CINEMATelugu Cinema

అడవిరాముడు అవతారమెత్తిన అన్నగారు

అన్నగారు (సీనియర్ ఎన్టీఆర్) నటించిన ఎన్నో సినిమాలు సంచలన విజయాలు సృష్టించాయి. అందులో ఒకటే “అడవిరాముడు” చిత్రం. ఈ చిత్ర విశేషాలను అప్పట్లో అది క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ చిత్రం కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించిన గంధదగుడి చిత్రానికి ఆధారమైనప్పటికీ ఎన్టీఆర్‌కు తగ్గట్టు కథను మార్పులు చేర్పులు చేసి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కొత్తదనాన్ని చూపించారు. ఈ మూవీని సత్య చిత్ర సంస్థ నిర్మించింది. ఇక కథానాయికలుగా జయసుధ, జయప్రదలను ఎంపిక చేశారు.

ఇంకా జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, నాగభూషణం, రాజ బాబు, రమాప్రభ, శ్రీధర్, కవిత, గుమ్మడి వంటి వారు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఎక్కువ సన్నివేశాలు ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. కాబట్టి, చిత్రాన్ని ‘సినిమా స్కోప్’ టెక్నాలజీని ఉపయోగించి షూట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకే, కెమెరామెన్‌గా విన్సెంట్‌ను ఎంపిక చేశారు. 1977 జనవరి 9న మద్రాసులో ఓ హోటల్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.
 
ఎన్టీఆర్ చెప్పే భరతమాత డైలాగ్‌ను ముహూర్తపు సన్నివేశంగా తీశారు. ఈ సన్నివేశం మినహా మిగిలిన షూటింగ్ మొత్తం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉండే అడవి ప్రాంతాలలో తీశారు. ఇక ఈ సినిమాలో నటింపచేసేందుకు మూడు ఏనుగులను మద్రాస్ సర్కస్ నుంచి తీసుకొచ్చారు. ఏనుగులతో షూటింగ్ చేసే సమయంలో కథానాయికలు ఇద్దరికీ పలు ప్రమాదాలు తప్పాయి. ఎన్నో కష్టాలను అధిగమించి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 1977 ఏప్రిల్ 28న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ స్టైల్ లుక్స్, డ్యాన్సులు, డైలాగులు అభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి.

అంతేకాకుండా, ఈ చిత్రంలో అన్నగారు నటించారు అని కాకుండా “అన్నగారు అడవిరాముడు అవతారమెత్తారని” ప్రేక్షకులు కొనియాడారు. వేటూరి అందించిన పాటలను రాఘవేంద్రరావు తనదైన శైలిలో చిత్రీకరించారు. ఈ సినిమా 40 కేంద్రాల్లో 50 రోజులు, 32 కేంద్రాల్లో 100రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు, 8 కేంద్రాల్లో 200 రోజులు, 4 కేంద్రాల్లో ఏడాదిపాటు ప్రదర్శింపబడి రికార్డులను కైవసం చేసుకుంది. అప్పట్లోనే ఈ సినిమా రూ.3 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Show More
Back to top button