Telugu Cinema

ఆస్కార్ చరిత్రలో.. తెలుగు పాట ‘నాటు’కుపోయింది!

తెలుగు సినీ చరిత్రలో మర్చిపోలేని రోజు ఇది. భారతీయ సినిమాకు ఆస్కార్ ఎన్నో ఏళ్ల కల.. అది నేటితో ‘ఆర్ఆర్ఆర్‌’ చిత్రంతో నెరవేరింది.

 ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించి పెట్టిన తెలుగు పాట ‘నాటు నాటు..’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో అంతర్జాతీయ వేదికపై అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్‌’ చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్‌’ గతేడాది మార్చి 24న విడుదలై, బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.1000కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబ్టటింది. అంతేకాదు ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వేదికగా గోల్డెన్‌ గ్లోబ్‌, హాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డు వంటి పలు అవార్డులను ఇప్పటికే తన ఖాతాలో వేసుకుంది. 

ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. కీరవాణి తనయుడు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ గానం చేశారు. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట వచ్చినప్పటి నుంచే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  

సినిమా విడుదలయ్యేనాటికి ఈ పాట ఒక సంచలనంగా మారింది. అప్పటికే ‘ఆర్ఆర్ఆర్‌’పై ఉన్న బజ్‌కు ఈ పాటపై మరింత క్రేజ్ పెరిగేలా చేసింది. ఈ పాట కోసమే ప్రత్యేకంగా థియేటర్‌లకు వెళ్లినవారు ఉన్నారు. ఈ పాటలోని సాహిత్యాన్ని పూర్తి చేయడానికి చంద్రబోస్‌కు దాదాపు 19నెలల సమయం పట్టిందట. ఒక పాట కోసం ఇంత సమయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని కూడా ఆయన ఓ ఇంటర్వూలో తెలిపారు. ఇక ఈ పాట కోసం ప్రేమ్‌ రక్షిత్‌ దాదాపు 95 స్టెప్పులను కంపోజ్‌ చేశాడట. తారక్‌, చరణ్‌లు భుజాలపై చేతులేసుకుని వేసిన హూక్‌ స్టెప్‌ కోసం ఏకంగా 30 వెర్షన్‌లు రెడీ చేశాడట. ఇందుకు దర్శకుడు రాజమౌళి 19 టేకులు తీసుకున్నారట. కానీ చివరికి రెండో టేకునే ఓకే చేయడం జరిగింది.

ఒక పాట వెనుక ఇంతమంది కష్టం దాగుంది కనుకే అటువంటి పాట.. ఇప్పుడు హాలీవుడ్‌ ప్రేక్షకుల చేత ఈలలు వేయించి, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకునేలా చేసింది.

ఈ పాటలో కేవలం తారక్‌, చరణ్‌ నాట్య ప్రతిభే కాదు, వాళ్లిద్ధరి మధ్య ఉన్న స్నేహబంధం ఎలాంటిదో.. తెల్లవాళ్లముందు తెలుగువాడి సత్తా ఏంటో కళ్లకు కట్టినట్టుగా చూపించారు.

అయితే, ప్రపంచవ్యాప్తంగా 81 పాటలు ఆస్కార్‌కు ఎంట్రీ ఇవ్వగా.. తుది జాబితాలో ఐదు పాటలు ఆస్కార్‌కు షార్ట్‌ లిస్ట్‌ అయ్యాయి. ‘నాటు నాటు’తో పాటు టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌ (అప్లాజ్‌), హోల్డ్‌ మై హ్యాండ్‌ (టాప్‌గన్‌:మావెరిక్‌), లిఫ్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌), దిస్‌ ఈజ్‌ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్ ఆల్‌ ఎట్‌ వన్స్‌) పాటలు ఆస్కార్‌కు పోటీ పడ్డాయి. అయితే మిగతా నాలుగు పాటల్ని పక్కకు నెట్టి.. ‘నాటు నాటు…’ పాట ఆస్కార్‌ గెలిచి, చరిత్ర సృష్టించింది.

లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా 95వ ఆస్కార్‌ వేడుకగా ఘనంగా జరిగింది. అవార్డును ప్రకటించగానే థియేటర్‌ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆస్కార్‌ అవార్డును అందుకున్న ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌ ఆనందోత్సహాల్లో మునిగిపోయింది. అంతకుముందు కాలభైౖరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌ ప్రదర్శన ఇచ్చారు.

చిత్ర బృందంతో పాటు దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. దీంతో పాటుగానే ఈసారి ఆస్కార్ అవార్డుల్లో డాక్యుమెంటరి ఫిల్మ్‌కు కూడా చోటు దక్కడం విశేషం. 

బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌గా ‘ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’… ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. దర్శకురాలు కార్తికి గోన్‌ సాల్వెస్‌ దీనిని రూపొందించారు. ప్రముఖ ఓటిటి వేదిక అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. 

ఈ అవార్డు కోసం.. ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌తోపాటుగా హావ్‌లౌట్‌, హౌ డూ యూ మెజర్‌ ఏ ఇయర్‌?, ద మార్థా మిచెల్‌ ఎఫెక్ట్‌, స్ట్రేంజర్‌ ఎట్‌ ద గేట్‌ అనే డాక్యుమెంటరీలు పోటీపడ్డాయి. అయితే చివరికి ‘ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ను వరించింది. ఏనుగులు, వాటి సంరక్షకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.

ది ఎలిఫెంట్ విస్పరర్స్.. ఇదోక షార్ట్ ఫిల్మ్. ఈ కథలో కథనమే హీరో. నిడివి 42 నిమిషాలు.. ఎటువంటి గ్రాఫిక్స్ వాడలేదు. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు.. వాటిని ఆదరించి పెంచిన వృద్ధ దంపతులు.. వీరి చుట్టే తిరుగుతుంది కథంతా. దీని కోసం 450 గంటల ఫుటేజీని చిత్రీకరించారు.. ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షించి.. నేడు ఆస్కార్‌ వేదికపై భారత్‌ తరఫున అవార్డును సొంతం చేసుకున్నారు దర్శకురాలు కార్తికి గోన్‌ సాల్వెస్‌.

గిరిజన గూడెంలోని ఏనుగు పిల్లలను సంరక్షించే దంపతులు.. ప్రకృతిలో జీవనం సాగిస్తుంటారు.. టీవీలు, మొబైల్ ఫోన్లు ఉండవు.. ఏనుగులనే తమ పిల్లలుగా భావించి.. వాటికి పేర్లు పెట్టి.. చిన్న పిల్లలను చుసుకున్నంత బాగా పెంచి.. పెద్ద చేస్తారు.. పెద్ద అయిన ఏనుగులను అటవీ అధికారులు తీసుకెళతారు.. ఆ సమయంలో వాళ్లు పడే మనోవేదన.. పిల్లలు దూరమవుతున్నారనే బాధ.. క్లుప్తంగా ఇదీ కథ.. అయితే ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ను తీసేందుకు దాదాపు ఐదేళ్లు పట్టిందట. 

మొత్తానికి ఈ రెండు భారతీయ చిత్రాలు.. 

తమదైన రీతిలో సత్తా చాటి.. ఆస్కార్ బరిలో నిలవడమే కాక.. అవార్డులను అందుకొని మనల్ని గర్వించేలా చేశాయి. 

Show More
Back to top button