సనాతన ధర్మంలో హిందూ వివాహ వ్యవస్థ ఎంతో గొప్పగా వర్ణించబడుతోంది. వధూవరులను సాక్ష్యత్తు దేవతలుగా భావించి వివాహాన్ని జరిపిస్తారు పురోహితులు. పాశ్చాత్య దేశాలలో కంటే భారతదేశంలో వివాహ వ్యవస్థ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. హిందూ వివాహ వ్యవస్థను పాశ్చాత్య దేశస్తులు కూడా అభినందిస్తున్నారు. అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న హిందు వివాహ వ్యవస్థను అభినందించే విదేశీయులు సైతం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో భారతదేశంలోని యువతకు పెళ్లిపై ఆసక్తి అనేది తగ్గిపోతుంది. నేటి యువత స్వేచ్ఛాయుత జీవనానికి అలవాటు పడి వివాహానికి దూరంగా ఉంటున్నట్టు సర్వేల ద్వారా వెళ్లడయ్యింది.
ప్రస్తుత కాలంలో ప్రేమ, పెళ్లి, రొమాంటిక్ లైఫ్ వంటి విషయాల్లో అభిప్రాయాలకు కాలం చెల్లిందంటున్నారు నిపుణులు. యువతుల ఆలోచనలో మార్పు వస్తోందని, పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండేందుకే నేటి యువతులు ఆసక్తి చూపుతున్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. యువతుల ఆలోచన విధానం పరిశీలిస్తే….
మారుతున్న జీవనశైలి.. గృహిణిగా ఉండేందుకు ఇబ్బంది..
నేటి యువతుల ఆలోచనా విధానంలోఎన్నో మార్పులు వచ్చాయి. వారి జీవనశైలిలో మార్పులను గమనించవచ్చు. తన ఇష్టాలను చంపుకొని బ్రతకడం కంటే స్వేచ్ఛాయుత జీవనాన్ని గడపడానికే నేటి యువతులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. నేటి కాలం మహిళల్లో, పెళ్లికాని యువతుల్లో ఆలోచన విధానం మారుతోంది. ఒకప్పుడు పెళ్లి, కుటుంబం వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఉండేది. పిల్లల్ని కనడం, కుటుంబం మొత్తానికి వంట చేయడం, గృహిణిగా ఇంటి బాధ్యతలు చేపట్టడం వంటివి ముఖ్యమైన విధిగా భావించేవారు.
అయితే.. మహిళలు వంటిల్లు కుందేలుగా ఇంట్లోనే ఉండడం వివక్షతకు దారితీస్తుంది. పురుషులు వ్యవసాయం లేదా ఉద్యోగం వంటివి చేసి కుటుంబాన్ని పోషించే బాధ్యత నిర్వర్తించేవారు. కానీ ఒక మహిళ గృహిణిగా ఎన్ని పనులు చేసినప్పటికీ గుర్తింపు పొందకపోవడం వారికి ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. అదే సామాజికపరంగా మహిళలపట్ల వివక్ష, చిన్నచూపుకు దారితీస్తుందనేది వారి భావన. ఆధునిక కాలంలో చాలా మార్పులు వచ్చాయి. నేటి యువతులు ఎక్కువ తాము ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతోనే జీవితాన్ని గడుపుతున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయి.
సమానత్వ భావాలు.. మహిళల్లో పెరుగుతున్న ఆర్థిక మానసిక చైతన్యం..
మహిళల్లో ఆర్థిక, మానసిక చైతన్యం పెంపొందుతోంది. మహిళలు కూడా చదువు, ఉద్యోగం వంటి విషయాల్లో ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆలోచన కూడా వారిని వివాహానికి దూరంగా ఉండేలా చేస్తుంది. ఫలితంగా తమకాళ్లపై తాము నిలబడగలమనే నమ్మకం ఏర్పడుతోంది. పురుషాధిక్యతను, పితృ స్వామిక భావాలను నేటి యువతులు వ్యతిరేకిస్తున్నారు. సామాజిక అవగాహనతో, అధ్యయనంతో స్త్రీలు నేడు తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు. నచ్చని విషయాలను వ్యతిరేకించడం, తమ స్వేచ్ఛను కాపాడుకోవడంలో భాగంగా నిర్ణయాలు స్వేచ్ఛాయుత నిర్ణయాలను సైతం తీసుకుంటున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగానే ఇప్పుడు యువతులు ప్రేమ, పెళ్లి, డేటింగ్ వంటి అంశాల్లో సొంత నిర్ణయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లిపై ఆసక్తి తగ్గుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇతరుల జోక్యాన్ని సహించకపోవడం నేటి యువతుల్లో గమనించవచ్చు.
వివాహం అతి ముఖ్యమైనది కాదనే భావన…
వివాహం అనేది జీవితంలో రెండవ ప్రాధాన్యతగల అంశంగా నేటి కాలం యువతులు పరిగణిస్తున్నారు. వీలైతే పెద్దగా అవసరం లేని విషయంగా కూడా భావిస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు యుక్త వయస్సు దాటగానే ‘అమ్మాయి పెళ్లెప్పుడు చేస్తారు’ అనే మాటలు తల్లిదండ్రులకు ఇబ్బందిగా అనిపించేవి. తమ బిడ్డల పెళ్లిళ్లకు తొందర పడేవారు. కానీ కాలం మారే కొద్ది తల్లిదండ్రులో కూడా ఆలోచన విధానం మారుతుంది. అమ్మాయిలను బాగా చదివిస్తే వారే ఉద్యోగరీత్యాస్థిరపడి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం ఆమె ఇష్టానికే వదిలేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో మహిళలు వ్యక్తిగత స్వేచ్ఛకు, అభివృద్ధికి, వృత్తిపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పవచ్చు. నేటి కాలంలో యువతుల ఆలోచన విధానం.. వారి తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు కూడా వివాహంపై యువతులు అంతగా ఆసక్తి చూపడం లేదనేది స్పష్టం అవుతుంది.
ఆర్థిక ఎదుగుదలపై ఆలోచన…
ఒకప్పటి కాలంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే వారిని పోషించడానికి భర్త మాత్రమే కష్టపడేవాడు. ఉద్యోగము వ్యవసాయం చేస్తూ భార్యలను, వారి సంతానాన్ని పురుషులే పోషించేవారు. ఇది కూడా నేటి యువతలో చులకన భావంగా మారుతుంది. ఆర్థికంగా తాము సంపాదించాలని ఆలోచన విధానం నేటి యువతులలో ఎక్కువగా కనిపిస్తోంది. పురుషులకంటే తామేమి తక్కువ కాదంటూ అన్ని రంగాలలో మహిళలు దూసుకెళ్తున్నారు. ఈ ఆలోచన విధానం కూడా వివాహానికి దూరంగా ఉండేందుకు కారణమని చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగం చేసే అమ్మాయిల ఆలోచన విధానం డబ్బు సంపాదన పైనే ఉంటుంది కానీ పెళ్లి, పిల్లలు అనే ఆలోచనను కట్టిపడేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
సర్దుకోలేక విడాకుల బాట..
ఒకప్పుడు 20ఏళ్లకే పెళ్లి చేసుకొని తల్లి కావాలనే ఆసక్తి యువతుల్లో ఉండేది. భర్త , పిల్లలు, కుటుంబమే లోకంగా భావించే వారు. కానీ ఇప్పుడలా కాదు. తమకంటూ సొంత జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు నేటి యువతులు. నేటి కాలంలో మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తమ స్వేచ్ఛాయుత జీవితానికి వివాహ బంధం ఇబ్బందికరంగా మారుతోందని విడాకుల బాట పడుతున్నట్టు నిపుణులు వెల్లడించారు. మహిళల్లో విడాకులు సంఖ్య పెరుగుతోందని, భవిష్యత్తులో మరింత పెంగరవచ్చని స్టాన్టీ అనే సర్వే పేర్కొన్నది. దీంతో కూడా ఒంటరి మహిళల సంఖ్య పెరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇంకొందరు పెళ్లి, ఉద్యోగం, కుటుంబం మధ్య సమతుల్యత అవసరమంటున్నారు. అందుకే చదువు, కెరీర్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒంటరితనం లేదా సింగిల్ లైఫ్ కోరుకునే మహిళల సంఖ్య పెరుగుతోందట.
పిల్లల్ని కనడంపై అనాసక్తి.. పెరగనున్న ఒంటరి మహిళల సంఖ్య
మోర్గాన్ స్టాన్టీ ఆర్గనైజేషన్ అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది. 2030 నాటికి ప్రపంచంలో ఒంటరిగా ఉండే మహిళల సంఖ్య 45 శాతానికి పెరగనున్నట్టు అంచనా వేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పుట్టే పిల్లల సంఖ్య కూడా తగ్గిపోనుందని నిపుణులు పేర్కొంటున్నారు. నేటి యువతులు పెళ్లి చేసుకొని, ఇంటి పట్టునే ఉండి పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపడం లేదట. ఇంటి బాధ్యతలకన్నా నచ్చిన చదువులు చదవడం, ఉద్యోగాలు చేయడం, వీలైనంత వరకు పెళ్లి, పిల్లలు వంటి విషయాలకు దూరంగా జీవితాన్ని గడపడానికే పలువురు మహిళలు ఆసక్తి చూపుతున్నారని నిపుణులు మాట. మారుతున్న కాలంతో పాటు యువతుల ఆలోచన విధానం శైలి కూడా మారుతుంది. పురుష అధిక్యతకు విసిగిపోయిన నేటి యువతులు.. సమాజంలో తమకంటూ ఒక పరిధిని ఏర్పరచుకుంటున్నారు. పెళ్లి పిల్లలు అనే మాటను దాటేసి వారి సొంత ప్రపంచంలో స్వేచ్ఛాయుత జీవనాన్ని గడపడానికే ఆసక్తి చూపుతున్నారు.