1984 అక్టోబర్ 31న పంజాబ్ ఉగ్రవాదులు శ్రీమతి ఇందిరాగాంధీని ఆమె స్వగృహంలో దారుణంగా హత్యచేశారు. ఇందిరాగాంధీ మరణాంతరం తిరిగి ప్రజాభిమానాన్ని పొందేందుకు శ్రీ రాజీవ్ గాంధీ 1984 నవంబర్ 27న పార్లమెంటుకు ఎన్నికలు జరిపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 415 సీట్లకు పైగా స్థానాలను సంపాదించి, అఖండ విజయాన్ని అందుకుంది. ఫలితమే.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిని అధిరోహించడం.. మితభాషి, వాస్తవిక దృక్పథంతో ఆలోచించే స్వభావం, సంయమనంతో నిర్ణయాలు తీసుకునే నేర్పుగల వ్యక్తిగా భారతదేశ రాజకీయ చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు రాజీవ్. పట్టణ, గ్రామాల్లో సుస్థిరాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందించారు. భారత్ లో టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థను వృద్ధి చేశారు. విద్యా విధానంలోనూ నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. అటువంటి రాజీవ్ గాంధీ పీఎంగా ప్రవేశపెట్టిన సంస్కరణల పర్యాయం గురుంచి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం:
కుటుంబ నేపథ్యం..
1944 ఆగస్టు 20న బొంబాయిలో జన్మించారు రాజీవ్ గాంధీ. తల్లి ఇందిరాగాంధీ, తండ్రి ఫిరోజ్ గాంధీ. మొదట రాజీవ్ రత్న అని నామకరణం చేశారు. రాజీవ్ అనగా తామరపువ్వు. తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా ఈయనకు పేరు పెట్టడం జరిగింది. దాంతో రాజీవ్ గాంధీ గా మారారు. రాజీవ్ పుట్టిన రెండేళ్లకు, 1946 డిసెంబర్ 14న సంజయ్ గాంధీ జన్మించాడు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే పూర్తైంది. తర్వాత డెహరాడూన్ వెల్కమ్ స్కూల్ లో చేరాడు. చదువులో ఎప్పుడు చురుగ్గా ఉండేవాడు. రాజీవ్ కు తాత జవహర్ లాల్ నెహ్రూ పోలికలు ఎక్కువగా ఉండేవి. డూన్ స్కూల్లో విద్యాభ్యాసం ముగిశాక, ఇంగ్లడ్ వెళ్ళి, అక్కడ ట్రినిటీ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు.
అప్పుడే ఇటాలియన్ యువతి అయిన సోనియా మైనాతో స్నేహం కుదిరింది. పైలట్ వృత్తిలో స్థిరపడాలనేది రాజీవ్ కల. చివరికి అదే వృత్తిని స్వీకరించాడు. ఆఫ్రో 748 కెప్టెన్ గా, తరువాత హెయింగ్ పైలెట్ గా రాజీవ్ వృత్తి బాధ్యతలను నిర్వర్తించాడు. విమానం నడపడం ప్రమాదమని, ఉద్యోగం మానెయ్యమని తల్లి ఇందిరాగాంధీ చెబితే.. వాదించి, చివరకు తల్లిని ఒప్పించాడు. అనంతరం, 1968 జనవరిలో ఇందిరాగాంధీ ఆశీస్సులతో రాజీవ్, సోనియాలు ఒక్కటయ్యారు. శ్రీమతి సోనియా ఇటలీలో సంపన్న కుటుంబంలో పుట్టింది. రాజీవ్ తో వివాహం జరిగాక, అత్తగారి కనుసన్నల్లో మెలిగింది. వీరిద్దరికి ప్రియాంక, రాహుల్ లు సంతానం. ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ట్రైనీ పైలట్ గా రాజీవ్ చాలాకాలం ఉద్యోగిగా కొనసాగారు.
రాజకీయరంగ ప్రవేశం..
1980 జనవరి 14 నుంచి 1984 అక్టోబర్ 31వరకు ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉన్నారు. ప్రతిపక్షాలు స్పష్టించిన కొన్ని అరాచక పరిస్థితుల వల్ల దేశంలో ఎమర్జెన్సీని విధించవలసి వచ్చింది. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయి, జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజీవ్ గాంధీ తమ్ముడైన సంజయ్ గాంధీ తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు. యువజన కాంగ్రెస్ లో సంజయ్ ది సైతం చురుకైన పాత్ర అని చెప్పాలి. సంజయ్ గాంధీ పంజాబ్ యువతి మేనకను వివాహం చేసుకున్నాడు. అతి పిన్నవయస్సులో రాజకీయాల్లోకి ప్రవేశించిన తాను ఆనాటి రాజకీయాల్లో కీలకంగా నిలిచాడు. 1980 జనవరిలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో జనతా ప్రభుత్వం ఓడిపోయి, తిరిగి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ఐ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది.
1980 జనవరి 23న నిత్య కార్యక్రమంలో భాగంగా విమానం నడుపుతూ, ఆకాశంలో విహరిస్తూ ఉండగా.. ప్రమాదవశాత్తూ సంజయ్ గాంధీ దుర్మరణం చెందారు. ఇది ఇందిరను ఎంతగానో కుంగదీసింది. ఈ సమయంలో రాజీవ్ తల్లికి చేదోడుగా నిలిచారు. ఆయన వ్యక్తిగతంగా రాజకీయాలంటే సుముఖత చూపలేదు. సోనియాగాంధీకి సైతం రాజీవ్ రాజకీయాల్లోకి రావడం ఇష్టంలేదు. అనివార్య పరిస్థితుల్లో 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో… అమేటీ నియోజకవర్గం నుంచి రాజీవ్ పార్లమెంటుకు పోటీ చేసి, ఎన్నికవ్వడంతో ప్రత్యక్షంగా రాజకీయాల్లో భాగమయ్యారు.1981 జూన్ 5న యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. రెండేళ్లకు, 1983 ఫిబ్రవరి 2న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ ప్రతినిధిగా ఆయన రాష్ట్ర పర్యటన చేశారు. అక్కడి నుంచి ప్రధాని అయ్యేంతవరకు కీలక పదవుల్లో సేవలు అందించారు.
గ్రామాలకు ఫోన్ల విస్తరణ…
రాజీవ్ మన దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలీ కమ్యూనికేషన్స్ వ్యవస్థలను బాగా అభివృద్ధి చేశారు. ఇందిర హత్యకు వారంముందు ప్రవేశపెట్టిన ఈ పాలసీ ద్వారా సాఫ్ట్ వేర్ ఎగుమతులు ప్రారంభమయ్యాయి. 1984లోనే ఈ విధానాన్ని ఇందిర కేబినెట్ ఆమోదించినా, రాజీవ్ ప్రభుత్వం 1984 నవంబర్ 18న ప్రకటించింది. 1984లో ప్రభుత్వ యాజమాన్యంలోని టెలీ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అప్ టెలీమాటిక్స్ ను ప్రారంభించింది. మొదట్లో అది డిజిటల్ ఎక్స్చేంజీల రూపకల్పన, అభివృద్ధి కోసం ఉద్దేశించింది కాగా, రాజీవ్ సలహాదారుగా ఉన్న వీట్రోడా టెలీ కమ్యూనికేషన్స్ ప్రధానంగా ఆరు టెక్నాలజీ మిషన్లకు నాయకత్వం వహించింది. దేశంలో టెలీకమ్యూనికేషన్స్ విప్లవాన్ని తీసుకువచ్చిన చాలామందిలో ముఖ్యుల్లో ఈయన ఒకరు.
వాస్తవానికి 1984 ఐటీ పాలసీకి ముందు సాఫ్ట్ వేర్ నిపుణులను పారిశ్రామికవేత్తలుగా గుర్తించలేదు. అసలు సాప్ట్ వేర్ ను వ్యాపారంగానూ పరిగణించలేదు.
1984 తర్వాత వీట్రోడా, ప్రభుత్వ సహాయంతో దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ల శ్రేణిని నిర్మించి, ఫోన్లను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఆ తర్వాతి ఏడాది అనగా, 1985లో దిల్లీ, ముంబై టెలిఫోన్ సేవలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. అదే సంవత్సరంలో విదేశీ సమాచార నెట్వర్క్ లిమిటెడ్ ను స్థాపించింది.
విద్యా– పాలసీలు..
జాతీయ సమైక్యత, సాంస్కృతిక, ఆర్ధిక అభివృద్ధిని సాధించడానికి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ, కాలేజీ స్థాయిల వరకు విద్యను అందించడం లక్ష్యంగా ఇందిర ప్రభుత్వం మొదటి నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టింది.
అసమానతలను తొలగించడం, విద్యావకాశాల్లో సమానత్వం కల్పించడం, ముఖ్యంగా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ 1986లో రాజీవ్ ప్రభుత్వం కొత్త నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టింది. రాజీవ్ ప్రభుత్వం 1985లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ను ప్రవేశపెట్టి, 1987లో ప్రారంభించింది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వారి విద్యాభ్యాసాన్ని సులభతరం చేసేందుకు అవసరమైన సస్వంగత పరికరాలు, బోధనా సామగ్రిని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.
వందమంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులకు జీతం ఇవ్వాలనే నిబంధనను ఇందులో చేర్చింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని 1986లో రాజీవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ యాక్ట్ 1985ను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. Distance/ Open study(‘దూర, బహిరంగ విద్య’) తరహాలో అందించడానికి ఏర్పాటైంది.
రోజ్ గార్ పథకం… ఈ పథకాన్ని ప్రవేశపెట్టి, పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నేరుగా నిధులను అందజేసి, గ్రామాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందించాడు. ఈ పథకం పంచాయితీ వ్యవస్థలోనే కీలకంగా భావించవచ్చు. అలాగే స్థానిక సంస్థల పునర్నిర్మాణానికి దోహదం చేసే ప్రణాళికను రూపొందించి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి మొత్తంగా పంచాయతీ, పురపాలక సంస్థలకు కొత్త రూపును సంతరించేలా చేశాడు.
షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును ముస్లిం పర్సనల్ లా బోర్డు కమిటి తీవ్రంగా వ్యతిరేకించి, ముస్లిం మతవిశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నారంటూ అప్పట్లో పెద్ద అలజడి చెలరేగింది. ఆ సందర్భంలో సెక్యులర్ వ్యవస్థలో ఒక మతం వారి మత విశ్వాసాలను మన్నించడం అవసరమనే భావనతో ఆర్డినెన్స్ రూపంలో రాజీవ్ గాంధీ షాబానో కేసుకు సంబంధించిన సమస్యను సంస్కరణ రూపంలో పరిష్కరించారు. అయితే రాజీవ్ చర్య చాలామంది దృష్టిలో విమర్శకు గురైంది.
సొంత పార్టీలో లుకలుకలు…
రాజీవ్ హయాంలో కాంగ్రెసు వంద సంవత్సరాల దినోత్సవాన్ని జరుపుకుంది. 1985 డిసెంబరు 28 నాటికి ఈ పార్టీకి 100 సంవత్సరాలు నిండాయి. రాజీవ్ గాంధీ ఈ పార్టీకి అధ్యక్షుడు మాత్రమే కాదు, దేశ ప్రధానమంత్రి కూడా.
రాజీవ్ గాంధీ ప్రధానిగా వచ్చిన రోజు, ఇందిరా గాంధీని హత్య చేసిన రోజు ఒకేరోజు.. అయితే ఇందిరాగాంధీ ఎదుర్కొన్న రాజకీయ సంక్షోభం ఆమెతోనే అంతం కాలేదు సరికదా, రాజీవ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మరింత బలపడింది.
ఇదే తరుణంలో బోఫోర్స్ గొడవను శ్రీ వి.పి. సింగ్ లేవదీశారు. స్విట్జర్లాండ్ నుంచి బోఫోర్స్ శత్రుఘ్నులను కొనుగోలు చేయడంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందనీ, రాజీవ్ గాంధీ అండదండలతోనే కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారాయని శ్రీ వి.పి. సింగ్ ఆరోపణ చేస్తూ, తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేకాక మరికొంతమంది అనుచరులతో కాంగ్రెసు పార్టీకి రాజీనామా ఇచ్చేలా పెద్దఎత్తున అలజడి లేవదీశాడు. ఈ పర్యవసానంతో ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించి, అవినీతి ప్రభుత్వంగా చిత్రించేలా ప్రచారం చేశాడు. శ్రీ వి.పి. సింగ్ కు తోడు ప్రతిపక్షాలు సైతం చేతులు కలిపాయి.
ఈ దశలో 1989 నవంబర్ 22, 24, 26లలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో లోక్ సభలో కాంగ్రెసుకు 193 సీట్లు మాత్రమే వచ్చి, అధికారంలోకి రావడానికి అవకాశం లేకుండా పోయింది. రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీ ఎన్నికలలో ఏకైక పార్టీగా గెలిచినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీలేని కారణంగా, ప్రతిపక్ష పార్టీగానే ఉండిపోయింది.
ఎవరినైనా కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రెసిడెంటు ఆహ్వానించినప్పటికీ రాజీవ్ ఇందుకు అంగీకరించలేదు. ప్రతిపక్షాలు, వామపక్షాలు, కాంగ్రెసులోని ఇతర చీలికదారులంతా కలిసి మిశ్రమ ప్రభుత్వంగా ఏర్పడి ఫలితంగా శ్రీ వి.పి. సింగ్ ప్రధాని అయ్యాడు. పూర్వ జనతా పార్టీ, సోషలిస్టు వర్గం, కాంగ్రెసు తిరుగుబాటుదార్లతో ‘జనతాదళ్’ అనే నూతన పార్టీ ఏర్పడింది. కాంగ్రెసు పార్టీ ప్రతిపక్ష పార్టీగా.. శ్రీ రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకునిగా లోక్ సభలో వ్యవహరించడం జరిగింది.
1990లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఈసారి శ్రీ రాజీవ్ గాంధీ హయాంలోని కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయం అంతటా స్పష్టత ఏర్పడింది. దీంతో రాజీవ్ దేశమంతటా పర్యటిస్తూ, కాంగ్రెసు గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు. ఓసారి ఎన్నికల కార్యక్రమంలో రాజీవ్ గాంధీ తమిళనాడు పర్యటనకు వచ్చారు. 1991 మే 21న మద్రాసు సమీపంలోని శ్రీ పెరంబుదూరులో బహిరంగసభలో రాజీవ్ ప్రసంగించేందుకు వచ్చారు. ఆ రోజు రాత్రి 10:25 గంటలకు వేదిక పై వచ్చి ఉన్నారు.
చుట్టూ రాజకీయ నాయకులు, కాంగ్రెసు కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. ఇదే సమయంలో రాజీవ్ కు పూలమాల సమర్పించేందుకు ఒక యువతి వచ్చింది. రాజీవ్ పాదాలకు నమస్కరించడానికి అన్నట్లు ముందుకు వంగింది. అంతే, మరుక్షణంలో పరిసర ప్రాంతమంతా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. సభా వేదికంతా భీభత్సంగా మారి, రక్తసిక్తమైంది. తీరా చూస్తే, రక్తపుమడుగులో రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డాడు. తమిళ టైగర్ గా భావించబడుతున్న ఆ హంతకి నడుముకు బెల్టుబాంబును ధరించి, ముందే చేసుకున్న ఏర్పాటుతో బటన్ నొక్కి బాంబు పేల్చి, రాజీవ్ ను హత్య చేసింది.
1989 నవంబరు వచ్చేనాటికి జరిగిన అయిదేళ్ళ పదవి కాలంలో రాజీవ్ గాంధీ కాలం ఇట్టే గడిచిపోయింది. తన అయిదేళ్ల పరిపాలనా కాలంలో పంజాబ్, అస్సాం సమస్యలను పరిష్కరించడం, సార్క్ దేశాల సమావేశాలు, మాల్దీవులకు సహకారం, శ్రీలంకకు శాంతి సైన్యాన్ని పంపడం వంటి వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వర్తించారు. దేశ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని, అభివృద్ధి దిశగా పయనించేలా కృషి చేశాడు.