Telugu Special Stories

ప్రపంచం మెచ్చిన భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

భారతీయ గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్‌ 125వ జయంతి సందర్భంగా 2012లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటనకు స్పందనగా ప్రతి ఏట 22 డిసెంబర్‌న దేశవ్యాప్తంగా విద్యాలయాలు, యూనివర్సిటీలు, పౌరసమాజం ఘనంగా “జాతీయ గణితశాస్త్ర దినోత్సవం (నేషనల్‌ మ్యాథమాటిక్స్ డే)” నిర్వహించడం కొనసాగుతున్నది. మానవ జీవన విధానంతో పాటు శాస్తసాంకేతిక అభివృద్ధికి గణితశాస్త్రం నిర్వహిస్తున్న పాత్రను ప్రచారం చేయడం, యువతతో పాటు విద్యార్థిలోకంలో రామానుజన్‌ స్ఫూర్తిని రగల్చడానికి జాతీయ గణితశాస్త్ర దినం దోహదపడే విధంగా నిర్వహించడం జరుగుతోంది.

అతి క్లిష్టమైన సంఖ్య సిద్ధాంతం, అనంత శ్రేణులు, కంటిన్యూడ్‌ ఫ్రాక్షన్స్‌, పార్టీషన్‌ థియరీ, రామానుజన్‌ నెంబర్‌ లాంటి పలు గణిత సూత్రాలను ప్రతిపాదించిన శ్రీనివాస రామానుజన్‌ గణిత ప్రతిభకు ప్రపంచ గణిత శాస్త్రవేత్తలు సహితం తమ అంగీకారాన్ని తెలుపడంతో భారతీయులందరికీ గర్వకారణం. ఉన్నత పాఠశాల విద్యను సహితం చక్కగా అభ్యసించని బాల గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ చూపిన గణిత ప్రతిభ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. 

22 డిసెంబర్‌ 1887న నేటి తమిళ నాడు ఈరోడ్‌ పట్టణంలోని తమిళ అయ్యంగార్‌ బ్రాహ్మణ కుటుంబంలో కమలతమ్మల్‌ – కుప్పుస్వామి దంపతులకు జన్మించిన శ్రీనివాస రామానుజన్‌ చిన్నతనం నుంచే స్వయం-శిక్షణతో గణితంలో రాణించడం జరిగింది. పాఠశాల విద్యను కూడా ఒక పద్దతిలో అభ్యసించక పోవడం, ఇతర సబ్జెక్టుల్లో మక్కువ చూపకపోవడంతో ఎలాంటి పట్టా పొందలేక పోయారు. తన 11వ ఏటి నుంచే త్రికోణమితి, జ్యామితి లాంటి గణిత అంశాల్లోఅత్యంత ప్రతిభ కనబర్చుతూ పలు గణిత ప్రతిపాదనలు చేస్తూ అనేక గుర్తింపులు పొందడం జరిగింది. మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్‌ పొందిన రామానుజన్‌ ఇతర సబ్జెక్టుల్లో ఆసక్తి చూపకపోవడంతో డిగ్రీ పొందలేకపోయారు. 1911లో ఇండియన్‌ మ్యాథ్స్‌ జర్నల్‌లో పరిశోధన వ్యాసాన్ని సమర్పించినా రామానుజన్‌ ప్రపంచ గణిత మేధావుల దృష్టిని ఆకర్షించగలిగారు. 

1913లో బ్రిటీష్‌ గణిత శాస్త్రవేత్త జిహెచ్‌ హార్డీ దృష్టిని ఆకర్షించిన శ్రీనివాసన్ రామానుజన్ కేంబ్రిడ్జ్‌ ట్రినిటీ కళాశాల స్కాలర్‌‌షిప్‌ను పొంది 1914లో ఇంగ్లాండ్‌కు చేరి హార్డీతో కలిసి గణిత పరిశోధనలు చేయడం ప్రారంభించాడం, తాను ప్రతిపాదించిన గణితశాస్త్ర సిద్దాంతాలు పలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం కావడం, 1918లో రాయల్‌ సొసైటీ ఆఫ్‌ లండల్‌ సభ్యత్వం పొందడం జరిగింది. 1917లో టిబీ సోకడం, అనారోగ్యాల పాలుకావడంతో 1919లో భారత్‌కు తిరిగి వచ్చారు. తన 32వ ఏట 26 ఏప్రిల్‌ 1920 రోజు తుది శ్వాస విడిచిన రామానుజన్‌ రాసిన మూడు నోట్‌బుక్స్‌లో ప్రతిపాదితమయిన పలు గణిత అంశాలు నేటికీ శాస్త్రవేత్తలకు నేటికీ కొరకరాని కొయ్యలుగానే మిగిలిపోయాయి. 

రామానుజన్‌ 137వ జన్మదిన వేడుకల శుభవేళ నేడు సమస్త భారత పౌర సమాజంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత గణితవేత్తలా సహితం శ్రీనివాసన్‌ ప్రతిభకు సలాంలు కొడుతున్నారు. మూడు దశాబ్దాల కొద్ది కాలం పాటు మాత్రమే జీవించిన రామానుజన్ ప్రపంచ గణితశాస్త్ర పేజీల్లో సుస్థిర స్థానాన్ని పదిల పరుచుకొని ప్రపంచ యువతకు మార్గదర్శకులుగా, గణితశాస్త్ర అధ్యయనశీలురకు కూడా దేదీప్యమాన దారి దీపంగా నిలుస్తున్నారు. 

Show More
Back to top button