CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో నిర్మాతను నిలబెట్టిన అజరామర ప్రేమకథ.. “ప్రేమనగర్”

నిజమైన ప్రేమ అంటే రెండు ఆత్మల కలయిక, స్వార్థాన్ని జయించడం, సేవాభావాన్ని పెంపొందించుకోవడం, త్యాగాన్ని అలవరచుకోవడం. ప్రపంచంలో  ప్రేమిస్తున్నామని అనుకునేవాళ్ళు ఎక్కువ, ప్రేమించే వాళ్ళు తక్కువ. జీవితంలో ప్రేమలు మారిపోతుంటాయి. జీవితాంతం ఒక్కరినే ప్రేమించడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. ప్రేమ లేనిదే బ్రతకలేమని, ఒకవేళ ఆ ప్రేమ దక్కకపోతే మరణిస్తామని అనుకునేవాళ్లు వాస్తవ జీవితంలో చాలా అరుదు. నిజమైన ప్రేమ అమృతం లాంటిది, అది ప్రాణం పోస్తుందే గానీ, ప్రాణం తీయదు.

ప్రేమ కథలకు జీవం పోయగల నటుడు అంటే అక్కినేని నాగేశ్వరావు పేరుని ఎన్నేళ్లయినా గుర్తుచేసుకుంటాం. కారణం ఓ దేవదాసు, ఓ ప్రేమనగర్, ఓ ప్రేమాభిషేకం లాంటి చిత్రాలతో కథానాయకుడి పాత్రను చిరస్మరణీయం చేయడమే. వ్యసనపరుడైన పిల్ల జమిందారుకి, ఆత్మాభిమానం నిండిన యూవతికి మధ్య సాగే ప్రేమ కథతో అల్లుకున్న ప్రేమనగర్ ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఈ చిత్రంలో పిల్ల జమిందారు కళ్యాణవర్మగా అక్కినేని పలికించిన హావాభావాలు, లతగా వాణిశ్రీ నటన, ఆమె ఆహార్యం మరువలేనిది.

చలనచిత్ర సీమ నిజంగా విచిత్రసీమ. పద్నాలుగు రీళ్ళ సినిమాలో కూడా కనపడనని ట్విస్టులు సినిమా పరిశ్రమ వారికి నిజజీవితంలో కనిపిస్తాయి. విసిగిపోయి ఇక్కడ మనలేక తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తితో కూడా ఇదే నా ప్రపంచం అనిపించే మాయాజాలం ఏదో సినిమా పరిశ్రమలో ఉంది. మన మదిలో నిలిచిపోయిన “ప్రేమనగర్” సినిమా అప్పట్లో చేసింది అదే. ముందు ఎవరో చేయాలనుకున్న ఈ సినిమా చివరకు రామానాయుడు గారు ముంగిట్లో వాలింది. అప్పటి బాక్సాఫీస్ దగ్గర ఓ ఎదురుదెబ్బ తిని “బ్యాక్ టూ పెవీలియన్” అన్నట్టుగా ఉన్నారు రామానాయుడు. ఇక జీవితంలో అటో, ఇటో అన్నట్టుగా ఈ సినిమా నిర్మించారు.

“ప్రేమనగర్” లాంటి విజయాలు అక్కినేని నాగేశ్వరావుకు కొత్త కాదు కానీ, ఆయన పుణ్యమా అంటూ గొప్ప నిర్మాత తెలుగు తెరపై బలమైన పునాదిని ఏర్పరచుకున్నారు. అక్కినేని లాగే ఈ సినిమా బరువు బాధ్యతలో తాను సగభాగం పంచుకొని కథానాయిక ఆహార్యానికి ఓ కొత్త లుక్కు తీసుకొచ్చారు వాణిశ్రీ. “ప్రేమనగర్” లేకపోతే రామానాయుడు లేడు. ఆయన లేకపోతే ఈ స్టూడియోలు, ఇన్నిన్ని సినిమాలు, ఇంతమంది దర్శకులు, సాంకేతిక నిపుణులు, ఉద్యోగులు లేరు. అందుకే అది “ప్రేమనగర్” కాదు, రామానాయుడు “సాహాసనగర్”. సాహసమైన సినిమా విడుదలై నేటికి 53 ఏళ్లు..

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :   కె.ఎస్.ప్రకాశరావు

నిర్మాణం   :     డి.రామానాయుడు 

రచన     :    ఆచార్య ఆత్రేయ 

తారాగణం  :   అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, గుమ్మడి వెంకటేశ్వరరావు, కైకాల సత్యనారాయణ, రాజబాబు

సంగీతం    :    కెవి. మహాదేవన్

కథ         :     కోడూరి కౌసల్యా దేవి

మాటలు, పాటలు   :   ఆచార్య ఆత్రేయ

ఛాయాగ్రహణం  : ఎస్.వెంకటరత్నం

ఎడిటింగ్      :      సి.పి.జంబులింగం

నిర్మాణ సంస్థ    :     సురేష్ ప్రొడక్షన్స్ 

నిడివి      :     171 నిమిషాలు

విడుదల తేదీ   :     24 సెప్టెంబరు 1954

భాష     :     తెలుగు

చిత్ర కథ…

సంపన్న జమీందారు కుటుంబానికి చెందిన రెండవ కుమారుడు “కళ్యాణ్”, మందు మరియు స్త్రీలతో తన జీవితాన్ని ఆస్వాదించే సంతోషకరమైన వ్యక్తి. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న మధ్యతరగతి మహిళ “లత” తన తండ్రి, తల్లి, ఇద్దరు సోదరులు మరియు సోదరితో నివసిస్తుంది. ఆమె అన్నయ్య తన భార్యతో కలిసి ఇంట్లో ఉంటాడు, కానీ లత కుటుంబంలో అత్యధికంగా సంపాదిస్తున్న సభ్యురాలు, కాబట్టి ఆమె తన వృత్తిని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె కళ్యాణ్‌కి సెక్రటరీగా చేరింది. మరుసటి రోజు కళ్యాణ్ ఆమెను తన ఎస్టేట్‌కు తీసుకువెళతాడు. అక్కడ ఆమె తన తల్లి, అన్నయ్య కేశవ వర్మ మరియు కోడలు ఇంద్రాణిని కలుస్తుంది. కళ్యాణ్ మద్యపానానికి బానిస అని లత వెంటనే గమనించి, కళ్యాణ్ తాగకుండా చేస్తానని లత కళ్యాణ్ తల్లికి హామీ ఇచ్చింది.

ఒక రోజు లత కళ్యాణ్ తాగకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది; ఆమె అతనితో వాదించిన తర్వాత గ్లాస్ విసిరింది. కళ్యాణ్‌ని ఆమెపై బాటిల్ విసిరేలా కోపగించుకున్నాడు. అక్కడ అతను తన తప్పును తెలుసుకుని అతను తన బాటిళ్లన్నింటినీ ధ్వంసం చేసి లతకి ఇక తాగనని వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ లతను గాఢంగా ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఇదంతా చూసిన అన్న కేశవవర్మ తన తల్లితో కలిసి లత తన భార్య నగలను దొంగిలించాడని ఒక కథను అల్లుతాడు. అది విన్న కళ్యాణ్‌కి లత మీద అనుమానం వస్తుంది. అతను దాని గురించి లతను అడుగుతాడు. కానీ ఆమె అలాంటి తప్పు చేసిందని అతను అనుమానించాడని బాధతో నిరుత్సాహంగా వెళ్ళిపోతుంది. అనుకోకుండా కళ్యాణ్ తన అన్న కేశవవర్మ పన్నిన కుట్రను గురించి సేవకుడు దాసు మరొకరితో గుసగుసలాడుకోవడం వింటాడు.

కళ్యాణ్ తన అజ్ఞానాన్ని ఒప్పుకొని క్షమాపణలు చెబుతాడు. కానీ లత అతన్ని క్షమించదు. కళ్యాణ్ సంయమనం కోల్పోయి తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. ఇంతలో లతకు పెళ్లి కుదురుతుంది. కళ్యాణ్ తల్లి లతకు క్షమాపణ చెప్పడానికి వెళుతుంది. అయితే లత తన పెళ్లికి ఆహ్వానాన్ని అందజేస్తుంది. అతను పెళ్లికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అతనిని చూసి లత షాక్ అవుతుంది, కళ్యాణ్ ను ప్రైవేట్‌గా కలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె కోడలు వారిని గమనించి అతిథులకు తెలియబరుస్తుంది. తన కుటుంబమంతా లతను వదిలి బయలుదేరుతారు. అప్పుడు అకస్మాత్తుగా కళ్యాణ్ తల్లి గదిలోకి ప్రవేశించి, తన కొడుకును వివాహం చేసుకోవాలని లతను కోరుతుంది. లత ప్యాలెస్‌కి వచ్చినప్పుడు, కళ్యాణ్ పరిస్థితిని చూసి, నిస్పృహతో మరియు ప్రేమాభిమానంతో అతను తనకు తానుగా విషం త్రాగి చావడానికి పూనుకోవాడన్ని చూసి ఆమె షాక్ అవుతుంది. కానీ ఎలాగైనా కళ్యాణ్ ఆసుపత్రికి తీసుకెళ్లడం, రక్షించడంతో కళ్యాణ్, లతలు కలుసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

కథకు మూలం..

1960 – 70 ప్రాంతాలలో నవలా రచనలో రచయిత్రిలదే (మహిళా రచయితలు) పైచేయిగా ఉండేది. 1970 – 80 లో యండమూరి వీరేంద్రనాథ్ గారు వచ్చాక, ఆ తరువాత 1980 దశకం అంతా రచయితలదే (పురుష రచయితలు అయితే). 1960 – 1970 దశకం అంతా రచయిత్రిలదే అని చెప్పుకోవచ్చు. అప్పటికి పత్రికలలో సీరియల్స్ గానీ, నేరుగా నవలలు గానీ వ్రాసినటువంటి రచయిత్రిలలో మొట్టమొదటి వరుసల పేర్లు చెప్పాల్సి వస్తే ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉండేవి. వారు యద్దనపూడి సులోచనారాణి,   కోడూరి కౌసల్యా దేవి, ముప్పాళ రంగనాయకమ్మగా గార్ల పేర్లు చెప్పుకోవచ్చు. వీరిలో కోడూరి కౌసల్యా దేవి వ్రాసిన నవల “చక్రభ్రమణం” నవలను మొట్టమొదటిసారిగా 1964 లో “డాక్టర్ చక్రవర్తి”గా సినిమా రూపొందించబడింది.

ఆధునిక నవలల్లో మొట్టమొదటిసారిగా సినిమాగా రూపొందించబడ్డ నవల “చక్రభ్రమణం”. రికార్డుల పరంగా “బారిస్టరు పార్వతీశం” నవల సినిమాగా వచ్చింది. కోడూరి కౌసల్యా దేవి వ్రాసిన మరొక నవల పేరు “ప్రేమ్ నగర్”. నిజామాబాదు జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి పేరొందిన పంపిణీదారుడు. సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి (ఆరికెపూడి కౌసల్యాదేవి) వ్రాసిన ఓ నవల చదివాక బాగా ప్రేరణపొంది “ప్రేమ్ నగర్” స్క్రిప్టు తయారుచేయించి అక్కినేనికి ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరావుకి స్క్రిప్ట్ చదివే అలవాటు లేదు. దాంతో తన భార్య అన్నపూర్ణకు ఇచ్చి చదవమన్నారు. ఆవిడ చదివి “దేవదాసు సినిమా అంత పేరు తెచ్చిపెడుతుంది మీకు, పైగా దేవదాసులో లేని కమర్షియల్ విలువలు ఇందులో ఉన్నాయి” అని అక్కినేనితో చెప్పింది. ఇక భార్య ఆ మాట చెప్పాక తిరుగేముంది. అక్కినేని పచ్చజెండా ఊపేశారు.

ఆదిలోనే హంసపాదు…

కథానాయికగా కే.ఆర్.విజయను, దర్శకుడిగా వి.మధుసూదన్ రావును అనుకున్నారు. సినిమా క్యాస్ట్రూమ్ కొనడానికి శ్రీధర్ రెడ్డి తన భార్యతో కలిసి డబ్బు తీసుకొస్తుంటే ఆ కారు ప్రమాదానికి గురైంది. దాంతో శ్రీధర్ రెడ్డి మనసు కీడు శంకించింది. ఆయన భార్య కూడా ఇదేదో అపశకునంలా ఉంది ఈ సినిమా మనకొద్దు అని నచ్చ చెప్పింది. దాంతో ప్రేమ్ నగర్ సినిమాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ కథ ఇలా ఉంటే అటుపక్క రామానాయుడు విపరీతమైన సంక్షోభంలో ఉన్నారు. రాముడు భీముడుతో నిర్మాతగా మారిన రామానాయుడు “ప్రతిజ్ఞ పాలన”, “స్త్రీ జన్మ”, “బొమ్మల కథ”, “పాప కోసం”, “శ్రీకృష్ణతులాభారం”, “సిపాయి చిన్నయ్య” సినిమాలు తీశారు. అవన్నీ లాభసాటి సినిమాలు. కానీ “ద్రోహి” సినిమా రామానాయుడు జోరుకు పగ్గాలు వేసింది. పెట్టుబడి పెట్టిన ఐదు లక్షల బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.

ఇప్పుడు ఏం చేయాలి? ఒకే ఒక ప్రయత్నం, ఆఖరి ప్రయత్నం. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. లేకుంటే లగేజ్ సర్దుకొని ఊరెళ్ళిపోవాలి. అప్పుడే దసరా బుల్లోడు సినిమా విజయవంతం అయ్యింది. అక్కినేనితో చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నారు. రామానాయుడు అక్కినేని గారిని కలిస్తే “ప్రేమనగర్” గురించి చెప్పారు. చేస్తే ఇలాంటి సినిమానే చేయాలి అనుకున్నారు. రామానాయుడు గారు 60 వేల రూపాయలు పెట్టి శ్రీధర్ రెడ్డి దగ్గర హక్కులు తీసేసుకున్నారు. పంపిణీదారుడు నవయుగ చంద్రశేఖర రావు దగ్గరికి వెళ్లి 15 లక్షల ఖర్చుతో “ప్రేమ్ నగర్” తీస్తాను మీరు అండగా నిలబడాలని అడిగారు. అసలే నష్టంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో రిస్క్ చేయడం తగునా అని అంటే ఏం పర్లేదు అని ధైర్యంగా ముందుకు దూకారు రామానాయుడు.

నిర్మాత రామానాయుడు…

“ప్రేమ్ నగర్” సినిమా రామానాయుడుకి “లైఫ్ అండ్ డెత్” సినిమా అయ్యింది. 1964లో “రాముడు భీముడు” విజయం సాధిస్తే 1979 వరకు సుమారు ఏడు సంవత్సరాలలో ఎనిమిది చిత్రాలు నిర్మించారు రామానాయుడు. “రాముడు భీముడు” విడుదలై చక్కటి విజయం సాధించింది. సినిమా పరిశ్రమకు వెళ్లొద్దన్న రామానాయుడు తండ్రి “రాముడు భీముడు” విజయంతో తన కొడుకు మంచి సినిమా తీశారని గర్వంగా చెప్పుకున్నారు. “రాముడు భీముడు” చిత్ర చిత్రీకరణ జరుగుతూ ఉండగానే ఎన్టీఆర్ కు మరో సినిమా బయానా ఇచ్చాడు రామానాయుడు. ఆ సినిమా పేరు “శ్రీకృష్ణతులాభారం”. ఎన్టీఆర్ వేరే సినిమాతో తీరికలేకుండా ఉండటం వలన “శ్రీకృష్ణతులాభారం” ఒక సంవత్సరం పాటు వాయిదా వేశారు. దాంతో “ప్రతిజ్ఞ పాలన” కాంతారావు, ఎల్.విజయలక్ష్మి, రాజశ్రీ లతో తీశారు రామానాయుడు. ఈ సినిమా కూడా బాగా ఆడింది. రెట్టించిన ఉత్సాహంతో శ్రీకృష్ణతులాభారం తీశారు. ఆ సినిమా బాగానే ఆడింది, పెట్టిన ఖర్చులు వెనక్కి వచ్చేశాయి. కానీ విపరీతమైన లాభాలు రాలేదు.

కె.యస్ ప్రకాశరావు గారి దర్శకత్వంలో “స్త్రీజన్మ” అనే సినిమా తీశారు. దీనికి కూడా పెట్టిన డబ్బులు వచ్చాయి. కానీ లాభం రాలేదు. ఐదో సినిమాగా కొత్త దర్శకుడు పి.వి.ఆర్.శేషగిరిరావుని పరిచయం చేస్తూ “పాప కోసం” తెలుగు, తమిళంలో సమాంతరంగా తీశారు. 1968 లో వచ్చిన ఈ సినిమా నిరాశపరచడంతో పాటు తీవ్ర నష్టం చేకూర్చింది. “బొమ్మలు చెప్పిన కథ” సినిమా కూడా నష్టాన్ని తెచ్చి పెట్టింది. శేషగిరిరావు దర్శకత్వంలో “సిపాయి చిన్నయ్య” (1969) తీశారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు రెండు పాత్రలలో నటించారు. అదే సమయంలో వచ్చిన “ప్రాణమిత్రులు”, సి”పాయి చిన్నయ్య” ఒకేలా ఉండడంతో ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. అప్పుడు కొత్త దర్శకుడు కె. బాపయ్యని పరిచయం చేస్తూ “ద్రోహి” అనే సినిమా తీశారు. తమిళంలో శివాజీ గణేషన్ హీరోగా నటించిన ఈ సినిమానే తెలుగులో పునర్నిర్మించారు. ఈ సినిమా అత్యంత ఘోర పరాజయం చవిచూసింది.

దర్శకుడు కె.యస్. ప్రకాశరావు..

కోడూరి కౌసల్యా దేవి రచించిన నవల “ప్రేమ్ నగర్” ఆధారంగా తీసే సినిమాకు దర్శకుడుగా కే.ఎస్.ప్రకాశరావును ఎంచుకున్నారు. గతంలో రామానాయుడికి “స్త్రీ జన్మ” అనే సినిమా తీశారు. కథానాయిక ఓరియెంటెడ్ గా ఉన్న సన్నివేశాలను కే.యస్.ప్రకాశరావు, నిర్మాత రామానాయుడు, రచయిత ఆత్రేయలు కూర్చొని సన్నివేశాలను ఎక్కువ భాగం కథానాయకుడి పరంగా మలిచారు. ఆత్రేయ గారు స్క్రిప్టు త్వరగా పూర్తి చేసి ఇచ్చారు. కే.యస్.ప్రకాశరావు “ప్రేమ్ నగర్” కు ముందు అక్కినేనికి రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. అక్కినేనితో 1952లో కన్నతల్లి అనే సినిమా తీశారు. ఆ తరువాత 17 సంవత్సరాలకు 1967లో “బందిపోటు దొంగలు” అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ “ప్రేమ నగర్” వారిరువురికి మూడవ సినిమా. ఆచార్య ఆత్రేయ మాటలు, పాటలు, కే.యస్.ప్రకాశరావు దర్శకత్వం, అక్కినేని నాగేశ్వరావు, వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా 15 లక్షల బడ్జెట్ ఈ సినిమాను చిత్రికరించడానికి శ్రీకారం చుట్టారు.

చిత్రీకరణ…

ప్రేమనగర్ సినిమా విడుదలై ఎంత సంచలన సృష్టించిందో, నిర్మాణ సమయంలో కూడా అంతకన్నా ఎక్కువ సంచలనం సృష్టించింది. అప్పటికే రామానాయుడు గారు సుమారు పదిహేను లక్షల నష్టంలో ఉన్నారు. అది సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసు. నాలుగున్నర లక్షలు పెట్టి సెట్టింగ్ వేశారు. ఇంత నష్టాల్లో ఉండి కూడా ఇంత ధైర్యం ఏమిటి అని అందరూ అవాక్కయ్యారు. రామానాయుడు గారికి మాత్రం స్క్రిప్ట్ మీద గట్టి నమ్మకం. ఈ సినిమాలో వేసిన సెట్టింగులు మరొక సినిమా హిందీలో వచ్చిన “మేరే జీవన్ సాథీ” సినిమాలో ఉపయోగించుకున్నారు. మొత్తానికి ఇన్ని వ్యాఖ్యానాల నడుమ 20 జనవరి 1971 నాడు మద్రాసు వాహిని స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అప్పటికి “దసరా బుల్లోడు” విడుదలై ఒక వారం అయ్యింది. పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. అక్కినేని గారు ముహూర్తపు సన్నివేశాలకు కొబ్బరికాయ కొట్టే అలవాటు లేదు. కానీ రామానాయుడు గారి కోరికమేరకు అక్కినేని గారు ప్రారంభోత్సవం నాడు కొబ్బరికాయ కొట్టారు.

చిత్రీకరణ మొదలైంది. “లతా నీవు విస్కీ తాగొద్దు అన్నావు, కానీ విషం తాగొద్దు అనలేదు కదా” అనే సంభాషణతో ముహూర్తపు సన్నివేశాన్ని మొదలుపెట్టారు. ఆరు నెలల చిత్రీకరణ సాగింది. “ఈ దెబ్బతో నేను మద్రాసులో చిత్ర పరిశ్రమలో ఉండడమా, లేక కీలంబాకం వెళ్లి వ్యవసాయం చేసుకోవడమా తేలిపోతుంది” అని రామానాయుడు చిత్రీకరణ సమయంలో అంటుండేవారు. తాను ఇదే విషయం తన శ్రీమతితో కూడా చెప్పారు. అక్కినేని యూనిట్ అంతా క్రమశిక్షణతో పని చేశారు. ఆరు నెలల్లో చిత్రీకరణ మొత్తం ప్రణాళికా బద్ధంగా సాగింది. చిత్రీకరణ పూర్తయింది. ప్రివ్యూ చూసిన వారంతా బ్రహ్మాండంగా ఉంది నాయుడు గారు సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందని చెప్పేసారట. కానీ ఆ మాటల మీద నాయుడుకి నమ్మకం లేదు. ద్రోహి సినిమాకి కూడా ఇలానే చెప్పారు. కానీ ఫలితం తారుమారై నష్టాన్ని మిగిల్చింది.

సినిమా విడుదల రోజు దగ్గరపడింది. రామానాయుడుకి ప్రతి సినిమా విడుదలకు ముందు రీలు తీసుకుని తిరుపతి వెళ్లి పూజ చేయించుకుని తిరిగి తెచ్చి పంపిణీదారు కార్యాలయంలో ఇవ్వడం అలవాటు. తనతో పాటు తన శ్రీమతి గారిని కూడా రామానాయుడు వెంట తీసుకొని వెళ్లారు. విపరీతమైన వర్షం. తిరుపతి వెళ్లడానికి ముందే ఒక కారు పంచర్ అయ్యింది. రెండో కారులో సర్దుకుని తిరుపతి వెళ్లారు. తిరిగి డబ్బాలు తీసుకొని విజయవాడలో దిగారు. చినుకులు పడుతున్నాయి. వర్షం ఇలా తగులుకుందేమి అని మదనపడ్డారు. తాను హోటల్ కి వెళ్లే సరికి చినుకులు కాస్త భారీ వర్షం అయ్యింది. రామానాయుడు డబ్బాలను పంపిణీదారులకు ఇచ్చారు. సినిమా హాలుకు డబ్బాలు తీసుకెళ్లారు పంపిణీ దారులు. మామూలుగానే ఉదయం ఆట చూసే రామానాయుడు ఈ సినిమా చూడాలంటే భయమేసి చూడలేదు. హోటల్ గదిలో తలుపులు వేసుకొని సెకండ్ షో అయిపోయే వరకు కూడా తన తలుపు తట్టవద్దని చెప్పారు.

ఆకట్టుకున్న తలకట్టు…

“ప్రేమ్ నగర్” చిత్రంలో వాణిశ్రీది ఏయిర్ హోస్టెస్ పాత్ర. తలకట్టు విపరీతమైన ఆకర్షణీయంగా ఉంది. చీరకట్టు, మోచేతులు దాటేవారకూ జాకెట్టు ఆ రోజుల్లో తెలుగువారిని ఫ్యాషన్ ను శాసించేవి. ఆస్పీ అనే హెయిర్ డ్రస్సెర్ ఇంగ్లండ్ నుంచి తిరిగి రాగానే ఈ సినిమాకోసం, ఆ తలకట్టు కోసం పట్టుకొచ్చారు. ఆ రోజుల్లో ఎయిర్ హోస్టస్ కు నెత్తిమీద గోపురంలాగా జుట్టుముడి వేసుకోవడం ఆచారంగా ఉండేది. ఆవిధంగా కనిపించేందుకు వాణిశ్రీ జట్టును వెనక్కిదువ్వీదువ్వీ నానా హైరాణ పెడుంతుంటే ఆమె తల్లి అభ్యంతరం చెప్పేవారట. ఆ తరువాత ఆ జుట్టుముడే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది “ప్రేమనగర్” సినిమాలో. ఆత్మవిశ్వాసం కలిగిన యువతి లతగా వాణిశ్రీ అద్భుతంగా అభినయించారు. ఈ సినిమాకి పని చేసిన పాటల రచయిత ఆచార్య ఆత్రేయ, దర్శకుడు ప్రకాశరావు అనుభవజ్ఞులు. వారు నిరూపించుకోవలసింది ఏమీ లేదు. అప్పటికే తమ ప్రతిభను నిరూపించుకున్నవాళ్ళు. తాము చేసే పనిపైన పూర్తి విశ్వాసం ఉన్నవారు. కానీ అప్పటికే కొన్ని ఫ్లాప్ చిత్రాలు నిర్మించి ఆర్థికంగా విపరీతంగా నష్టబోయిన రామానాయుడుకీ, కెమెరామన్ గా అంతగా రాణించలేకపోయిన వెంకటరత్నంకీ, పెద్ద సినిమాలో, కలర్ సినిమాలో అప్పుడే అడుగుపెట్టిన వాణిశ్రీ కి ఆ సినిమా పరీక్షే. ఆ చిత్రం విజయవంతం కావడంతో వాణిశ్రీ పీహెచ్ డీ పట్టాలు వచ్చినంత ఆనందించారు.

పాటలు…

ఇక పాటల విషయానికి వస్తే తెలుగు సినిమా పాటని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టినటువంటి “మనసు గతి ఇంతే” లాంటి పాటలు ఆత్రేయ వ్రాశారు. పాతాళంలోకి తొక్కివేసినటువంటి “లే.. లే.. లే.. లేలేలే నా రాజా..  లేలే.. నా రాజా” లాంటి పాటలు కూడా ఆత్రేయనే వ్రాశారు. ఆత్రేయను సినీ వేమన అని కూడా అంటారు. మామూలు మాటలలో అనంతమైన వేదాంతాన్ని, అద్భుతమైన జీవిత సత్యాన్ని పొదిగి అందించడం ఆత్రేయ యొక్క ప్రత్యేకత. సాధారణ మాటలతో అనంతమైన అర్ధాన్ని పొదగడం ఆత్రేయకే చెల్లు అని చెప్పవచ్చు. “మనసు గతి ఇంతే” పాటలో “ఒకరికిస్తే మరల రాదు, ఓడిపోతే మరచిపోదు, గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకుపడదు” పాటలో నాలుగు పంక్తులు, ఎనిమిది పదాలు. ఎంత ఆలోచించగలిగితే అంత అర్ధాన్నిస్తుంది.

తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా పాటలో “తెల్లవారి వెలుగులా” అనే ఒక అద్భుతమైన భావంతో పోల్చారు. తెల్లవారి వెలుగు చైతన్యానికి ప్రతిరూపం. అమ్మాయి అందం తెల్లవారి వెలుగులా ఉన్నది అనే ఉదాత్తమైన భావనతో ఆత్రేయ వ్రాశారు. “ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీదేశం పోరా, చుట్టుపక్కల ఉన్నావంటే.. చూడకుండా ప్రాణ ముండదురా”.. అనే లలిత శృంగార గీతం ఎక్కడా కూడా పరిధులు దాటకుండా “చూడకుండా ప్రాణం ఉండదురా” అని ఉదాత్తమైన భావనను తెలియజేశారు ఆత్రేయ. గంభీరమైన సంభాషణలు చిత్ర విజయంలో ఎంతో దోహదం చేశాయి. కె.వి.మహదేవన్, రామానాయుడు నిర్మాణంలో చేసిన మొదటి చిత్రం ఇది. ఈ విధంగా మాటలు, పాటలు “ప్రేమనగర్” చిత్ర విజయంలో దోహదం చేశాయి.

రచయిత ఆత్రేయ…

సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకుడు అన్నీ ఒకవైపు అయితే రచయిత ఆచార్య ఆత్రేయ మరో వైపు. మాటలు, పాటలు వ్రాసిన ఆచార్య ఆత్రేయ గారు ఈ సినిమా విజయంలో అత్యధిక పాత్ర పోషించారు అంటే ఏమాత్రం సందేహించేది లేదు. తాను వ్రాసిన సంభాషణలకు అన్ని తరగతుల ప్రేక్షకులు “నేల తరగతుల నుంచి కుర్చీ, రిజర్వుడ్ వరకు కూడా చప్పట్లే చప్పట్లు. గురి తప్పని వేటగాడి ధనుస్సులోంచి వచ్చిన బాణాల లాగా, తుపాకి నుంచి వచ్చిన తూటాలాగా ఈ సినిమా సంభాషణలకు ఇంత విలువ ఉంటుందని నిరూపించిన రచయిత ఆచార్య ఆత్రేయ అని చెప్పవచ్చు. ఈయన తర్వాత దాసరి నారాయణరావు, పరుచూరి బ్రదర్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారు మాటల రచయితకి కూడా స్టార్ డమ్ ఉంటుందని నిరూపించారు.

అందరికంటే ముందు ఆ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది ఆచార్య ఆత్రేయ అని, ఆ సినిమా “ప్రేమ్ నగర్” అని చెప్పవచ్చు. ప్రతీ పాత్ర అద్భుతమైన సంభాషణలు పలుకింది. ప్రతీ సంభాషణలో కూడా అనంతమైన ఫిలాసఫీ పొదిగివుంది. ఒకటి కాదు, రెండు కాదు. మొదటి నుంచి చివరి వరకు తొంభై శాతం సంభాషణలో అన్నింటిలో కూడా ఫిలాసఫీ ఉంటుంది. “దేనినైతే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు”. “మనిషికి చివరికి కావలసింది ఆరడుగులే అయినా వేల వేల ఎకరాలు ఉన్నాయి”. “నేను చెడ్డవాళ్లను చేరదీశానే గానీ, ఎవ్వరినీ చెడగొట్టలేదు. ఇవన్నీ హీరో కళ్యాణ్ అనే మాటలు. పనిమనిషి కూడా “చినబాబు గారు చెడిపోయారు కానీ చెడ్డవారు కాదమ్మా” అంటుంది. ఎంత భావగర్భితమైన వేదాంతం దట్టించిన సంభాషణలు అంటే ఈ సినిమా మొదలు పెట్టడం కూడా చాలా అద్భుతంగా మొదలుపెట్టారు.

ప్రచారం…

ఈ రోజులలో లాగా ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేదు. కేవలం వాల్ పోస్టర్ చూసి సినిమాకు రావాలి. “ప్రేమనగర్” సినిమాకు వాల్ పోస్టర్ వేసింది ఈశ్వర్. ప్రఖ్యాత పబ్లిసిటీ కళాకారుడు అయిన తాను సుమారు 2500  సినిమాలకు తాను పని చేశారు. ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందు రామానాయుడు, అక్కినేని లతో కలిసి కూర్చొని పాత్రలు ఎలా ఉండాలి, వారి వేషధారణ ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా ఈశ్వర్ డిజైన్ చేశాక వాళ్ళ పాత్రధారణ, వేషధారణ తయారుచేశారు రామానాయుడు. రామానాయుడు వందకు పైగా సినిమాలు చేస్తే అందులో 75 సినిమాలు ఈశ్వర్ పబ్లిసిటీ పోస్టర్లు వేశారు. ఫోటోలు తగ్గించి రేఖా చిత్రాలతో వాల్ పోస్టర్లు వేసేవారు. సినిమా పోస్టర్లు సినిమా విడుదలలో కీలక పాత్ర పోషించాయి.

విడుదల…

24 సెప్టెంబర్, 1971 నాడు సినిమా విడుదల అయ్యింది. ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట, మొదటి ఆట, రెండవ ఆట అయిపోయాక పంపిణీదారులు రామానాయుడు ఉన్న హోటల్ గదికి వచ్చారు. అన్ని గంటలు కూడా తాను అనుభవించిన మానసిక సంఘర్షణ దాని గురించి వ్రాస్తూ “సినిమా అనే రంగుల ప్రపంచంలో నిర్మాత అనుభవించే నిజమైన ఆందోళన ప్రసవవేదనకి అద్దం పట్టే సన్నివేశం అది” అని చెప్పారు. పంపిణీదారులు సినిమా బావుంది వంద రోజులు ఆడుతుందని రామానాయుడు తో చెప్పారు. బావుంది కాదు, సూపర్ డూపర్ హిట్ అనే మాట తమ నోటినుండి వినాలనుకున్నారు. కానీ చూసిన వారంతా అలా చెప్పలేదు. పర్వాలేదండి బాగానే ఉందని చెప్పారు. నాలుగు రోజుల తర్వాత సినిమా సూపర్ హిట్ అని, నాలుగు వారాల్లో పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయని, ఆ తర్వాత లాభాలు తనకే అని చెప్పారు. రోజురోజుకీ కలెక్షన్ల వర్షం పెరిగింది. అటు భారీ వర్షాలు, వర్షాల్లో కూడా సినిమా విజయవంతం అయ్యింది.

“ప్రేమ్ నగర్” సృష్టించిన రికార్డులు పరిశీలన చేస్తే 34 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా 15 లక్షల బడ్జెట్ నిర్మితమై దాదాపు 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాని తమిళంలో కూడా రామానాయుడే నిర్మించారు. తమిళంలో  వసంత మాళిగై (1972) పేరుతో వాణిశ్రీ, శివాజీ గణేషన్ తో నిర్మించారు. తమిళంలో రెండు పతాక సన్నివేశాలు పెట్టారు. ఒక పతాక సన్నివేశంలో హీరో చనిపోతాడు. ఇంకొక పతాక సన్నివేశంలో హీరో బ్రతుకుతాడు.  ఏ సెంటర్లో ఒకలాగా, బీ సెంటర్లో ఒకలాగా విడుదల చేశారు. రెండు రకాల పతాక సన్నివేశాలు జనాలు ఆదరించారు. హిందీలో రాజేష్ ఖన్నా, హేమమాలినితో తీశారు. అక్కడ కూడా అద్భుత విజయం సాధించింది. మూడు భాషలలో, ముగ్గురు వేర్వేరు సాంకేతిక నిపుణులతో తీసిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.

“ప్రేమ నగర్” సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ , బాక్స్ ఆఫీస్ వద్ద ₹1.45 కోట్లు వసూలు చేసింది. డి.రామానాయుడు ఇంతకుముందు సినిమాలు పరాజయం పాలవ్వడంతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి “ప్రేమ నగర్” అద్భుతమైన విజయంతో తన సినీప్రస్థానంలో నాటకీయ మలుపు చోటు చేసుకుంది. ఈ చిత్రం 750 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శింపబడింది. ఈ చిత్రం తమిళంలో “వసంత మాళిగై” (1972) గా మరియు హిందీలో ప్రేమ్ నగర్ (1974) గా కె.యస్.ప్రకాశరావు చేత పునర్నిర్మించబడింది.

Show More
Back to top button