అప్పుడప్పుడే సినిమాలలో ఒప్పంద పత్రాలు (అగ్రిమెంటు) మొదలవుతున్నాయి. కాకినాడ నుండి వచ్చిన ఒక నటి అప్పట్లో పేరు మోసిన జెమిని స్టూడియోస్ నిర్మాణ సంస్థ నిర్మించబోయే ఒక సినిమాలో ఒక పాత్రలో నటించడానికి ఒప్పంద పత్రాలపైన సంతకం చేసింది. అయినా కూడా ఆమె వేరే నిర్మాణ సంస్థ తీయబోయే “నారద నారది” అనే సినిమాలో నటించడానికి కూడా ఒప్పుకున్నది. అది తెలిసి జెమినీ వాళ్లకు తెలిసి ఇదేమిటి అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఏమైంది అని తన ధోరణిలో అడిగింది ఆ నటి. తమ ఒప్పందం ప్రకారం అలా నటించడం తప్పన్నారు జెమినీ వారు.
మీరు నాకలా చెప్పలేదు అది మీ తప్పే అన్నదామె తనకలవాటైన పుర్రచేతిని గాల్లో తిప్పుతూ. కాదంటే ఒప్పందం రద్దుచేసుకోండి అంది బేపర్వాగా. జెమినీ వారికి ఏమీ పాలుపోలేదు. అలా కాదు గానీ మీరు ఊరు వెళుతున్నట్టు ఉత్తరం వ్రాసి ఇవ్వండి అన్నారు అంతే. “అబద్ధాలు ఆడమంటావా” అంటూ గయ్యిమంది ఆవిడ. బిక్కచచ్చిన జెమినీ సిబ్బంది ఆరోజు వరకు ఆవిడకు రావలసిన డబ్బు అందజేసి చెంబుడు మంచినీళ్లు తాగి హమ్మయ్య అనుకున్నారు. అంత నిర్మొహమాటంగా తనదైన శైలిలో సమాధానం చెప్పిన ఆ నటికి అలా “నారద నారది” (1946) సినిమా తొలి సినిమా అయ్యింది. ఆమె మరెవరో కాదు తెలుగు సినిమాకు గయ్యాళి అత్తగా ప్రసిద్ధిపొందిన “సూర్యకాంతం”.
సూర్యకాంతం అనే పేరు వింటేనే ఆంధ్రదేశంలోని కోడళ్ళకు హడల్. సినిమాలలో ఆమె పోషించిన పాత్రలు అంతగా ప్రజాజీవితంలోకి చొచ్చుకునిపోయాయంటే అతిశయోక్తి కాదు. ఆమె పెత్తనానికి తలవంచని కోడలు లేదు, ఆమె దాష్టీకానికి బాధలు పడని సవతి కూతురు లేదు. ఆమె తగాదాకు బెదిరిపోని ఇరుగు, పొరుగింటి వారు లేరు. ఏ రకమైన పాత్రనైనా చాకచక్యంతో అవలీలగా అర్ధం చేసుకుని నటించగలిగే సామర్ధ్యంగల తార సూర్యకాంతం. కత్తులు, తుపాకులు అవసరంలేని మాటల తూటాలతో ఇచ్చిన పాత్రకు సరైన న్యాయం చేకూర్చగల ప్రతిభావంతురాలు సూర్యకాంతం. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే అమ్మో! ఆవిడా? నిజంగా సూర్యకాంతమే! అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించారు సహజనట కళా శిరోమణి సూర్యకాంతం.
నిజానికి సూర్యకాంతం పేరు పెట్టుకోవాలంటే తెలుగువారు గడగడలాడేవారు. అలాగని ఆమెను అభిమానించకుండా ఉండేవారు కాదు. ఆమె అంటే ఇష్టపడని తెలుగువారంటూ కూడా లేరు. ఎందుకంటే తెరమీద ఆమె చేసిన చెడ్డలన్నీ మంచికే దారితీసాయి గనుక. సూర్యకాంతం తెర మీద పాత్రలను ఎంత అద్భతంగా పోషించేవారో, నిజ జీవితంలో కూడా అంతే ఉన్నతంగా జీవించేవారు. దశబ్దాల పాటు ఒకే రకం పాత్రలను పోషించి, అన్ని సినిమాలలోనూ నటించినా కూడా సూర్యకాంతం ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆవిడ సహజ నటనే కాబోలు. ఆమె మాటలు సూదుల్లా గుచ్చుకునేలా వున్నా, మనసులో మాత్రం వాటికి వెన్న, తేనె పూసేశారు అన్న విషయం కొందరికి మాత్రమే తెలుసు. గర్వం ఆమె దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు. తన అహంకారం కూడా కేవలం పాత్రలకు మాత్రమే పరిమితం అయ్యేది.
తెరమీద గయ్యాళిగా ఉన్నా సూర్యకాంతం తన నిజజీవితంలో స్నేహశీలి, దాత, నటీనటులకు ఆత్మీయురాలు. వారికి ఆపద వస్తే తన తరపున దేవుడికి మొక్కుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సూర్యకాంతం ఇచ్చిన పాత్రలకు న్యాయం చేకూరుస్తూ తన నటన ద్వారా అందాన్ని, ఆనందాన్ని ప్రసాదించిన విదుషీమణి. అందం అంటే కేవలం భౌతికం కాదు. మనసు, మాట, హృదయం ఎలా ప్రవర్తిస్తుందో దాన్నిబట్టి అందాన్ని అంచనా వేయాలి అని ఆమె వ్యక్తిత్వాన్ని ఉదాహరణగా తీసుకుని చెప్పవచ్చు. ఆమె ఓరచూపులు చూస్తూ, ఎడమ చెయ్యిని విసురుతూ, కుడిచెయ్యిని నడుంమీద నిలబెట్టి విసరిన సంభాషణాచాతుర్యాల్లో వెక్కిరింపులు, కల్లబొల్లికబుర్లు చోటుచేసుకున్న ప్రతీమాట, ప్రతీసన్నివేశం సజీవశిల్పం. ఆవిడ మంచి వంటగత్తె. చిత్రీకరణకు ఆమె రకరకాల వంటకాలు తెచ్చిపెట్టేది. తెలుగునాట వంటల పుస్తకం వెలువరించిన తొలిరచయితల్లో ఆమె ఒకరు. ఆమె చేసిన పులిహోర వంట మళ్లీ నా జీవితంలో ఏనాడూ ఎరుగనని నటుడు గుమ్మడి చెప్పుకునేవారు. ఆమె అల్పంలో అనల్పం, సూక్ష్మంలో మోక్షం, వెరసి ఆంధ్రుల గయ్యాళి అత్త పెద్దిభొట్ల సూర్యకాంతం.
జీవిత విశేషాలు…
జన్మనామం : సూర్యకాంతం
ఇతర పేర్లు : గయ్యాళి అత్త
జననం : 28 అక్టోబరు 1924
స్వస్థలం : వెంకట కృష్ణరాయపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్
వృత్తి : నటి
జీవిత భాగస్వామి : పెద్దిబొట్ల చలపతిరావు (హైకోర్టు జడ్జి)
తండ్రి : పొన్నాడ అనంతరామయ్య
తల్లి : వెంకట రత్నమ్మ
బిరుదులు : సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణా, రంగస్థల శిరోమణి
మరణ కారణం : వృద్ధాప్యంలో చక్కెర వ్యాధి
మరణం : 17 డిసెంబరు 1996, చెన్నై
నేపథ్యం…
సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరలో ఉన్న వెంకట కృష్ణరాయపురం గ్రామంలో 28 అక్టోబరు 1924 నాడు పొన్నాడ అనంతరామయ్య, వెంకట రత్నమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి పొన్నాడ అనంతరామయ్య కాకర్లమూడి సంస్థానంలో దివాన్ గిరి చేసేవారు. దానికి తోడు ఆయనకు కరణీకం కూడా ఉండేది. భార్య వెంకటరత్నమ్మ చాలా ఓర్పు గల ఇల్లాలు. ఆ దంపతులకు 14 మంది సంతానం. ఆ రోజుల్లో వైద్యం ఇంకా అభివృద్ధి చెందలేదు. వరుస కాన్పులు కావడంతో వెంకటరత్నమ్మ పదిమంది పిల్లల్ని పోగొట్టుకున్నారు. ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ పిల్లవాడు మాత్రమే మిగిలారు. వారిలో సూర్యకాంతం చిన్నది. అందువలన ఆమె ఆడింది ఆట, పాడింది పాట అయిపోయింది. చిన్నతనంలో సూర్యకాంతానికి సినిమాల మీద అస్సలు దృష్టి లేదు. చదివే ఆవిడ ప్రపంచం. ఇంగ్లీషు చదువులు చదవాలని, తన మాటలతో అందరినీ హడలెత్తించాలనేది ఆవిడ కోరిక. హిందీ పోరాట సన్నివేశాలున్న సినిమాలు ఎక్కువగా చూసేవారు. పుస్తకాలు బాగా చదివే అలవాటున్న సూర్యకాంతం అపరాధ పరిశోధన నవలలను పూటకొకటి చదువుతూ ఉండేవారు. సూర్యకాంతం చదువు ఠానా బాలికల పాఠశాలలో సాగింది. పాఠశాలలో జరిగే సంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. మూడో ఫారం చదువుతున్న సమయంలో ఆకస్మాతుగా తండ్రి కాలం చేశారు. దాంతో సంతోషకరంగా నడిచిన వారి ఇంట్లో ఒక్కసారిగా చీకటి ఆవరించింది.
నాటకాలు…
ఆ రోజులలో రెండు అణాలు ఇస్తే రెండు సినిమాలు చూపించేవారు. లీల చిట్నీస్, అశోక్ కుమార్ నటించిన ఖజాంచి, బంధన్ వంటి హిందీ సినిమాలను సూర్యకాంతం చూసేవారు. ఆ సినిమాలు చూస్తూ, చూస్తూ ఆమెకి నటనపై అభిలాష పెరిగిపోయింది. నటననే వృత్తిగా స్వీకరించాలన్న తపన కూడా ఆమెలో పెరిగిపోయింది. కానీ ఇంట్లో వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు, అందులోనూ వాళ్ళ నాన్న గారు కూడా చనిపోయారు. అందువలన ఆమె పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. కళల మీద ఆసక్తితో ఆరేళ్ళ వయస్సు నుండే పాటలు పాడటం, నృత్యం కూడా నేర్చుకున్నారు. ఆమె సమీప బంధువు బాలాంత్రపు ప్రభాకర రావు “హనుమాన్ నాట్యమండలి” అనే నాటక సమాజం పేరుతో నాటకాలు వేయిస్తూండేవారు. అందులో అంతా ఆడవాళ్లే నటించేవారు. ఆ విధంగా సూర్యకాంతం ఆ నాటక సమాజంలో చేరి “సక్కుబాయి”, “తులాభారం”, “చింతామణి” లాంటి నాటకాలలో శంభుశాస్త్రి, వసంతకుడు, కాశీపతి వంటి పాత్రలు వేస్తూ ఉండేవారు. కాకినాడలోని మెక్ లారెన్స్ పాఠశాలలో మెట్రిక్యులేషన్ కూడా పూర్తయ్యింది.
సినీరంగ ప్రవేశం…
జెమిని వాళ్ళు చంద్రలేఖ (1943) సినిమాకు సన్నాహాలు చేస్తున్న రోజులు అవి. భారీ ఖర్చుతో, ఎక్కువ మంది తారలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నందున ఆ సినిమాకు తారలు కావాలని పత్రికలలో ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆ ప్రకటనల పట్ల ఆసక్తి కనబరచిన యండమూరి సుభద్ర, దాసరి సుభద్రలు మద్రాసు బయలుదేరుతూ తమతోబాటుగా నాటకాలలో నటిస్తున్న సూర్యకాంతాన్ని కూడా తమతో మద్రాసుకు తీసుకెళ్లారు. చెన్నపట్నం చేరిన ఈ ముగ్గురు చలాకితనం జెమిని వాళ్లకు బాగా నచ్చింది. వారిని చంద్రలేఖ సినిమాలో నృత్య సన్నివేశాలకు తీసుకున్నారు. చంద్రలేఖ సినిమాకు నేపథ్య గాయనిగా పనిచేస్తున్న గాయని పి.లీలకు సూర్యకాంతం మాటకారితనం బాగా నచ్చింది. తను పనిచేస్తున్న “నారద నారది” (1946) సినిమా దర్శకులు చిత్తజల్లు పుల్లయ్యకు చెప్పారు. సూర్యకాంతం మాటకారితనాన్ని పరీక్షించిన దర్శకులు “చిత్తజల్లు పుల్లయ్య” ఆమెకు ఆ సినిమాలో ఒక చిన్న వేషం కూడా ఇచ్చేశారు. అది తెలిసిన జెమినీ పిక్చర్స్ వారు కోప్పడ్డారు. చేసేది లేక ఆమె జెమినీ పిక్చర్స్ వారి ఒప్పంద పత్రాన్ని రద్దుచేసుకున్నారు. ఆ విధంగా సూర్యకాంతం నటించిన తొలి సినిమా “నారద నారది” (1946) అయ్యింది. ఆ తరువాత గృహప్రవేశం (1946), రత్నమాల (1948), ధర్మాంగద (1949), శివగంగ లాంటి సినిమాలలో అవకాశాలు వచ్చాయి.
24 యేండ్లకే 60 యేండ్ల ముసలావిడగా…
గృహప్రవేశం (1946), రత్నమాల (1948), ధర్మాంగద (1949), శివగంగ లాంటి సినిమా నటించిన తరువాత సూర్యకాంతం సంసారం (1950) అనే సినిమాలో నటించారు. అయితే ఆమె నటించిన పై సినిమాలలో దేనితోనూ రాని పేరును “సంసారం” సినిమాతో వచ్చింది. ఆ సినిమా ఆమెకు ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 24 ఏళ్ల వయసున్న సూర్యకాంతం సంసారం (1950) సినిమాలో 60 ఏళ్ల శేషమ్మ పాత్రలో రేలంగికి తల్లిగా నటించారు. ఆ చిత్రంలో “నేను విదేశాలన్నీ తిరిగొచ్చిన దాన్ని” అనే గొప్పలుపోయే ఓ పాత్రతో “నువ్వేమిటి? ముక్కానీ పోస్టు కార్డు వెళుతుంది” అని సూర్యకాంతం చెప్పిన సంభాషణను ఆనాటి ప్రేక్షకులు పదేపదే చెప్పుకునేవారు. ఆ విధంగా సంసారం సినిమాలో 60 ఏళ్ల శేషమ్మ పాత్ర ఆవిడకి ఎనలేని పేరు తెచ్చిపెడితే “రూపవతి” సినిమా ఆమె ఖ్యాతిని సుస్థిరం చేసింది. అంతే సూర్యకాంతం ఓ ప్రత్యేక తరహా పాత్రలకు ఏకైక చిరునామాగా మారిపోయింది. ఆమె రెండవ చిత్రం స్వస్తిక్ ప్రొడక్షన్స్ వారి ధర్మాంగద (1949) చిత్రంలో ఆమెది మూగ, కుంటి వేషం. ఆ పాత్రలో నటించినప్పుడు ఆమె యొక్క కాలు మడిచి కట్టకుండానే, వికలాంగురాలి పాత్రలో ఎంతో సహజంగా నటించారు. ఆ సమయంలో ఆమెను చూసిన తాపీ ధర్మారావు నీలో ఎంత ప్రతిభ ఉందేమమ్మా అని ఆమెను ప్రశంసించారు.
గయ్యాళి అత్త పాత్రలలో…
ధర్మాంగద (1949) చిత్రంలో సైగలుచేస్తూ నటించడంతో ఆరంభమైన ఆమె సినిమా జీవితం ఆ తరువాత క్రమక్రమంగా కోటి ప్రభలతో ప్రకాశించింది. ధర్మాంగద చిత్రం తరువాత గృహప్రవేశం లాంటి చిత్రాలలో చిన్నచితకా వేషాలు వేసిన ఆమె నటన సంసారం (1950) సినిమాతో మలుపులు తిరిగింది. సూర్యకాంతం శ్రీ గజాననా ప్రొడక్షన్స్ వారి కోడరికం (1953) లాంటి సినిమాల నుండి ఆవిడ అత్త పాత్రలను వేయనారంభించారు. కోడరికం చిత్రం తరువాత గయ్యాళి అత్త పాత్రలకు సూర్యకాంతం పెట్టింది పేరుగా మారిపోయారు. నిజ జీవితాలలో ఏ అత్తగారైన కోడలిని రాచిరంపాన పెడుతుంటే “అమ్మో ఆవిడ సూర్యకాంతమే” అని అందరూ చెప్పుకునే స్థాయికి ఆవిడ ఎదిగిపోయారు. సినిమాల చిత్రీకరణకు గానీ, సినిమా శతదినోత్సవ వేడుకలకు గానీ, ఏదైనా వివాహ వేడుకలకు గానీ సూర్యకాంతం వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ ల కోసం వచ్చే అభిమానులు ఆమె దగ్గరికి వెళ్లడానికి భయపడేవారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒకసారి సుత్తివేలు “మనం పిల్లలకు రాక్షసుల పేర్లు పెట్టము, అలాగే మీ పేరు పెట్టడానికి కూడా భయపడతారు ఎందువలనమ్మా” అని సూర్యకాంతంను అడిగారు. దానికి ఆమె కోప్పడకుండా “ఏం చేస్తాం! నేనంటే అందరికీ అలాంటి భయభక్తులు ఉన్నందుకు సంతోషమే అని చమత్కరించారు.
నటిగా 750 చిత్రాలలో…
సూర్యకాంతం చిన్నప్పటినుంచి పత్తేదారు పుస్తకాలు చదవడం వలన కాబోలు ఆవిడకు భయమంటే ఏమిటో తెలియదు. ఆమె చెప్పదలుచుకున్నది ఏదయినా చాలా సూటిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. ఏ మాత్రం తీరిక దొరికినా కూడా ఆవిడ రేడియో నాటకాలలో విరివిగా పాల్గొనేవారు. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, ఆంగ్లము, హిందీ కూడా అనర్గళంగా మాట్లాడేవారు. దోదులే, బహుత్ దిన్ హువే వంటి కొన్ని హిందీ సినిమాలలో కూడా సూర్యకాంతం నటించారు. “భట్టి విక్రమార్క” సినిమా చిత్రీకరణ కోసం ఆవిడ పూణేలో ఉన్న సమయంలోనే మరాఠీ కూడా వంటపట్టించుకున్నారు. ఆవిడ ఏనాడు తన అందచందాలను నమ్ముకోలేదు. ఆమె తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించడం మీదనే దృష్టి పెట్టారు. ఆవిడ తన నిజజీవితంలో ఎన్నో డక్కాముక్కీలు తిన్నారు, కానీ జీవితం మీద ఏనాడూ తన ప్రేమను కోల్పోలేదు.
ఆమె సినీరంగంలో ప్రవేశించే నాటికి ఏడాదికి పట్టుమని పది సినిమాలు కూడా తయారయ్యేవి కాదు. అలాంటి రోజులలో సినిమాకి వచ్చిన సూర్యకాంతం కాలక్రమంలో 750 సినిమాలలో తనదైన ముద్రవేశారు. రత్నమాల (1948), లైలామజ్ను (1949), చక్రపాణి (1954), పెళ్లిచేసి చూడు (1952), చంద్రహారం (1954), దొంగ రాముడు (1955), చిరంజీవులు (1956), కన్యాశుల్కం (1955), భాగ్యరేఖ (1957), మాయాబజార్ (1957), మాంగల్యబలం (1959), అత్తా ఒక్కంటి కోడలే (1958), గుండమ్మ కథ (1962), దాగుడుమూతలు (1964), మూగమనసులు (1964) ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద దండకమంతా అవుతాయి సినిమా పేర్లు. తెలుగులోనే కాకుండా “మరుమగల్”, “కుడుంభం”, “ఏలై ఇన్ ఆస్తి” వంటి తమిళ చిత్రాలలోనూ బహుత్ దిన్ హువే, దోదుల్హే, బాలనాగమ్మ వంటి హిందీ చిత్రాల్లోనూ ఆవిడ నటించారు.
గుణంలో సౌమ్యురాలు…
సూర్యకాంతం వ్యక్తిగా చాలా సౌమ్యురాలు, సున్నిత మనస్కురాలు, చక్కని మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేవారు. స్థాయితో సంబంధం లేకుండా మనుషులను అభిమానించేవారు సూర్యకాంతం. జీవితంలో ఈ రోజే మనది, రేపు ఏమవుతుందో చెప్పలేమని భావించే సూర్యకాంతం తనకు ఇష్టమైనవన్నీ వండుకు తినేవారు. తన చుట్టూరా ఉన్న వారికి కూడా పెట్టేవారు. ఆవిడ చిత్రీకరణకు వచ్చిందంటే చాలు వెంట పదిమందికి సరిపడా పదార్థాలు ఉన్న క్యారేజీ ఉండేది. పండుగలు వస్తే కూలీలకు కట్నాలు వేసేవారు. ఆ సినిమాలో అలా వ్రాశాం, ఈ సినిమాలో ఇలా రాద్దాం అంటూ రచయితలు కూడా మార్చి మార్చి ఆవిడకు కొత్త గయ్యాళితనాలు అన్వేషించి మరీ వ్రాసేవారు. ఆమెకు దర్శకులు కేవలం సన్నివేశం వివరించి “అమ్మా మీకు చెప్పేదేముంది కొంచెం మషాలా ఘుమాయించండి” అనేవారు. వాళ్ళ ఊహలకు అందని విధంగా సన్నివేశాన్ని పండించేవారు సూర్యకాంతం. ఆ రోజులలో “మొదటి టేక్ లోనే షాట్ ఓకే చేయించుకున్న అతికొద్దిమంది కళాకారుల” లో సూర్యకాంతంది అగ్రస్థానం. ఆ రోజులలో గుండమ్మ కథ, తోడికోడళ్ళు, కుల గోత్రాలు, మాయాబజార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ ఎన్నో సినిమాలు మనకు గుర్తుకొస్తాయి, ఆహ్లాదాన్ని ఇస్తాయి.
దానశీలి…
తక్కువ పారితోషికం ఉన్న ఆ రోజులలోనే సూర్యకాంతం లక్షలు సంపాదించారు. 1950 వ సంవత్సరంలో హైకోర్టు జడ్జి పెద్దిబొట్ల చలపతిరావుని వివాహం చేసుకున్నారు. కానీ ఆమెకు పిల్లలు లేరు. సూర్యకాంతం తన అక్క కుమారుడు అనంత పద్మనాభ మూర్తిని దత్తత తీసుకున్నారు. ఎంతోమందికి ఆవిడ గుప్తదానాలు చేశారు. వికలాంగ కేంద్రాలకు, విద్యాసంస్థలకు, గ్రంథాలయాలకు, సాంస్కృతిక సంస్థలకు విరాళాలు అందజేశారు. ముసలితనంలో ఆదరణకు నోచుకోని రంగస్థలం కళాకారులు ఎంతో మందిని డబ్బు ఇచ్చి ఆదుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘానికి భారీ ఎత్తున విరాళాలు ఇవ్వడమే కాకుండా, వారి కోసం విరివిగా నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. దివిసీమ తుఫానుకు గురైనప్పుడు తోటి కళాకారులతో ఆ వయస్సులో కూడా రాష్ట్రమంతట 27 రోజులు అవిశ్రాంతంగా పర్యటించి విరాళాలు సేకరించి బాధితులకు అందజేశారు సూర్యకాంతం. ఎన్నో బిరుదులు ఆమెను వరించాయి. మరణించడానికి కొద్ది రోజుల ముందు కూడా సావిత్రి స్మారక అవార్డును అందుకున్నారు. సూర్యకాంతం చివరగా “ఎస్పీ పరశురామ్” సినిమాలో నటించగా, “అన్న” సినిమా శతదినోత్సవ ఉత్సవంలో చివరిసారిగా కనిపించారు.
స్వర్గప్రాప్తి…
సూర్యకాంతం జీవన మలిసంధ్యలో మధుమేహ వ్యాధి బారిన పడ్డారు. చాలా కాలం మూత్రపిండాల వ్యాధితో కూడా బాధపడ్డారు. కానీ ఆ విషయం ఎవ్వరికీ కూడా తెలియనివ్వలేదు. ఆవిడ డయాలసిస్ చేయించుకుని మరి చిత్రీకరణకు హాజరయ్యేవారు. చేతికి కట్టు కట్టుకొని స్టూడియోకి వచ్చిన ఆవిడని ఎవరైనా ఏమిటని అడిగితే తనకు దెబ్బ తగిలింది అని అబద్ధం ఆడేవారు. అనారోగ్య విషయం తెలిస్తే ఎక్కడ వేషాలు పోతాయో అని భయపడేవారు. ఆ వయస్సులో ఆమె నటించేది డబ్బు కోసం కాదు. ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందని ఆమె ఉద్దేశ్యం. చిత్రీకరణ అంటే ఆవిడకు పండుగ. కానీ ఆమె కోరికను ఎక్కువ కాలం నిలుపలేని భగవంతుడు 18 డిసెంబరు 1994 నాడు ఆమెకు పూలరథం పంపించి స్వర్గప్రాప్తి కలుగజేశాడు.
ఆమె మరణం యావత్ ఆంధ్రదేశాన్ని కలచివేసింది. వందల మందికి దానం చేసిన ఆవిడ ఏనాడూ ఎవ్వరినీ చేయి చాచి అడుగలేదు. ఎవ్వరినీ దేనికీ ఆవిడ దేబిరించలేదు. 750 సినిమాలలో నటించిన మనిషికి ఎంతోమందితో అనుబంధం ఉండి ఉండాలి. కానీ ఆవిడ నిష్క్రమించిన మరునాడు మద్రాసు లోని మైలాపూర్ లో జరిగిన ఆవిడ అంత్యక్రియలకు చిత్ర పరిశ్రమ నుండి కేవలం పదిమంది మాత్రమే హాజరయ్యారు. వారిలో అంజలీదేవి, జి.వరలక్ష్మి, అల్లు రామలింగయ్య, వాణిశ్రీ, గీతాంజలి, రావికొండలరావు, రాధ కుమారి, కె.వి. రావు మొదలగువారు. అంజలీదేవి దుఃఖమైతే ఆరోజు వర్ణనాతీతం అని చెప్పాలి. ఆమె మరణ వార్తను ముందు రోజు రాత్రి రేడియోలో విని తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వెంటనే తన అధికార కార్యక్రమాలకు విరామం ఇచ్చేసి ఆమె ఇంటికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.