CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో తక్కువ చిత్రాలతో ఎక్కువ కీర్తిపొందిన నటి.. సీనియర్ శ్రీరంజని..

1932 లో తెలుగు టాకీలు మొదలైన తరువాత మొట్టమొదటగా 1934వ సంవత్సరంలో “లవకుశ” చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. ఈస్టిండియా ఫిలిం కంపెనీ పతాకంపై మోతీలాల్ ఛబ్రియా నిర్మాతగా పి.పుల్లయ్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కె.వి. సుబ్రహ్మణ్యం వ్రాసిన “లవకుశ” నాటకం  ఆధారంగా “లవకుశ” (1934) చిత్రాన్ని తెలుగేతరుడైన మోతీలాల్ ఛబ్రియా నిర్మించారు. శ్రీరాముని పాత్రలో పారుపల్లి సుబ్బారావును నటించగా, ఆ చిత్రంలో సీతాదేవి పాత్రలో గుంటూరు జిల్లా వాసి అద్భుతంగా నటించారు. ఆ పాత్ర ధరించిన ఆ నటి గురించి ప్రజలు అద్భుతంగా చెప్పుకున్నారు. ఆమెకు “లవకుశ” మొట్టమొదటి చిత్రం.

అంతకుముందు ఎలాంటి నటన అనుభవం లేకుండా సీతాదేవి పాత్రను అద్భుతంగా పోషించడమే కాదు, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన ఆ నటిని చూస్తే ప్రజలు సాక్షాత్తు సీతాదేవి వచ్చి ఈ సినిమాలో కనిపించింది అన్నంత మంత్రముగ్ధులయ్యారు. వాల్ పోస్టర్లలో, పుస్తకాలలో ఉన్న సీతమ్మ బొమ్మని కత్తిరించి, ఇళ్ళలోను, గోడలకు అతికించి దండాలు కూడా పెట్టేవారు. చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆమెకు ఆంధ్ర దేశమంతటా అనేక చోట్ల ఘనమైన సన్మానాలు జరిగాయి. ఆమె పేరు “సీనియర్ శ్రీరంజని”. శ్రీరంజని సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన వారిలో మొదటిది ఆమె. సీత పాత్రధారిణిగా ఆమె నటనకు “స్వర్ణ పతకం” కూడా దక్కించుకున్నారు.

అక్క – చెల్లెల్లు చిత్రరంగంలో కథానాయికలుగా కొనసాగడమనే సంప్రదాయ ప్రక్రియకు శ్రీకారం చుట్టినవారు “శ్రీ రంజని సిస్టర్స్”. ఆ  తరువాత ఆ వైభవాన్ని సినిమా రంగంలో అలాగే కొనసాగించిన వారు “పుష్పవల్లి – సూర్యప్రభ”, “షావుకారు జానకి – కృష్ణకుమారి”, “జయసుధ – సుభాషిణి”, “అంబిక – రాధ”, “జ్యోతిలక్ష్మి – జయమాలిని”,  “భానుప్రియ – శాంతి ప్రియ”, “రాధిక – నిరోషా”, “నగ్మా – జ్యోతిక – రోషిణి మొదలగు కథానాయికలు తెలుగు చిత్రాలలో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. అలాంటి “శ్రీ రంజని సిస్టర్స్” తెలుగు సినిమారంగంలో తమ వారసత్వ వైభవాన్ని చాటి చెప్పారు.

సీనియర్ శ్రీరంజని తెలుగు చలనచిత్ర రంగంలో ఐదు సంవత్సరాలు, తొమ్మిది చిత్రాలు. అయినా కూడా ఇప్పటికీ తెలుగు వారికి ప్రీతిపాత్రమైన వెండితెర సీత సీనియర్ శ్రీరంజని. ఆమె చెల్లెలు జూనియర్ శ్రీరంజని కూడా తన అక్క బాటలో నడిచి, తాను కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. కష్టాలు వస్తే సినిమాలలో శ్రీరంజని కష్టాలు అంటారు. శ్రీ రంజని కష్టాలు, ప్రేక్షకులకు అలుపెరుగని కన్నీళ్లు, అవే నిర్మాతలకు కాసుల వర్షాలు. శ్రీరంజని అనగానే సీనియర్ అయినా, జూనియర్ అయినా కష్టాలు, పతివ్రత పాత్రలు, తులసి చెట్టు దగ్గర పూజలు చేయడం పరిపాటి అయ్యింది.

వీరి కుమారులు యం.మల్లికార్జునరావు సూపర్ స్టార్ కృష్ణ గారి సినీప్రస్థానం ప్రారంభంలో, కృష్ణ గారి సినీ జీవితాన్ని మలుపు తిప్పిన విజయవంతమైన చిత్రం “గూడచారి 116” ను రూపొందించారు. తెలుగులో మొట్టమొదటి విజయవంతమైన చిత్రం లవకుశ (1934). తెలుగు టాకీలు వచ్చిన తరువాత విడుదలైన అంతకుముందు వచ్చిన తెలుగు సినిమాలు లవకుశ (1934) అంతగా విజయవంతం కాలేదు. ఆ తరువాత 1949లో విడుదలై విజయవంతమైన మరొక చిత్రం కె.వి.రెడ్డి గారు తెరకెక్కించిన “గుణసుందరి కథ”, 1966లో విడుదలై విజయవంతమైన ఇంకొక చిత్రం “గూడచారి 116”. ఈ ముడు ఈ చిత్రాల ప్రసక్తి లేకుండా తెలుగు సినిమా చరిత్ర సమగ్రం కాదు అనడానికి అతిశక్తి లేదు. ఈ సినిమాల గురించి ప్రస్తావించుకోవాలంటే “సీనియర్ శ్రీరంజని”, “జూనియర్ శ్రీరంజని”, “యం. మల్లికార్జున రావు” గురించి కూడా చెప్పుకోవాల్సిందే. ఇది శ్రీరంజని కుటుంబానికి ఉన్న ప్రత్యేకత.

జీవిత విశేషాలు.

జన్మనామం  :   సీనియర్ శ్రీరంజని

ఇతర పేర్లు  :   మంగళగిరి శ్రీరంజని 

జన్మదినం :  1906

స్వస్థలం :    మురికిపూడి, నరసరావుపేట, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

తల్లి    :     వీరమ్మ ,

జీవిత భాగస్వామి :    నాగుమణి  

పిల్లలు :    ముగ్గురు (వారిలో ఒకరు యం. మల్లికార్జున రావు) 

మరణ కారణం  :   క్యాన్సర్ 

మరణం :    24 సెప్టెంబరు 1939

నేపథ్యం…

సీనియర్ శ్రీరంజని 1906 వ సంవత్సరంలో గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా మురికిపూడిలో జన్మించారు. తల్లి పేరు వీరమ్మ. సీనియర్ శ్రీరంజని ప్రాథమిక విద్యాభ్యాసం జరుగుతున్నప్పుడే ఆమెకు “సంగీతం”, “భరతనాట్యం” నేర్పించారు. శ్రీ రంజని మేనత్తలు భరతనాట్యం చేసేవారు, బాగా పాడేవారు కూడానూ. వారి సహాచర్యంలో పెరిగిన శ్రీరంజనికి చిన్నతనంలోనే ఆ ఉత్సాహం కలిగింది. కీర్తిశేషులు బెజవాడ హనుమాన్ దాస్ వద్ద సంగీతాభ్యాసం చేశారు. సీనియర్ శ్రీరంజని మేనత్తలు అంజనాదేవి, శేషగిరిలు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తుండడం వలన వారు నాటకాలలో కూడా పాత్రలు ధరించేవారు. బెజవాడ హనుమాన్ దాస్ స్థాపించిన “శ్రీకృష్ణలీలా విలాసం” అనే నాటక సంస్థలో సీనియర్ శ్రీరంజని  మేనత్తలు పాత్రలు ధరించేవారు.

“శ్రీకృష్ణలీలా విలాసం” అనే నాటక సమాజం (1930 ప్రాంతంలో) సుమారు పది సంవత్సరాల పాటు నడిచింది. ఆ నాటక సంస్థలో సీనియర్ శ్రీరంజని కూడా పాత్రలు పోషించేవారు. “శ్రీకృష్ణ లీలా విలాసం” అనే నాటక సంస్థ వారు కేవలం బెజవాడ, గుంటూరులలోనే కాకుండా రాయలసీమలో కూడా నాటక ప్రదర్శనలు జరుపుతుండేవారు. ఆ నాటక ప్రదర్శనలో సీనియర్ శ్రీరంజని కేవలం స్త్రీ పాత్రలే కాకుండా, పురుష పాత్రలు కూడా పోషిస్తూ ఉండేవారు. “శశిరేఖ” నాటకంలో అభిమన్యుని పాత్ర, “సావిత్రి” నాటకంలో సావిత్రి, సత్యవంతుడి పాత్ర, “రాధాకృష్ణ” అనే నాటకంలో శ్రీకృష్ణుడి పాత్ర పోషించేవారు. ఎస్.ఆర్.మూవీస్ అధినేత నాగుమణి కూడా బెజవాడ హనుమాన్ దాస్ వద్దే సంగీతం నేర్చుకోవడం వలన అక్కడే సంగీతం విద్య నేర్చుకుంటున్న శ్రీరంజనితో పరిచయమై, ఆ పరిచయం కొన్నాళ్ళకు వివాహానికి దారితీసింది.

సినీరంగ ప్రవేశం…

ఆ రోజుల్లో ఆరున్నర శృతిలో అద్భుతంగా పాడే శ్రీరంజని గాత్రంతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించడం గుర్తించిన హెచ్.ఎం.వి గ్రామ్ ఫోన్ కంపెనీ వారు ఆమెతో రికార్డు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజులలో నాటకాలలో నటించే వారితో గ్రామ్ ఫోన్ రికార్డు సంస్థ (హెచ్.యం.వి) వారు గ్రామ్ ఫోన్ రికార్డులు పాడించేవారు. నిజానికి గ్రామ్ ఫోన్ రికార్డు కంపెనీలు ఇలా ప్రేక్షకులలో ఆదరణ ఉన్నవారితో పాటలు పాడించి రికార్డింగ్ చేయించేవారు. ఈ క్రమంలో హెచ్.ఎం.వి వారు సీనియర్ శ్రీరంజని గురించి తెలుసుకొని ఆమెతో పాటలు పాడించి, రికార్డింగ్ చేయించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. పాటల రికార్డింగ్ కోసం “కొల్లాపూర్”, “బొంబాయి”  తీసుకెళ్లాలి. కానీ ముందుగా రిహార్సుల్ కోసమని ఆమెను విజయవాడకు పిలిపించారు. శ్రీరంజని తన భర్త నాగుమణి తో కలిసి రిహార్సల్ చేస్తున్న సమయంలో నిశ్శబ్ద యుగం (మూకీ యుగం) నుండి పరిశ్రమతో అనుబంధం ఉన్న తెలుగు సినిమాలో తొలితరం సినీ ప్రముఖులలో ఒకరు అయిన దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య అనే సినీ ప్రముఖులు అక్కడకు వచ్చారు.

లవకుశ (1934)…

కాకినాడకు చెందిన పుల్లయ్య కలకత్తాలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి సినిమాలు నిర్మించేవారు. ఆయన 1933లో “సతీసావిత్రి” అనే సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా మోస్తరుగా ఆడింది. ఆ తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బెంగాలీలో ఒక సినిమా తీశారు. దాని పేరు “సీత”. ఈ సినిమాకి దేబకి బోస్ దర్శకత్వం వహించారు. అందులో పృథ్వీరాజ్ కపూర్ రాముడిగా, దుర్గా ఖోటే సీతగా మరియు త్రిలోక్ కపూర్ లవుడిగా నటించారు. ఆ సినిమా బెంగాలీలో విజయవంతం అయ్యింది. దానిని తెలుగులో తీయదలిచి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, దర్శకులు సి.పుల్లయ్యను సంప్రదించారు. అప్పటికే లవకుశ అనే నాటకాన్ని తెలుగులో సినిమాగా తీయాలని చూస్తున్న చిత్త జల్లు పుల్లయ్య “ఈస్ట్ ఇండియా కంపెనీ” వారికి 1934 సంవత్సరంలో లవకుశ అనే సినిమాను తీసిపెట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చారు.

లవకుశ సినిమా పౌరాణిక సినిమా. పౌరాణిక నాటకాలు వేసే నటీనటుల కోసం వెతికే క్రమంలో ఆయన ఆంధ్రదేశం వచ్చారు. ఆ క్రమంలో రంగస్థల నటులు, నృత్యకారులు అయిన పారుపల్లి  సత్యనారాయణద్వారా విజయవాడలో ఉన్న సీనియర్ శ్రీరంజని గురించి తెలుసుకున్న చితజల పుల్లయ్య హెచ్.ఎం.వి.లో పాటల రికార్డింగ్ చేస్తున్న శ్రీరంజని భర్త నాగుమణినితో చర్చించి, తాను తీయబోయే “లవకుశ” (1934) సినిమాలో సీత పాత్రకి శ్రీరంజనిని ఎంచుకున్నారు.  అలాగే ఆమె భర్త నాగుమణిని భరతుని పాత్రకు ఎంపిక చేసుకున్నారు. రంగస్థలం ప్రముఖ నటులు పారుపల్లి సుబ్బారావును రాముడు పాత్రకు, లక్ష్మణుడిగా ఈమని వెంకట్రామయ్యను ఎంచుకున్నారు. లవ, కుశలుగా మాస్టర్ భీమారావు, మాస్టర్ మల్లేశ్వరరావు లను తీసుకున్నారు. వీరందరితో పాటు శ్రీరంజనిని కూడా కలకత్తా తీసుకొని వెళ్లి కేవలం వంద రోజులలో లవకుశ (1934) సినిమాను పూర్తి చేశారు. 

వెండితెర రెండవ సీత…

03 డిసెంబరు 1934 నాడు లవకుశ సినిమా విడుదలయ్యింది. ఎడ్ల బండ్లు కట్టుకుని సినిమాలకు వెళ్లి చూడడం ఈ సినిమాతోనే ప్రారంభమైంది. దుర్గ కళామందిర్ లో “లవకుశ” సినిమా ప్రదర్శిస్తున్న రోజులలో విజయవాడ రోడ్లపైన ఎడ్లబండ్లతో పెద్ద తిరునాళ్లగా ఉండేదట. లవకుశ సినిమా అనుకోకుండా అత్యంత ఘనవిజయం సాధించింది. వాల్ పోస్టర్ మీద ఉన్న సీత బొమ్మ కత్తిరించి తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి పూజలు చేసేవారు అభిమానులు. శ్రీరంజని ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు చేయడం, హారతులు పట్టడం లాంటివి చేస్తుండేవారు.

మద్రాసు లోని రౌండ్ థియేటర్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు లవకుశ సినిమా విజయోత్సవ సభను ఏర్పాటుచేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఒరిస్సా మహారాజు విక్రమ్ దేవ్ వర్మ హాజరయ్యారు. శ్రీరంజనిని సన్మానించడానికి వేదిక మీదికి పిలిచినప్పుడు ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు చూసి వాల్మీకి రామాయణంలో సీత గురించి చదివాను, కానీ లవకుశ సినిమా చూశాక నిజమైన సీతను చూస్తున్నానని అరచేతి వెడల్పు గల బంగారు పతకాన్ని ఆమెకు బహుకరించారు. తెలుగు టాకీలతో పోలిస్తే సీనియర్ శ్రీరంజని వెండితెర రెండవ సీతగా ప్రసిద్ధికెక్కింది. వెండితెర మొట్టమొదటి సీత “సురభి కమలా భాయి” (శ్రీరామ పాదుక పట్టాభిషేకం).

కేవలం తొమ్మిది సినిమాలు…

“లవకుశ” (1934) సినిమా విజయవంతం అవ్వడంతో సీనియర్ శ్రీరంజనికి వరుసగా సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. లవకుశ విజయం తర్వాత శ్రీరంజని శోక పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిపోయారు. నటనలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. రెండవ సినిమా పినపాల వెంకటదాసు “కృష్ణ లీలలు” సినిమాలో దేవకి పాత్రలో శ్రీవిరంజని నటించారు. ఈ సినిమా చిత్ర నిర్మాణం మద్రాసులో జరిగింది. అలాగే మాయాబజార్ (1936) లో సుభద్ర, సతీ తులసి (1936) లో పార్వతి, సారంగధర (1937) లో రత్నాంగి,  చిత్రనళీయం (1938) లో దమయంతి, నరనారాయణ (1937) లో గయుని భార్య, మార్కండేయ (1938) లో మరుద్వతి, వరవిక్రయము (1939) లో భ్రమరాంబ మొదలగు పాత్రలలో నటించిన సీనియర్ శ్రీరంజని ప్రజల హృదయాలలో చిరస్మరణీయులయ్యారు. శ్రీరంజని కేవలం తొమ్మిది సినిమాలలో నే నటించినా కూడా ఆమె నటనాకౌశలానికి ప్రజల నీరాజనాలు లభించాయి. పాటలు పాడడంలో, పద్యం చదవడంలోనే కాకుండా నవరసాలు పలికించగల అద్భుత నటిగా కూడా ఆమెకు మంచి పేరు ఉండేది. సీనియర్ శ్రీరంజని నటించిన ఆఖరి చిత్రం “వరవిక్రయం”. ఈ చిత్రంతో భానుమతి సినీ జీవితం మొదలయ్యింది.

పిన్న వయస్సులో కీర్తిశేషులు…

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రంగస్థలం నటులు పారుపల్లి సుబ్బారావుతో కలిసి శ్రీ రంజని “లవకుశ” నాటకాన్ని రంగస్థలం మీద ప్రదర్శిస్తుండేవారు. ఆమె నటించే సినిమాలు కొన్ని కలకత్తాలోనూ, కొన్ని కొల్హాపూర్ లోనూ, కొన్ని బొంబాయి లోనూ చిత్రీకరించడం, ఏమాత్రం ఖాళీ లేకుండా మధ్య మధ్యలో రంగస్థలం నాటకాలలో నటిస్తున్న క్రమంలో  “వరవిక్రయం” సినిమా చిత్రీకరణలో ఉండగానే ఆమెకు ఆరోగ్యం దెబ్బతిన్నది. అది చివరికి క్యాన్సర్ కు దారితీసింది. ఆమెకు దైవభక్తి అంతా ఇంతా కాదు. ప్రతీనిత్యము కొన్ని గంటలు దైవ ప్రార్థన చేసేవారు. శ్రీరంజని కుటుంబానికి కీర్తిశేషులు చల్లా లక్ష్మీనారాయణ గురువులు. వారింట్లో ఏది జరిగిన గురువుల అనుమతితో, వారి ఆశీర్వచనాలతోనే జరిగేవి. క్యాన్సర్ వ్యాధి గురైన సీనియర్ శ్రీరంజని అతి చిన్న వయస్సులో (33 సంవత్సరాలకే) 1939లో తన స్వగ్రామంలోనే కీర్తిశేషులయ్యారు.  

చిన్న వయస్సులోనే రాలిపోయిన ఈ తార మరణం ఆమె కుటుంబీకులనే కాదు, సినిమాను అభిమానించే వారిని కలతపరిచింది.  శ్రీ రంజనికి ముగ్గురు కుమారులు. తరువాత కాలంలో దర్శకులుగా మంచి పేరు సంపాదించుకున్న ఎం.మల్లికార్జున రావు వారిలో పెద్దవారు. ఈయన గొల్లభామ (1947) చిత్రంలో రాజకుమారుడుగా నటించారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “గూఢచారి 116” సూపర్ స్టార్ కృష్ణ కు “ఆంధ్రా జేమ్స్ బాండ్” అనే మారుపేరును తెచ్చిపెట్టడమే కాకుండా, తెలుగు చిత్రసీమలో ప్రముఖ వ్యక్తిగా తన స్థానాన్ని పదిలపరుచుకునేలా చేసింది. ఇప్పటికీ సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీరంజని గురించి మాట్లాడుకుంటే ఆమె ఎన్నో సినిమాలలో నటించారని   అనుకుంటారు. కానీ ఆమె నటించింది కేవలం తొమ్మిది సినిమాలే. అయినప్పటికీ కూడా ఆ పాత్రల యొక్క ప్రత్యేకత, తెలుగు టాకీలు మొదలైన కొత్తలో అవి సృష్టించినటువంటి సంచలనం పరిశీలన చేసి చూస్తే, సీనియర్ శ్రీరంజని సినిమా చరిత్ర గురించి తెలుసుకున్న వారు ఎవ్వరూ కూడా ఆమెను మర్చిపోరు.

Show More
Back to top button