CINEMATelugu Cinema

తొలినాళ్లలో తెలుగులో రంగుచిత్రాలు విరివిగా రాకపోవడానికి కారణాలు.

భారతదేశానికి స్వాతంత్ర్యానికి ముందు మన దేశ ప్రభుత్వ విధానాలు హిందీ, తమిళ చిత్రాలకు మాత్రమే అనువుగా ఉండేవి. 1918 వ సంవత్సరంలో మొదటి సినిమాటోగ్రాఫ్ చట్టం వచ్చింది. కానీ వాటి నిబంధనలను మాత్రం 1940 నుండి కఠినతరం చేశారు. మన సినిమాల మీద ప్రభుత్వం 1942, 1943 సంవత్సరాల లో “ముడి ఫిలిమ్” నియంత్రణ నిబంధనలను రుద్దింది. డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్ 44 “ఎ” సెక్షన్ కింద నిర్బంధ చిత్ర ప్రదర్శన ఆచరణకు తెచ్చింది.

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో “ముడి ఫిలిమ్” కొరత తీవ్రంగా ఉండేది. దిగుమతులలో అధికభాగం ఆనాటి మన బ్రిటిష్ పాలకుల శత్రుదేశంగా మారిన జర్మనీ దేశం నుండి (ఆగ్ఫా) దిగుమతి అవుతున్నందువలన ఈ నియంత్రణ అనివార్యమైంది. ఫిలిం ముఖ్య ఉత్పత్తి స్థానం “లండన్”.  అయితే యుద్ధ కాలంలో వీటి ఎగుమతులకు బ్రిటిష్ పాలకులు ప్రధాన్యత ఇవ్వలేదు. అందువలన వీటి ఉత్పత్తులు కూడా బాగా తగ్గిపోయాయి.

ఆనాడు మనదేశంలో నిర్మించిన ఏ చలనచిత్రాల నిడివి కూడా 11,000 అడుగులు మించరాదనే నిబంధన ఉండేది. అప్పట్లో మన సినిమాలు 18 నుంచి 20 వేల అడుగుల నిడివిలో తయారవుతుండేవి. స్టూడియో యాజమాన్యం సినిమాలు నిర్మిస్తున్నట్లయితే ప్రతీ మూడు చిత్రాల్లో ఒకటి ఆనాటి ప్రభుత్వ అనుకూల భావాలతో నిర్మించాలనేది ప్రభుత్వం ఆజ్ఞ. ప్రజలపై చలనచిత్ర ప్రభావాన్ని పసిగట్టిన ప్రభుత్వం ఈ నిబంధనతో తమకు అనుకూలమైన చిత్రాల నిర్మాణాన్ని తప్పనిసరిగా మార్చింది.


తక్కువ నిడివిగల చిత్రాలు రూపొందించే నిబంధన…

మొరార్జీ దేశాయ్ 1957 వ సంవత్సరంలో “వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి” గా పనిచేసినప్పుడు విదేశీ మారకద్రవ్య లోటు పేరుతో ముడి ఫిలిం దిగుమతి కోటపై ముప్పై శాతం కోత విధించారు. అదే సంవత్సరం 12 సెప్టెంబరు నాడు ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావనకు తెచ్చినప్పుడు సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు. దానికి “వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి” సమాధానమిస్తూ నిర్మాతలు తాము తీసే చిత్రాల నిడివి తగ్గించుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. ఆనాడు సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన నామినేటెడ్ సభ్యుడైన పృథ్వీరాజ్ కపూర్ 17 రీళ్ళకన్నా తక్కువ ఉండే సినిమాల మీద ప్రేక్షకులకు ఆసక్తి ఉండదని తాను వాదించారు. పెద్ద నిడివితో సినిమాలను ప్రేక్షకులకు అలవాటు చేసిన నిర్మాతలే ఇప్పుడు చిన్న చిత్రాలను వారికి అలవాటు చేయాలని మొరార్జీ దేశాయ్ సమాధానమిచ్చారు. అదే సంవత్సరం ముడి ఫిలిం దిగుమతులను ఓ.జి.ఎల్ నుంచి తప్పించి 30 శాతం కోత విధించారు.   నిజానికి ఆచరణలో ఇది 40 శాతం వరకు ఉండేది.

నవగ్రహ కూటమి..

1957 నాటి కోటా నిబంధనల ప్రకారం తమిళ చిత్రాలకు 30 ప్రింట్లు, తెలుగు చిత్రాలకు 20 ప్రింట్లు అనుమతించేవారు. చిత్రం నిడివితో సంబంధం లేకుండా ప్రింటుకు 15 రోల్స్ మాత్రమే పాజిటివ్ కోటా ఇచ్చేవారు. అప్పట్లో అనువాద (డబ్బింగ్) చిత్రాలకు కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేశారు. ముడి ఫిలిం కోటా ఇచ్చేందుకు మద్రాసులో ఒక అధికారిని నియమించారు. అతని క్రింద తొమ్మిది మంది సభ్యులతో ఒక పరిశీలన సంఘం కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ తొమ్మిది మంది సభ్యులలో అత్యధికులు తమిళులే కావడంతో అది అనర్ధాలకు దారితీసింది. ఆనాటి తెలుగు దినపత్రికలు ఈ తొమ్మిది మంది సభ్యుల సంఘాన్ని “నవగ్రహ కూటమి” గా అభివర్ణించాయి. అదే సంవత్సరం తమిళంలో నిర్మించిన “సంపూర్ణ రామాయణం” విడివి 24 రీళ్ళైతే ఈ కమిటీ నిబంధనలను తుంగలోకి తొక్కి ప్రింటుకు 23 రీళ్ల చొప్పున (నిజానికి అనుమతించింది 15 రీళ్లు మాత్రమే) 45 ప్రింట్లకు (అనుమతి లభించిందికూడా నిజానికి 30 ప్రింట్లకు మాత్రమే) అనుమతి ఇచ్చేసింది.

ప్రతీ చిత్రానికి లక్ష రూపాయలు అదనపు భారం..

మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న 1960 వ సంవత్సరంలో ఆనాటి తన బడ్జెట్ ప్రతిపాదనలో ఎక్స్ పోజ్ డ్ ఫిలిం పై మీటరుకు 50 పైసలు చొప్పున అదనపు సుంకం విధించారు. అంటే చిత్ర పరిశ్రమకు ఇది సుమారు 75 లక్షల రూపాయల అదనపు భారం అన్నమాట. కానీ ఈ నిబంధన ఆచరణలోకి వచ్చేసరికి రెండు కోట్ల రూపాయల భారాన్ని మోపింది. ప్రతీ చలనచిత్రానికి అదనంగా లక్ష రూపాయల పన్ను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ 04 మార్చి తేదీన బొంబాయిలోని సెంట్రల్ స్టూడియోలో సమావేశం అయ్యింది.

సత్యజిత్ రాయ్ నిరసన…

అసోసియేషన్ కు ఆనాడు సారథిగా ఉన్న జె.బి.రుంగ్తా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ సమావేశం ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని  తీవ్రంగా నిరసించింది. చిన్న చిత్రాల నిర్మాతలకు, ప్రాంతీయ చిత్ర నిర్మాతలకు వెసులుబాటు కల్పిస్తామని అప్పటి సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ హామీ ఇచ్చారు. అప్పటికే మన దేశంలో సినిమాల నిర్మాణం పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. సినిమా థియేటర్ లో నల్లని తెరపై “ది ఎండ్” అని తన కరపత్రంలో ముద్రించిన “సత్యజిత్ రాయ్” ఒక కరపత్రం రూపంలో తన నిరసన వినూత్నంగా తెలియజేశాడు. అంటే చిత్రపరిశ్రమ ఇక  పరిసమాప్తమైనట్టేనని “సత్యజిత్ రాయ్” గారి భావన. చివరికి 20 ఏప్రిల్ 1960 తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి లోక్ సభలో పన్ను తగ్గింపు ప్రకటన చేశారు.

సవరించిన పన్ను…

సవరించిన పన్ను ప్రకారం మీటర్ ఒక్కింటికి ఫిలిం పై మొదటి 5 ప్రింట్లకు 10 పైసలు, తరువాత ఐదు ప్రింట్లకు 15 పైసలు, ఆ తరువాత 15 ప్రింట్లకు 20 పైసలు, దరిమిలా 25 ప్రింట్లు 25 పైసలు, ఆపైన అన్ని ప్రింట్లకు 30 పైసలు పన్ను వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. విడుదలైన సంవత్సరం తర్వాత తీసే ప్రింట్లన్నిటికీ 15 పైసలు చొప్పున పన్ను విధించారు. బాలల చిత్రాలకు, విద్యావిషయక చిత్రాలకు పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే అదే ఏడాది బ్రిటన్ బడ్జెట్ లో అక్కడి ప్రభుత్వం సినిమా థియేటర్లలో ప్రవేశపన్ను పూర్తిగా రద్దు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం తమ దేశంలో ఆనాడు 65 లక్షల పౌండ్ల పన్ను రద్దు చేసింది. థియేటర్లను రక్షించుకునేందుకు టెలివిజన్ ప్రభావం సినిమాపై బాగా పడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం తెలియజేసింది.

ముడి ఫిలిం యాభై శాతం కోత…

1957 నుంచి ముడి ఫిలిం దిగుమతులపై ఉన్న కోతను పెంచుతూ వచ్చిన ప్రభుత్వం 1962 లో కోతను ఏకంగా యాభై శాతానికి పెంచడంతో సినిమా నిర్మాణం అసాధ్యంగా మారింది. ఆ నాటికి ముప్పై మూడు శాతం మాత్రమే ముడి ఫిలిం లభించే పరిస్థితి ఉంది. 1957 నుండి సినీ పరిశ్రమ తనకు తానుగా విధించుకున్న నియమాన్ని అనుసరించి 15 వేల అడుగుల లోపే సినిమా తీయడం అలవాటు చేసుకుంది. అంతకుముందు ఏడాది దాకా తెలుగు, తమిళం భాషలలో 50 సినిమాలు చొప్పున తయారవుతుండేవి. కొత్తగా వచ్చిన నిబంధనల వల్ల ఆ రెండు భాషల్లోనూ పాతిక చొప్పున సినిమాలు మాత్రమే నిర్మించుకునే పరిస్థితి ఏర్పడింది.

తెలుగు నుండి తమిళ, హిందీ చిత్రాలవైపు మళ్ళిన నిర్మాతలు..

1962లో మద్రాసులో నిర్మించిన చిత్రాలు సంపాదించిన విదేశీ మారకద్రవ్యం సుమారు 1.75 కోట్లు (భారతదేశంలో వసూళ్లు కాక). కాగా మద్రాసులో  వినియోగించిన ముడి ఫిలిం విలువ రెండు కోట్ల రూపాయలు. 1965 నాటికి నిబంధనలలో కొత్త మార్పులు వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం ఫిలిం ఛాంబర్ లో సభ్యత్వం ఉన్న నిర్మాతకు ముడి ఫిలిం కోటాగా 60 వేల అడుగుల నెగిటివ్, 80 వేల అడుగుల పాజిటివ్, 80 వేల అడుగుల సౌండ్ ఫిలిం ముట్టేవి. అయితే నిర్మాణంలో ఉన్న చిత్రాల సాకుతో చాలామంది నిర్మాతలు తమ కోటాను బ్లాక్ మార్కెట్ కు తరలించేవారు. ఫలితంగా తెలుగులో సినిమాల సంఖ్య తగ్గింది. తెలుగులో నిరంతరం సినిమాలు తీసే నిర్మాతలు తమిళం, హిందీ చిత్రాల వైపు మొగ్గు చూపారు.

రంగు చిత్రాల విషయానికి వస్తే…

పైన ఉన్న నిబంధనలన్నింటినీ మించిన నిబంధన హిందీ, తమిలేతర చిత్రాలు రంగులలో నిర్మించడానికి పెద్ద అవరోధంగా నిలిచింది. డెబ్భయ్యవ దశకం ఆరంభం వరకు అమలులో ఉన్న ఈ నిబంధన తెలుగుతోపాటు ప్రాంతీయ భాషల్లో వర్ణ చిత్రాలు రాకుండా విజయవంతంగా అడ్డుకుంది. ఈ నిబంధన ఏమిటంటే విదేశీ మార్గద్రవ్యం సంపాదించే భాషా చిత్రాలకు మాత్రమే కలర్ ఫిలిం కోటాను అనుమతించాలి. అయితే హిందీ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం ఉండేది. తమిళ సినిమాలకు సిలోన్, బర్మా, మలేషియా, సింగపూర్ లలో వ్యాపార మార్కెట్ ఉండేది. అందువలన సహజంగానే హిందీ, తమిళ చిత్రాలకు కలర్ ఫిలిం కోటా లభించేది.

నిరసన వ్యక్తం చేసిన ఎన్టీఆర్…

మిగతా భాషలలో ఆసక్తి, అనురక్తీ వున్నా కూడా వర్ణ చిత్రాలు చూసే భాగ్యానికి ప్రేక్షకులు నోచుకోకుండా పోయారు. ఆనాటి మన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా ప్రభుత్వంలో ఈ విషయమై సంప్రదింపులు జరిపిన దాఖలాలు లేవు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా చిన్నచిన్న నిరసనలు తప్ప గట్టిగా పోరాడిన వారు లేరు. ఆంధ్ర సచిత్ర వారపత్రిక 29 మే 1964 తేదీ సంచికలో నందమూరి తారక రామారావు గారు వ్రాసిన వ్యాసంలో ఈ సమస్యపై పతాక శీర్షికలో నిరసన వ్యక్తం చేశారు. అయినా ఆ తరువాత కూడా ఐదేళ్లు ఈ సమస్య సమస్యగానే ఉండిపోయింది. దానికి ముఖ్య కారణం మన నిరసనను పట్టించుకునే నాథుడు లేకపోవడమే. దక్షిణ భారతదేశం అంటే ఆనాడు మద్రాసు, తమిళం అంతే.

తెలుగుకు ప్రాధాన్యతనివ్వని పత్రికలు..

అప్పట్లో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ పత్రిక దేశమంతా చాలా ప్రసిద్ధి. అందులో వచ్చిన వార్తలు ప్రభుత్వం మీద కొద్దో గొప్పో ప్రభావం చూపించేవి. అయితే ఆ పత్రికలలో వచ్చే సమస్యలన్నీ ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించినవే అయ్యి ఉండేవి.  బాధాకరమైన విశేషం ఏమిటంటే ఆ రోజులలో ఆ పత్రికలకు ఎడిటర్ గా ఉన్న ఏ.ఎస్.రామన్ (అవధానం సీతారాముడు) పొద్దుటూరులో పుట్టి మదనపల్లి వాల్తేరులలో చదువుకున్నారు. తాను తెలుగువాడే అయినా తన పత్రికలోని సినిమా వార్తల్లో తెలుగు అన్నమాట కనిపించకుండా చేశారు. తెలుగుకే స్థానం లేకపోయాక రాశిలోనూ వాసిలోనూ అంతకన్నా తక్కువగా ఉన్న కన్నడం, మలయాళం చిత్రాల వార్తల సంగతి చెప్పనవసరం లేదు కదా. హిందూ పత్రిక వెలువరించే స్పోర్ట్స్ అండ్ పాస్ టైమ్ మాత్రమే తెలుగు సినిమా వార్తలు వేసేది. ఆ పత్రిక కూడా దేశవ్యాప్తంగా పంపిణీ అయ్యేది.

విజయవంతమైన తొలి రంగుల సినిమా “లవకుశ”…

1967 వ సంవత్సరంలో విడుదలైన నాలుగు తెలుగు వర్ణ చిత్రాలలో మూడు పరాజయం పాలవ్వడంతో తెలుగులో వర్ణ చిత్రాలు తీయడానికి సాహసం చేయలేదు. 1970 కి పూర్వం కలర్ ముడి ఫిలిం కొరత ఉన్నందున అప్పుడు నిర్మాతలకు కోటా ఉండేది. కలర్ ఫిలిం కావలసిన నిర్మాత తన చిత్రాల ఎగుమతితో విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించి ఆ సొమ్ముతో కలర్ ఫిలిం కొనవలసి వచ్చేది. దాంతో సహజంగానే విదేశీ మార్కెట్ ఉండి, విదేశీ మారకద్రవ్యం సంపాదించే హిందీ, తమిళ చిత్రాల నిర్మాతలకు మాత్రమే కలర్ ఫిలిం కొనడానికి అర్హత ఉండేది. తెలుగు నిర్మాతలకు అలాంటి అవకాశం లేకపోయేది. కోటా లేకపోవడంతో బ్లాక్ లో కొని తీయవలసి వచ్చేది. నందమూరి తారకరామారావు గారు నటించిన “లవకుశ” వసూళ్ళలో కొత్త రికార్డు సృష్టించిన తరువాత తెలుగులో కలర్ సినిమాలు రాకపోవడానికి ఈ నిబంధనలే ప్రధాన కారణం. “లవకుశ”, “రహస్యం”, “అవేకళ్ళు” చిత్రాలను గమనిస్తే “లవకుశ” తమిళ భాషలో వచ్చిన విదేశీ మారకద్రవ్యం తోనే నిర్మాత శంకరరెడ్డి “రహస్యం” సినిమా తీశారు.

ఆర్వో కలర్ లో “అవేకళ్ళు”…

ఇక ఏ.వీ.ఎం సంస్థ అంతకుముందు తాము తీసిన తమిళ చిత్రాల విదేశీ ఆదాయంతోనే కలర్ ఫిలిం కోటా కొనే స్తోమతు సంపాదించుకుంది. “అవేకళ్ళు”, “భక్త ప్రహ్లాద” చిత్రాలు అలాగే తీసింది. అలా తెలుగులో తొలినాట వచ్చిన కలర్ చిత్రాలన్నిటికీ ఎంతో కొంత తమిళ, హిందీ చిత్రాల సహకారం ఉందన్నది నిర్వివాదాంశం. “అవేకళ్ళు” చిత్రాన్ని కోడక్ ఈస్ట్ మన్ పై ఎక్స్ పోజ్ చేసి, ప్రింటు ఆర్వో కలర్ లో తీశారు. ఈ విషయాన్ని వారు ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. తరువాత కాలంలో కూడా చాలా చిత్రాలకు రెండు మూడు రకాల కలర్ ఫిలింలను వాడి “ఎ” సెంటర్లకు ఈస్ట్ మన్ కలర్ ప్రింట్లు, బి. సి. సెంటర్లకు ఆర్వో గేవా కలర్ ప్రింట్లు తీసి పంపించేవారు. కానీ ఇవి ప్రకటనలో ఎక్కడా కనిపించేవి కాదు. ప్రింట్ల విషయంలో ఈ పద్ధతిని పాటిస్తే సినిమా అపజయం పాలైనా కూడా నష్టం తక్కువ శాతంలో ఉంటుందని నిర్మాతలు భావించేవారు.

ఊపందుకున్న రంగుల చిత్రాలు…

“అవేకళ్ళు” సినిమా నిర్మాణ కాలంలో ఆర్వో ఫిలింస్ మద్రాసు ప్రతినిధిగా ఎ.వి.యం అధినేత మెయ్యప్ప చెట్టియార్ ఉండేవారు. ఇది కూడా ఆ సంస్థకు మరో వెసులుబాటు. ఆనాటికీ ముడి ఫిలిం సరఫరా చేసే సంస్థలలో ఆగ్ఫా, డెకో, ఆర్వో సంస్థలు ముఖ్యమైనవి. విదేశీ మారకద్రవ్యం కొరత వలన కోడక్ దిగుమతులు తగ్గిపోయాయి. తూర్పు జర్మనీ నుంచి “వెబ్ ఫిలిం ఫ్యాబ్రిక్ ఉల్ ఫెన్ సంస్థ” వారు కేంద్ర ప్రభుత్వంతో భారతదేశ రూపాయితో మారక ద్రవ్య (రూపీ పేమెంట్) ఒప్పందం చేసుకోవడంతో ఆర్వో దిగుమతి సాధ్యమైంది. ఆనాటికి తెలుపు, నలుపు ఫిలిం భారతదేశంలో హిందూ ఫిలిం పేరుతో తయారు చేస్తున్నా కూడా అవసరాలకు తగినంత ఉత్పత్తి లేదు. 1970 తరువాత కలర్ ఫిలిం దిగుమతులపై ఉన్న ఆంక్షలు క్రమేపి తగ్గిపోవడంతో కలర్ చిత్రాల నిర్మాణం అన్ని భాషలలోనూ ఊపు అందుకుంది.

భారతదేశంలో మొదటి కలర్ హిట్ సినిమా.. “ఆన్”..

రంగుల చిత్రాలు రూపొందించడం మొదలయిన తరువాత మొట్టమొదట విజయవంతమైన చిత్రం “ఆన్” (హిందీ). మహబూబ్ ఖాన్ దీనిని టెక్నికలర్ లో రూపొందించారు. “ఆన్” అనే హిందీ చిత్రం 16 జనవరి 1953 నాడు మహారాష్ట్ర లోని బొంబాయి లిబర్టీ థియేటర్ లో రజతోత్సవం జరుపుకుంది. బొంబాయితో పాటు అదే రోజున అహ్మదాబాద్, సూరత్ లోనూ, పాకిస్తాన్ లో గల కరాచీ, లాహోర్ పట్టణాలలో కూడా ఈ సినిమా రజోత్సవం జరుపుకుంది. భారతదేశంతో పాటు పాకిస్తాన్, బర్మా, సిలోన్ లలో కూడా ఒకే రోజున విడుదలైన ఈ చిత్రం నాలుగు దేశాలలో మొదటి వారం సుమారు ఒక కోటి ఇరవై అయిదు లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆనాటి బొంబాయి రాష్ట్రములో 7,64,423 రూపాయలు వసూలు చేసింది. ఒక బొంబాయి నగరంలోనే దాదాపు 5,37,556 రూపాయలు వసూలు చేసింది.

1961 లో ముడి ఫిలిం పంపిణీ ఎలా ఉండేదంటే..

“మూవీ ఫేర్” పత్రిక కథనం 1962 లో ప్రచురించిన ప్రకారం…  1961 వ సంవత్సరంలో మద్రాసులో ముడి ఫిలిం కమిటీ సరఫరాకు అంగీకరించిన ముడి ఫిలిం “కొత్త చిత్రాలకు 994 ప్రింట్లు, పాత చిత్రాలకు 325 ప్రింట్లు”. ఆ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యంత పొడవైన చిత్రం “కలిసి ఉంటే కలదు సుఖం” (17,880 అడుగులు). అత్యంత చిన్న చిత్రం “కన్న కొడుకు” (14,356 అడుగులు). 1961 వ సంవత్సరంలో మద్రాసులో మొత్తం 139 చిత్రాలు తయారయ్యాయి. వాటిల్లో తెలుగు చిత్రాలు 54. ఉపయోగించిన మొత్తం ఫిలిం 20,77,014 అడుగులు. మన తెలుగు చిత్రాలు 54 కు ఉపయోగించిన ముడి ఫిలిం 8,26,112 అడుగులు. అంటే సగటున ఒక్కో చిత్రానికి 15,298 అడుగులు అన్నమాట.  

07 నవంబరు 1969 ఫిలిం ఫేర్ సంచిక ప్రకారం…

1969 నాటికి కూడా దేశంలో పరిస్థితి ఏమీ మారలేదు. ముడి ఫిలిం కొరత ఇంకా ఎక్కువ అయ్యింది. ఆ ఏడాది ప్రభుత్వం అత్యవసరంగా ఆర్వో బ్లాక్ అండ్ వైట్ పాజిటివ్ మూడు వేల రోల్స్ దిగుమతి చేసుకోవలసి వచ్చింది.  అది కూడా రోల్ ఒక్కింటికి 60 రూపాయలు అదనపు రవాణా ఖర్చు భరించి.. అంటే ఒక్కో సినిమా ప్రింటుకు నిర్మాత అదనంగా వెయ్యి రూపాయలు భరించవలసి వచ్చేది. తమిళ చిత్రం అయితే మొత్తం 30 ప్రింట్లకు 30 వేలు, తెలుగు చిత్రం అయితే 20 ప్రింట్లకు 20 వేల రూపాయలు అదనపు ఖర్చుతో దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది.

ఫిలిం ఫేర్ 03 ఫిబ్రవరి 1956 సంచిక కథనం…

ఝాన్సీ కి రాణి హిందీ సినిమాను టెక్నికలర్ లో తీసిన సోహ్రేబ్ మోడీ  ఆ తరువాత ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ భారతదేశంలో టెక్నికలర్ వసతులు కల్పిస్తే తప్ప మళ్ళీ తాను టెక్నికలర్ సినిమా తీయలేనని అన్నారు. “ఝాన్సీ కి రాణి” నెగిటివ్ ను సోహ్రేబ్ మోడీ లండన్ లో ప్రాసెసింగ్ చేయించారు. ప్రాసెసింగ్ సమయంలో మార్పులు అవసరమని అక్కడ సాంకేతిక నిపుణులు సూచిస్తే ఆ ప్రకారం మళ్లీ ఆ సన్నివేశాలను చిత్రీకరించి తిరిగి లండన్ పంపించారు. “ఝాన్సీ కి రాణి” విడుదల సమయంలో లండన్ నుంచి ప్రాసెస్ అయ్యి వచ్చిన మొత్తం 100 ప్రింట్లను తాను కస్టమ్ డ్యూటీ కింద 5,40,000 రూపాయలు చెల్లించారు.

ఈ మొత్తం అంతా ఒక చిన్న చిత్రం అవలీలగా తయారు చేయగలిగే వాడినని మోడీ అన్నారు. తాను ప్రాసెసింగ్ చేయించిన 100 ప్రింట్లను ఆ రోజుల్లో ఆయన ప్రత్యేక విమానంలో 09 జనవరి 1953 నాడు భారతదేశము తీసుకువచ్చారు. ఆ రోజు ఆ ప్రింట్లను తీసుకువచ్చిన ప్రత్యేక శాంతాక్రాజ్ విమానం  విమానాశ్రయంలో ల్యాండ్ కావడం, విమానంలో నుంచి ప్రింట్లను మేళతాళాలతో బయటకు తీసుకు రావడం, 06 కెమెరాలతో ప్రత్యేకంగా చిత్రీకరించారు. 26 జనవరి 1953   గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మొత్తం 100 కేంద్రాల్లో “ఝాన్సీకి రాణి” విడుదల అయ్యింది. ఆ రోజుల్లోనే ఆ సినిమాకు అయిన ఖర్చు అక్షరాల 60 లక్షల రూపాయలు.

ఆంధ్ర పత్రిక సచిత్ర వార పత్రికలో ఆనాడు ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్య..

 ఈనాడు ఫారెన్ ఎక్స్చేంజి గడించగలిగే మరొక భాష నిర్మాణానికి తోడుగా ఉంటేనే గానీ తెలుగు చిత్రాలు రంగులలో తీసే అవకాశం కూడా లేదు. ఇంతటి నిస్సహాయ నిరాధార పరిశ్రమకు ప్రభుత్వ సహాయం “విదేశీ మారకద్రవ్యం” లో జరగవలెను.

విశేషాలు..

★ ఈస్ట్ మన్ కలర్ లో తీసి ఆర్వో కలర్ లో ప్రింట్లు వేసిన చిత్రం “అవేకళ్ళు” (1967)..

★ ఆర్వో కలర్ లో తీసిన తొలి సూపర్ హిట్ చిత్రం “దసరా బుల్లోడు” (1971)..

★ మొదటి ఖరీదైన ఫ్లాప్ చిత్రం
వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన “రహస్యం” (1967)…

★ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి టెక్నికలర్ చిత్రం యం.వి.రామన్ గారు దర్శకత్వం వహించిన “మురిపించే మువ్వలు” (1962)..

★ మూడు గంటలకు పైగా సాగే ఇరవై నాలుగు రీళ్ళ హిందీ చిత్రం “రామాయణ్”…

★ సగానికి పైగా రంగుల (కలర్) లో తయారైన చిత్రం “దైవబలం” (1959)..

★ దక్షిణ భారతదేశంలో తయారైన మొట్టమొదటి సంపూర్ణ వర్ణ చిత్రం  మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్ వారి “ఆలీబాబా 40 దొంగలు” (1956)..

★ తెలుగులో మొట్టమొదటి సూపర్ హిట్ వర్ణ చిత్రం “లవకుశ” (1963)…

★ తెలుగులో తొలి అపరాధ పరిశోధక చిత్రం “సింగపూర్ సి.ఐ.డి”..

Show More
Back to top button