HISTORY CULTURE AND LITERATURE

గోదావరి మధ్యలో గిరిజనులు నిర్మించిన పురాతన ఆలయం.. 

అందమైన గోదావరి నది తీరం మధ్యలో ఓ ద్వీపంలా కనిపించే దీవి.. అక్కడ అద్భుత దృశ్యం  పురాతన కాలం నాటి ఆలయం. ఆ దృశ్యం చూడగానే అక్కడికి వెళ్లాలి అనిపించే ఆత్రుత.. మనసును ఉవ్విళ్లూరిస్తుంది. ఆ ప్రాంతమే మోతే గడ్డ. ఈ గడ్డపై పురాతన కాలం నాటి శివాలయంలో.. పరమేశ్వరుడు వీరభద్ర స్వామి రూపంలో పూజలను అందుకుంటున్నాడు. మోతెగడ్డ దీవి ప్రకృతి అందాలతో అలరారుతోంది.

ఆ ఇసుక తిన్నెలు.. అందమైన పరిసరాలు అహ్లాదాన్ని పంచుతాయి. సంధ్యా సమయంలో గోదావరి జలాలపై సూర్యకిరణాలు ప్రతిబింబించే దృశ్యం అపూర్వం. ఈ క్షేత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పరమ పవిత్రమైన పుణ్య ప్రదేశం భద్రాచలం పట్టణానికి సమీపంలో ఉంది ఈ ఆలయం. భద్రాద్రి రామయ్యను దర్శించుకోవడానికి వచ్చిన అనేకమంది ప్రజలు ఈ ఆలయం వద్దకు చేరుకోవడానికి ఎంతో మక్కువ చూపిస్తారు. కానీ ఈ ఆలయం నిత్యం తెరిచి ఉండదు. పరమపవిత్రమైన గోదావరి మధ్యలో ఎత్తైన ద్వీపం వద్ద ఈ ఆలయం ఉంది. వర్షాకాలంలో భారీ వరదలు సంభవించడంతో గోదావరి ప్రవాహం అధికంగా పెరుగుతుంది. ఈ సమయంలో ఈ ఆలయానికి రాకపోకలు నిలిచిపోతాయి. కేవలం డిసెంబర్ నెల నుండి మే నెల వరకు మాత్రమే ఈ ఆలయం చూడడానికి అవకాశం ఉంటుంది. గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉండకపోవడంతో ఈ సమయంలో ఆ పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి భక్తులు కాలినడకనే ప్రయాణిస్తారు.

స్థల పురాణం..

ఒకప్పుడు దట్టమైన కీకారణ్యంతో కూడుకొని ఉండేది ఈ ఏజెన్సీ ప్రాంతం.  గోదావరి మధ్యలో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని 13వ శతాబ్దంలో గిరిజనులు నిర్మించుకున్నారు. ఆ కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఈ ఆలయ క్షేత్రపాలకుడు సూర్య భగవానుడు. ఇక్కడ స్వామి వారి చారిత్రక గాధ.. గిరిజనుల నమ్మకాలతో ముడిపడినటువంటిది.

పూర్వము ఈ గోదావరి నది తీరానికి వీరభద్రుడు అనే రాజు వేటకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడి గిరిజన జాతి స్త్రీ భద్రకాళితో ప్రేమలో పడతాడు. కుల పెద్దలను, గిరిజన ప్రజలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అంతేకాకుండా ఆ కొండ జాతి ప్రజలకు అండగా నిలిచాడు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ వారికి దేవుడు అయ్యాడు. ఆ కృతజ్ఞతతోనే ఆ గిరి పుత్రులు గుడి కట్టి పూజిస్తున్నారు. ఇక్కడ సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా వీరభద్ర స్వామి ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. అందుకే ఈ స్వామి దర్శనం కోసం శివరాత్రి రోజు కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.

గిరిజనుల సమక్షంలోనే శివరాత్రి మహోత్సవం…

ఏటా ఇక్కడ శివరాత్రి మహోత్సవం గిరిజన ప్రజలే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శివపార్వతుల కల్యాణానికి స్వయంగా గోటి తలంబ్రాలను తీసుకువచ్చి కళ్యాణాన్ని అద్భుతంగా నిర్వహిస్తారు. ఆడబిడ్డ భద్రకాళికి తాళిబొట్టు, కట్న కానుకలు సమర్పించి భక్తిని చాటుకుంటున్నారు. శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవార్ల కళ్యాణాన్ని వైభవంగా జరుపుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడిన గిరిజనులు అంతా ఈ వేడుక చూడడానికి తరలివస్తారు.

శివరాత్రి సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రాచలం రామాలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లను చేస్తారు.  ప్రకృతి అందాలతో అలరారుతోంది ఈ క్షేత్రం. గోదావరిలోఎంత పెద్ద వరదలు వచ్చినప్పటికీ ఈ దీవి మాత్రం మునగదు. జూలై నుంచి నవంబర్ వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. కాబట్టి ఈ దీవిలోకి వెళ్లే సాహసం ఎవరు చేయరు. అప్పటివరకే స్వామి వారికి పూజా కార్యక్రమాలు కూడా ఉండవు. డిసెంబర్ నుండి వరద ప్రవాహం తక్కువగా ఉండడంతో ఆ సమయంలో అర్చకులు నాటు పడవ ద్వారా వెళ్లి పూజలు నిర్వహిస్తారు. 

పర్యాటక ప్రదేశంగా  గుర్తించాలి…

ఈ దీవిని ప్రఖ్యాత పర్యాటక స్థలంగా మార్చవచ్చు. ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తే ప్రతినిత్యం పూజలు జరిగేలా చేయవచ్చు.  భక్తులు ఆ ప్రాంతానికి చేరుకునేలా తగిన ఏర్పాటు చేయగలిగితే భద్రాచల రాముని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు మరొక అద్భుతమైన పర్యాటక అనుభూతిని అందించవచ్చు. ఈ క్షేత్రం భద్రాచలంలోని రామాలయం వద్ద నుంచి పడమర దిక్కుగా గోదావరి వారధిని తిలకించే వారికి వారధికే ఆవల.. నది ప్రవాహం మధ్యలో ఎత్తుగా మోతేగడ్డ కనిపిస్తుంది. పరిసర ప్రాంతాలైనటువంటి భద్రాచలం, సారపాక, బూర్గంపాడు మండలాల ప్రజలకు ఈ తీరం ఓ పర్యాటక ప్రాంతం.

ఆలయాన్ని చేరుకునే మార్గాలు…

మోతే గడ్డ దీవికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. భద్రాచలం వెళుతున్నప్పుడు వచ్చే బూర్గంపాడు మండలంలోని సారపాక కూడలి నుంచి ఇరవైండి  రహదారిలో వెళుతుంటే నాలుగు కిలోమీటర్ల దూరం తర్వాత.. మోతే గ్రామ రహదారి వస్తుంది. ఆ దారిలో వెళితే మోతె నుంచి గోదావరి తీరానికి దారి ఉంటుంది. దాదాపు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ మార్గం గుండా వెళితే గోదావరి తీరంలో మెట్ల రేవు కనిపిస్తుంది. అక్కడి నుంచి పడమలో మోతె గడ్డ దీవికి చేరుకోవచ్చు. ఈ మార్గంలో వెళ్లాలనుకునేవారు ముందుగానే పడవని ఏర్పాటు చేసుకుంటే సౌకర్యంగా ఉంటుంది.  భద్రాచలం నుంచి రెండో మార్గం కూడా ఉంది. భద్రాచలం పట్టణం నుంచి పర్ణశాల, దుమ్ముగూడెం వెళ్లే రహదారిలో నాలుగు కిలోమీటర్ల దూరంలో 

చెన్నంపేట అనే కుగ్రామం వస్తుంది. ఆ పల్లె నుంచి గోదావరి నది తీరానికి వెళ్లాలి. అటు నుంచి నదిలో మోతెగడ్డ దీవి వరకు నడిచే వెళ్లాల్సి ఉంటుంది. కాస్త కష్టంగా అనిపించినా..  జీవితకాలం 

గుర్తుండి పోతుంది ఆ పర్యటకం. కనుచూపుమేరలోని భద్రాచలం క్షేత్రం ఉంది కాబట్టి అటు రామయ్య దర్శనం, ఇటు శివయ్య కటాక్షము లభిస్తుంది. శివ కేశవుల మధ్య అభేక్షాన్ని పాటించినట్లు అవుతుంది.

Show More
Back to top button