Telugu Cinema

తెలుగు సినీతెర చంద్రమోహనం.. నటుడు చంద్రమోహన్…

తెలుగు సినీతెర సినిమాలో హీరో అంటే ఆరడుగులు ఉండాలి, అందగాడై ఉండాలి, శరీర సౌష్టవం బావుండాలి. ఇవన్నీ ఉంటేనే హీరో గా అవకాశాలు వస్తాయి.

మరి ఆరడుగులు లేకున్నా హీరో అయితే, తనతో నటించిన ప్రతీ కథానాయిక స్టార్ హీరోయిన్ అయితే, ప్రతీ హీరోయిన్ తొలి సినిమా తనతోనే తీయాలని తపన పడితే.. ఆయనే హీరో చంద్రమోహన్ గారు.

చంద్ర మోహన్ గారూ ఒకప్పుడు హీరో.. తర్వాత కామెడీ హీరో.. ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్.. పాత్రలన్నీ తనవే.

తెలుగు సినీతెర చంద్ర మోహన్‌ గారితో నటించిన తర్వాతనే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి వంటి ఎంతో మంది కథనాయికలు స్టార్లుగా రాణించారు.

తెలుగు సినిమాల్లో  తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్న చంద్ర మోహన్ గారి అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. చంద్ర మోహన్ గారూ తన నటనా నైపుణ్యంతో తెలుగు నాట  కోట్ల మంది హృదయాలను సంపాదించారు.

ముక్కుసూటి మనస్తత్వం, డబ్బు ఎక్కువగా ఖర్చు చేయని పొదుపరి, భోజన ప్రియుడు. తన ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి సినిమాలే లక్ష్యంగా మద్రాసు బయలుదేరి తన ఆశయాన్ని నెరవేర్చుకుని తన 54 ఏళ్ళ నట ప్రస్థానంలో వెయ్యికి పైగా చిత్రాలలో నటించి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన విలక్షణ, వైవిధ్య నటులు చంద్రమోహన్ గారూ. తనది లక్కీ హ్యాండ్ అంటుంటారు. కథనాయకులు శోభన్ బాబు గారు చంద్రమోహన్ గారి వద్ద అప్పు తీసుకుని భూమి కొనుగోలు చేసి, తిరిగి అప్పు చెల్లించేవారు. దీనిని బట్టి తనది ఎంత లక్కీ హ్యాండో మనకు అర్థమైపోతుంది.

జీవిత విశేషాలు…

  • జన్మ నామం :    మల్లంపల్లి చంద్రశేఖర రావు
  • జననం    :    23 మే 1942
  • స్వస్థలం   :    పమిడిముక్కల, కృష్ణా జిల్లా, భారత్  
  • తండ్రి   :   మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి
  • తల్లి     :  శాంభవి
  • పిల్లలు   :   ఇద్దరు కుమార్తెలు
  • వృత్తి      :    తెలుగు సినిమా నటుడు
  • బంధువులు   :   బంధువులు  శివలెంక కృష్ణప్రసాద్ (మేనల్లుడు)
  • జీవిత భాగస్వామి   : జలంధర
  • పురస్కారాలు :    నంది అవార్డు

జననం…

చంద్రమోహన్ గారు  23 మే 1942,

 కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. తెలుగు సినీతెర చంద్రమోహన్ గారి అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు.

చంద్రమోహన్ గారు బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో,  బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశారూ.

విద్యాభ్యాసం…

చంద్రమోహన్ గారు తన ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పమిడిముక్కల లోనే చదువుకున్నారు. ఆ తరువాత ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి వరకు వరకు గుంటూరు జిల్లా అచ్చంపేటలో జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నారు. బాపట్లలో అగ్రికల్చర్ కళాశాలలో బి.ఎస్సి అగ్రికల్చరల్ పూర్తి చేశారు. కళాశాలలో ఉన్నప్పటి నుండే చంద్రమోహన్ గారు నాటకాలు వేసేవారు. గుంటూరు, బాపట్లలో తాను ఎక్కువగా నాటకాలు ప్రదర్శించారు. బి.యస్సీ అగ్రికల్చరల్ పూర్తి కాగానే ఏలూరులో వ్యవసాయ అధికారిగా ఉద్యోగం లభించింది. చంద్రమోహన్ గారు ఉద్యోగం చేస్తూనే తన నాటకాల అభిరుచిని కూడా కొనసాగించారు. “తేనె మనసులు” తీస్తున్న “అదుర్తి సుబ్బారావు” గారికి కొత్త నటీనటులు కావలసి వచ్చి పేపర్లో ప్రకటన వేశారు. ఆ ప్రకటన చూసి మిత్రుల సలహా మేరకు చంద్రమోహన్ గారు తన ఫోటోలను మద్రాసుకు పంపించారు.

సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నాలు …

కొన్ని రోజుల తర్వాత మద్రాసు రమ్మని చంద్రమోహన్ గారికి  కబురు వచ్చింది. దాంతో చంద్రమోహన్ గారు మద్రాస్ వెళ్లారు, కానీ ఆ చిత్రంలో నటించేందుకు చంద్రమోహన్ గారు ఎంపిక అవ్వలేదు. ఆ చిత్రంలో కృష్ణ గారు, సంధ్యారాణి గారితో పాటు మరి కొంతమందిని ఎంపిక చేశారు ఆదుర్తి సుబ్బరావు గారు. ఆ తరువాత తీసిన “కన్నెమనసులు” చిత్రానికి కూడా నూతన నటీనటులు కావలసి వచ్చి మళ్ళి ప్రకటన ఇచ్చారు ఆదర్శ సుబ్బారావు గారు. అది చూసిన చంద్రమోహన్ గారు ఆ చిత్రానికి కూడా ఫోటోలు పంపించగా ఆ చిత్రానికి కూడా చంద్రమోహన్ గారు ఎంపిక అవ్వలేదు. ఆదుర్తి గారు ఆ సినిమా కూడా దర్శకత్వం వహించారు. 

ఆ చిత్రం ఎంపిక కోసం చంద్రమోహన్ గారితో బాటుగా కృష్ణంరాజు గారు వచ్చారు. ఆ సినిమా కూడా చంద్రమోహన్ గారు ఎంపిక కాకపోవడంతో తిరిగి ఏలూరు వచ్చి తన ఉద్యోగం తను చేసుకుంటూ ఉన్నారు. కొద్దికాలం తర్వాత చంద్రమోహన్ గారు నాన్నగారు మరణించారు దాంతో చంద్రమోహన్ గారి అమ్మగారు తనని ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. తనకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ పెళ్లిళ్లు చేసే వరకు ఎక్కడికి వెళ్లొద్దని సినిమాలపై ఉన్న అభిలాషతో తన జీవితం పాడు చేసుకోవద్దని చంద్రమోహన్ గారికి తన తల్లి సూచించారు. తన తల్లి సూచన మేరకు తాను కూడా పెళ్లి చేసుకుని ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.

సినీ రంగ ప్రవేశం …

తెలుగు సినీతెర చంద్రమోహన్ గారు పంపించిన ఫోటోలను బి.యన్ రెడ్డి గారి చేతికి అందాయి. ఆ ఫోటోలు బి.యన్ రెడ్డి గారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో బి.యన్ రెడ్డి గారు చంద్రమోహన్ గారిని మద్రాసు కు రమ్మని కబురు పంపించారు. కానీ చంద్రమోహన్ గారు వెళ్లలేదు. దాంతో బియన్ రెడ్డి గారే విజయవాడ వచ్చినప్పుడు చంద్రమోహన్ గారిని కలవమన్నారు. దాంతో చంద్రమోహన్ గారు వాళ్ళ బావ గారిని వెంటబెట్టుకొని వచ్చి వెల్కమ్ అనే హోటల్లో బి.యన్.రెడ్డి  గారిని కలిశారు. బి.యన్ రెడ్డి గారు చంద్రమోహన్ గారిని చొక్కా విప్పించి అడిషన్ చేయించారు. చంద్రమోహన్ గారు అందంగానే కాకుండా మంచి శరీర సౌష్టవం కలిగి వుండేవారు. ఆడిషన్ అయిపోయాక, స్క్రీన్ టెస్ట్ కోసం మద్రాస్ రమ్మన్నారు.

దాంతో చంద్రమోహన్ గారు వాళ్ళమ్మ గారిని ఒప్పించి శనివారం సాయంత్రం రైలెక్కి ఆదివారం మద్రాసు వాహిని స్టూడియోస్ కు చేరుకున్నారు.                                      

అక్కడ వచ్చిన వారందరికీ వాహిని స్టూడియోస్ లోనే స్క్రీన్ టెస్ట్ చేశారు.

స్క్రీన్ టెస్ట్ కి అతిరథ మహారథులు వచ్చారు. డి.వి. నరసరాజు గారు, పాలగుమ్మి పద్మరాజు గారు, కమలాకర కామేశ్వరరావు గారు, కె.వి.రెడ్డి గారు, అసోసియేట్ గా ఉన్న సంగీతం శ్రీనివాసరావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు జడ్జిలుగా వ్యవహరించారు.

చంద్రమోహన్ గారిని నీకు నచ్చిన ఒక సంభాషణ చెప్పమని అడుగగా తాను నటించిన నాటకాలలోని ఒక సంభాషణను చెప్పారు.

కొద్దిరోజుల తర్వాత ఫలితాలు చెబుతామని చెప్పి సాయంత్రం 6 గంటల రైలు ఎక్కించి చంద్రమోహన్ గారిని విజయవాడ పంపించారు.

 ఆ తరువాత వాహిని స్టూడియోస్ కు చెందిన విజయవాడ పంపిణిదారులకు చంద్రమోహన్ గారు ఎంపికైనట్టు ఒక లేఖ పంపించారు.

చంద్రమోహన్ గారు వాళ్ళ అమ్మ గారిని ఒప్పించడానికి వాళ్ళ బావ గారిని తీసుకొని వెళ్లారు. ఆమె మొదట్లో ఒప్పుకోలేదు. ఆ తర్వాత అమ్మాయిల జోలికి వెళ్ళను, చెడు తిరుగుడులు తిరగను అనే రకరకాల ఒట్లు వేయించుకుని ఒప్పుకున్నారు. దాంతో  చంద్రమోహన్ గారు రైళ్లకి మద్రాసు కు బయలుదేరి వాహిని స్టూడియోస్ కి వెళ్లారు.

తొలి చిత్రం రంగులరాట్నం…

వాహిని స్టూడియోస్ కు వచ్చిన చంద్రమోహన్ గారిని నెల రోజులు చిత్రీకరణ ఏవిధంగా తీస్తున్నారో పరిశీలించమని బి.యన్ రెడ్డి గారు చెప్పారు. నెల రోజులు చిత్రీకరణ పరిశీలనకే సమయం వెచ్చిస్తే ఉద్యోగానికి పెట్టిన సెలవుల పరిస్థితి ఏంటి అని ఆలోచించసాగారు చంద్రమోహన్ గారు.

కానీ బి.యన్ రెడ్డి గారు అనుకున్నట్టుగానే నెల రోజుల్లోనే “రంగులరాట్నం” చిత్రీకరణ పూర్తి చేశారు. రంగులరాట్నంలో చంద్రమోహన్ గారికి అంజలి దేవి గారు అమ్మగా, రామ్మోహన్ గారు అన్నగా, నీరజ వదినగా , వాణిశ్రీ గారు జోడిగా నటించారు.

చంద్రమోహన్ గారికి “రంగులరాట్నం” మొదటి సినిమా అయినా కూడా చాలా యాదృచ్ఛికంగా చక్కగా నటించారు. 1966 లో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. అప్పటికి దాకా చెలికత్తె పాత్రలు వేసిన వాణిశ్రీ గారు ఈ చిత్రం తర్వాత కథానాయకగా పది సంవత్సరాలు ఏక చత్రాధిపత్యం వహించి తన సత్తా చాటినారు.  

తెలుగు సినీతెర చంద్రమోహన్ గారికి ఈ చిత్రం తర్వాత బాపు గారు తీసిన “బంగారు పిచ్చుక” తో పాటు “సుఖదుఃఖాలు” లాంటి ఎన్నో సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించి పూర్తిగా మద్రాసు వచ్చేసారు. “ఆత్మీయులు” లో అక్కినేని  గారితో కలిసి నటించారు. “సంబరాల రాంబాబు” లో చలం కు మిత్రుడిగా నటించారు. “కాలం మారింది”, శోభన్ బాబు గారితో కలిసి “జీవన తరంగాలు” లో నటించారు.

విశ్వనాథ్ గారి “కాలం మారింది” లో చంద్రమోహన్ గారు నటించారు. విశ్వనాధ్ గారు చంద్రమోహన్ గారి అమ్మ వాళ్ళ అక్క కొడుకు. దాంతో విశ్వనాధ్ గారి చిత్రాలలో “ఓ సీత కథ”, “సిరిసిరిమువ్వ”, “సీతా మహాలక్ష్మి”, “శంకరాభరణం”, “శుభోదయం” వంటి ఎన్నో సినిమాల్లో నటించారు చంద్రమోహన్ గారు. 

శంకరాభరణం …                                            

విశ్వనాథ్ గారు “శంకరాభరణం” లో అందరిని కొత్తవారినే తీసుకున్నారు. దాంతో సినిమాకు కలెక్షన్ల పరంగా ఇబ్బంది ఉంటుందని గ్రహించి చంద్రమోహన్ గారిని, నిర్మలమ్మ గారిని తీసుకున్నారు.

చంద్రమోహన్ గారికి ముందుగా పారితోషికంగా 50,000 రూపాయలు  అనుకున్నారు.

కానీ మొదటి కాపీ ప్రివ్యూ చూసిన తర్వాత తమిళ హక్కులు తీసుకోమని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు చంద్రమోహన్ గారిని అడిగారట.దానికి అంగీకరించని చంద్రమోహన్ గారు నా యాభై వేలు నాకు ఇచ్చేయండి. మీ తమిళ హక్కులు నాకొద్దు అని అన్నారట.

దాంతో తమిళ నటి మనోరమ గారు ఏడు లక్షల యాభై వేల రూపాయలకు తమిళ హక్కులు కొనుగోలు చేయగా ఆమెకు ఐదు కోట్ల యాభై లక్షలు షేర్ వచ్చింది. అయితే అంత మొత్తం లాభం వచ్చినా చంద్రమోహన్ గారు బాధపడ లేదట.

కథానాయికల కలల హీరో చంద్రమోహన్ గారు …

చంద్రమోహన్ గారిని కథానాయికల హీరో అని పిలుస్తారు. ఏ కథానాయిక అయినా తనతో మొదటి సినిమా తీస్తే ఆవిడ స్టార్ అయినట్లే. అంతటి లక్కీ హ్యాండ్ అంటారు చంద్రమోహన్ గారిని.

జయప్రద గారు చంద్రమోహన్ గారితో నటించిన తర్వాతనే తనకు స్టార్ హోదా వచ్చింది. వీరిద్దరి కలయికలో ఆరు చిత్రాలు వచ్చాయి.

పండంటి కాపురంల (1972) లో ఆరంగ్రేటం చేసిన జయసుధ గారు చిన్నాచితక వేషాలు వేసినా కూడా “సెక్రెటరీ” చిత్రంలో చంద్రమోహన్ గారితో నటించిన పిమ్మట జయసుధ గారికి స్టార్ హోదా వచ్చింది.

ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 25 చిత్రాలలో నటించారు.

“పదహారేళ్ళ వయసు” చిత్రంలో చంద్రమోహన్ గారికి జోడిగా నటించిన శ్రీదేవి గారు ఏ రేంజ్ కథానాయకగా ఎదిగిపోయారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. “శ్రీరంగనీతులు” సినిమాలో చంద్రమోహన్ గారి సరసన నటించిన తర్వాతనే విజయశాంతి గారు లేడీ సూపర్ స్టార్ అయ్యారు.

వీరిద్దరూ కలిసి 8 సినిమాలలో నటించారు. లక్ష్మీ గారు, రాధిక గారు, తాళ్లూరు రామేశ్వరి గారు, మంజుల గారు, ప్రభ గారు లాంటి సుమారు 40 మంది హీరోయిన్లను చంద్రమోహన్ గారికి జోడిగా పరిచయం చేశారు.

ఏ హీరోయిన్ అయినా చంద్రమోహన్ గారితో పరిచయం అవ్వాలని బలంగా కోరుకునేవారు.

సహా పాత్రధారునిగా….

తాయారమ్మ బంగారయ్య చిత్రంలో చిరంజీవి గారికి సమానంగా చంద్రమోహన్ గారు హీరో పాత్ర ధరించారు. రామ్ రాబర్ట్ రహీంలో రజనీకాంత్, కృష్ణలతో సమానంగా చంద్రమోహన్ గారు నటించారు.

రెండు సినిమాలలో సోలో హీరోగా నటిస్తే, ఒక సినిమాలో రెండవ హీరోగా నటించేవారు చంద్రమోహన్ గారు.

కారణం తాను ఎత్తు తక్కువగా ఉండటమే. పొట్టిగా కాకుండా కొంచెం ఎత్తుగా ఉండి ఉంటే చంద్రమోహన్ గారు “సూపర్ స్టార్” అయ్యుండే వారని చాలామంది హీరోలు చెప్పుకొచ్చేవారు. 70 వ దశకంలో హీరోగా ఓ వెలుగు వెలిగిన చంద్రమోహన్ గారు 80 ల్లోకి వచ్చేసరికి రెండవ హీరోగా ఉండిపోయారు.

పోలీస్ పాత్రలు గల హీరో వేశాలన్నీ తను పొట్టిగా ఉండటం వలన ఇతర హీరోలకు తరలిపోయేవి. 90 ల్లోకి వచ్చేసరికి నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, సుమన్ లాంటి హీరోల హవా మొదలైంది. దాంతో చంద్రమోహన్ గారు సహా పాత్రధారుడిగా నటించడం మొదలుపెట్టారు. 

“ఆదిత్య 369” లో తెనాలి రామకృష్ణడిగా, “ఆమె” లో ఊహకు తండ్రిగా, “గులాబీ” లో జేడీకి తండ్రిగా, “నిన్నే పెళ్లాడుతా” లో మూర్తి గా ‘చంద్రలేఖ” లో పాండుగా, “ఇద్దరు మిత్రులు” సినిమాలో చిరంజీవికి తండ్రిగా, “చిరునవ్వుతో” లో వేణుకు మామగా, “మనసంతా నువ్వే”, “నువ్వు నాకు నచ్చావ్”, “మన్మధుడు”, “నువ్వే నువ్వే”, “నువ్వు లేక నేను లేను”, “7/g బృందావన కాలనీ”, “వర్షం”, “అందరివాడు”, “అతనొక్కడే”, “బలాదూర్”, “యోగి”, “రణం”, “రెడీ”, “కృష్ణ”, “మిరపకాయ్”, “దూకుడు”, “బాద్షా”, “లౌక్యం”, “దువ్వాడ జగన్నాథం”, “గౌతమ్ నంద”, “ఆక్సిజన్” వంటి చిత్రాలలో చంద్రమోహన్ గారు పోషించని పాత్ర లేదు. తండ్రిగా, కొడుకుగా, హీరోగా, బలాదూర్ తిరిగే జులాయిగా, దొంగగా, శ్రేయోభిలాషిగా, స్నేహితుడిగా, తెనాలి రామకృష్ణుడిగా తన 54 ఏళ్ల సినీ జీవితంలో తొమ్మిది వందల పైచిలుకు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు.

చంద్రమోహన్ గారు 78 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉంటూ నటిస్తూనే ఉన్నారు.

వివాహం…

తెలుగు సినీతెర చంద్రమోహన్ గారు గాలి బాలసుందర్ గారి కుమార్తె జలంధర గారిని వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. జలంధర గారు ప్రముఖ రచయిత్రి.

“అగ్నిపుష్పం”, “అభిమానులతో ఉగాది”, “ఆటోగ్రాఫ్”, “ఆకాశంలో మల్లెపూలు”, “ఆత్మహత్య”, “ఉపాసన” వంటి సుమారు 55 వరకు కథలు, నవలలు వ్రాశారు.

చంద్రమోహన్ గారు, జలంధర గారు కలిసి ఆదర్శ దాంపత్యానికి గాను “జీవితకాల సాఫల్య పురస్కారం” అందుకున్నారు.

ముక్కుసూటి మనస్తత్వం… 

చంద్రమోహన్ గారు ముక్కుసూటి మనిషి. 1975లో నందమూరి తారక రామారావు గారు, బాలకృష్ణ, మురళీమోహన్ గార్లతో నటించిన “అన్నదమ్ముల అనుబంధం” లో బాలకృష్ణ గారు పోషించిన పాత్రకు ముందుగా చంద్రమోహన్ గారిని తీసుకున్నారు. 15 రోజులు నృత్యం లో శిక్షణ కూడా తీసుకున్నారు చందమోహన్ గారు. కానీ చంద్రమోహన్ గారికి చెప్పకుండానే తన స్థానంలో బాలకృష్ణ గారిని నటింపజేశారట.

ఈ విషయం తెలియక షూటింగ్ స్పాట్ కి వచ్చిన చంద్రమోహన్ గారికి మేకప్ వేయకుండా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా పట్టించుకోకుండా ఉన్నారట.

దాంతో అసలు విషయం తెలుసుకున్న చంద్రమోహన్ గారు కోపంగా వెళ్ళిపోయారట. 

ఎన్టీఆర్ గారు 15 రోజుల తర్వాత మళ్లీ వేరే సినిమా తీస్తూ చంద్రమోహన్ గారిని హీరోగా నటింపజేసేందుకు ఇద్దరు వ్యక్తులతో కబురు పంపించగా చంద్రమోహన్ గారు కోపంగా ఎవరికి కావాలి మీ అన్న గారి సినిమాలో వేషం? తోటి కళాకారులను గౌరవించని వారి సినిమాలో నేను నటించను అన్నారట.

కె విశ్వనాథ్ గారి చిత్రాలలో విశ్వనాధ్ గారు తప్ప ఇంకెవరు కనిపించరని ముక్కుసూటిగా చెప్పేవారు చంద్రమోహన్ గారు.

Show More
Back to top button