
చ దువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేస్తూ.. లైఫ్ సెట్ అనుకునే సమయంలో ఎవరైనా ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలనుకుంటారా? కానీ, బెంగళూరుకి చెందిన జంట మంచి జీతం వచ్చే కొలువులు వదిలేసి మరీ.. సమోసా వ్యాపారం ప్రారంభించింది. సమోసా అమ్మితే ఎంత వస్తుంది.? మహా అంటే నెలకు రూ.30 వేలు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాదు.. సమోసాపై కాలేసినట్టే!. ఎందుకంటే ఈ దంపతులు సమోసా సింగ్ అనే పేరుతో సమోసాల వ్యాపారం చేస్తూ రోజుకు దాదాపు రూ.12 లక్షలు సంపాదిస్తున్నారు. అసలు ఎవరు వీళ్లు? వ్యాపారం ఎలా ప్రారంభించారు? ఎలా సంపాదించారు? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
కథ ప్రారంభం
అన్ని కథల్లాగే ‘సమోసా సింగ్’ అనే మన కథలోనూ షిఖార్ వీర్ సింగ్ హీరో, నిధి హీరోయిన్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఒకే కాలేజీలో బయోటెక్ డిగ్రీ పూర్తి చేశారు. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. డిగ్రీ పూర్తయ్యాక నిధి ఉద్యోగంలో చేరింది. ఇక మన కథానాయకుడేమో తన మాస్టర్స్ పూర్తి చేయడానికి హైదరాబాద్‌కి వచ్చారు. అలా చదువుకునే సమయంలో తన స్నేహితులతో కలసి రోడ్‌సైడ్ ఫుడ్ తినేవారు. అప్పుడు షిఖార్ గమనించిన విషయం ఏంటంటే రోడ్‌సైడ్ ఫుడ్‌లో సమోసా చాలా పాపులర్ అని. కానీ, దాన్ని హైజీనిక్‌గా తయారు చేయట్లేదని తెలుసుకున్నారు. అప్పుడే హైజీన్‌గా సమోసాలు చేసి.. అమ్మాలని నిర్ణయించుకున్నారు. తన MTech పూర్తి చేసి.. సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నారు.
వ్యాపారం వైపు అడుగులు
నిధి సంవత్సరానికి రూ.30 లక్షల జీతం వచ్చే ఉద్యోగం, శిఖర్ మంచి స్థాయి ఉన్న ఉద్యోగం చేస్తుండేవారు. జీవితం సాఫీగా సాగిపోతుంది. అయినా శిఖర్‌కు ఏదో తెలియని అసంతృప్తి. వ్యాపారం చేయాలనే తన కలని తన భార్యతో చెప్పారు. దీనికి తన భార్య నిధి కూడా ఓకే చెప్పడంతో.. ఇద్దరు కలిసి వ్యాపారం ఎలా చేయాలి అనే ప్రణాళికలు వేసుకున్నారు. అలా ఇద్దరు తమ ఉద్యోగం మానేసి సమోసా సింగ్ అనే పేరుతో సమోసా వ్యాపారం 2015లో ప్రారంభించారు. సాధారణ సమోసాల్లా కాకుండా వీరి సమోసా ఆకారం భిన్నంగా ఉండటంతో పాటు నూనె తక్కువగా పీల్చుకుంటుంది. దీంతో కస్టమర్లు పెరిగారు. శిఖర్ వ్యాపారం, నిధి మార్కెటింగ్ చూసుకునేవారు. అలా క్రమంగా రోజుకు 500 సమోసాలు అమ్మేవారు.
వ్యాపారంలో మలుపు
ఒక రోజు వీరికి ఒక కంపెనీ నుంచి 8,000 సమోసాల ఆర్డర్ వచ్చింది. అది వారి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. పెద్ద ఆర్డర్.. చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. కానీ, చేయడానికి సరిపడా స్థలం లేదు. దీనికి వారు వెనక్కి తగ్గకుండా వారి దగ్గర ఉన్న అపార్ట్‌మెంట్‌ని అమ్మేసి ఆ డబ్బుతో స్థలం కొన్నారు. కల నెరవేర్చుకోవడం చిన్న విషయం కాదని దీని ద్వారా వెల్లడైంది.
ఇదే కాదు ఫండింగ్ కోసం ఇన్వెస్టర్ల దగ్గర రెండు రోజుల వరకు వేచి చూసి ఒక మీటింగ్‌ని ఏర్పాటు చేశారు.
వారి మొదటి మీటింగ్‌లోనే రూ.19 కోట్ల ఫండింగ్ సాధించారు.
ఇక దినదినాభివృద్ధి అంటే ఇదేనేమో అనే విధంగా వీరు ఎదిగారు. ఈ సక్సెస్ స్టోరీ.. మరెంతో మంది యువత వ్యాపారస్థులుగా మారేందరికు స్ఫూర్తినిస్తుంది కదా!