ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి, రూ.2.5లక్షల కంటే ఎక్కువ జీతం ఉండాలి, ఇలా ఎన్నో కండీషన్లు ఉంటాయి. మరి కూలీ పని చేసే వారికి తమ కుటుంబానికి రక్షణ కల్పించనవసరం లేదా? అనే ప్రశ్నకు IRDAI సరల్ జీవన్ బీమా యోజనతో సమధానం ఇచ్చింది. ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్. ఉద్యోగంతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇందులో ఉండే కండీషన్స్ అన్ని IRDAIనే నిర్ణయిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఎలాంటి అబ్జెక్షన్లు లేకుండా పాలసీని అందజేయాలి.
అర్హతలు.. మరిన్నివిషయాలు
18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసున్న వారు సరల్ జీవన్ బీమా యోజనకి అర్హులు. లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. దీని కాల వ్యవధి 5 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. గరిష్ఠ మెచ్యూరిటీ వయస్సు 70 ఏళ్లు. కనిష్ఠంగా రూ.5,00,000, గరిష్ఠంగా రూ.25,00,000 వరకు పొందవచ్చు. ఈ పాలసీపై లోన్ ఇవ్వరు. ఈ పాలసీ కోసం బర్త్ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు, అడ్రెస్ ప్రూఫ్, ఉద్యోగస్థులైతే చివరి మూడు నెలల సాలరీ స్లిప్పులతో పాటు బ్యాంకు స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది.
సరల్ జీవన్ బీమా యోజనకి ఎంత ప్రీమియం కట్టాలి అనేది కంపెనీనే నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రీమియం ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి వేరువేరుగా ఉంటుంది. ప్రీమియం చెల్లించడానికి 4 మార్గాలు ఉన్నాయి. ఒకటి నెలనెలా, 3నెలలకోసారి, 6నెలలు, ఏడాది.. వీటిల్లో మీకు ఎలా వీలైతే అలా ప్రీమియం చెల్లించుకోవచ్చు. దీన్ని తీసుకున్న 12 నెలల్లోపు ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. కేవలం ప్రీమియం డబ్బు మాత్రమే లభిస్తుంది. కవరేజ్ డబ్బు రావు. ఇది ఇన్సూరెన్స్ పూర్తి వివరాలు. తక్కువ ఆదాయం వచ్చే వారికి ఈ బీమా బాగా ఉపయోగపడుతుంది.