అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి మధుసూదన రావు ఒకరు. తనని అమ్మకన్నా మిన్నగా పెంచి పోషించిన సవతి తల్లి అన్నపూర్ణ పేరుతో 10 సెప్టెంబరు 1951 నాడు “అన్నపూర్ణ పిక్చర్స్” నిర్మాణ సంస్థను ప్రారంభించారు దుక్కిపాటి మధుసూదనరావు. ఆ నిర్మాణ సంస్థలో అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.వి.ఎ.సూర్యారావు లను ఆయన భాగస్వాములుగా చేర్చుకున్నారు. దానికి అక్కినేని నాగేశ్వరరావుని ఛైర్మన్‌ని చేశారు దుక్కిపాటి. ఆ సంస్థ ద్వారా తొలిసారి నిర్మించిన చిత్రం దొంగరాముడు (1955). తమ సంస్థ తీసే మొదటి సినిమాకు కె.వి.రెడ్డి దర్శకత్వం వహించాలని ఉద్దేశించి రెండేళ్ళు కాచుకొని దొంగరాముడు సినిమా నిర్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని, సావిత్రిల జంట కన్నుల పండుగగా నటించడంతో అది ఘనవిజయం సాధించింది. దాంతో దుక్కిపాటి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కించిన తొమ్మిదవ చిత్రం ఇద్దరు మిత్రులు (1961). తెలుగులో ఇది ఐదవ చిత్రం. అంతకుముందు ఆ సంస్థ నిర్మించిన నాలుగు సినిమాలను తమిళంలో కూడా నిర్మించారు. ఇద్దరు మిత్రులు సినిమాతో అన్నపూర్ణ పిక్చర్స్ వారు తమిళ సినిమా పరిశ్రమకు వీడ్కోలు చెప్పేశారు. అందుకు అనేక ప్రధాన కారణాలలో ముఖ్యమైనవి అక్కడ రాజకీయాలు. అంతకుముందు తీసిన “వెలుగునీడలు” (1961) తమిళంలో “తూయ ఉల్లం” అక్కడ సరిగ్గా ప్రదర్శింపబడకుండా నష్టాలను చవిచూసింది. ఆనాటి తమిళ అగ్రనటుడు ఒకరు పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారం మూలాన ఆ సినిమా దెబ్బతినింది. అక్కినేని తమిళ డబ్బింగ్ ఎంతమాత్రం బాగుండదన్నది అతని ప్రచారంలో ప్రధాన విమర్శ. మరోవైపు అన్నపూర్ణ సంస్థ వరుసగా విజయాలు సాధించడంతో తమిళనాడులో అగ్రనటులు పారితోషికం విపరీతంగా పెంచి అడగడం ప్రారంభించారు. దాంతో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రధాన భాగస్వామి దుక్కిపాటి మధుసూదన రావుకు ఇది ఏమాత్రం నచ్చలేదు. అందువలన ఇద్దరు మిత్రులు సినిమాను కేవలం తెలుగు వరకు మాత్రమే పరిమితం చేశారు.
ఇద్దరు మిత్రులు సినిమా అనేది తెలుగు సినిమా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం. తొలిసారి ఒక అగ్రనటుడు ద్విపాత్రాభినయ చిత్రాలకు శ్రీకారం చుట్టడం అనేది విశేషంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి ముందు ఒకటి రెండు సినిమాలు అలాంటివి వచ్చినా కూడా అవి కేవలం అనువాద చిత్రాలు మాత్రమే. సాంకేతికంగా పోల్చుకుంటే “ఇద్దరు మిత్రులు” సినిమా తెలుగునాట ఒక కొత్త విప్లవానికి తెరతీసిందని చెప్పవచ్చు. అలాగే అన్య భాషా చిత్రాల నుండి తెలుగు సినిమాలను తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా బాగా తెలియచెప్పిన చిత్రం ఇద్దరు మిత్రులు. అన్నపూర్ణ వారి ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం పోషించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజసులోచన, ఇ.వి.సరోజ, గుమ్మడి, శారద, పద్మనాభం ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించగా రచన కొర్రపాటి గంగాధర రావు చేశారు. 29 డిసెంబరు 1961 నాడు విడుదలైన ఈ చిత్రం శతదినోత్సవాన్ని దాటి రజతోత్సవం జరుపుకుంది.
చిత్ర విశేషాలు….
దర్శకత్వం : ఆదుర్తి సుబ్బారావు
సంభాషణలు : కొర్రపాటి గంగాధర రావు
నిర్మాణం : దుక్కిపాటి మధుసూదనరావు
తారాగణం : అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, ఇ.వి.సరోజ, గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మనాభం, శారద, జి.వరలక్ష్మి, రేలంగి , అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, సూర్యకాంతం
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
ఛాయాగ్రహణం : పి.ఎన్. సెల్వరాజ్
కూర్పు : ఎం.ఎస్. మణి
నిర్మాణ సంస్థ : అన్నపూర్ణ పిక్చర్స్
నిడివి : 165 నిమిషాలు
విడుదల తేదీ : 29 డిసెంబరు 1961
భాష : తెలుగు
చిత్ర కథ సంక్షిప్తంగా…
కోటీశ్వరుడు అజయ్ విదేశాల్లో చదువుకుంటూ ఉంటాడు. తండ్రి మరణించాడనే విషయం తెలిసిన బాధలో అతడు స్వదేశం వస్తాడు. దాంతో అజయ్ ఆస్తిమీద కన్నేసిన ఆయన మేనేజర్, అజయ్ ఆస్తి మొత్తం కొట్టేయాలని అప్పులు చూపిస్తాడు. వాటి నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు అజయ్. అనుకోకుండా అజయ్ కారు కింద పడతాడు విజయ్. చదువుకుని ఉద్యోగం రాక నిరుద్యోగి అయిన విజయ్ పేదరికం వలన నానా అవస్థలు పడుతూ ఉంటాడు. అతనికి పెళ్ళయిన ఒక చెల్లెలు కూడా ఉంటుంది. అవసరానికి తన నగలు అమ్ముకున్న కారణంగా ఆమె తన పుట్టింటిలోనే ఉండవలసి వస్తుంది. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న విజయ్ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటాడు.
చూడడానికి అచ్చుపోలినట్లు తనలాగే ఉన్న విజయ్ ను చూసిన అజయ్ ఆశ్చర్యపోతాడు. విజయ్ ను తనతో పాటు తీసుకువెళ్తాడు అజయ్. ఇరువురు ఒకరికొకరు తమ కథ చెప్పుకుంటారు. ధనవంతుడైన అజయ్ ను ఎవరైనా చంపేస్తారేమోనని తన అత్త ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటుంది. అందుకు తగినవిధంగానే మేనేజర్ భానోజీ కూడా ప్రణాళిక వేస్తూ ఉంటాడు. అందువలన అజయ్ మనశ్శాంతిని కోల్పోతాడు. డబ్బున్నా సుఖం లేకపోయేసరికి అజయ్, ధనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ లు తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటారు. కళ్ళు లేకపోయినా కూడా అజయ్ వాళ్ళ అత్త విజయ్ ని ఇట్టే పసిగట్టేస్తుంది. చేసేదిలేక తాము ఆడుతున్న నాటకం గురించి వారు చెబుతారు.
భానోజీ కూతురును ప్రేమించినట్టు నటిస్తున్న విజయ్ అసలు విషయాలు కూపీలాగేస్తాడు. అక్కడ విజయ్ కుటుంబాన్ని అతని స్థానంలో చక్కదిద్దుతాడు అజయ్. ఆ క్రమంలో ఓ కారు మెకానిక్ గా అజయ్ కొనసాగుతూ ఉంటాడు. తనతో పనిచేసే వ్యక్తి చెల్లెలిని అజయ్ ప్రేమిస్తాడు. భానోజీకి అసలు విషయం తెలిసి విజయ్ ను మట్టు పెట్టాలనుకుంటాడు. భానోజీ బండారం బయట పెడతాడు విజయ్. ఆఖరుకు కూతురు కూడా భానోజీని అసహ్యించుకుంటుంది. అజయ్ ఆస్తి అజయ్ కి దక్కుతుంది. అందులో విజయ్ కి సగభాగమిస్తాడు అజయ్. అజయ్, విజయ్ లు కోరుకున్న అమ్మాయిలను పెళ్ళిచేసుకొని అత్తయ్యతో ఆనందంగా ఉంటారు.
కథకు పునాది…
అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు తమ “వెలుగునీడలు” చిత్రం శత దినోత్సవ వేడుకలు ఆంధ్రరాష్ట్రం లోని “విజయవాడ”, “రాజమండ్రి”, “విశాఖపట్నం” కేంద్రాలను ఎంచుకుని అక్కడ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకల నిమిత్తం విశాఖపట్నం వెళ్ళిన దుక్కిపాటి మధుసూదన రావు తన మిత్రులు నవయుగ చంద్రశేఖర రావు, నవయుగ మేనేజర్ డి.విశ్వనాథ శర్మ, పీ.ఏ.పీ.సుబ్బారావు లతో కలిసి సరదాగా ఆటవిడుపు కోసం కలకత్తా వెళ్లారు. అక్కడ ఒక చిత్ర ప్రదర్శన శాలలో నటులు ఉత్తమ్ కుమార్ నటించిన “తాషేర్ ఘర్” అన్న సినిమాను చూశారు.
అప్పటికి ఆ సినిమా కలకత్తాలో బాగా ఆడుతుంది. వారికి ఆ సినిమా పెద్దగా నచ్చలేదు, కానీ అందులో కథానాయకుడు పోషించిన ద్విపాత్రాభినయం అనే అంశం మాత్రం దుక్కిపాటి మదుసూదన రావుకు అమితంగా నచ్చింది. అప్పటివరకు తెలుగులో నేరుగా ఆవిధంగా అగ్ర కథానాయకుడు ద్విపాత్రాభినయం చేసిన సినిమా రాలేదు. అప్పటికే ఒకటి, రెండు సినిమాలు వచ్చినా కూడా అవి తమిళ సినిమా నుండి వచ్చిన అనువాదాలు మాత్రమే. అందుకని ఆ ఘనత తమ సంస్థ కొట్టేయాలని దుక్కిపాటి మదుసూదన రావు ఉబలాటపడ్డారు. దాంతో మరో ఆలోచన లేకుండా “తాషేర్ ఘర్” అనే బెంగాల్ సినిమా హక్కులను కొనేశారు.
కొర్రపాటి గంగాధరరావు చేత సంభాషణలు..
కలకత్తా నుండి మద్రాసు రాగానే దుక్కిపాటి మధుసూదనరావు తమ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో కలిసి కథ గురించిన చర్చలు ఆరంభించారు. స్క్రిప్టు తయారీని మహాయజ్ఞంలా భావించే అన్నపూర్ణ పిక్చర్స్ వారు “తాషేర్ ఘర్” చిత్రంలోని మూల కథను అస్సలు పట్టించుకోలేదు. కేవలం మూడు సన్నివేశాలను మాత్రమే తీసుకున్నారు. మిగతా కథను స్వంతంగా రూపొందించుకున్నారు. చక్కటి స్క్రిప్టు తయారీ కోసం అన్నపూర్ణ పిక్చర్స్ వారు అవసరమైతే ఎంత మంచి సలహానైనా తీసుకునేవారు.
దుక్కిపాటి దృష్టిలో స్క్రిప్టు అనేది ఒక పవిత్ర కావ్యం. ఇద్దరు మిత్రులు సినిమా స్క్రిప్టు విషయంలో ఆదుర్తి లతో పాటు అప్పటి సంస్థలో సహచర దర్శకులుగా ఉన్న కె.విశ్వనాథ్, రచయిత మరియు పాత్రికేయులు గోరా శాస్త్రి సహాయం కూడా తీసుకున్నారు దుక్కిపాటి మధుసూదనరావు. ఈ క్రమంలోనే సూర్యకాంతం, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, శారద మొదలగు కొత్త పాత్రలు పుట్టుకొచ్చాయి. నిజానికి మూలకథలో నటి ఇ.వి.సరోజ పాత్ర కూడా లేదు.
చిత్రానువాదం సిద్ధమయ్యింది. వెలుగునీడలు సినిమాకు మాటలు వ్రాసిన ఆత్రేయతో ఈ సినిమాకు సంభాషణలు వ్రాయించాలని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు సంభాషణలు వ్రాయడానికి దుక్కిపాటిని చాలా ఇబ్బందులు పెట్టారు ఆత్రేయ. హాస్య సన్నివేశాలను ఎన్ని రోజులైనా కూడా పూర్తిచేయకుండా బాగా విసిగించారు. అందువలన ఆత్రేయను మార్చి ఆ సన్నివేశాలను అప్పటికే బాపట్లలో వైద్యుడిగా మంచి అనుభవం ఉండి అప్పుడే సినిమా రంగానికి వచ్చిన డాక్టరు కొర్రపాటి గంగాధరరావు చేత వ్రాయించాల్సి వచ్చింది. దుక్కిపాటి నమ్మకాన్ని నిలబెట్టారు కొర్రపాటి.
సావిత్రిని కాదని ఇ.వి.సరోజ ను తీసుకుని…
అప్పట్లో అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మాణ సంస్థకు సావిత్రి శాశ్వత కళాకారిణిగా ఉండేవారు. కానీ ఈ “ఇద్దరు మిత్రులు” సినిమాలో ఆవిడకు సరిపడ పాత్ర లేదు. ఇందులో నటించిన ఇద్దరు నాయికల పాత్రలు కూడా కథనాయకుల చుట్టూ తిరిగేవే కానీ ఆ పాత్రలకు పెద్దగా వ్యక్తిత్వం ఉండదు. అందువలన ఈ సినిమాలో ఆమెను ప్రక్కన పెట్టేశారు. దుక్కిపాటి మధుసూదనరావు ఇదే విషయాన్ని సావిత్రి దగ్గర ప్రస్తావిస్తే ఆవిడ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆప్యాయతలకు, విలువలకు ప్రాణమిచ్చే అన్నపూర్ణ సంస్థ అంటే ఆ రోజుల్లో అందరికీ మహా ఇష్టం. అందువలన దుక్కిపాటి తర్కాన్ని సావిత్రి అర్థం చేసుకున్నారు. ఇద్దరు నాయికలలో ఒకరైన రాజసులోచన అంతకుముందే అన్నపూర్ణ పిక్చర్స్ వారి “మాంగల్యబలం” (1959) లో నటించారు.
ఇద్దరి మిత్రులు చిత్ర ఇండోర్ చిత్రీకరణ అంతా మద్రాసు లోని వాహినీ స్టూడియోలో జరిగింది. అవుట్ డోర్ చిత్రీకరణ అంతా కూడా హైదరాబాదులోనే జరిగింది. ఆరోజుల్లో దక్షిణాది భాషా చిత్రాల చిత్రీకరణ అంతా వాహినీ స్టూడియోలోనే జరిగేవి. అలా ఒక తమిళ చిత్ర చిత్రీకరణలో ఉన్న ఇ..వి.సరోజ పక్క అంతస్తులోనే ఉన్న దుక్కిపాటి మధుసూదన రావును పలకరించేందుకు వచ్చారు. ఆవిడ అంతకుముందు అన్నపూర్ణ పిక్చర్స్ వారి “వెలుగునీడలు” తమిళ భాషా చిత్రంలో అక్కినేని భార్యగా నటించారు. సరోజను ఒక్కసారిగా పరిశీలనగా చూసిన దుక్కిపాటి మధుసూదన రావు ఆమెను “ఇద్దరు మిత్రులు” సినిమాకు రెండో కథానాయికగా నిర్ణయించారు. ఒక్క ముక్క కూడా తెలుగు రాని ఇ.వి. సరోజ కోసం పార్వతిని అనే కళాకారిణి చేత సరోజ సంభాషణలను చెప్పించి రికార్డు చేసి ఆ టేపును సరోజకి ఇచ్చారు. ఆ సంభాషణలను తమిళంలో వ్రాసుకుని బట్టీవేసి చిత్రీకరణ సమయంలో అద్భుతంగా చెప్పారు.
సాలూరి సంగీతం, దాశరథి పాటలు…
“ఇద్దరు మిత్రులు” సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు. అంతకుముందు అన్నపూర్ణ పిక్చర్స్ సినిమాలకు పెండ్యాల నాగేశ్వరావు, మాస్టర్ వేణు సంగీతం అందించారు. నిజానికి సాలూరి రాజేశ్వరరావు అంటే దుక్కిపాటికి ఇష్టమే ఉండేది. కానీ వెలుగునీడలు (1961) సినిమాకు కబురు చేస్తే సాలూరి రాలేదు. ఆయన పని విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెడతారని ఎవరు చెప్పడంతో దుక్కిపాటి సందేహించారు. ఆలస్యంగా పెడితే దుక్కిపాటి కోప్పడమే కాకుండా, కొడతారని విని సాలూరి కూడా భయపడి రాలేదు. అపోహలు తొలగిన పిదప సినిమాకు ఇద్దరు కలిసి అద్భుతమైన పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు. కాలక్రమేణా అన్నపూర్ణ సంస్థకు సాలూరి రాజేశ్వరావు చాలా సినిమాలకు పని చేశారు. ఆయన తన సినిమా ప్రస్థానంలో ఎక్కువ సినిమాలు చేసిన సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ మాత్రమే.
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికీ ప్రేరణనందించిన కవి దాశరథి కృష్ణమాచార్య. ఆయన వ్రాసిన గాలిబ్ గీతాలను అక్కినేని నాగేశ్వరావుకు అంకితం ఇచ్చారు. దుక్కిపాటి చదివిన అ పుస్తకం తనకు బాగా నచ్చింది. దాంతో దాశరథికి దుక్కిపాటి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. తనకు సంగీత పరిజ్ఞానం లేదు అని దాశరథికి సందేహిస్తుంటే, అదంతా తాము చూసుకుంటామని దుక్కిపాటి ఆయనకు భరోసా ఇచ్చారు. ఆ విధంగా “ఇద్దరు మిత్రులు” చిత్రంతో దాశరథి కృష్ణమాచార్య తొలిసారిగా సినిమా ప్రపంచానికి పరిచయమయ్యారు. ఆయన వ్రాసిన తొలి పాట “ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా”, అలాగే సినిమాలో మొదటగా వచ్చే “దిలారం” పాట “నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి” కూడా ఆయన వ్రాసినదే. మిగిలిన పాటలు శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు వ్రాశారు.
చిత్రీకరణ…
“ఇద్దరు మిత్రులు” సినిమాలో కథానాయకుడు ద్విపాత్రాభినయం కావడంతో ఆ సినిమా నిర్మాణ సమయంలోనే పెద్ద సంచలనం సృష్టించింది. ద్విపాత్రాభినయ సన్నివేశాలు ఎలా తీస్తున్నారోనన్న ఆసక్తిని పెంచింది. సినిమా ప్రధాన భాగం అంతా మద్రాసులో తీసినా కూడా ద్విపాత్రాభినయ సన్నివేశాలన్నీ హైదరాబాదులోనే తీశారు. అందువలన “ఇద్దరు మిత్రులు” సినిమా పూర్తిగా హైదరాబాదులో కనిపించే సినిమాగా అనిపిస్తుంది. ఆరంభంలో వచ్చే హోటల్ సన్నివేశాలన్నీ కూడా “రిడ్జ్” అనే పేరు గల హోటల్ లోనే తీశారు. “రిడ్జ్” అనే హోటల్ ఆ రోజుల్లో సినిమా వారి అభిమాన హోటల్ గా పేరుగాంచింది.
అక్కినేని నాగేశ్వరరావు ఇంటి సన్నివేశాలన్నీ నగరంలోని లేండ్ లార్డ్ జనాబ్ ఫయాజుద్దీన్ ఇంటిలో చిత్రీకరించారు. కథానాయకులు తమ తమ స్థానాలు మారాక డబ్బున్న అజయ్ బాబు పెట్రోల్ బంక్ లో పనిచేసిన సన్నివేశాలన్నీ హైదరాబాదు “పబ్లిక్ గార్డెన్స్” ఎదుటగా ఉన్న డెక్కన్ సర్వీస్ స్టేషన్ లో తీశారు. “ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు” పాటను గండిపేటలో తీశారు. “ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా” అనే పాటను రాజేంద్రనగర్ లోని “రఫీ అహ్మద్ కిద్వాయ్ గార్డెన్” లో తీశారు. మొత్తానికి సినిమా పూర్తయ్యింది. ఈ సినిమాకు ఆ రోజుల్లో దాదాపుగా 12 లక్షలు రూపాయలు ఖర్చయ్యింది.
ఛాయాగ్రహకుడి మాయాజాలం…
“ఇద్దరు మిత్రులు” సినిమాకు సాంకేతిక నిపుణులు చేసిన మాయాజాలం అంతాఇంతా కాదు. ఆ మాయాజాలం చేసింది మరెవరో కాదు ఛాయాగ్రాహకులు పి.ఎన్. సెల్వరాజ్. ఆయనకు అక్కినేని నాగేశ్వరావు మధ్యన ఉన్న అనుబంధం అపురూపమైనది. అక్కినేని ఆయన చూపినంత అందంగా మరెవ్వరు చూపరన్నది ఆ రోజులలో అందరి అభిప్రాయం కూడా. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థకు ఆదుర్తి సుబ్బారావు, పి.ఎన్. సెల్వరాజ్ రెండు కళ్ల లాంటివారు. చిత్రంలోని ద్విపాత్రనాభినయ సన్నివేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమాలో రెండవ వ్యక్తిగా (కల్పిత పాత్రలో) జగన్నాథ రావుని డూప్ గా ఉపయోగించుకున్నారు. కొన్ని సన్నివేశాలలో రెండో నాగేశ్వరరావు వీపు భాగము, తల వెనుక భాగమో చూపారు.
అలాంటి సన్నివేశాలలో మసక వెళుతురులో చూస్తే అచ్చు అక్కినేని నాగేశ్వరావు లాగానే ఉండేవారు. ఈ సినిమాలో ఒక అక్కినేని కూర్చుని ఉంటే, మరొక అక్కినేని వెనకాల కూర్చుని చుట్టూ తిరుగుతూ మాట్లాడడం, ఇద్దరు పరస్పరం కరచాలనం చేసుకోవడం వంటి సన్నివేశాలను ఆనాడు తనకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పి.ఎన్. సెల్వరాజ్ చాలా అద్భుతంగా తీశారు. అలాగే ధనవంతుడైన అక్కినేని త్రాగి కారులో వేగంగా ఇంటికి వెళ్లే సన్నివేశాన్ని ఒక చిన్న బ్యాటరీ లైట్ సాయంతో కారు వెనక సీట్లో కూర్చుని అబిడ్స్ వీధులలో ఛాయాగ్రాహకులు పి.ఎన్. సెల్వరాజ్ చిత్రీకరించిన విధానం అప్పట్లో సినిమా సాంకేతిక నిప్పులను అపరిమితంగా అలరించింది. ఈ సినిమాకు అందించిన అద్భుతమైన ఛాయాగ్రహణానికి గుర్తుగా, పి.ఎన్.సెల్వరాజ్ ప్రతిభకు గుర్తింపుగా దుక్కిపాటి ఆయనకు వజ్రపు ఉంగరాన్ని బహుకరించారు.
మీనా పాత్రతో శారద తొలిపరిచయం…
ఇద్దరు మిత్రులు సినిమాలో “శారద” పోషించిన పాత్ర బెంగాళీ చిత్రం “తాషేర్ ఘర్” లో అస్సలు లేదు. తెలుగు సినిమాలో మాత్రమే ఈ పాత్రను సృష్టించారు. పాత్ర భావుకతను మెలిపెడుతూ ఈ పాత్రను తీర్చిదిద్దారు. ఈ పాత్రను పేరుమోసిన తార కన్నా కూడా కొత్త అమ్మాయి చేత ఈ పాత్ర పోషింపజెస్తే నటిగా కాకుండా పాత్ర మాత్రమే కనిపిస్తుందన్న ఉద్దేశంతో దుక్కిపాటి కొత్త నటి కోసం అన్వేషణ ప్రారంభించారు. అదేవిధంగా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. ప్రకటన చూసి అన్నపూర్ణ పిక్చర్స్ కార్యాలయానికి చాలా మంది ఫోటోలు పంపించారు. కానీ దుక్కిపాటికి ఎవ్వరూ నచ్చలేదు.
ఒకరోజు ఎల్వీ ప్రసాద్ తెనాలి నుంచి ఒక అమ్మాయి పంపించిన ఛాయా చిత్రాలు (ఫోటోలు) దుక్కిపాటికి చూపించారు. అవి నచ్చిన దుక్కిపాటి మీనా వేషానికి ఆమె చక్కగా సరిపోతుందని వెంటనే ఆమెను పిలిపించారు. ఆదుర్తి సుబ్బారావు కూడా ఆమెకే ఓటేశారు. ఆనాటి మీనా పాత్ర పోషించిన అమ్మాయినే ఈనాటి ఊర్వశి శారద. మొదట్లో ఆమె చాలా వరకు హాస్య పాత్రలో నటించారు. మనుషులు మారాలి” (1969) విడుదలయ్యాక ఆమె ప్రస్థానం శిఖర స్థాయికి చేరింది. తొలి పరిచయం లోనే అక్కినేనికి చెల్లెలు పాత్ర పోషించిన శారద 1974లో వచ్చిన “ప్రేమలు పెళ్లిళ్లు” చిత్రంతో అక్కినేని సరసన జంటగా నటించారు.
రజతోత్సవం…
నిర్మాణాన్ని పూర్తిచేసుకున్న “ఇద్దరు మిత్రులు” సినిమా 29 డిసెంబరు 1961 నాడు విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. కేవలం శతదినోత్సవాలు మాత్రమే కాకుండా రజతోత్సవాలు కూడా జరుపుకుంది. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు హైదరాబాదులోని దీపక్ మహల్ లో జరిగాయి. ఈ చిత్రంలో నటించలేదన్న దిగులు, చింత లేకుండా మహానటి సావిత్రి ఆ వేడుకలలో అందరికీ జ్ఞాపికలు బహుకరించారు. ఈ వేడుకలకు ఆ రోజుల్లో తారలంతా మద్రాసు నుండి ఒక ప్రత్యేక విమానంలో రావడం మరో విశేషం. ఆ సినిమా రజతోత్సవ వేడుకలు మాత్రం మద్రాసులోని అక్కినేని గృహంలో ప్రైవేటు వేడుకగా జరిగాయి.
అప్పటికి అక్కినేని తన మకాం ఇంకా హైదరాబాదుకు మార్చలేదు. అప్పట్లో భారతదేశానికి కార్మిక మంత్రిగా ఉన్న దివంగత రాష్ట్రపతి వర్యులు వి.వి.గిరి ఈ సినిమాను సతీసమేతంగా హైదరాబాదు లోని దీపక్ చిత్ర ప్రదర్శన శాలలో, ప్రత్యేక ప్రదర్శన వేయించుకుని చూడడం మరో విశేషం. ఈ సినిమా సాంకేతిక పరంగా తెలుగు సినిమాల మార్పునకు విప్లవాత్మక శ్రీకారం చుట్టిన సినిమాగా చెప్పవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్తమ అభిరుచి గల నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు, ఉత్తమ అభిరుచి గల దర్శకుడు కలిసి అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానరు నుండి వచ్చిన మేలి “ముత్యం ఇద్దరు మిత్రులు”
వెండితెర నవల…
1950 – 60 లలో దూరదర్శినిలు లేవు. అప్పట్లో అనేకమందికి పుస్తకాలు, రేడియో, సినిమాలే కాలక్షేపం. సినిమాలతో పాటు ఆ రోజులలో వెండితెర నవలలు కూడా వచ్చేవి. గోటేటి శ్రీ రామరావు వెండితెర నవలలకు చాలా ప్రసిద్ధి. సినిమా పాత్రికేయులలో ఆయనను భీష్మాచార్యుడిగా పరిగణిస్తారు. ఆంధ్ర ప్రత్తిక నుంచి బయటకు వచ్చిన కొత్తలో ముళ్లపూడి వెంకటరమణ కూడా వెండితెర నవలలు వ్రాశారు. గోటేటి శ్రీ రామరావు అంతకుముందు “వెలుగునీడలు”, “భార్యాభర్తలు” సినిమాలకు నవలలు వ్రాసారు. ఆ పరంపరలో “ఇద్దరు మిత్రులు” సినిమా ఆయనకు మూడోది. “అసలు కథ ఎత్తుగడ చూడండి, పైనున్నవాడు బహు కొంటెవాడు. పెద్దంత్రం, చిన్నంత్రం లేకుండా అందర్నీ ఆడించి ఆడుకుంటాడు” అంటూ సాగుతుంది నవలా. గోటేటి శ్రీ రామరావు వ్రాసిన మొదటి రెండు నవలల కన్నా కూడా ఈ సినిమా నవల చాలా మనోజ్ఞంగా నడుస్తుంది. “ఇద్దరు మిత్రులు” సినిమా విడుదలైన 10 రోజుల తరువాత దాని వెండితెర నవల మార్కెట్ లోకి వచ్చింది. అది కేవలం రెండు వారాల్లోనే పునర్ముద్రణకు వెళ్ళింది. వేడివేడి మిరపకాయ బజ్జీలలాగా “ఇద్దరు మిత్రులు” వెండితెర నవలా పుస్తకాలు అమ్ముడుపోయాయి.