HISTORY CULTURE AND LITERATURE

ప్రకృతి ఒడిలో సలేశ్వరుడు.. దర్శనం ఓ మధురమైన అనుభూతి

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సలేశ్వర మల్లికార్జున క్షేత్రం ఉంది. పేరుకు తగ్గట్టుగానే భారీ పర్వతాల నడుమ ఈ మహేశ్వర సన్నిధి విరాజిల్లుతోంది. భక్తులు ఎంతో ప్రయాస పడి ఈ సలేశ్వరాన్ని దర్శించుకుంటారు.  ఇక్కడికి చేరుకోగానే తమ ప్రయాణ బడలికను పూర్తిగా మరచిపోయి అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులు అవుతారు. శివానుగ్రహానికి పాత్రులు అవుతారు. ఎవరివల్ల ప్రకృతిలోని కొండలు గుట్టలు తరులు గిరులు ఝరులు నదీనదాలు లోయలు వాగులు వంకలు ఇలా ప్రాకృతిక హంగులన్నీ ఏర్పడ్డాయో అతడినే మహాదేవుడు అంటారు.

సమస్తాన్ని సృష్టించేవాడు సమస్త, సర్వదా ఉండే ఈశ్వరుడే భవుడు, ముజ్జగాలకు భవుడే  సర్వమని అధర్వణ వేదం చెప్పింది. అలంటి ప్రకృతి స్వరూపమైన సర్వేశ్వరుడు, ప్రకృతితో మమేకమై ప్రకృతిలో ప్రకృతిగా ఆకృతి దాలుస్తాడు. అందులో ఈశ్వరుని సన్నిధానాలన్నీ కొండకోనల్లో, పర్వతాలల్లో, శిఖరాగ్రాలపై, నదీనదాల చెంతపై కీకారణ్యంలో స్వయం వ్యక్తమై కొలువుదీరి ఉంటాయి.   ఆ కోవాలోనిదే ప్రాకృతిక సౌందర్య నిలయం, విలక్షణ ఈశ్వర ధామం సలేశ్వర తీర్థం. నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన ఈ క్షేత్రం శివనామ స్మరణతో పులకించిపోతుంది. 

చుట్టూ కొండలు గుట్టలతో కూడిన దట్టమైన అరణ్యం, ఈ అరణ్యం మధ్యలో మెలికలు తిరుగుతూ ఒంపులతో హొయలు పోయే రహదారి, ఈ రహదారి గుండా భక్తులు శివయ్యను దర్శించుకుంటారు. ఇలాంటి అరణ్యాలగుండా ప్రయాణించడం  ఓ మరపురాని, మధురమైన అనుభూతి. హైదరాబాద్ నుంచే కాక రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి రోడ్డు మార్గం ద్వారా సలేశ్వరాన్ని చేరుకోవచ్చు. సలేశ్వరం నుంచి శ్రీ శైలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రధాన రహదారి నుంచి 16కిలోమీటర్ల లోపలి వెళ్తే సలేశ్వర దేవాలయానికి చేరుకోవచ్చు. అయితే ఈ 10 కిలోమీటర్లలో 13 కిలోమీటర్లలో మాత్రమే వాహనాలు వెళ్తాయి.

మిగితా మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిందే. దట్టమైన అరణ్యం, కొండలు జలపాతాలు, వాగులు, లోయలు నిండిన ఈ ప్రదేశం గుండా నడుస్తూ ముందుకు సాగుతూ ఉంటె అదొక అనిర్వచనీయమైన అనుభూతి కులుగుతుంది. పరమేశ్వరుని భక్తులు తప్పకుండ దర్శించవలసిన క్షేత్రం ఇది. మల్లికార్జున స్వామి పేరుతో ఇక్కడ సర్వేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. రెండు కొండల నడుమ ఉన్న వాగు అంచుమీదినుంచి ఇరుకైన మార్గం ద్వారా అడుగులో అడుగు వేసుకుంటూ అతి జాగ్రత్తగా ఆలయ సమీపానికి చేరుకుంటారు. 

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జలపాతం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తుంది.  కైలాసం లోని పరమేశ్వరుని జటాజూటం నుంచి గంగమ్మ అమాంతం దుముకుతున్నట్టుగా ఈ జలపాతం కనిపిస్తోంది. స్వచ్ఛ స్పటిక ధారల్లా క్షీరదారాల్లా జలపాతం జాలువారుతుంది. సమశీతలంగా ఉండే ఈ జలపాతం కింద భక్తులు ఆనంద పారవశ్యంతో స్నానాలు చేస్తారు. జలపాతం కింద స్నానం చేయడం వల్ల సకల అనారోగ్యాలు తొలుగుతాయి. అరణ్యంలో సుదూర ప్రాంతం నుంచి ప్రవహిస్తూ సారవంతమైన భూమిలోని ఖనిజ లవనాలని ఔషధులిని, వృక్షాల వేళ్ళు, ఆకుల రసాలను, ఆకుల సారాలను ఈ వాహిని నింపుకుంటుంది.

కొండా ప్రాంతానికి చేరుకొని తుళ్ళిపడే జలపాతంగా రూపుదాలుస్తుంది. ఈ జలాల కింద స్నానములు చేస్తే.. దీర్ఘ రోగాలన్నీ మాయం అవుతాయి. అంతులేని మానసిక, శారీరక రోగాలన్నీ తగ్గిపోయాయి. మల్లికార్జున స్వామివారికి అత్యంత సమీపంలో ఎగిసిపడుతున్న ఈ జలపాతం సాక్షాత్తు ఈశ్వర స్వరూపం. శివుడు అష్టమూర్తి స్వరూపుడు కాబట్టి సూర్యరూపంలో ఆరోగ్యాన్ని, పర్జన్య రూపంలో జలాన్ని, ఇంద్ర రూపంలో ఆహారాన్ని, దక్షిణామూర్తి రూపంలో సకల విద్యలను, ఈశ్వర రూపంలో ఐశ్వర్యాన్ని మహాదేవుడు అనుగ్రహిస్తాడు. వీటన్నింటికి ప్రతీకలుగా మల్లిఖార్జునుడు ఇక్కడ బాసిల్లుతున్నాడు.  

సలేశ్వర క్షేత్ర దర్శనం భక్తులకు మరువలేని మనోల్లాసాన్ని మధురానుభూతిని అందిస్తుంది. జలపాతం చెంత ఉన్న ఓ గుడిలో మల్లిఖార్జునుడు నాగాభరణం సహితంగా కొలువుదీరి ఉంటాడు. నల్లమల గిరిజన తెగయైన చెంచులు ఇక్కడ పూజారుగాలు వ్యవహరిస్తున్నారు. భక్తుల లింగమూర్తికి స్వయంగా అభిషేకాల్ని, పూజల్ని చేస్తారు. పవిత్ర స్నానాలు ముగిశాక భక్తులు గర్భాలయానికి చేరుకుంటారు. ఈ గర్భాలయానికి ఎలాంటి ముఖ మండపం ఉండదు. ఓ గుహలాంటి గుడిలో మల్లిఖార్జునుడు తేజోలింగ స్వరూపుడుగా కొలువుదీరి ఉంటాడు. అతంత సహజవంతమైన వాతావరణంలో ఎలాంటి హంగులు అర్హతలు లేకుండా మల్లిఖార్జునుడు భాసిల్లుతుంటాడు. శివలింగానికి రజతంతో తయారు చేసిన పంచఫణి అలంకారంగా ఉంటుంది. భక్తులు స్వయంగా లింగమూర్తి అభిషేకాలు, అర్చనలు,పూజలు జరుపుకుంటారు. 

మరో విశేషం ఏమిటంటే.. నల్లమల ప్రాంతంలో అధికంగా ఉండే గిరిజన తెగ అయిన చెంచులు ఈ ఆలయ నిర్వహణ చేపడుతారు. ఈ ఆలయంలో పూజలు అభిషేకాలు చెంచుల పర్యవేక్షణలో కొనసాగుతాయి. భవ్యమైన భవుణ్ణి నమో భవాయచ రుద్రాయచ అంటూ రుద్రం అభివర్ణించింది. భవం అనగా జన్మ.. జనన మణనాధులు ఆధ్యంతాలు లేని భవుణ్ణి కొలిచే భక్తులకు పునర్జన్మ ఉండదని విశ్వాసం. భక్త సులభుడైన అనుగ్రహం పొందాలంటే కావాల్సిందిఅనన్యమైన భక్తి ఒక్కటే. ఏ వేదం చదవని సాలె పురుగుకు, ఏ శాస్త్రం అధ్యయనం చేయని పాముకు, ఏ విద్యను నేర్వని ఏనుగుకు కిరాతుడై అడవిలో సంచరించే బోయవానికి ఇలా ఎందరో భక్తులకు ఈశ్వరుడు ముక్తిని అనుగ్రహించాడు. ఆ నేపధ్యంలోనే ఇలాంటి వేద వేదంగాలు, మంత్రాలు, అర్చనా సంప్రదాయాలు ఆగమాలు, ఆడంబరాలతో ప్రమేయం లేని అతిసామాన్యులైన గిరిజనులైన చంచులు సలేశ్వర మల్లికార్జునుడి పూజారులుగా వ్యవహరిస్తున్నారు. 

కేవలం దీపాల కాంతులతో మల్లికార్జునుడు వింత వెలుగుల నేపథ్యంగా వినూత్నంగా ఈ దేవాలయంలో గోచరిస్తాడు. ఇనుప చట్రాలతో నిర్మించిన ఓ మంటపంతో లింగమూర్తి పానపట్టంలో ఉంటాడు. నల్లమల అరణ్యం మధ్యలో ఉన్న ఈ స్వామికి చెంచులు ప్రకృతి సహజంగా లభించే పదార్థాలను నివేదనగా సమర్పిస్తారు. అలనాటి భక్త కన్నప్ప వంటి భక్తుల నిష్కామ భక్తిని ఈ మల్లిఖార్జునుడు మరోసారి గుర్తుచేస్తున్నాడు. సలేశ్వర క్షేత్రం సార్ధక నామధేయంగా ప్రస్ఫుటమౌతుంది. శైలాలు అనగా పర్వతాలు, కొండలు అని అర్ధం స్ఫురిస్తుంది.

ఈ కొండల మధ్య ఈశ్వరుడు కొలువై ఉన్నాడు కావున ఈ క్షేత్రం శైలేశ్వరం గా ప్రసిద్ధి చెందింది. రానురాను కాలాంతరంలో సలేశ్వరంగా పిలువబడుతుంది. ఆకాశాన్ని తాకే కొండలు, వాటిపై చుక్కల్ని చుంభించే వృక్షాలతో ఈ ప్రదేశం రమనీయంగా ఆహ్లాద భరితంగా ఉంటుంది. శివభక్తితో భారీ కొండలు వెన్నెముద్దల్లా కరిగి స్వామి ముందు సాగిలపడుతున్నాయా అని అనిపిస్తుంది. విచిత్రకృతుల్లో విభిన్నంగా ఏ అదృశ్య శిల్పో చెక్కినట్లుగా చక్కగా తీర్చిద్దిద్దినట్లుగా కొండలు బారులు తీరి ఉంటాయి.

సలేశ్వర మల్లికార్జున స్వామి సన్నిధికి సమీపంలో ఓ పురాతన గుడి ఉంది. వీరభద్రస్వామి గంగమ్మ తల్లి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడకు సమీపంలోనే సహజసిద్ధంగా ఏర్పడిన పుట్ట ఉంది. దీనిని సుబ్రహ్మణ్య సన్నిధిగా భక్తులు భావిస్తారు. పుట్టకు పాలుపోసి పుట్టకు రక్షా బంధనాలు కడుతారు. ఇలా దారాలతో రక్షా బంధనాలు కట్టడం వలన స్వామి తమని సదా రక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సలేశ్వరంలో ఉవ్వెత్తున ఎగిసిపడే ఓ జలపాతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడకు విచ్చేసిన జనబాహుళ్యన్ని భట్టి ఈ జలపాత ప్రవాహం ఉంటుంది. భక్తుల తక్కువ సంఖ్యలో ఉంటె తక్కువ ప్రవాహం తోను..భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉంటె జోరుగా హోరెత్తుతూ ఎక్కవ ప్రవాహంతో ఈ జలపాతం  కనువిందు చేస్తోంది. 

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి చైత్ర బహుళ విదియ వరకు ఐదు రోజుల పాటు సలేశ్వరం  మల్లిఖార్జున స్వామివారికి వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వార్షిక ఉత్సవాల సందర్భంలో మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, హైదరాబద్ జిల్లా ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి పునీతులవుతారు. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే లింగమయ్యపై వెన్నెల కాంతి విరజిమ్ముతుంది అంటారు. ఆ దృశ్యాన్ని చూడటానికి భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తారు. నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఉన్న సలేశ్వర సన్నిధికి సమీపంలోనే వవ్యప్రాణులు సంచరిస్తూ భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ క్షేత్ర సందర్శనం భక్తులకు ఎంతో మధురమైన అనుభూతిని అందిస్తుంది. శివ సందర్శన భాగ్యంతో పాటు ప్రకృతి ఒడిలో ఆదమరిచి హాయిగా సేదతీరిన అనుభవం భక్తులకు స్వంతం అవుతుంది.

Show More
Back to top button