HISTORY CULTURE AND LITERATURE

‘అహాన్ని జయించిన బలశాలి బాహుబలి’

దిగంబరుడిగా పూజలందుకునే గోమటేశ్వరుడు ● ఆడంబరం నుంచి దిగంబరానికి దారి చూపే బాహుబలి

● జైనుల ఆరాధ్య దైవం ●ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా విగ్రహం

బాహుబలి అనగానే అందరికీ గుర్తొచ్చేది సినీ నటుడు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా. బాహుబలి అంటే ఆ పేరు వినగానే అందరికీ సినిమా మాత్రమే గుర్తొస్తుంది కానీ.. బాహుబలి అనేది ఒక వ్యక్తి పేరు అని చాలామందికి తెలియదు. జైనమతస్తుల్లో ప్రాముఖ్యం కలిగిన వాడు, జైనుల ఆరాధ్యుడు, ధర్మాన్ని ఆచరించే మహాయోగి ఆయన. ఆడంబరం నుంచి దిగంబరానికి దారి చూపే బాహుబలి ఆయన. ఆహాన్ని జయించిన బలశాలి బాహుబలి ఆయనే గోమటేశ్వరుడు.

అద్భుతమైన ఏకశిలా విగ్రహం గోమాటేశ్వరుడు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏకశిలా విగ్రహం అది. గోమటేశ్వరుడిని బాహుబలిగా అభివర్ణిస్తారు. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాలోని శ్రావణ బెళగొళలో కొలువు తీరాడు ఈ బాహుబలి. ఓ పెద్ద కొండపై చెక్కిన ఈ శిలా రూపం 30 కిలోమీటర్ల మేర దర్శనమిస్తుంది. గోమటేశ్వరుడిని విగ్రహం వద్దకు చేరుకోవాలంటే మూడు  వేల అడుగుల ఎత్తుకు వెళ్లాలి. 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒకే కొండ ను చెక్కి 614 మెట్లు తయారు చేశారు. ఆ మెట్లన్నీ ఎక్కితే 57 అడుగుల ఎత్తులో ఉన్న బాహుబలి మనకు దర్శనమిస్తారు.

ఎవరు ఈ బాహుబలి.. ?

అసలు ఎవరు ఈ బాహుబలి అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. చాలామందికి బాహుబలి అని ఒక వ్యక్తి విగ్రహ రూపంలో ఉన్నారని చాలా మందికి తెలియదు. అదేంటో తెలియాలి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఈ పురాణ కథను తెలుసుకోవాల్సిందే. పురాణం ప్రకారం జైనుల మొదటి తీర్థంకరుడు గా చెప్పుకునే వృషభనాధుడి కుమారుడే ఈ బాహుబలి. వృషభనాధుడికి వందమంది సంతానం. బాహుబలి కి భరతుడు అనే ఒక అన్నయ్యతో పాటు 98 మంది తమ్ముళ్ళు ఉన్నారు. ఒకానొకనాడు వృషభ నాధుడు యోగిగా మారాలనుకున్నాడు.  రాజ్యాన్ని తన వందమంది సంతానానికి పంచి ఇచ్చాడు. పెద్ద కుమారుడు భరతుడిని అయోధ్యకు రాజుని చేశాడు. బాహుబలిని అస్మక రాజ్యానికి పాలకుడిని చేశాడు.

మిగతా సంతానానికి తమ రాజ్యంలోని పలు ప్రాంతాలను ఇచ్చేసి తాను యోగిగా మారాడు. అయితే  భరతుడికి పౌరుషం, అత్యాశ, అహంకారం ఎక్కువగా ఉండేవి. రాజ్య కాంక్ష కూడా ఎక్కువే. తాను పాలిస్తున్న అయోధ్య భరతుడికి చాలా చిన్న రాజ్యాంగా కనిపించింది. ఇంత చిన్న రాజ్యానికి రాజు కావడం ఏంటని, మహారాజ్య విస్తరణ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో చుట్టుపక్కల రాజ్యాలకు దండయాత్ర ప్రకటించాడు. అనేక రాజ్యాలను జయించాడు. అంతటితో కోరిక తీరని భరతుడు.. తన సోదరుల రాజ్యాలను కూడా జయించి తీరాలని భావించాడు. అయితే తన అన్న భరతుడి దురాశ, రాజ్యా ఆకాంక్ష, పౌరుషం తెలిసిన భరతుని తమ్ముళ్లంతా స్వచ్ఛందంగానే రాజ్యాలను తమ అన్న భరతుడికి అప్పగించి వారంతా సన్యాసం తీసుకున్నారు. కానీ ఒక బాహుబలి మాత్రం రాజ్యాన్ని వదులుకోలేనన్నాడు. 

భరతునికి, బాహుబలి కి మధ్య యుద్ధం…

రాజ్య ఆకాంక్ష ఉన్న భరతుడు.. తన తమ్ముడు బాహుబలి రాజ్యాన్ని దక్కించుకోవాలని అస్మకరాజ్యంపై యుద్ధం ప్రకటించాడు. రెండు రాజ్యాల మధ్య యుద్ధానికి రంగం సిద్ధమైంది. అయితే.. యుద్ధం అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు, ఎన్నో కుటుంబాలు వీధిన పడతాయి, ప్రజలు దిక్కులేని వాళ్ళు అవుతారు ఇల్లాల్లు విధవరాల్లు అవుతారు, రక్తం ఏరులై పారుతుంది, పిల్లాపాప అనాధలవుతారు, ప్రాణా నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని భావించిన భరతుడు, బాహుబలి మూడంచల యుద్ధానికి ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో మొదటిది ఒకరి కళ్ళల్లోకి ఒకరు రెప్పవేయకుండా చూడడం. రెండవది జల యుద్ధం, మూడవది మల్ల యుద్ధం.

రెండు యుద్ధాల్లో బాహుబలి విజయం సాధించాడు. మూడవ యుద్దంలో కూడా విజయం సాధించే బాహుబలి.. అన్న భరతుని కళ్ళలో చావు భయం చూసి వెనక్కి తగ్గాడు. అప్పుడు బాహుబలికి మనసులో ఒక ఆలోచన మెదిలింది. కేవలం రాజ్యం కోసం రక్తసంబంధం ఉన్న తోబుట్టువు మీద యుద్ధం చేయడం ఏమిటి ? నాకు ఇంత స్వార్థం ఎందుకు ? అనే ఆలోచన బాహుబలి మనసులో మెదిలింది. జీవితం మీద వైరాగ్యం తెచ్చుకున్నాడు. తనమీద తనకే అసహ్యం వేసింది. రాజ్యంపై మోజు తగ్గింది. సిరిసంపదలను రాజ్యాన్ని వదులుకున్నాడు. రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని సర్వాన్ని తెచ్చి అన్న భరతునికి అప్పజెప్పాడు. తాను కట్టుబట్టలతో కూడా కాకుండా.. బట్టలు లేకుండా దిగంబరుడిగా మారి అడవుల బాట పట్టాడు బాహుబలి.

మోక్షం కోసం ఘోర తపస్సు…

కోరికలు, రాజ్యాధికారాన్ని, అహాన్ని వదిలిన బాహుబలి మోక్షం కోసం తపస్సు చేయసాగాడు. కీకారణ్యమైనటువంటి పోతనాపురం అడవులలో బాహుబలి  ఘోర తపస్సు చేపట్టాడు. కానీ బాహుబలికి మోక్షం సిద్ధించలేదు. తాను నిలుచున్న స్థలం తనది కాదని, తన అన్న పొందిన రాజ్యానిదని తన మనసులో మెదిలింది. పరాయి నేల మీద తాను తపస్సు చేస్తున్న భావన బాహుబలికి కలిగింది. దీంతో తన తపస్సు మరింత కఠిన తరంగా ఉండాలని భావించి ముని వేళ్ళ పై నిల్చోని తపస్సు చేయసాగాడు. అదే సమయంలో తన తండ్రి వృషభనాధుడు.. లౌకిక విషయాల పట్ల ఆలోచన ఉండకూడదని, అప్పుడు మనసు ఏకాగ్రతను సంతరించుకోలేదు అనే మాటలను గుర్తు చేసుకున్నాడు. ఇతర ఆలోచనలను పక్కనపెట్టి పూర్తిగా ధ్యానంపై ధ్యాస పెట్టి ఘోర తపస్సు చేశాడు బాహుబలి. ఆ సమయంలో ఆయన శరీరంపై పుట్టలు కోటలుగా పెరిగాయి. శరీరానంత చెట్లు, తీగల అల్లుకున్నాయి. పాములు ఒళ్లంతా పారాయి. అయినా తన మనసులో ఎటువంటి అలజడి లేకుండా, శరీరాన్ని కదిలించకుండా నిశ్చలంగా నిలబడి చివరికి అనుకున్నది సాధించాడు. బాహుబలికి మోక్షం సిద్ధించింది. తపస్సు ద్వారా జైనుల తొలి మోక్ష సాధకుడుగా బాహుబలి మోక్షం సాధించాడు.

శ్రావణ బెళగొళలో బాహుబలి స్థాపన.. 

బాహుబలి విగ్రహాన్ని స్థాపించడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. క్రీస్తుశకం 10వ శతాబ్దంలో దక్షిణ కర్ణాటక ప్రాంతాన్ని కాంగులు పరిపాలించేవారు. కాంగులు జైన మతాన్ని అవలంబించేవారు. జైన సిద్ధాంతాలను సైతం పాటించేవారు. ఎన్నో జైన మందిరాలను నిర్మించారు. కాంగులు చక్రవర్తి రాచమల్లు జైన ధర్మాన్ని పాటించేవాడు రాజమల్లు వద్ద మంత్రిగా ఉన్న చాముండిరాయుడు తల్లికి ఓనాడు కలలో దిగంబర ఆకారంలో ఓ పెద్ద రూపంతో బాహుబలి దర్శనమిచ్చాడు. సరిగ్గా అటువంటి రూపాన్ని ఆ రాజ్యంలో నిర్మించాలని కలలో కోరాడట. వెంటనే మెలకువ వచ్చిన మంత్రి తల్లి ఈ విషయాన్ని చాముండి రాయుడికి తెలియజేసింది.  దిగంబర రూపంలో ఉన్న బాహుబలి విగ్రహాన్ని నిర్మించాలని కోరింది. సాక్షాత్తు జైన వంశస్తుడైన బాహుబలి కలలో కనిపించి తన విగ్రహం నిర్మించడని అడగడం తమకు మహా భాగ్యమని భావించిన ఆ రాజు రాచమల్లు మంత్రి  చాముండి రాయుడు విగ్రహ నిర్మాణానికి ఏర్పాటు చేశారు. సుమారు 12 సంవత్సరాలకు ఆ విగ్రహం పూర్తయింది. ఆ విగ్రహం పూర్తయ్యే వరకు మంత్రి చాముండి రాయుడు తల్లి నిరాహార వ్రతాన్ని ఆచరించారట. 

శ్రావణ బెళగొళ అంటే అర్థం ఇదే…

ఎత్తైన పర్వతాల మధ్య ఆధ్యాత్మిక సాధనకు అనువుగా ఉండే ప్రాంతం శ్రావణ బెళగొళ. ఒకవైపు విద్య గిరి,  మరోవైపు చంద్రగిరి కొండల మధ్యలో విశాలమైన సరస్సు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. శ్రావణ అంటే యోగి అని బెళగొళ అంటే తెల్లటి తామరలు ఉన్న సరస్సు అని అర్థం. అ సరసుని ధవళ సరోవరంగా కూడా పిలుస్తారు. అందుకే ఈ ప్రాంతానికి శ్రావణ బెళగొళ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. చుట్టూ ఎత్తైన కొండల నడుమ, పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలితో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఆ సరస్సు. యోగులు, సిద్దులు, ధ్యానం చేయడానికి అనువైన వాతావరణము అది. అందుకే అక్కడ గోమటేశ్వరుని అదే బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్టాపించడానికి అనువైనదిగా ప్రదేశాన్ని ఎంచుకున్నారు.

ఏకశిలపై బాహుబలి నిర్మాణం…

వింధ్య గిరి కొండపై 57 అడుగుల నిలువెత్తు రూపంగా భగవాన్ బాహుబలి విగ్రహం నిర్మించారు. భారీ ఆకారంలో విగ్రహం మనకు దర్శనమిస్తుంది. తెల్లటి గ్రానైట్ తో ఏకశిల మీద చిక్కిన గోమటేశ్వరుని మొఖం ఆరున్నర  అడుగులు ఉంటుంది. బాహుబలి పాదాలు 9 అడుగులు పొడవు. ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా విగ్రహాల్లో ఈ విగ్రహం కూడా ఒకటి. ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద చెవులు, అరవిరిసిన తామరల వంటి కళ్ళు, విచ్చుకున్న పెదాలు, కోటేరు వంటి ముక్కు, నిర్మలమైనటువంటి ముఖారవింద రూపం కలిగి ఉన్న గోమటేశ్వరుని ముఖవర్చేసు చూస్తుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. శాంతి, అహింస, త్యాగనిరతికి నిలువెత్తు రూపంగా బాహుబలి రూపం మనకు దర్శనమిస్తుంది. జైన మహా శిల్పి ‘అరిష్టనేమి’ ఏకశిలగా ఉన్న కొండని తులచి గోమటేశ్వరుని చెక్కారట వింధ్య గిరి పర్వతంపై ప్రతిష్టించారు. విగ్రహ రూపకర్తకు గోమటేశ్వరుని విగ్రహాన్ని చెక్కి ప్రతిష్టించేందుకు 12 ఏళ్ళు సమయం పట్టిందట. అందుకే 12 ఏళ్లకు ఒకసారి అక్కడ మహా ‘మస్తాభిషేకాన్ని’ కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఈ మస్తాభిషేక మహోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు, జైనులు, పర్యాటకులు అధిక సంఖ్యలో హాజరవుతారు.  క్రీస్తు శకం 1398 నుంచి మహా మస్తాభిషేకం మహోత్సవం జరుగుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి.

సముద్ర మట్టం నుంచి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండను తొలిచి 614 మెట్లు నిర్మించారు. ఆ మెట్లన్నీ ఎక్కి తే మహా మండపం కనిపిస్తుంది. దాని నుంచి లోపలికి వెళ్తే బాహుబలి గోమటేశ్వరుని విగ్రహం మనకు దర్శనమిస్తుంది. 

మహా మస్తాభిషేక మహోత్సవం..

బాహుబలి గోమటేశ్వరుని విగ్రహానికి 12 సంవత్సరాలకు ఒకసారి ‘మహా మస్తాభిషేక మహోత్సవం’ నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో బాహుబలి విగ్రహానికి శుద్ధి కార్యక్రమం చేస్తారు. ప్రతి 12 ఏళ్లకోసారి ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు ఈ మహోత్సవం జరుగుతుంది. జైన పీఠాధిపతి చారు కీర్తి భట్టారక ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. పీఠాధిపతి ముందుగా బాహుబలి విగ్రహాన్ని చేరుకుంటారు. జైన మంత్రోచ్ఛారణల మధ్య మహాభిషేకం ప్రారంభం చేస్తారు. దేశంలోని వివిధ నదుల నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకిస్తారు. రత్న, స్వర్ణ, రజత, తామ్ర, కాంచన, శుభ మంగళ అన్న పేర్లతో కలశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పంచామృతం, పసుపు, కుంకుమ, శ్రీగంధం, నారికేళం, చెరకు రసం, తదితర సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు వెయ్యి ఎనిమిది కళాశాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు.

భారీ స్థాయిలో జరిగే ఈ అభిషేకాన్ని చూస్తుంటే ఆధ్యాత్మికతతో మనసు పులకించిపోతుంది. స్వర్ణ పుష్పాభిషేకం, పూల వాన అద్వితీయంగా జరుగుతుంది. హెలికాప్టర్ల నుంచి పూల వానలను కురిపిస్తారు. తొమ్మిది రోజులు పాటు ఈ మహోత్సవాన్ని అద్భుతంగా అద్వితీయంగా నిర్వహిస్తారు. ప్రపంచంలో నుండి అభిషేకానికి చేరుకొని పర్యాటకులు భక్తులు ఆధ్యాత్మికతలో మునిగితేలుతారు. దిగంబర రూపంలో ఉన్న ఆయన రూపాన్ని చూస్తే మనసులో ఉన్న కోరికలు, ఆడంబరాలు, అహంకారం అన్ని మటుమాయమై మనసు నిండా శాంతి నెలకొంటుంది. 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహత్తర ఘట్టాన్ని చూడడానికి ఎంతోమంది ఎదురుచూస్తూ ఉంటారు. బాహుబలి దర్శనం ప్రతిరోజు దర్శించుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శన వేళలు ఉంటాయి.

తెలంగాణకు బాహుబలికి ఉన్న సంబంధం…

అస్మక రాజ్యానికి పాలకుడైనటువంటి బాహుబలి పోతనపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. పోతనపురం అంటే తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటి బోధన్ పట్టణం. తమ్ముడి రాజ్యంపై దండెత్తి వచ్చిన భరతుణ్ణి బోధన్‌లో ఎదుర్కొని గెలిచిన బాహుబలి రాజ్యపరిత్యాగం చేసి తపస్సుకు అటవీ బాట పట్టాడు. తపస్సు సమయంలో బాహుబలి శరీరానికి తీగలు, పాములు చుట్టుకుంటాయి. అతడి చుట్టూ పుట్టలు పెరుగుతాయి. ఈ దృశ్యాన్ని చూసిన భరతుడు అప్పటి రూపాన్ని ప్రతిబింబించేలా 525 ధనుస్సుల పొడుగున్న బాహుబలి కుక్కుటేశ్వరుడుగా పిలిచేవారట.

శ్రావణ బెళగొళలో ఉన్న శాసనంలో ఈ విషయం రాయబడింది.  మరి ఆ విగ్రహం ఏమైపోయినట్లు? శాసనంలో పేర్కొన్నట్లు బాహుబలుని విగ్రహం అప్పట్లోనే అడవుల్లో కలిసిపోయిందా? కాల క్రమంలో విగ్రహం నేలపై ఒరిగి భూమిలో పూడుకుపోయిందా అని చాలామంది సందేహాలు తలెత్తుతున్నాయి. బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకునే అదేవిధంగా  విద్య గిరిపై విగ్రహాన్ని నిర్మించారట. అయితే తెలంగాణకు బాహుబలికి ఉన్న ఇంత గొప్ప సంబంధం గురించి చాలామందికి తెలియదు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి బాహుబలి తెచ్చిన పేరు సామాన్యమైనది కాదు.  తెలంగాణతో బాహుబలి చరిత్ర పెనవేసుకుంది. బాహుబలి తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమయ్యాడు. కనుమరుగైన  బాహుబలి భారీ విగ్రహం వెలికి తీసే పనిని చేపట్టాలని పురావస్తు శాఖలను తెలంగాణ చరిత్రకారులు కోరుతున్నారు.

Show More
Back to top button