20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో తమిళ నాటక రంగస్థలంపై తమిళ దేశాన్ని మూడు దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపిన చరిత్ర కలిగిన సాంఘిక నాటకం “రక్తకన్నీరు”. ప్రేక్షకులను ఆ నాటకం కవ్వించింది, నవ్వించింది. మనిషిలోని హీ మనిషిలోని హీనత్వపు చెంపను చెళ్ళుమనిపించడమే కాకుండా నాటి రాజకీయాలను సందర్భోచితంగా తూర్పారబట్టింది. “రక్తకన్నీరు” నాటకం. ఈ నాటకం సమాజంలోని అవకతవకల మీద సెటైర్లు విసిరేది. ఇలాంటి నాటకం గతంలో లేదు, మున్ముందు రాదు అన్నంతగా ప్రసిద్ధికెక్కింది.
“తిరువారూర్ కె. తంగరాజ్” రక్త కన్నీరు నాటకాన్ని వ్రాశారు. “రక్త కన్నీరు” నాటకంలోని ప్రధాన పాత్రధారి, దర్శకుడు, ప్రదర్శకుడు యం.ఆర్. రాధ. ఆ రోజులలో తమిళ నాటకాలకు విపరీతమైన ఆదరణ ఉండేది. సినిమాలను తలపించేలా భారీఎత్తున అమరికలు, నృత్యాలు, స్పెషల్ ఎఫెక్ట్స్ తో యం.ఆర్. రాధ ప్రదర్శించే నాటకాలను ప్రేక్షకులు విరగబడి చూసేవారు. యం.ఆర్. రాధ అసలు పేరు మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్. ఈయన కథానాయికలు రాధికా శరత్ కుమార్, నిరోషాల తండ్రి.
యం.ఆర్. రాధ చిన్నతనంలోనే తినటానికి మరో చేప ముక్క ఇవ్వనందున తల్లితో గొడవపడి ఇల్లువదిలి పారిపోయారు. రైల్వే స్టేషనులో ఒక పెద్దమనిషి సహకారంతో వాళ్ళ నాటక సంస్థలో చేరి చిన్నచిన్న పనులు చేస్తూ నాటకరంగంలో మెలకువలు నేర్చుకుని, నాటకాలలో పట్టు సంపాదించారు. కులం తక్కువ వాడని ఆయనను వంటగదిలోకి రానిచ్చేవారు కాదు. అది తనకు నచ్చేది కాదు. అందువలన చిన్నతనం నుండే తాను దేనికీ భయపడేవారు కాదు. అందుకే ఆయనను రెబల్ అంటుండేవారు.
తన పదవ ఏట ప్రారంభమైన నాటకరంగంలో చిన్నచితకా వేషాలేసిన ఆయన చివరికి ఆయన్నే దృష్టిలో పెట్టుకొని నాటకాలు వ్రాసే స్థాయికి ఎదిగారు. రంగస్థల నటుడైన తాను రంగస్థల వేదికలపై సుమారు ఐదు వేలకు పైగా నాటక ప్రదర్శనలిచ్చారు. రక్త కన్నీరు నాటకం విజయవంతమవ్వడంతో తాను పేరు సంపాదించుకున్నారు. అదే నాటకాన్ని సినిమాగా తీసినప్పుడు అందులో కూడా తాను అద్భుతంగా నటించి అగ్రతారగా ఎదిగారు. “రక్త కన్నీర్” సినిమాకు ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో బాటు, ప్రత్యేక పురస్కారాలను సంపాదించిపెట్టింది.
యం.ఆర్. రాధా “సంతానదేవన్” సినిమాతో 1939వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వెండితెరపై అరంగేట్రం చేశారు. జి.యం.బషియార్, పి.భానుమతి నాయక, నాయికలుగా నటించిన ఈ సినిమాలో యం.ఆర్.రాధ ప్రధానమైన పాత్రలో నటించారు. ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తనకు నాటకాలే మెరుగునిపించి నాటక ప్రదర్శనలోనే కొనసాగుతూ మళ్ళీ నాటకాలు వేయడం మొదలుపెట్టారు. “తాంథై పెరియార్” (ఈరోడ్ వెంకటప్ప రామసామి) స్థాపించిన సామాజిక ద్రవిడర్ కజగం అనే ద్రావిడ ఉద్యమం బాగా ఊపందుకుంటున్న తరుణంలో అంటరానితనంతో సహా ప్రస్తుత కుల వ్యవస్థ యొక్క రుగ్మతలను నిర్మూలించడం కోసం యం.ఆర్.రాధ ను బాగా ఆకర్షించింది.
ద్రవిడ ఉద్యమ ప్రభావంతో నాస్తికత్వంతో దేవుని ఉనికిని ప్రశ్నిస్తూనే, అలాంటి అంశాలతో నాటకాల ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. 12 జనవరి 1967 నాడు భవిష్యత్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి నటులు మరియు రాజకీయ నాయకులు ఎం.జి. రామచంద్రన్‌ను ఇంటిని సందర్శించిన యం.ఆర్. రాధ సంభాషణ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా కుర్చీలోంచి లేచి రామచంద్రన్ ఎడమ చెవిపై రెండుసార్లు కాల్చి నాలుగు సంవత్సరాల మూడు నెలలకు జైలుకు వెళ్లి వచ్చి మళ్ళీ సినిమారంగంలో కొనసాగారు. ఆయనకు ముగ్గురు భార్యలు, పన్నెండు మంది పిల్లలు.
జీవిత విశేషాలు.
జన్మనామం : యం.ఆర్. రాధ
ఇతర పేర్లు : మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ నాయుడు
జన్మదినం : 14 ఏప్రిల్ 1907
స్వస్థలం : తిరుచ్చి, మద్రాసు, మద్రాసు రాష్ట్రం, బ్రిటీషు ఇండియా
వృత్తి : రంగస్థల నటులు, సినిమా నటులు
తండ్రి : మద్రాసు రాజగోపాలన్
తల్లి : మద్రాసు రాజమ్మాళ్
జీవిత భాగస్వామి : ముగ్గురు భార్యలు (సరస్వతి, ధనలక్ష్మి మరియు గీత)
పిల్లలు : నలుగురు కుమారులు MRR వాసు , MR రాధా రవి , రాజు, మోహన్ మరియు ఎనిమిది మంది కుమార్తెలు రశ్య, రాణి, రతికళ, గానవల్లి, కస్తూరి, రాజేశ్వరి, రాధిక శరత్‌కుమార్ మరియు నిరోష..
మరణ కారణం : అనారోగ్యం
మరణం : 17 సెప్టెంబరు 1979, తిరుచిరాపల్లి, తమిళనాడు.
నేపథ్యం…
మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ నాయుడు అలియాస్ రాజగోపాల రాధాకృష్ణన్ అలియాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ 21 ఫిబ్రవరి 1907 నాడు తమిళనాడు లోని తిరుచిరాపల్లి జిల్లా లోని తిరుచ్చిలో జన్మించారు. వీరి తండ్రి మద్రాసు రాజగోపాలన్, తల్లి రాజమ్మాళ్. మద్రాసు అనే ఇంటిపేరు కలవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ నిజానికి మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (యం.జి.ఆర్) కన్నా పదేళ్లు పెద్దవారు. యం.ఆర్. రాధ వాళ్ళ నాన్నకు కూరగాయల దుకాణం ఉండేది. వారు పెద్దగా డబ్బు కలిగి ఉన్న కుటుంబమేమీ కాదు. చిన్నతనంలో బడికి వెళ్లి చదువుకునే పరిస్థితి ఎం.ఆర్. రాధ కు లేదు. తాను చిన్నగా ఉన్నప్పుడు అనగా సుమారు పది సంవత్సరాల వయస్సులోనే తినటానికి మరో చేప ముక్క ఇవ్వనందున తల్లితో గొడవపడ్డారు.
తల్లి ఎం.ఆర్. రాధ ను వారించింది. అన్ని చేపలు నీకే వేస్తే ఇంట్లోని మిగతా వారికి కూడా సరిపడాలి కదా. నీకు ఒక్కడికే వేస్తే ఎలా అని వాళ్ళ అమ్మ అన్నారు. దాంతో అలిగి, అమ్మతో గొడవపడిన యం.ఆర్. రాధ ఇల్లువదిలి పారిపోయారు. పదేళ్ల వయస్సు ఉన్న ఆ కుర్రాడు ఎక్కడికి వెళ్తాడు. దగ్గర్లో ఉన్న ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. రైల్వే స్టేషన్ లో అటూ, ఇటూ తిరుగుతుండగా, యం.ఆర్.రాధను ఒక పెద్దాయన గమనించి, తన పెట్టెను రైలు భోగి దగ్గరకు తీసుకు రమ్మని చెప్పారు. ఆ పెద్దాయన పేరు అలంటూరు రంగస్వామి నాయుడు. ఆయనకు ఒక నాటక సంస్థ ఉండేది. పది సంవత్సరాల వయస్సున్న యం.ఆర్. రాధను తనతో తీసుకెళతాను వస్తావా? అని రంగస్వామి నాయుడు అడిగారు. సరే అని తలూపి ఆయనతో ఆ పదేళ్ల యం.ఆర్. రాధ వెళ్లిపోయారు.
చిన్నతనం నుండే రెబల్…
మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ నాలుగవ తరగతి వరకే చదువుకున్నాడు. ఆ తరువాత చదువు లేదు. అలంటూరు రంగస్వామి నాయుడుతో కలిసి వాళ్ళ నాటకాల ట్రూపులో పనిచేస్తుండడం వలన చదువు ఆగిపోయింది. ఆ నాటకాల కంపెనీలోనే ఆయనతో చిన్నచిన్న పనులు చేయించుకునేవారు. యం.ఆర్. రాధ మొండివాడు, అందులోనూ చిన్న పిల్లవాడు గనుక అప్పుడప్పుడు నాటక కంపెనీ పెద్దల చేతిలో చిన్న చిన్న దెబ్బలు కూడా తినాల్సి వస్తుండేది. ఆయన మొండితనంతో చిన్న వయస్సు నుండే తనకు రెబల్ లక్షణాలు ఉండేవి. అతడు తక్కువ కులం వాడని వంట గదిలోనికి రానిచ్చేవారు కాదు. అప్పటినుండి ఆయన ఎదిరించడం అలవాటు చేసుకున్నారు. వంటగది దగ్గరికి వెళ్లి వంట అయ్యిందా లేదా అని గంభీర స్వరంతో వంట వారిని ప్రశ్నిస్తుండేవారు. నాటకాలలో పనిచేస్తున్న క్రమంలో ఒకనాడు తన బంధువు ఒకరు యం.ఆర్. రాధను చూసి, ఇంటివద్ద తనపై అమ్మానాన్నలు ఎంత బెంగపెట్టుకున్నది వివరించి ఆయనను ఇంటికి తీసుకెళ్లారు.
యం.జి.ఆర్ తో కలిసి నాటకాలు…
నాటకాలలో పనిచేసిన రాధా ఇంటివద్ద ఉండడంతో ఏమి తోచేది కాదు. ఒకసారి అలవాటైన నాటకాల కంపెనీ జీవితాన్ని వదులుకోలేకపోయాడు. దాంతో మరో నాటకాల కంపెనీలో చేరాడు. నాటకాల కంపెనీలో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండే యం.ఆర్. రాధా పెద్ద పెద్ద నాటకాలు వేసే స్థాయికి ఎదిగారు. అప్పట్లో రంగస్థలం నటులు కాంట్రాక్టు పద్ధతిలో నటిస్తుండేవారు. ఒకచోట కాంట్రాక్టు అయిపోగానే మరో చోట కాంట్రాక్టుకు వెళ్ళిపోయేవారు. యం.జీ.ఆర్, చక్రపాణి నటిస్తున్న “మధురై బాయ్స్ ట్రూప్” లో చేరిన యం.ఆర్. రాధా కొన్ని నెలల పాటు వారితో కలిసి నాటకాలు వేస్తుండేవారు.
నాటకాలు వేస్తున్న సమయంలో లోటుపాట్లను యం.జీ.ఆర్, చక్రపాణి లకు యం.ఆర్. రాధ వివరిస్తుండేవారు. “నాకు నాటకంలో యం.ఆర్. రాధా అన్న చాలా మెలకువలు నేర్పారు. నాకు మార్గదర్శకులుగా నిలిచిన వారిలో రాధ అన్న ఒకరు” అని యం.జి.ఆర్ తన దినచర్యలో వ్రాసుకున్నారు. నాటకంలో తాను వేస్తున్న వేషం చిన్నదా? పెద్దదా? అనే తేడా లేకుండా రంగస్థలం మీద ఎం.ఆర్. రాధా తన విశ్వరూపం ప్రదర్శిస్తుండేవారు. ఆయన ప్రక్కన నటించాలంటే రంగస్థలం నటీనటులు ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. ఒక్కోసారి నాటకంలో విలన్ ప్రక్కన ఉండే “సేవకుడి” పాత్రలో నటించినా కూడా యం.ఆర్ రాధ తన నటనతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకునేవారు.
సినీ రంగం…
చిన్న చిన్న పాత్రలలో నటించడం మొదలుపెట్టిన ఎం.జీ.రామచంద్రన్ 1936 వ సంవత్సరంలో చిత్రరంగ ప్రవేశం చేస్తే, యం.ఆర్. రాధా 1939 వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా “సంతానదేవన్” సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. ఆ సినిమాను “సేలం” లోని “మోడరన్ థియేటర్” వారు నిర్మించారు. “సంతానదేవన్” (1939) చిత్రంలో జి.యం.బషియార్, పి.భానుమతి నాయక, నాయికలుగా నటించారు. అందులో యం.ఆర్.రాధ ప్రధానమైన పాత్రలో నటించారు. ఆ తరువాత వరుసగా నాలుగైదు సినిమాలలో నటించారు. ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తనకు నాటకాలే మెరుగునిపించి నాటక ప్రదర్శనలోనే కొనసాగుతూ మళ్ళీ నాటకాలు వేయడం మొదలుపెట్టారు.
ద్రావిడ ఉద్యమం…
“తాంథై పెరియార్” (ఈరోడ్ వెంకటప్ప రామసామి) స్థాపించిన సామాజిక ద్రవిడర్ కజగం అనే ద్రావిడ ఉద్యమం బాగా ఊపందుకుంటున్న తరుణం అది. అంటరానితనంతో సహా ప్రస్తుత కుల వ్యవస్థ యొక్క రుగ్మతలను నిర్మూలించడం. ఆ రోజులలో మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ద్రావిడ నాడులో ఊపందుకుంటున్న ఆ ఉద్యమం యం.ఆర్. రాధ ను బాగా ఆకర్షించింది. ఆ సంస్థతో ఆయన సన్నిహితంగా ఉంటూనే నాటక రంగంలో కొనసాగుతూ “ద్రవిడ ఉద్యమ” ప్రభావంతో ఎక్కువ సామాజిక సమస్యలతో నాస్తికత్వంతో దేవుని ఉనికిని ప్రశ్నిస్తూనే, ఇలాంటి అంశాలతో నాటకాల ప్రదర్శన ఇస్తూ ఉండేవారు. నాస్తికత్వంతో దేవుని ఉనికిని ప్రశ్నించే యం.ఆర్. రాధ వేసే నాటకాలు పోలీసుల దృష్టికి వెళుతుండేవి. దాంతో ఆ నాటకాలను నిషేధించిన సందర్భాలు కూడా ఉండేవి. ఆ నాటకాల పేర్లు మార్చి, సన్నివేశాలు మార్చేసి, మళ్లీ అవే నాటకాలను రెబల్ స్టార్ యం.ఆర్. రాధ ప్రదర్శించేవారు. అలా నాటకాలు వేయడం ఆయనకు అలవాటయ్యింది.
“రక్త కన్నీరు” నాటకం…
అలా నాటకాలు వేసే క్రమంలో యం.ఆర్. రాధ యొక్క రంగస్థల నాటక జీవితాన్ని మలుపు తిప్పిన నాటకం “రక్త కన్నీరు”. పెరియార్ శిష్యులు “తిరువారూర్ కె. తంగరాజ్” “రక్త కన్నీరు” నాటకాన్ని వ్రాశారు. ఆ నాటకాన్ని యమ్. ఆర్. రాధా తమిళంలో ప్రదర్శిస్తూ ఉండేవారు. ఆయన “రక్త కన్నీరు” నాటకంలో ఒక కుష్టువాని పాత్రను ధరించి ప్రదర్శించేవారు. దానికి తమిళ దేశంలో విశేష ఆదరణ లభించింది. తమిళనాట రాజకీయ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నాటకంలో వ్యంగ్యంగా దుయ్యబట్టడంతో ఎం.ఆర్. రాధా ప్రదర్శించే ఆ నాటకం అంటే తమిళులు చెవి కోసుకునేవారు.
ఆ నాటకంతో ఒక్కసారిగా యం.ఆర్. రాధా పేరు మార్మోగిపోయింది. రోజురోజుకి “రక్త కన్నీరు” నాటకానికి ప్రజాదరణ బాగా పెరిగిపోయింది. ఆ నాటకాన్ని క్రమం తప్పకుండా ప్రతీరోజు ఒక ప్రదర్శన, ఒక్కోసారి ఒకే రాత్రి రెండు, మూడు ప్రదర్శనలు ఇచ్చేవారు. తమిళ రాష్ట్రంలోనే కాకుండా తమిళ జనాభా ఉన్న మలేషియా, సింగపూర్, బర్మా, సిలోన్ లాంటి దేశాలలో యం.ఆర్. రాధ ప్రదర్శింస్తున్న ఆ “రక్తకన్నీరు” నాటకం సంచలనం సృష్టించింది. ఆ రోజులలో రామాయణాన్ని భిన్నమైన కోణంలో చూపిస్తూనే అందులోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ మరో నాటకాన్ని కూడా ఎం.ఆర్.రాధా ప్రదర్శిస్తూ ఉండేవారు. అది ఆనాటి సమాజంలో మరో సంచలనం.
ఆ రోజులలో అనేకమంది ఆ నాటకాన్ని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఆ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం వారు “ఎవ్వరైనా ఏ నాటకాన్నైనా ప్రదర్శించాలంటే స్థానిక అధికారులతో ఆమోదం పొందాలి” అనే చట్టాన్ని కూడా ప్రవేశపెట్టారు. యం.ఆర్. రాధ ముందుగా “రక్తకన్నీరు” నాటకాన్ని అనుమతి తీసుకుని ప్రదర్శించేవారు. ఆ నాటకాన్ని ప్రదర్శించే క్రమంలో నాలుగైదు సన్నివేశాలు పూర్తయినాక నాటకాన్ని హఠాత్తుగా ఆపేసి, మధ్యలో రామాయణంలోని కొంత భాగాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. అలా “రక్త కన్నీరు” నాటకం రంగస్థలం మీద ప్రభంజనాన్ని సృష్టించింది.
“రక్త కన్నీర్” (1954) సినిమా…
యం.ఆర్. రాధ 1939 వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సినీరంగ ప్రవేశం చేసి నాలుగైదు సినిమాలలో నటించిన తరువాత సుమారు పదిహేను సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ పదిహేను సంవత్సరాలు నాటకాలకే పరిమితమైపోయారు. ఆయన నటించిన “రక్త కన్నీరు” నాటకాన్ని నేషనల్ పిక్చర్స్ వారు సినిమాగా తీద్దామనుకున్నారు. వారు అంతకు ముందు ఎం.జీ.రామచంద్రన్ తో “పరాశక్తి” అనే సినిమాను నిర్మించారు. ఆర్.కృష్ణన్ మరియు ఎస్.పంజు దర్శకత్వంలో రక్తకన్నీరు (1954) సినిమా తెరకెక్కించారు. యం.ఆర్. రాధ పెట్టిన షరత్తులకు దర్శకులు కృష్ణన్ – పంజు లు, నిర్మాత పి.ఏ. పెరుమాళ్ ముదలియార్ ఒప్పుకున్నారు. “రంగస్థలం ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు సినిమా చిత్రీకరణ జరుపకూడదు. తీరిక ఉన్నప్పుడు మాత్రమే సినిమా చిత్రీకరణకు వస్తాను” ఇది యం.ఆర్. రాధ పెట్టిన షరత్తు. “రక్త కన్నీర్” సినిమా లో యం.ఆర్. రాధ భార్యగా తెలుగు నటి జూనియర్ శ్రీరంజని నటించారు. చిత్రీకరణ పూర్తయ్యింది. 25 అక్టోబర్ 1954 నాడు విడుదలైంది. దీపావళి రోజున విడుదలయిన “రక్త కన్నీర్” సినిమా సంచలన సృష్టించింది. శత దినోత్సవాలు కూడా జరుపుకుంది.
వేగం పెరిగిన సినీ జీవితం…
“రక్త కన్నీర్” సినిమా విడుదల సమయానికి ఎం.జీ.ఆర్ కథానాయకుడిగా నిలదుక్కుకొని శరవేగంతో దూసుకెళ్తున్నారు. “రక్త కన్నీర్” సినిమా విడుదలైన తరువాత కూడా యం.ఆర్. రాధ “రక్త కన్నీరు” నాటక ప్రదర్శనలు ఆపలేదు. ఆ నాటకానికి ఆదరణ కూడా అలాగే ఉండేది. “రక్త కన్నీర్” సినిమా విజయవంతం అయిన తరువాత ఎం.ఆర్. రాధకు ఒకటి, రెండు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. 1960 నుండి ఎం.ఆర్. రాధకు వెండితెర జీవితం వేగం పుంజుకుంది. అప్పటినుండి ప్రతీ రెండు సినిమాలలో ఒక సినిమాలో యం.ఆర్. రాధ నటిస్తుండేవారు. కొన్ని సినిమాలలో ఆయన విలన్ గానూ, కొన్ని సినిమాలలో కథానాయిక తండ్రి గానూ నటించారు.
ఆయన ఏ పాత్ర ధరించినా కూడా, ప్రత్యేకంగా తన సంభాషణలతో వెండితెర మీద ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవారు. ఆయన ఓకే రకమైన గొంతుతో కాకుండా తన స్వరాన్ని పెంచుతూ, తగ్గిస్తూ రకరకాలుగా సంభాషణలు పలికేవారు. ఆయన తాను ధరించే పాత్రను బట్టి, తాను నటించే దృశ్యాన్ని బట్టి ఎం.జీ.ఆర్ నటించే ప్రతీఒక్క సినిమాలో యం.ఆర్. రాధ నటిస్తూ వచ్చారు. డిసెంబరు 1966 వరకు నటుడిగా ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న యం.ఆర్. రాధ తమిళంతో పాటు, ఆంగ్లంలో కూడా అనర్గళంగా మాట్లాడేవారు. నిజానికి యం.ఆర్. రాధకు తమిళమే కాదు, ఇంగ్లీష్ కూడా వ్రాయడం రాదు.
యం.జి.ఆర్ పై కాల్పులు జరిపిన యం.ఆర్. రాధ…
అప్పట్లో యం.జి.ఆర్ పై జరిపిన కాల్పుల ఘటన ఎంతో సంచలనం సృష్టించింది. 12 జనవరి 1967 నాడు ఎమ్.జి.ఆర్ పై కాల్పులు జరిగాయి. 12 జనవరి 1967 నాడు ముత్తుకుమరన్ పిక్చర్స్‌కు చెందిన యం.ఆర్. రాధ మరియు నిర్మాత కె.ఎన్.వాసు భవిష్యత్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి నటులు మరియు రాజకీయ నాయకులు ఎం.జి. రామచంద్రన్‌ను ఇంటిని సందర్శించారు. సంభాషణ జరుగుతున్న సమయంలో ఎం.ఆర్.రాధా అకస్మాత్తుగా కుర్చీలోంచి లేచి రామచంద్రన్ ఎడమ చెవిపై రెండుసార్లు కాల్చారు.
తూటా ఎమ్‌జిఆర్ ఎడమ చెవి పక్కగా గిగబడింది. రెండు బుల్లెట్లు రామచంద్రన్ మెడలో దిగాయి. ఆ తరువాత వెంటనే తుపాకీని తనవైపు తిప్పుకుని తనను తాను కాల్చుకోవడానికి ప్రయత్నించిన రాధా తనను తానే రెండు సార్లు (ఒకటి కణతవద్ద, రెండోది మెడమీద) కాల్చుకున్నారు. దాంతో ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేసారు. అక్కడ వారు సరైన చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. కాల్పులకు ప్రత్యక్ష సాక్షి నిర్మాత కె.ఎన్.వాసు మాత్రమే.
మే 1967లో సైతాపేట మొదటి డివిజన్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయధిపతి ఎస్.కుప్పుసామి ఆధ్వర్యంలో యం.జి.ఆర్ పై జరిగిన హత్య కేసు విచారణలో, ఆ తరువాత జస్టిస్ పి.లక్ష్మణన్ ఆధ్వర్యంలో జరిగిన చింగ్లెపుట్ సెషన్స్ కోర్టులో రాధ తరపున ప్రముఖ క్రిమినల్ అటార్నీ ఎన్.టి. వనమామలై వాదించారు. న్యాయస్థానం తీర్పును 04 నవంబరు 1967 నాడు వెలువరించారు. సాక్ష్యాధారాలు ఎక్కువగా రాధకు వ్యతిరేకంగా ఉన్నందున, యం.ఆర్. రాధకు ఏడేళ్ల శిక్ష విధించబడింది. హైకోర్టు విచారణ తరువాత అతడి వయస్సును పరిగణనలోకి తీసుకుని శిక్షను ఏడు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాల మూడు నెలలకు తగ్గించారు.
మరణం…
యం.జి.ఆర్ పై కాల్పుల ఘటనలో నాలుగు సంవత్సరాల మూడు నెలల జైలుశిక్ష అనుభవించిన తరువాత జైలు నుండి విడుదలయ్యారు. ఆ తరువాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్న యం.ఆర్. రాధ 1974 నుండి మళ్ళీ సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. జైలు నుండి వచ్చిన తరువాత కూడా తనకు ప్రజాదరణ తగ్గలేదు. ఆయన సమయాల్కరన్ (1974), దశవతారం (1976), మేళా తలంగల్ (1978), పంచభూతం (1978), వండిక్కారన్ మగన్ (1978), టాక్సీ డ్రైవర్ (1978), వెలుమ్ మయిలం తునై (1979) మొదలగు సినిమాలలో నటించారు. తన వయస్సు డెబ్భైలోకి వచ్చేసరికి యం.ఆర్. రాధకు అనారోగ్యం మొదలయ్యింది. తనకు కామెర్లు వచ్చాయి. దాంతో కోలుకోలేకపోయారు.
అలా క్షీణించిన అనారోగ్యంతో 17 సెప్టెంబరు 1979 నాడు తిరుచిరాపల్లిలోని తన నివాసంలోనే యం.ఆర్. రాధ తన 72 సంవత్సరాల వయస్సులో కామెర్లు కారణంగా మరణించారు. తాను మరణించే నాటికి శరణం అయ్యప్ప (1980), నాన్ పొట్ట సవాల్ (1980) సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. అతని అంత్యక్రియల ఊరేగింపుకు అభిమానులు పోటెత్తారు. ఎందరో అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. అతని అంత్యక్రియకు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దది. ఎందుకంటే సుమారు 200,000 మంది సంతాపకులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.
కుటుంబం…
నిజానికి మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ (యం.ఆర్. రాధా) కుటుంబంలో పూర్వీకులు తెలుగు ప్రాంతానికి చెందినవారు. అతడు మూడుసార్లు వివాహం చేసుకున్నారు. అతనికి ముగ్గురు భార్యలు. అతని భార్యల పేర్లు సరస్వతి, ధనలక్ష్మి మరియు గీత. రాజగోపాల రాధాకృష్ణన్ తన ముగ్గురు భార్యల ద్వారా తనకు పన్నెండు మంది పిల్లలకు తండ్రి అయ్యారు. అతనికి నలుగురు కుమారులు. వారు మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ వాసుదేవన్ , మద్రాస్ రాజగోపాలన్ రాధా రవి, రాజు మరియు మోహన్.
అలాగే ఎనిమిది మంది కుమార్తెలు రశ్య, రాణి, రతికళ, గానవల్లి, కస్తూరి, రాజేశ్వరి, నటి రాధిక శరత్‌కుమార్ మరియు నటి నిరోష లు. యం.ఆర్. రాధ మొదటి కుమారుడు యం.ఆర్.ఆర్ వాసు 1980ల మధ్యకాలం వరకు ప్రముఖ గుణచిత్ర నటులుగా ఉన్నారు. యం.ఆర్. రాధ మరో కుమారుడు యం.ఆర్. రాధా రవి కూడా నటులే. ప్రముఖ నటులు ఆర్.శరత్‌కుమార్‌ను వివాహం చేసుకున్న నటి మరియు నిర్మాత రాధిక కూడా యం.ఆర్. రాధ కుమార్తెనే. మరో నటి నిరోషా (నిరోజా అని కూడా పిలుస్తారు) కథానాయిక మరియు నటిగా, సహాయక పాత్రల్లో ఎక్కువగా పనిచేశారు. ఆమె నటులు రామ్ కీ ని వివాహం చేసుకున్నారు.