
ప్రపంచంలో ఎక్కడైనా ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకుని రెండు మాటలు మాట్లాడుకుంటే వాటిలో ఒకటి తప్పనిసరిగా సినిమాల గురించి అయి ఉంటుందనేది అతిశయోక్తి కాదు. 1910 సంవత్సరంలో భక్త పుండలిక్, 1911 సంవత్సరంలో రాజ దర్బార్ వంటి మూకీ చిత్రాలను విదేశీ సాంకేతిక శాస్త్రజ్ఞుల సాయంతో నిర్మించిన భారతీయులు, వారి సహకారం లేకుండా 1913 నాటికి దుండి రాజ్ గోవింద్ పాల్కే స్వీయ దర్శకత్వంలో “రాజా హరిచంద్ర” ని నిర్మించగలిగారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కు చెందిన రఘుపతి వెంకయ్య నాయుడు తన కొడుకు ప్రకాష్ దర్శకత్వంలో 1921లో భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో మూకీ చిత్రాలు ప్రదర్శిస్తూ కథాగమనానికి తగ్గట్టు సన్నివేశానికి అనుగుణంగా సంభాషణలు చెప్పేవారు. ఇలాంటి వాటికి తెరదించుతూ 1931 లో హిందీలో నిర్మించబడిన “ఆలం ఆరా” తో భారతదేశంలో సినిమా టాకీయుగం ప్రారంభం అయ్యింది. అదే సంవత్సరం హెచ్.ఎం.రెడ్డి తెలుగు టాకీ “భక్త ప్రహ్లాద” ను నిర్మించడంతో తెలుగు టాకీయుగం కూడా ప్రారంభమైంది.
తెలుగు టాకీ తొలి దశాబ్దంలో (1931 – 40) సావిత్రి, రామదాసు, ద్రౌపతి వస్త్రాపహరణం, శ్రీకృష్ణ లీలలు, సీతాకళ్యాణం మొదలైన పౌరాణిక చిత్రాలను అధిక సంఖ్యలో నిర్మించారు. ఆ దశాబ్దపు చివరిలో గృహలక్ష్మి, మాలపిల్ల, మళ్లీ పెళ్లి, రైతుబిడ్డ మొదలైన చిత్రాలతో సాంఘిక చిత్రాల విప్లవం మొదలైంది. నేడు పౌరాణిక చిత్రాలు దాదాపు ప్రేక్షకాదరణ కోల్పోయి సాంఘిక చిత్రాలే అందరి ఆదరణ పొందుతున్నాయి. తొలి దశలో అంగికం, వాచకం, ఆహార్యం, సాత్వికం అనబడే చతుర్విధ అభినయాలలో ఆరితేరిన వారే నటులుగా పనిచేయగా, నేడు వాచకంతో సంబంధం లేకుండా నటులుగా రాణించగలుగుతున్నారు. తెరపై కనిపించేది మాత్రమే నటి లేదా నటుడైతే కొన్ని సందర్భాలలో ఇతర వ్యక్తులచే డబ్బింగ్ చెప్పించడం ద్వారా దాదాపు అన్ని సందర్భాలలో ఇతరులచే పాటలు పాటించడం ద్వారా నేడు జనరంజకంగా సినిమాలను రూపొందిస్తున్నారు.
యాదృచ్చిక నష్టాలు…
ఒక నిర్మాత విజయం సాధించి లాభం పొందితే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో మరో సినిమాకు శ్రీకారం చుడతాడు. అలా మరో సినిమాకి శ్రీకారం చుట్టడం వలన ఆ నిర్మాత వలన లభించిన స్ఫూర్తితో నూతన నిర్మాతలు రంగ ప్రవేశం చేసి సినీ నిర్మాణం చేపడతారు. దాంతో సినీరంగం పై ఆధారపడి బ్రతుకుతున్న వేలాది మందికి మేలు జరుగుతుంది. కొన్ని సార్లు యాదృచ్చికంగా నిర్మాతకు నష్టాలు జరుగుతుంటాయి. ఒక సినిమా నిర్మాణానికి పథకం వేసుకుని ప్రారంభించాక, కొంత పని జరిగాక ఊహించని విధంగా వచ్చే భూకంపాలు, పెను తుఫానులు, వరదలు, ఉప్పెనలు, అగ్ని ప్రమాదాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు, సమ్మెలు, ప్రమాదాలు, అనారోగ్యం, మరణం మొదలైనవి జరిగినప్పుడు ఆ సినిమా ప్రాజెక్టుకు తీరని నష్టం వాటిల్లుతుంది. అలాంటి సందర్భములో దైవానుగ్రహాన్ని కోరుకోవడం తప్ప మరేమి చేయలేము. ఇక మానవ సంబంధమైన కారణాలకొస్తే నిర్మాతలకు వచ్చే కొన్ని నష్టాలకి కారణం ఇతరులైతే, మరి కొన్నింటికి తానే బాధ్యుడు అవుతాడు.
కోరి తెచ్చుకునే నష్టాలు…
దురలవాట్లు గల వారిని, నీతి నిజాయితీలు కనబరచని వారిని, నియమాలకనుగుణంగా ప్రవర్తించని వారిని, అయోగ్యులను, భజనపరులను, అనేక ఇతర వ్యాపకాలతో తీరిక లేని వారిని నమ్ముకుని చిత్ర నిర్మాణ బాధ్యతలు అప్పగించడం వలన నిర్మాత నష్టాలను కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. దాని వలన నిర్మాత నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వారి బారిన పడకుండా ఉండాలంటే ఆ వ్యక్తుని స్వయంగా గమనించి ఇతరుల నుండి (ముఖ్యంగా అతను గతంలో పనిచేసిన వారి నుండి సమాచార సేకరణ జరిపి) ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పరీక్షించి అతను చిత్తశుద్ధి కలవాడని, సజ్జనుడని, సమర్ధుడని నిర్ణయించుకున్న తరువాత మాత్రమే ఆయా పనుల నిమిత్తం నిర్మాత నియమించుకోవాలి. కొన్ని సందర్భాలలో కొంతమంది నోటిమాట వ్యవహారాలు కాకుండా వ్రాతపూర్వకంగా ఉండడం వలన భవిష్యత్తులో ఏమైనా విభేదాలు ఏర్పడిన పక్షంలో సులభంగా పరిష్కరించుకునే వీలుంటుంది. నిర్మాత చేసే ప్రతి చెల్లింపుకి ఒప్పంద పత్రం ఉండటం చాలా మంచిది.
తొలి సినిమా రోజుల నుండే ఒప్పందాలు..
ఒకవైపు సినిమా ఒప్పుకునే ముందు సినిమా నిర్మాతలతో, అందులోను పనిచేసే ముఖ్య నటీనటులు, నటవర్గం, సాంకేతిక నిపుణులు ఒప్పందాన్ని వ్రాసుకుంటారు. ఈ ఒప్పందం ఆనవాయితీ సినిమా నిర్మాణం తొలి రోజుల నుంచి వస్తున్నదే. ఆ రోజులలో ఒప్పంద పత్రాలు (అగ్రిమెంట్లు) ఎలా ఉండేవి అనడానికి మహానటుడు సామర్ల వెంకట రంగారావు (ఎస్.వి.రంగారావు) తొలి చిత్రం వరూధిని సినిమాకు ఆయన నిర్మాతతో వ్రాయించుకున్న ఒప్పంద పత్రాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వరూధిని చిత్రం 1945 లో విడుదలైంది. యస్.వి. రంగారావు ఆ సినిమాలో నటించడానికి నిర్మాత, దర్శకుడు బి.వి.రామానందంతో చేసుకున్న ఒప్పందం అంశాలను క్రింద మీరు ఒప్పంద పత్రంలో చూడవొచ్చు. ఆరు దశాబ్దాల క్రితం సినిమా పరిశ్రమలో వ్రాత, కోతలు ఎలా ఉండేవో మీరు చూడవచ్చు.
ఒప్పంద పత్రం…
★ తేదీ 21 అక్టోబరు 1945 తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాలూకు ధవలేశ్వరం గ్రామము సామర్ల భవంతులలో నివసించుచున్న తెలగ కులస్తులు సామర్ల కోటేశ్వరరావు గారి కుమారుడు సామర్ల వెంకట రంగారావు, చిత్ర నిర్మాత మరియు దర్శకులు బి.వి. రామానందం గారికి వ్రాయించి ఇచ్చు ఒప్పందం పత్రం (అగ్రిమెంటు)..
1.. మీరు మోడరన్ థియేటర్స్ సేలంలో తీయబోయే తెలుగు సినిమాలో నాకు నిర్ణయించిన రెండు పాత్రలు (కృష్ణదేవరాయ, ప్రవరాఖ్యుడు) నేను నటించబోతున్నాను. అందులకు గాను 90 రోజులకు గానూ రూపాయలు 750 (అక్షరాల ఏడు వందల యాభై రూపాయలు) మీరు నాకు ఇచ్చుటకును.
2.. నా పాత్రలు పూర్తయ్యే వరకు మీ వద్ద నుండి నేను పూర్తి చేయుటకును, ఒకవేళ తొంబది రోజుల లోపల నా పాత్ర పూర్తయిపోయిన యెడల నిర్ణయించిన మొత్తం యావత్తు మీరు నాకు ఇచ్చుటకును, ఒకవేళ నాకు నిర్ణయించిన పాత్రలు పూర్తయిపోయిన యెడల తొంబది రోజుల పైన నేను ఇంకను ఉండవలసి వచ్చిన, పైన నిర్ణయించిన మొత్తము నేను పైన నిర్ణయించిన రోజులకు పైగా పనిచేసిన దానికి ప్రోరేటా చొప్పున మీరు నాకు ఇచ్చుటకును
3.. మీరు నన్ను రమ్మన్న చోటికి 15 ఫిబ్రవరి 1946 తారీకు లోపుగా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను వచ్చుటకు రాను పోను మూడవ క్లాసు రైలు ఖర్చులు, భోజనము, వసతి నేనున్నంత కాలం మీరు నాకు ఇచ్చుటకును
4.. అచట మీరు నాకు ఇచ్చు భోజనము అనగా (ఉదయం కాఫీ, 12 గంటలకు కాయగూరలతో భోజనము, సాయంకాలము టీ, రాత్రి 8 గంటలకు కాయగూరలతో భోజనము) వసతికి అంగీకరించి నేను మీ వద్ద పనిచేయునంత కాలమును అచ్చటనే ఉండెదను.
5.. మీరు ఈరోజున ఈ ఒప్పంద (అగ్రిమెంట్) కాలమునందు ఇచ్చిన రూపాయలు 150 (అక్షరాల నూట యాభై రూపాయలు) ఇచ్చినారు గనుక ముట్టినవి. ఈ రోజు పుచ్చుకున్న బయానా డబ్బు (అడ్వాన్సు) మొత్తము సొమ్ములోంచి పోను మిగతా రూపాయలు 600 (అక్షరాల ఆరు వందల రూపాయలు) మాత్రమే పుచ్చుకొనుటకున్నూ, మీరు బయానాగా (అడ్వాన్స్) ఇచ్చిన సొమ్ము మొత్తం నేను అచ్చటికి చేరిన రోజు మొదలు తొంబది రోజుల అనంతరము నాకు సొమ్ములో నుండి నెల ఒకటికి వచ్చు డివిడెంటు సొమ్ములో నుండి మొదటి నెలలోనే మినహాయించుకోగా మిగతా సొమ్ము మాత్రమే మీరు నాకు ఇచ్చుటకున్నూ
6.. ఈ ఒప్పందం (అగ్రిమెంటు) మీరు సినిమా తీయబోయే ఊరికి మీరు తెలియపరచిన వెంటనే అక్కడికి చేరిన రోజు నుంచి అమలులోకి వచ్చును.
7.. మీరు నిర్ణయించిన సమయముకు రాత్రి గానీ, పగలు గానీ, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రిహార్సలుకు, పాత్ర ధరించుటకు, సినిమా చిత్రీకరణకు హాజరు కాగలవాడను.
8.. మీరు నిర్ణయించిన దర్శకులు, సంగీతం దర్శకులు, ప్రొడక్షన్ మేనేజర్ల అనుమతి అనుసరించి నేను నా పాత్ర ఎట్టి విధములైన ఆటంకములు చెప్పక యాక్ట్ చేయబడును.
9.. సినిమా చిత్రీకరణ అనుసరించి మీకు నేను అవసరమని తోచిన యెడల ఎట్టి ప్రదేశమునకు గానీ మీ సొంత ఖర్చుల పైన వచ్చి మీ పని పూర్తి చేయగలవాడను
10.. వ్రాతపూర్వకమైన మీ అనుమతి లేనిదే నేను మీ వద్ద ఉండు కాలము మరియొక చిత్రములో నటించుటకు గానీ, నాటకములు మొదలైన వాటిలో పాల్గొనట గానీ, వగైరాలు చేయువాడను గాను మరియు మీ ఆజ్ఞ, అనుమతి లేనిదే మీరు నాకు ఇచ్చిన వసతి గృహము విడిచి వెళ్ళువాడను గాను.
11.. నా పాత్రలు అయిన తరువాత మీ వద్ద రిలీజ్ ఉత్తరము పొంది గానీ నా ఊరికి గానీ మరియు ఇతర ప్రదేశములకు గానీ వెళ్ళువాడను గాను.
12.. మీ రిలీజ్ ఉత్తరం పొందిన తరువాత ఏ కారణం చొప్పునైననూ నా పాత్ర చెడిపోయిన నా చిరునామాకు మీరు తెలియపరచిన తక్షణం మీ ఖర్చుల పైన, మీరు రమ్మను ప్రదేశమునకు వెంటనే బయలుదేరి వచ్చి నా పాత్ర నటించగలవాడను. అందులకుగాను పైన నిర్ణయించిన మొత్తము నుండి నేను మరల నటించిన నెలకు గానీ, రోజులకు గానీ ఈ ఒప్పందం పత్రం (అగ్రిమెంటు) రెండో క్లాజు అనుసరించి ప్రోరేటా ప్రకారము పుచ్చుకొనగలవాడను.
13.. ఏ కారణము వల్లనైననూ నన్ను గురించి మీ సినిమా చిత్రీకరణ ఆగిపోయిన యెడల అట్టి రోజునకు నాకు వచ్చు పారితోషికం నా మొత్తం సొమ్ములో నుండి తగ్గించుకొని పుచ్చుకొనుటయే గాక మీకు వచ్చే యావత్తు నష్టపరిహారమును నా వద్ద నుండి మీరు రాబట్టుకొనుటకు మీకు అన్ని హక్కులు కలిగి ఉన్నవి.
14.. పైన ఉదాహరించిన షరతులకు గానీ, ఏ వొక్క షరతుకు గానీ నేను ఎంత మాత్రమూ భిన్నంగా నడుచువాడను గాను. అటుల నడిచిన మీరు చేయు యావత్తు చర్యలకు బాధ్యుడను.
15.. ఈ ఒప్పంద పత్రం (అగ్రిమెంట్) పూర్తిగా చదువుకొని, అర్థం చేసుకొని సమ్మతించి, క్రింది సాక్షి సంతకములు చేసిన మధ్యవర్తుల సమీపమున సంతకము చేయుటమైనది.
సంతకం..
ఎస్వీ రంగారావు, 21 అక్టోబరు 1945..