తెలుగు సినీ పరిశ్రమలో సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలతో పాటు విషాదాంత ప్రేమకథా చిత్రాలలోనూ నటించి, ఘనవిజయాలు సాధించిన ఘనత దిగ్గజ నటుడైన అక్కినేని నాగేశ్వరరావుకి మాత్రమే దక్కింది. అలాంటి వాటిలో ఒకటైన “ప్రేమాభిషేకం” చిత్రం విశేషాల గురించి తెలుసుకుందాం. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కథానాయికలుగా శ్రీదేవి, జయసుధలను ఎంపిక చేశారు. ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మించారు. నిర్మాతలుగా అక్కినేని వారసులు వ్యవహరించారు.
మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి అందించిన సంగీతం ఈ మూవీని మరోస్థాయికి తీసుకువెళ్ళింది. ఈ మూవీ షూటింగ్ 1980 సెప్టెంబర్ 20న అక్కినేని జన్మదినం నాడు మొదలైంది. దాసరి తొలి షాట్ ను ఏఎన్ఆర్, శ్రీదేవిలపై పిక్చరైజ్ చేశారు. షూటింగ్ మొత్తాన్ని 32రోజులలో పూర్తి చేశారు. ఈ సినిమా సమయానికి ఏఎన్ఆర్ వయసు 57 సంవత్సరాలు అయినా శ్రీదేవి వంటి యువ నటి సరసన యువకుడిలా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.
1981 ఫిబ్రవరి 18న అక్కినేని పెళ్లి రోజున విడుదలైన ఈ సినిమా రికార్డు విజయం సాధించింది. 75 వారాలపాటు థియేటర్లలో రన్ అయ్యి తొలి తెలుగు ప్లాటినం జూబ్లీ చిత్రంగా చరిత్రను సృష్టించింది. అంతేకాకుండా, ఈ చిత్రం 86 కేంద్రాల్లో 50 రోజులు, 43 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు, 22 కేంద్రాల్లో 200 రోజులు, 13 కేంద్రాల్లో 250 రోజులు, 11 కేంద్రాల్లో 300 రోజులు, 8 కేంద్రాల్లో 365 రోజులు (గోల్డెన్ జూబ్లీ) ప్రదర్శింపబడి రికార్డులను క్రియేట్ చేసింది.
అప్పట్లోనే రూ. 4కోట్లను వసూల్ చేసి వాణిజ్య పరంగా హిట్ కొట్టింది. ఈ చిత్రం నాలుగు నంది అవార్డులు, రెండు సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. హిందీలో ‘ప్రేమ్ తపస్య’ పేరుతో, తమిళంలో ‘వాజ్వే మాయం’ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేశారు.