
“నాటకాంతం హి సాహిత్యం” అన్నారు మహాకవి కాళిదాసు. అంటే అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్ధం. కవిత్వం, వ్యాసం, కథ ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తరువాత మాత్రమే నాటకాన్ని రచించాలని కాళిదాసు తెలిపారు. అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన. ప్రపంచ సాహిత్యంలో “మాళవికాగ్నిమిత్రం”, “అభిజ్ఞాన శాకుంతలం” వంటి నాటకాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయిన కాళిదాసు అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ నిజమని ఆధునిక రచయితలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. నాటకానికి అంత శక్తి ఉంది. కాబట్టే, “నాటకం రసాత్మకం కావ్యం” అన్నాడు.
ఒక శ్రవణ సహిత దృశ్యరూపకాన్ని నాటకం అంటారు. రాజుల పరిపాలనా కాలంలో, జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ “నాటకం”. నాటకం అనేది సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకొంటూ రంగప్రవేశం చేస్తాయి. తెలుగు నాటకరంగ చరిత్ర, తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అనడాన్ని బట్టి, నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసుకోవచ్చు. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే.
కానీ పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను చిందు భాగవతము యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అనీ పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవారు కూచిపూడి భాగవతులు. తెలుగు సినిమా మాటలు నేర్చిన తొలినాళ్ళలో తెలుగు చిత్రరంగంలో ఉన్న నటీనటులందరూ కూడా తొంభై శాతం మంది నాటక రంగం నుండి వచ్చిన వారే. అలా వచ్చి తెలుగు నాటకరంగంలో పేరు ప్రతిష్టలు సంపాదించిన వారు తాడిపత్రి రాఘవాచార్యులు (భళ్లారి రాఘవ), పసుపులేటి కన్నాంబ, వేమూరి గగ్గయ్య, స్థానం నరసింహారావు, చిలకలపూడి సీతారామాంజనేయులు, సురభి కమలాభాయి, శ్రీ రంజని, దాసరి కోటిరత్నం, ఋష్యేంద్రమణి, లక్ష్మీరాజ్యం, రాజేశ్వరి, కొమ్మూరి పద్మావతి మొదలగు వారున్నారు. అలాంటి వారిలో పి.రామతిలకం ఒకరు.
నాటకాల తొలినాళ్లలో స్త్రీలకు ప్రవేశం లేదు..
నాటకాలకు ప్రసిద్ధి చెందిన ఆంధ్రనాటక రంగంలో, నాటక ప్రదర్శనాలలో స్త్రీ పాత్రలకు స్త్రీలు కరువయ్యి, స్త్రీ పాత్రలను కూడా పురుషులే ధరిస్తున్న ఆ రోజులలో “స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలి” అని బళ్ళారి రాఘవ ఎలుగెత్తి చాటడం వలన సాహసించిన కొద్దిమంది స్త్రీలు తెలుగు నాటక రంగంలో ప్రవేశించారు. వారు నాటకరంగంలో ప్రవేశించడమే కాకుండా, ఎంతో ప్రతిభతో రాణించారు కూడా. ఆనాడు సురభి నాటక సంస్థ ప్రదర్శించిన సురభి నాటకాలలోనూ, దంటు వెంకట కృష్ణయ్య (గుంటూరు) వారి నవలా నాటక సమాజంలోనూ, విశాఖపట్నం మారేపల్లి రామచంద్రశాస్త్రి వారి సంగీత మానినీ సమాజంలోనూ ఎంతోమంది స్త్రీలు ప్రవేశించి, ఆ నాటకాలలో ప్రముఖ పాత్రను పోషించారు.
ఆనాడు పసుపులేటి కన్నాంబ, దాసరి కోటిరత్నం, శ్రీ రంజని, లక్ష్మీరాజ్యం, కొమ్మూరి పద్మావతీ, ఋష్యేంద్రమణి, పి.రామతిలకం మొదలగు వారందరూ నాటకరంగంలో “స్త్రీ” పాత్రలను ధరించి, నాటకరంగంలో అగ్రనటీమణులుగా ఎదిగి, తారాపథాన్ని అందుకుని, నాటకరంగంలో ప్రథమ శ్రేణి నటీనటులుగా ప్రజాదరణ పొందారు. నిజానికి ఆనాడు రంగస్థలంలో నిలబడడానికి నటునికి గానీ, నటీమణికి గానీ గుండె ధైర్యం కావాలి, దానితో సమానమైన సామర్థ్యం కూడా కావాలి.
నటనకు సరిపడా చక్కని రూపురేఖా విలాసం కావాలి. ప్రేక్షకులను ఆకర్షించగల ముఖారవిందం కావాలి, పాటలు, పద్యాలు ధారాళంగా పాడగల శ్రావ్యమైన గొంతు కూడా కావాలి. సంభాషణలు పలకడంలో మైక్ సాయం లేకుండా, ఆఖరి ప్రేక్షకుడి వరకు కూడా వినిపించే గొంతు కావాలి. ఆ సంభాషణలకు స్పష్టత కావాలి, ప్రతీ అక్షరం అందరికీ తెలియాలి. పై వాటిలో ఏది లోపించినా చేతులు తట్టేసేవారు. పురుష కళాకారులనే నీళ్లు తాగించే ఆనాటి ప్రేక్షకులు, స్త్రీలు అంటే చులకనగా చూడబడే ఆ రోజులలో ప్రేక్షకుల మందు నిలబడడం సామాన్యమైన విషయం కాదు. అది అసామాన్యమైన విషయం. ఇన్ని సమర్థతలు నాటి స్త్రీ పాత్రధారిణికి కావాలి. వీటన్నిటిని పుణికిపుచ్చుకున్న కళాకారిణి పి.రామతిలకం.
నేపథ్యం…
1911 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, విజయవాడలో పి.రామతిలకం జన్మించారు. అమె తండ్రి మృదంగ విద్వాంసులు పువ్వుల వెంకట రత్నం. ఆయన దగ్గరి బంధువు పువ్వుల నారాయణ దగ్గర పి.రామతిలకం సంగీత విద్యను అభ్యసించి, కచేరీ చేయగలిగిన ప్రతిభను సంపాదించారు. అమె చేసిన కచేరీలకు కొన్ని చోట్ల బహుమతులను కూడా అందుకున్నారు. తెలుగు నాటకరంగం లోనూ, తెలుగు సినిమా మాటలు నేర్చిన తొలినాళ్ళలో, ప్రారంభ తొలి చిత్రాలలోనూ, తారామణిగా ప్రకాశించి ఆంధ్ర ప్రజానీకం హృదయాలను చూరగొన్నారు. “మైలవరం బాలభారతీ నాటక సమాజం” ఆనాడు నాటకరంగంలో అసమానమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆ నాటక సమాజం వారి నాటకాలు అంటే ప్రజానీకం ఉవ్విళ్ళూరేవారు. వారి నాటకాలలో ఒక దశాబ్దం పాటు ఉజ్వల నటుడిగా వెలుగొందిన కపిలవాయి రామనాథ శాస్త్రితో సమబాగిణి అయి, ఆయన విధానాలన్నిటినీ ఆచరించి, ఆయనతో సమఉజ్జీగా నిలబడి ఆయనతో సమానమైన పేరు సంపాదించారు రామతిలకం.
ఆమె ఆజానుబాహు కాకపోయినా చామన ఛాయతో ఆకర్షణ కలిగిన అంగసౌష్టవం, చురుకైన నేత్రాలు, వంకెలు తిరిగిన కురుల సౌందర్యం, ఆమెను చూడవలసిందే గానీ వ్రాయనలవి కాదు. అమె నట సవ్యసాచి, స్వతహాగా మేధావి, కుశాగ్రబుద్ధి, పాత్రలో పరకాయ ప్రవేశం చేయగల దిట్ట. అమె తన నటనతో ప్రేక్షకులను మైమరిపింపజేసి తన వశం చేసుకొని ప్రశంసల వర్షం కురిపించుకోగల ప్రజ్ఞాశాలి. నాటక రంగంతో పాటు, దశాబ్ద కాలం సినిమా రంగంలో కూడా వివిధ పాత్రలను ఎంతో ఉదాత్తంగా పోషించి, ప్రసిద్ధ రంగస్థల గాయనిగా, సినిమా నటిగా పురోగమించారు రామతిలకం. ఒక పాత్రకు, మరొక పాత్రకు నటనలో సారూప్యం ఉండేది కాదు. ఏ పాత్రకు ఆ పాత్ర యొక్క ప్రత్యేకత నిలబెట్టుకునేవారు. ఆమె పాటలు కూడా పాడేవారు. ఆమె ఏనాడు కూడా ఏ నటిని, ఏ పాటని, ఏ అభినయాన్ని అనుకరించలేదు. ఆమె తన స్వయంకృషితో, తన స్వీయ ప్రతిభతో, తన సృజనాత్మక శక్తితో, వివిధ కోణాలలో తన పాత్రను ప్రతిభావంతంగా మలుచుకొని, ప్రతీ పాత్రను ఉన్నత శిఖరాలకు ఎక్కించారు.
కపిలవాయి తో ఎక్కువగా నాటకాలు…
రామతిలకం గాత్రం కోకిల కంఠం. మధురాతి మధురమైనది మరియు శ్రావ్యమైనది. అప్పట్లో అలాంటి గాత్రం ఏ రంగస్థలం నటికీ లేదని చెప్పడం అతిశక్తి కాదేమో. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంలో ఆమె నేర్పరి. రామతిలకం పద్య పఠనానికి ఏ ఒక్క నటుడు కూడా పోటీగా నిలబడడానికి వెనుకంజ వేసేవారు, ఒక్క కపిలవాయి రామనాథ శాస్త్రి తప్ప. ఎందుకనగా ఆమె పద్య పఠనం అంత విశిష్టమైనది. ఆమె మైలవరం థియేటర్ లో అనేక నాటకాలలో లెక్కకు లేని పాత్రలను ఎదరించారు. కపిలవాయి రామనాథ శాస్త్రి తో కలిసి ఆమె ఆంధ్రదేశమంతటా సంచారం చేసి నాటకాలలో అనేక పాత్రలు పోషించారు. నాటకాలలో ఆయన నాయకుడైతే, ఆమె నాయకి. ఆనాడు విస్తృత ప్రచారంలో ఉన్న అన్ని నాటకాలలో ఉన్న అన్ని రకాల పాత్రలను పోషించారు రామతిలకం.
ఆకర్షణీయంగా ఉండే ఆమె హావాభావాలు, నొక్కులు కలిగిన మృదువైన శిరోజాలు, విశాలమైన నేత్రాలు ఆమె నటనకు అలంకారాలుగా ఉండగా, ఆమె శ్రద్ధగా నేర్చుకున్న సంగీతం వలన కాబోలు ఆమెకు అచిరకాలం లోనే రంగస్థలం మీద నటిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. మైలవరం బాలభారతి సమాజానికి మేనేజరుగా ఉన్న కొమ్మూరి పట్టాభిరామయ్య ప్రాంభించిన లక్ష్మీ విలాస సభ” లో ప్రముఘ పాత్రలు ధరించిన రామతిలకం, ఆ తరువాత కపిలవాయి రామనాథ శాస్త్రితో కలసి “చింతామణి”, “చిత్రాంగి”, “సత్యభామ”, “అహల్య”, “సావిత్రి” మొదలైన స్త్రీ పాత్రలు పోషించారు. కపిలవాయి రామనాథ శాస్త్రి, రామతిలకం జంటగా వేసిన నాయకా, నాయిక వేషాలు ప్రజలను అమితంగా ఆకట్టుకోగా, కపిలవాయి తో విడిపోయి కొంతకాలం పులిపాటి వెంకటేశ్వర్లు తో కలసి ప్రదర్శించిన నాటకాలకు కూడా మంచి గుర్తింపు లభించింది.
చిత్ర రంగం…
నాటకాలలో రాణించి పేరు తెచ్చుకున్న నటీమణులకు మాత్రమే ఆనాటి సినిమాలలో ప్రవేశం లభించేది. ఒక్కోసారి అనుభవజ్ఞులైన నటీమణులకు కూడా సినిమా అవకాశాలు దొరికేవి కాదు. కానీ రామతిలకం మాత్రం సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నారు. ఆమె 1932 వ సంవత్సరంలో కలకత్తా ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ వారు నిర్మించిన “సావిత్రి” అనే శబ్ద చలనచిత్రములో “సావిత్రి” పాత్రను పోషించి అఖండ కీర్తిని గడించారు. అలాగే 1933 వ సంవత్సరంలో కలకత్తా మదన్ ఫిల్మ్ కంపెనీ వారు నిర్మించగా కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వం వహించిన “చింతామణి” చలనచిత్రంలో “చింతామణి” పాత్రను పోషించారు.
ఆ తరువాత వేల్ పిక్చర్ వారి “సీతాకళ్యాణం” సినిమాలో “కైక” పాత్రను, “కృష్ణలీలలు” చిత్రంలో ఆమె “యశోద” పాత్రను పోషించి తన గాన మాధుర్యముతోనూ , ఉద్వేగపూరితమైన భావ ప్రకటనతోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు పి.రామతిలకం. ఆ తరువాత హెచ్.ఏం.రెడ్డి “ద్రౌపది వస్త్రాపహరణం”, చిత్రంలో చిలకలపూడి సీతా రామాంజనేయులు “కృష్ణుడు” పాత్ర ధరిస్తే, రామతిలకం “సత్యభామ” పాత్రను పోషించారు. ఆ తరువాత ఆమె “సతీ తులసి”, “మొహినీ రుక్మాంగద”, “నర నారాయణ” (చివరి చిత్రం) చిత్రాలు వాణిజ్యపరంగా, కళాత్మకంగా విజయవంతం అవకపోవడంతో ఆమె సినిమా రంగం నుంచి వైదొలిగిపోయారు.
35 సంవత్సరాలకే స్వర్గారోహణం…
సినిమారంగంలో సంవత్సరానికి ఒకటో, రెండో విడుదలయ్యే చిత్రాలలో నాయక పాత్ర పోషించేవారు రామతిలకం. సినిమాలలో బొమ్మ కదలడం, మాట్లాడడం, పాట పాడడం ఒక వింత అయిన ఆ రోజులలో, సినిమా లలో నటించే నటీనటులకు ఎంతో గౌరవం, వారంటే ప్రేక్షకులకు ఎంతో ప్రేమ. వారికి ఎంతో పేరుప్రతిష్టలు కూడా ఉండేవి. సరస్వతి టాకీస్ వారి నిర్మించిన ద్రౌపది వస్త్రాపహరణం (1936) చిత్రంలో సి.ఎస్.ఆర్ కృష్ణుడుగా, రామతిలకం సత్యభామ పాత్ర పోషించగా, అందులో “చూడ చూడ కలికి శోభమౌగ పతుల ప్రేమలో”, “రే సాధువసంతా ముదితవనాల తాంతా” అనే గేయాలను రామతిలకం ఆలపించారు.
అలాగే వేల్ పిక్చర్సు వారు “శ్రీకృష్ణ లీలలు” తెరకెక్కించగా అందులో యశోద పాత్రను ధరించి “వినోదంబౌ నాకు నాయనా”, “జోజోజో కోమల శ్యామల”, “కనలేదు నీవు వినలేదు నీవు వనితల”, “కలయో వైష్ణవ మాయో ఇతర సంకల్పమో”, “గోపాలా గుణనిధి గోపబాల బృందావన లోల” అనే పద్యాలను పాడారు. పువ్వు పుట్టింది పరిమళించింది. పున్నమినాటి వెన్నెల విరిసింది. ఒక్క దశాబ్దం పాటు దేదీప్యమానంగా వెలిగిపోయారు. ఆంధ్ర ప్రజల హృదయాలలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. 35 సంవత్సరాల అతి చిన్న వయస్సులోనే ధ్రువతారగా రాలిపోయారు పి.రామతిలకం.










