GREAT PERSONALITIESTelugu Cinema

అన్నపూర్ణ కంఠాభరణం.. దుక్కిపాటి మధుసూదన రావు

దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 17, 1917 – మార్చి 26, 2006)

సినిమా అంటేనే వ్యాపారం. సినిమా అంటేనే వినోదం. అలాంటి సినిమాని వినోదాత్మకంగా తీసి, ప్రేక్షకులను మెప్పించి పెట్టిన పెట్టుబడిని లాభాలతో రాబట్టుకోవడం నిర్మాతకు కత్తిమీద సాము లాంటిది. ఎంత గొప్ప మేధావులైనా, జనం నాడి పట్టక పోతే లాభం లేదు అంటారు. అసలు జనం నాడిని పట్టుకోవడమే పెద్ద విద్య. సదరు విద్యలో ఆరితేరిన వారు అరుదుగా ఆగుపిస్తారు. అలాంటి వారు వరుస విజయాలు చూస్తారు. నిర్మాత, అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు గారూ ఆ కోవకు చెందినవారే.

జానపదాలు, పౌరాణికాల జోలికి వెళ్లకుండా కేవలం సాంఘిక చిత్రాలనే నిర్మించి 1955 నుండి 1994 వరకు సుమారు 22 చిత్రాలను నిర్మిస్తే అందులో 16 చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. దీనిని బట్టి దుక్కిపాటి గారికి చిత్ర నిర్మాణం మీద పట్టు, సృజనాత్మకత ఏపాటిదో మనకు అర్థమైపోతుంది. దాదాపు మూడున్నర దశాబ్దాలు చిత్ర రంగంలో ఉండి విలువలు కలిగిన అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదన రావు గారూ.

దుక్కిపాటి గారి దూరదృష్టి మూలంగానే, అక్కినేని నాగేశ్వరరావు గారూ మహానటుడు అనిపించుకోగలిగారు. దుక్కిపాటి గారూ తమ ‘అన్నపూర్ణ’ పతాకంపై జనం మెచ్చే చిత్రాలు తెరకెక్కించి పదికాలాల పాటు జనం మదిలో నిలచిపోయారు. “తన ప్రతి విజయం వెనుక ఉన్నది దుక్కిపాటి వారి మేధాశక్తి” అని అక్కినేని నాగేశ్వరావు గారూ అనేక సందర్భాలలో చెప్పుకున్నారు. దుక్కిపాటి గారూ నెలకొల్పిన “ఎక్సెల్సియర్ నాటక సమితి” లోనే అక్కినేని గారూ ఎక్కువగా వేషాలు వేశారు. దుక్కిపాటి గారి ప్రోత్సాహంతోనే అక్కినేని గారూ చిత్రసీమలో అడుగు పెట్టారు, ఘంటసాల బలరామయ్య గారిని ఆకట్టుకోగలిగారు. ఆ తరువాత తెలుగు చిత్రసీమలో తిరుగులేని కథనాయకుడిగా వెలిగిపోయారు.

జీవిత విశేషాలు.

జననం: 27 జూలై 1917

స్వస్థలం: కృష్ణా జిల్లా గుడివాడ తాలూకులోని పెయ్యూరు

తండ్రి: సీతారామ స్వామి

తల్లి : గంగాజలం, అన్నపూర్ణ ( సవతి తల్లి )..

పురస్కారాలు: రఘుపతి వెంకయ్య అవార్డు,

మరణం: మార్చి 26, 2006

జననం.

దుక్కిపాటి మధుసూదనరావు గారు 17 జూలై, 1917 తేదీన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకులోని పెయ్యేరు గ్రామంలో సీతారామ స్వామి, గంగాజలం దంపతులకు జన్మించారు. దుక్కిపాటి గారికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉన్నారు. చివరిసారిగా ఒక ఆడ కూతురుకు జన్మనిచ్చిన తరువాత దుక్కిపాటి మధుసూదన రావు గారి కన్నతల్లి కనుమూశారు. నలుగురు పిల్లలను చూసుకోవడం దుక్కిపాటి గారి తండ్రి గారికి ఇబ్బందిగా మారింది. తన బంధువుల సలహాతో సీతారామ స్వామి గారూ (దుక్కిపాటి మధుసూదన రావు గారి తండ్రి) అన్నపూర్ణ గారిని రెండో వివాహం చేసుకున్నారు. పేరుకు సవతి తల్లి కానీ వారిని తన కన్న బిడ్డల్లాగా పెంచి పెద్దచేశారు. అన్నపూర్ణ గారూ కన్నతల్లి ప్రేమ ఎరుగని దుక్కిపాటి గారిని లాలించి, బుజ్జగించి, తీర్చి, ప్రయోజకుడిని చేశారు. అందుకే ఆయన ఆ తల్లిని మరవలేకపోయారు. అందుకే ఆయన ఆమె పేరు మీద అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు.

విద్యాభ్యాసం..

దుక్కిపాటి మధుసూదన రావు గారూ తన విద్యాభ్యాసాన్ని బందరు (మచిలీపట్నం) లో కొనసాగించారు. ఉన్నత చదువులు చదవాలంటే ఆ రోజుల్లో విజయవాడ లేదా మచిలీపట్నం కు వెళ్లి చదువుకునేవారు. అలా తన ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ చదువు మచిలీపట్నంలో పూర్తిచేసిన దుక్కిపాటి మధుసూదన రావు గారూ డాక్టరు చదవాలనే అభిలాషతో ఉండేవారు. అందుకోసం మద్రాసుకు వెళ్ళాలనుకున్నారు. ఆర్థికంగా చాలా ఉన్నతమైన కుటుంబంలోనే జన్మించిన దుక్కిపాటి మధుసూదన రావు గారికి డాక్టరు చదవడం పెద్ద విషయమేమి కాదు. కానీ సరిగ్గా అదే సమయానికి తన తండ్రి అనారోగ్యంతో మంచం పట్టడంతో చదువు మానక తప్పింది కాదు. చదవు మానేసి వ్యవసాయం పనులు చేశారు. అలా కొన్నాళ్లకి వ్యవసాయం ఒక దారికి రాగానే దుక్కిపాటి గారూ మళ్లీ చదువుపై దృష్టి సారించారు. మచిలీపట్నంలోని నోబుల్‌ కళాశాలలో బి.ఏ. లో చేరారు. అక్కడ ఆయన చక్కని కార్యకర్తగా ఎదగడానికి పరిస్థితులు ప్రేరేపించాయి. కళాశాలలో జరిగిన ‘డ్రమెటిక్‌ అసోసియేషన్‌’ ఎన్నికల్లో నిలిచి దానికి కార్యదర్శి అయ్యారు దుక్కిపాటి గారూ, అధ్యక్షులుగా ఎం.ఆర్‌.అప్పారావు గారూ ఎన్నికయ్యారు. తన ధ్యాస నాటకాల వైపు మళ్ళడంతో ఆ కాలంలో ఆయన ఎన్నో నాటికలను విద్యార్థులచేత ప్రదర్శింపచేశారు. అలా ఆయన విద్యార్థి దశనుంచే నాటకానుభవం గడించారు.

చదువు పూర్తయ్యాక “ఎక్సెల్సియర్ నాటక సమితి” అనే నాటక సంస్థను ప్రారంభించారు. దానికి కార్యదర్శి అయ్యారు. కోడూరి అచ్చయ్య, ఎం.ఆర్‌.అప్పారావు వంటి మిత్రులతో కలసి ఆ క్లబ్బు తరుపున నాటకాలు విరివిగా ప్రదర్శించారు. మధుసూదనరావు గారూ “ఎక్సెల్సియర్ నాటక సమితి” తెచ్చిన సంస్కరణలే ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆ కాలంలో పౌరాణిక నాటకాలకే ఆదరణ ఎక్కువగా ఉండేది. వాటి ఆధిపత్యాన్ని తగ్గించాలనుకొన్న దుక్కిపాటి గారూ సాంఘిక నాటకాల రూపకల్పనకు నడుం బిగించారు. ఎక్సెల్సియలర్ నాటక సమితిలో దుక్కిపాటితో పాటు పెండ్యాల నాగేశ్వరావు గారూ, బుద్ధిరాజు శ్రీరామమూర్తి గారూ వంటివారూ ఉండేవారు. వారి సహకారంతో ఆయన “ఆశాజ్యోతి”, “తెలుగుతల్లి”, “సత్యాన్వేషణ” వంటి సాంఘిక నాటకాలను వ్రాయించి వాటిని ప్రదర్శించేవారు. అవి ఘనవిజయాలన్ని సాధించాయి. ఆ తరుణంలోనే దుక్కిపాటికి గారికి అక్కినేని గారితో పరిచయం ఏర్పడింది.

వివాహం..

దుక్కిపాటి గారి చదువు పూర్తయిపోయింది. తన వయస్సు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి తనకు పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. 1937 వ సంవత్సరంలో వాళ్ళ వూరికి దగ్గరలో గల కాటూరులో సుశీలదేవి తో వివాహం జరిపించారు.

అక్కినేని గారితో పరిచయం, అనుబంధం..

దుక్కిపాటి గారూ నిర్వహిస్తున్న “ఎక్సెల్షియర్ నాటక సమితి” లో ప్రదర్శించే నాటకాలలో “ఆశాజ్యోతి” నాటకంలో కథానాయకి పాత్ర కోసం ఒక అబ్బాయిని వెతుకుతుండగా గుడివాడలో బుద్దిరాజు శ్రీరామమూర్తి పర్యవేక్షణలో ప్రదర్శిస్తున్న “విప్రనారాయణ” నాటకంలో “దేవదేవి” పాత్ర వేస్తున్న అక్కినేని గారిని చూశారు. “ఎక్సెల్షియర్ నాటక సమితి” అధ్యక్షులు కోడూరి అచ్చయ్య గారూ, కార్యదర్శి దుక్కిపాటి గారూ కలిసి ఆ “విప్రనారాయణ” నాటకాన్ని వీక్షించిన అనంతరం అక్కినేని గారు వేసిన దేవదేవి పాత్రకు ముగ్ధులై ఒక వెండి బహుమతిని బహుకరించారు. ఆ రోజుల్లో నాటకాలలో ఆడ పాత్రలు కూడా మగవారితోనే నటింపజేసేవారు. ఆ నాటకం, అక్కినేని గారి నటన చూసి తాము ప్రదర్శించే నాటకాలకు అక్కినేని గారూ సరిగ్గా సరిపోతారని భావించి అక్కినేని గారి అన్నయ్య గారి అనుమతితో అక్కినేని నాగేశ్వరావు గారిని నాటకాల కోసం ముదినేపల్లిలో వున్న “ఎక్సెల్షియర్ నాటక సమితి” కి తీసుకెళ్లారు.

ముదినేపల్లితో బాటుగా గుడివాడ, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి లలో కూడా నాటకాలు ప్రదర్శించేవారు. కొన్నాళ్ళకు “ఎక్సెల్సియర్ నాటక సమితి” ని ముదినేపల్లి నుండి గుడివాడకు మార్చారు. మచిలీపట్నం, విజయవాడ, పాలకొల్లు, విజయనగరం, తెనాలి అన్నిచోట్లా నాటక సంఘాలు ఉండేవి. ఎక్కడైనా నాటకం వేయాలంటే ఈ నాటక సంఘాలతో ఒప్పందం కుదుర్చుకుని నాటకాలు వేయించుకునేవారు. మచిలీపట్నంలో “ఇండియన్ డ్రామెటిక్ కంపెనీ”, “ఆంధ్ర నాటక కళాపరిషత్” అనే నాటక సంస్థలు ఉండేవి. డి.వి. సుబ్బారావు గారూ నిర్వహిస్తున్న “ఇండియన్ డ్రామెటిక్ కంపెనీ” నాటక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందామని వెళ్లే నాటక నిర్వాహకులు, మార్గమధ్యలో ఉన్న గుడివాడకు వెళ్లి అక్కినేని గారి నాటక అభినయం చూసి “ఎక్సెల్సియర్ నాటక సమితి” వాళ్ళతోనే నాటకం వేయించుకునేవారు. అంతగా అక్కినేని గారి నటన ప్రాభవం ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఒకసారి “పాలకొల్లు” లో ఆశాజ్యోతి అనే నాటకం వేస్తున్నారు. ఆ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ముచర్ల సుబ్బారావు గారూ తన మిత్రుడితో కలిసి ఆ నాటకం చూస్తున్నారు. 52 ఏళ్ళ వయస్సున్న తన మిత్రుడు అక్కినేని గారూ నటిస్తున్న స్త్రీ పాత్రకేసి ఆసక్తికరంగా చూస్తున్నాడు. అప్పుడు ముచర్ల సుబ్బారావు గారూ తన మిత్రుడితో అంత ఆసక్తిగా కథానాయకిని చూస్తున్నావు. ఆమెను పెళ్లిచేసుకుంటావా అని అడిగారు. అప్పుడు తన మిత్రుడు “నా భార్య చనిపోయింది కదా. చేసుకుంటాను” అన్నారు. ఇది విన్న ముచర్ల సుబ్బారావు గారూ రేపు నాటకాలు వేసిన వారిని మన ఇంటికి భోజనానికి పిలుస్తాను, అక్కడ మాట్లాడుదాం అన్నారు. మరునాడు నాటక సభ్యులు భోజనానికి వచ్చినప్పుడు అక్కినేని గారిని తన మితుడికి చూపించి ఇతనే ఆ స్త్రీ పాత్రదారి అని చెప్పారు ముచర్ల సుబ్బారావు గారూ. దాంతో తన మిత్రుడు అవాక్కయిపోయాడు. అంతగా స్త్రీ పాత్రను రక్తి కట్టించేవారు అక్కినేని గారూ. అలా మూడు సంవత్సరాలు రకరకాల నాటకాలు వేస్తూ అలరిస్తూ వచ్చారు అక్కినేని గారూ. అక్కినేని గారి జీవన విధానాన్ని, వారి అభిరుచుల్ని చాలా ప్రభావితం చేశారు దుక్కిపాటి మధుసూదన రావు గారూ.

సినీ ప్రస్థానం..

అక్కినేని నాగేశ్వరావు గారూ బుద్ధిరాజు శ్రీరామమూర్తి గారి సలహాతో “విప్రనారాయణ” నాటకంలో దేవదేవి పాత్ర పోషిస్తున్నారు. ఆ నాటక ప్రదర్శన చూసిన దుక్కిపాటి గారూ, తమకు కథానాయిక ( స్త్రీ ) పాత్ర లేని లోటు తీరిందని అక్కినేని గారిని హీరోయిన్ని చేశారు. అక్కినేని నాగేశ్వరావు గారూ “ధర్మపత్ని” (1941) చిత్రంలో నటించి వెనక్కి వచ్చేశారు. వయస్సు తక్కువగా (16 సంవత్సరాలు) ఉండడంతో కొంతకాలం తర్వాత చూద్దాం అని పి.పుల్లయ్య గారూ చెప్పడంతో వెనక్కి వచ్చేశారు అక్కినేని గారూ.

ఎప్పటిలాగే అక్కినేని గారూ మళ్ళీ నాటకాలలో నటిస్తూ ఉన్నారు. వారంతా నాటకాల్లో తీరిక లేకుండా ఉన్నప్పుడే ఘంటసాల బలరామయ్య గారూ విజయవాడ రైల్వేస్టేషన్లో అక్కినేని గారిని చూసి తన సినిమాకు ఆయనే తగిన వ్యక్తి అని నిర్ధారించుకొని చిరునామా తీసుకొన్నారు. తర్వాత గుడివాడకు వచ్చి అక్కినేని గారికి కబురు చేశారు. దుక్కిపాటి గారూ, రామబ్రహ్మం గారూ (అక్కినేని సోదరుడు) ఇద్దరూ అక్కినేని గారిని ఘంటసాల బలరామయ్య గారి వద్దకు తీసుకెళ్లారు. ఆయన వారిని మద్రాసుకు వచ్చి ‘ప్రతిభ’ ఆఫీసులో సంప్రదించమన్నారు. అంతే దుక్కిపాటి గారూ, మరో మిత్రుడు సూర్యప్రకాశ రావు గారితో కలసి అక్కినేని గారిని తీసుకొని మద్రాసు సెంట్రల్‌ స్టేషనల్లో దిగారు.

మద్రాసులో గల “ప్రతిభ” కార్యాలయంలో పేకేటి గారూ అక్కినేని గారిని స్వాగతించారు. అలా సీతారామజననం (1944) చిత్రంతో అక్కినేని నాగేశ్వరావు గారూ కథనాయకుడు అయ్యారు. ఆ తర్వాత దుక్కిపాటి గారూ ఘంటశాల బలరామయ్య, చల్లపల్లి రాజా గార్లతో కలసి గూడవల్లి రామబ్రహ్మం గారి దగ్గరకెళ్లి అక్కినేని గారిని మాయలోకం (1945) చిత్రానికి తీసుకొమ్మని సూచించారు. అలా మాయలోకం, తర్వాత రత్నమాల, ముగ్గురు మరాఠీలు చిత్రాల్లో అక్కినేని నటించి నటుడిగా నిలదొక్కుకొన్నారు.

దాదాపు అదే తరుణంలో దుక్కిపాటి మధుసూదనరావు గారూ అన్నపూర్ణ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా తొలిసారి దొంగరాముడు (1955) చిత్రం నిర్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి గార్ల జంట కన్నుల పండుగగా నటించడంతో అది ఘనవిజయం సాధించింది. దుక్కిపాటి గారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపన…

దుక్కిపాటి మధుసూదన రావు గారు మద్రాసు వెళ్లి ఘంటశాల బలరామయ్య గారిని కలిసిన తరువాత తనకు కూడా సినిమాలు చేయాలనే పట్టుదల కలిగింది. దాంతో ఒక నిర్మాణ సంస్థ స్థాపించి, సొంత నిర్మాణంలో చిత్రాలు తీయాలని అనుకొన్నారు. దుక్కిపాటి గారిని సొంత తల్లి కన్నా ఎక్కువగా ప్రేమగా, ఆప్యాయతగా చూసుకున్నారు తన సవతి తల్లి అన్నపూర్ణ గారూ. ఆవిడ గారికి పిల్లలు లేరు. తన సొంత తల్లిలాగా అభిమానించే దుక్కిపాటి గారికి అన్నపూర్ణ గారంటే కూడా ఎనలేని గౌరవం, ప్రేమ. ఆ అభిమానంతో ఆవిడ పేరుతోనే దుక్కిపాటి గారూ 10 సెప్టెంబరు 1951 తేదీన అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.వి.ఎ.సూర్యారావులతో కలసి అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను స్థాపించారు. దీనికి అక్కినేని నాగేశ్వరరావు గారిని ఛైర్మన్‌గా మరియు దుక్కిపాటి మధుసూదన రావు గారూ మేనేజింగ్ డైరెక్టర్‌గా కంపెనీ రిజిస్టర్ చేయబడింది.

తొలి చిత్రం దొంగరాముడు…

అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపించిన మొదటి ప్రయత్నంగా అక్కినేని గారితో కలిసి ఒక సినిమా తీయాలని అనుకున్నారు. కె.వి. రెడ్డి గారిని దర్శకుడిగా తీసుకుందామని అనుకున్నారు. దొంగరాముడు (1955) సినిమాను తీశారు. తమ సంస్థ తీసే మొదటి సినిమాకు కె.వి.రెడ్డిగారే దర్శకత్వం వహించాలని ఉద్దేశించి రెండేళ్ళు కాచుకొని దొంగరాముడు సినిమా నిర్మించారు. అప్పటికే కె.వి.రెడ్డి గారూ “పెద్దమనుషులు” అనే చిత్రం చేస్తున్నారు కుదరదు అని చెప్పారు. అయినా కూడా కె.వి.రెడ్డి గారి కోసమే సుమారు మూడేళ్లు నిరీక్షించి 1955 లో “దొంగరాముడు” అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

అక్కినేని నాగేశ్వరరావు గారూ, సావిత్రి, జమున, కొంగర జగ్గయ్య, ఆర్.నాగేశ్వరరావు, రేలంగి, సూర్యకాంతం, మద్దాలి కృష్ణమూర్తి, అల్లు రామలింగయ్య, కంచి నరసింహారావు తదితర తారగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం 1 అక్టోబరు 1955 లో విడుదలయ్యి అద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రానికి కథ దుక్కిపాటి మధుసూదన రావు గారూ అందించగా, సంభాషణలు డి.వి.నరసరాజు వ్రాశారు. సముద్రాల రాఘవాచార్య గీతరచన చేయగా, పెండ్యాల గారూ అందించిన స్వరాలు అద్భుతంగా ఉన్నాయి. “చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా”, “భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ, బోసి నవ్వుల బాపూజీ, చిన్నీ పిలక బాపూజీ”, “రారోయి మా యింటికి మాటున్నది మంచి మాటున్నది” లాంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి ప్రయత్నమే విజయవంతం అవ్వడంతో అక్కినేని, దుక్కిపాటి గార్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అద్భుత విజయాల అన్నపూర్ణ…

అనుకున్నట్టుగానే “దొంగరాముడు” చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, శరత్ రచించిన “నిష్కృతి” అనే నవల ఆధారంగా ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో “తోడికోడళ్ళు” తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొంది, అద్భుతమైన విజయాన్ని అందుకుంది. “తోడికోడళ్ళు” విజయం తరువాత అక్కినేని, సావిత్రి జంటగా “మాంగల్య బలం, వెలుగునీడలు” వంటి విజయవంతమైన చిత్రాలు తీశారు దుక్కిపాటి గారూ. అక్కినేని గారిని ద్విపాత్రాభినయంలో చూడాలని ఆశపడ్డారు దుక్కిపాటి గారూ. అందుకోసం బెంగాలీ చిత్రం ‘తాషేర్ ఘర్’ను ఎంచుకున్నారు. దాని ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘ఇద్దరు మిత్రులు’. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది.

దుక్కిపాటి గారికి పరభాష కథలతో తీసే చిత్రాల మీద మోజు తీరింది. ఎంతసేపూ పరభాషా కథలతో చిత్రాలు తీయడమేనా? మన తెలుగు కథలు సినిమాలకు పనికిరావా? అన్న ఆలోచన కలిగింది దుక్కిపాటి గారికి. దాంతో డాక్టర్ శ్రీదేవి గారూ వ్రాసిన “కాలాతీత వ్యక్తులు” నవలను ‘చదువుకున్న అమ్మాయిలు’ పేరుతో తెరకెక్కించారు. కానీ ఆ చిత్రం గత చిత్రాల స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే “అన్నపూర్ణ” సంస్థ చిత్రాల స్థాయిలో పాటలతో అలరించింది.

ఆ తరువాత ఆరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారూ వ్రాసిన “చక్రభ్రమణం” నవలను “డాక్టర్ చక్రవర్తి” పేరుతో సినిమాగా మలిచారు దుక్కిపాటి గారూ. ఈ చిత్రం అద్భుతమైన విజయం మూటగట్టుకుంది. “తోడికోడళ్ళు” మొదలుకొని “డాక్టర్ చక్రవర్తి” దాకా అన్ని చిత్రాలకూ ఆదుర్తి సుబ్బారావు గారే దర్శకత్వం వహించారు. ఆదుర్తి సుబ్బారావుగారి వద్ద సహాయ దర్శకులు గా పనిచేసిన కె.విశ్వనాథ్ గారిని తమ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ నుండి “ఆత్మగౌరవం” చిత్రంతో దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి గారూ. ఈ చిత్రం దర్శకునిగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి మంచి పేరు సంపాదించి పెట్టింది.

“బియాండ్ దిస్ ప్లేస్” నవల ఆధారంగా “పూలరంగడు” అనే కథను సిద్ధం చేశారు ముళ్ళపూడి వెంకటరమణ గారూ. ఈ చిత్రానికి ప్రముఖ నవలా రచయిత్రి రంగనాయకమ్మ గారూ మాటలు వ్రాశారు. ఊహించినట్టుగానే “పూలరంగడు” మంచి విజయం సాధించింది. యద్దనపూడి సులోచనారాణి గారూ వ్రాసిన నవల “ఆత్మీయులు” ను సారథీ స్టూడియోస్ భాగస్వామ్యంలో తెరకెక్కించారు. వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మ్యూజికల్ హిట్ అనిపించుకుంది.

ఆ తరువాత దుక్కిపాటి గారూ నిర్మించిన “జైవాన్, అమాయకురాలు” చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. దాంతో మళ్ళీ తమకు అద్భుతమైన విజయాలు అందించిన ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో “విజేత” నవలను “విచిత్రబంధం” గా తెరకేక్కించి ఘనవిజయం సాధించారు. ఈ చిత్రం ద్వారా రామకృష్ణను గాయకునిగా పరిచయంచేశారు. “విజేత” తరువాత యద్దనపూడి మరో నవల “బంగారు కలలు” ను అదే పేరుతో నిర్మించారు. దీనికి కూడా ఆదుర్తి సుబ్బారావు గారే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం “విచిత్రబంధం” స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అక్కినేని గారూ అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలో కథనాయకుడిగా రూపొందిన చివరి చిత్రం.

కొత్తవారిని పరిచయం చేసిన అన్నపూర్ణ పిక్చర్స్..

అన్నపూర్ణ సంస్థ నిర్మించే చిత్రాలకు ఎక్కువగా ఆదుర్తి సుబ్బారావు గారూ దర్శకత్వం వహించేవారు. దుక్కిపాటి గారూ తన సినిమాలలో కొర్రపాటి గంగాధరరావు, యుద్దనపూడి సులోచనరాణి, గొల్లపూడి మారుతీరావు, ముప్పాళ్ల రంగనాయకమ్మ (సంభాషణల రచయిత్రి), కె.విశ్వనాథ్ (దర్శకుడు), ఆశాలత కులకర్ణి, జి. Aరామకృష్ణ, జీడిగుంట రామచంద్ర మూర్తి, శారద వంటి కళాకారులను పరిచయం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించడానికి అక్కినేని గారితో పాటు దుక్కిపాటి మధుసూదనరావు గారూ కూడా ఎంతో కృషి చేశారు. చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గానూ దుక్కిపాటి గారిని ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో రాష్ట్రప్రభుత్వం సత్కరించింది. రెండు శరీరాల్లో ఉన్న ఒకే ఆత్మ స్నేహం అంటారు. దాన్ని దుక్కిపాటి, అక్కినేని- ఇద్దరూ నిరూపించారు.

తోడికోడళ్ళు (1957), మాంగల్యబలం (1958), వెలుగునీడలు (1961), ఇద్దరు మిత్రులు (1961), చదువుకున్న అమ్మాయిలు (1963), డాక్టర్‌ చక్రవర్తి (1964), ఆత్మ గౌరవం (1966), పూలరంగడు (1967), విచిత్రబంధం (1972), ప్రేమలేఖలు (1977), రాధాకృష్ణ (1978), పెళ్లీడు పిల్లలు (1982), అమెరికా అబ్బాయి (1987) వంటి అద్భుతమైన చిత్రాలెన్నో దుక్కిపాటి నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నెలకొల్పిన నంది అవార్డును “డాక్టర్‌ చక్రవర్తి” చిత్రం అందుకోవడం విశేషం. పెళ్లీడు పిల్లలు, అమెరికా అబ్బాయి చిత్రాలు తప్ప మిగిలిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు చిత్రాలలో మెదటి సారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇద్దరు మిత్రులు అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్లే నిర్మించడం విశేషం.

అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన చిత్రాలు..

 • దొంగ రాముడు (1955),
 • తోడికోడళ్ళు (1957),
 • ఇద్దరు మిత్రులు (1961),
 • చదువుకున్న అమ్మాయిలు (1963),
 • వెలుగు నీడలు (1964),
 • డాక్టర్ చక్రవర్తి (1964),
 • ఆత్మ గౌరవం (1965),
 • పల్నాటి యుద్ధం (1966),
 • సుడిగుండాలు (1967),
 • పూల రంగడు (1967),
 • ఆత్మీయులు (1969),
 • జై జవాన్ (1970),
 • అమాయకురాలు (1971),
 • విచిత్రబంధం (1972),
 • బంగారు కలలు (1974),
 • ప్రేమలేఖలు (1977),
 • రాధాకృష్ణ (1978),
 • పెళ్ళీడుపిల్లలు (1982),
 • అమెరికా అబ్బాయి (1987),
 • విజయ్,
 • సిసింద్రీ (1995).

మరణం

దుక్కిపాటి మధుసూదన రావు గారు న్యుమోనియా వ్యాధితో బాధపడూతూ తన 90 యేళ్ళ వయసులో 26 మార్చి 2006 ఆదివారం నాడు మరణించారు. తాను డాక్టరు కావాలనే ఆకాంక్ష తీరక, వ్యవసాయం రంగం వైవు, అటునుండి నాటకాల వైపు, ఆ తరువాత సినీ నిర్మాణ రంగం వైపు తన మజిలీ అనేక మలుపులు తిరిగినా కూడా కృషి, పట్టుదల, ఓర్పుతో నైతిక విలువలతో తన జీవితాన్ని మలుచుకున్న తీరు అద్భుతం అనే చెప్పాలి. దుక్కిపాటి గారూ మరణించినా కూడా తాను నిర్మించిన చిత్రాలతో ప్రజల హృదయాలలో, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి సజీవంగా నిలిచిపోయారు. దుక్కిపాటి గారూ చిత్రరంగంలో చేసిన సేవలకు గుర్తుగా 1993 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు.

Show More
Back to top button