగిన ఓ యుద్ధంలో అహిల్యా భాయి భర్త ఖండేరావు మరణించారు. అప్పుడు అహిల్యా భాయికి 29 ఏళ్ళు. అప్పటి ఆచారాల ప్రకారం అహిల్యా భాయి సతి సహగమనానికి సిద్ధం అయింది. కానీ ఆమె మామ మల్హర్ రావు ఆమెను అడ్డుకోవడంతో అహిల్యా భాయి సతీ సహగమనం చేయలేదు.
ఆ తరువాత 1766లో మల్హర్ రాజు మృతితో మాల్వా రాజ్య పతనం మొదలైంది. అప్పుడు అహిల్యా భాయి రాజమాతగా తన కుమారుడు మాలేరావు హోల్కర్ రాజుగా నియమితులయ్యారు. కానీ 1767 ఏప్రిల్ 5న మాలే రావు హోల్కర్ కూడా అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు మాల్వా రాజ్యానికి రాజు అయ్యే అర్హత ఉన్న ఎవరు లేరు. కుటుంబంలో అందరిని కోల్పోయిన ఓ మహిళ, ఏమి చేయలేదు అని అందరూ అనుకుంటున్నారు. కానీ, అహిల్యా భాయి అంత బాధలో కూడా రాజ్యం గురించి ప్రజల గురించి ఆలోచించింది రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకోవాలని నిర్ణయించుకుంది.
1767 డిసెంబర్ 11న రాణిగా బాధ్యతలు తీసుకుంది. ఆ రాజ్యంలో కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ మంత్రులు, సైన్యం తనకు అండగా నిలిచారు. రాణి రాజ్యపు సింహాసనాన్ని అధిష్టించిన ఒక సంవత్సరంలోపే అహిల్యా భాయి తానేంటో నిరూపించుకుంది. తన రాజ్యాన్ని రక్షించుకోడానికి కత్తులు, ఆయుధాలతో తన సైన్యంతో కలిసి యుద్ధ రంగంలోకి దూసుకువెళ్లింది. ఆమె తన ఏనుగులపై ఉన్న అంబారీ 4 మూలలకు 4 బాణాలకు అమర్చుకొని తన శత్రువులతో వీరోచితంగా పోరాడింది. సైనిక వ్యవహారాలలో ఆమెకు నమ్మకస్తుడైన సుభేదార్ తుగొజి రావు హోల్కర్ ని ఆమె మిలట్రీ అధిపతిగా నియమించింది. ఈయన అహిల్యా మామగారైన మల్హర్ రావుకు దత్త పుత్రుడు.
అప్పటి వరకు ఒక చిన్న గ్రామంగా ఉన్న ఇండోర్.. అహిల్యా భాయి 30 ఏళ్ళ పాలనలో అన్నివిధాలా అభివృద్ధి చెందింది. తన హయాంలో పెద్ద సంఖ్యలో కోటలు, దేవాలయాలు నిర్మించి కీర్తి ఘడించింది. పరమ శివుని భక్తురాలైన ఆమె.. పరిపాలనా సమయంలో అహల్యా బాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. మధ్యభారత మాళ్వా ప్రాంతాంలోనే కాక భారతదేశమంతటా శివాలయాలు నిర్మించారు. మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునరుద్ధరించారు.
కాశీ, ద్వారక, మథుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్, ఘృష్ణేశ్వర్ ఇలా అనేక పుణ్యక్షేత్రాలలోని అలయాలను పునరుద్ధరించి ధర్మ స్థాపన చేశారు. ఆ విధంగా హిందూ ధర్మ పునరుత్తేజానికి కృషి చేసింది. మహేశ్వర్ నేత కార్మికులను ప్రొత్సహించి మహేశ్వరం చీరలు అను కొత్త నేతను అందుబాటులోనికి తెచ్చింది. ప్రజలు ఈ చీరల పట్ల అత్యంత మక్కువ చూపేవారు. ఈనాటికీ మహేశ్వరం చీరలు మహారాష్ట్రలోనే కాక భారతదేశమంతటా ప్రసిద్ధి చెందాయనడంలో అతిశయోక్తి లేదు.
మాళ్వ రాజధాని మహేశ్వరం సాహిత్య సంగీత కళాత్మక పారిశ్రామిక సంస్థలకు వేదికగా మారింది. ఆమె మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ మరాఠా కవి మోరోపంత్ సాహిర్ అనంత పండిత్ సంస్కృత పండితుడు కుశాలి రావు కు తన ఆస్థానంలో పెద్ద పీట వేసింది. అహిల్యాబాయి మహేశ్వరంలో పెద్ద వస్త్ర పరిశ్రమను స్థాపించింది. సంతానం లేని వితంతువుల ఆస్తులు జప్తు చేయాలనే విధానాన్ని కూడా అహిల్యా భాయ్ రద్దు చేసింది. 1780లో అహిల్యా భాయి కుమార్తె ముక్తా భాయి తన భర్త చనిపోయాడని తాను కూడా సతీ సహగమనం ప్రకారం చితిలో దూకి అగ్నిప్రవేశం చేసింది. దాంతో అహిల్యా భాయి కూతురు మరణించిందన్న మానసిక బాధతో ఆరోగ్యం బాగా క్షీణించింది. చివరికి 1795 ఆగస్టు 13న 70 ఏళ్ళ వయసులో అహిల్యా భాయి మరణించింది. అహిల్యా భాయి పాలన మరాఠా సామ్రాజ్య చరిత్రలోసువర్ణ యుగంగా గుర్తుంది పోతుంది.