Telugu News

పంతొమ్మిదవ శతాబ్దపు ప్రపంచ అత్యంత సుప్రసిద్ధ రచయిత.. జాన్ కీట్స్..

ప్రపంచంలోని అద్భుతమైన కవిత్వాన్ని వ్రాసింది ఇరవై ఐదు ఏళ్ళ లోపు వారే, అందులో ఇంకా అద్భుతమైన కవిత్వాన్ని వ్రాసింది ఇరవై ఒక్క ఏళ్ళ లోపు వారే. అంటే సాహిత్య చరిత్రలో యువ కవులు అత్యుత్తమ సృజనాత్మకతను, అద్భుతమైన భావాలను అందించారనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. చాలా మంది గొప్ప కవులు తమ ఇరవై సంవత్సరాల వయస్సు ప్రారంభంలోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కవితలను వ్రాశారు. అంత అద్భుతమైన కవిత్వాన్ని అందించిన వారిలో ప్రముఖులు ఆర్థర్ రాంబౌడ్, పి. బి. షెల్లీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు మొదలగు వారున్నారు. అదే కోవకు చెందిన వారు జాన్ కీట్స్. లార్డ్ బైరన్ మరియు పెర్సీ బైషే షెల్లీలతో పాటు రెండవ తరం అద్భుతమైన కవులలో ఒక ఆంగ్ల కవి జాన్ కీట్స్. ఆయన తన 25 సంవత్సరాల వయస్సులో క్షయవ్యాధితో మరణించారు. ఆయన మరణించే నాటికి, అతని కవితలు ప్రచురణలోకి వచ్చి నాలుగు సంవత్సరాల కంటే తక్కువ కాలమే అయ్యింది. నిజానికి ఆ కవితలు కానీ, తాను వ్రాసిన సాహిత్యం కానీ అతని జీవితకాలంలో అవి అంతగా ఆదరణ పొందలేదు. కానీ తన మరణం తరువాత అతని కీర్తి వేగంగా పెరిగిపోయింది. 

పద్దెనిమిది శతాబ్దం చివరి నాటికి, జాన్ కీట్స్ ఆంగ్ల సాహిత్య ప్రామాణిక రచయితల జాబితాలో స్థానం సంపాదించారు. ఆంగ్ల చిత్రకారులు, కవులు మరియు కళా విమర్శకుల సమూహం అయిన “ప్రీ – రాఫెలైట్ బ్రదర్‌ హుడ్‌” కు చెందిన అనేక మంది రచయితలను బలంగా ప్రభావితం చేశారు కీట్స్. అతని జాన్ కీట్స్ వ్రాసిన “ఓడ్ టు ఎ నైటింగేల్” ను 1888 నాటి ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా నాటి “అంతిమ కళాఖండాలలో ఒకటి”గా అభివర్ణించింది. జాన్ కీట్స్ శైలి “ఇంద్రియ సుఖాలతో నిండి ఉండేది”.  ముఖ్యంగా ఆయన రచనలలోని స్తుతి గీతాల శ్రేణిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమ కవుల లక్షణం వలె , ఆయన ప్రకృతి రూపకాల ద్వారా తీవ్రమైన భావోద్వేగాలను ఆయన మరీ నొక్కిచెప్పారు. ఈనాటికీ కూడా ఆయన వ్రాసిన కవితలు, లేఖలు ఆంగ్ల సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందినవిగా, అత్యంత విశ్లేషించబడినవిగా నిలిచి ఉన్నాయి. ఆయన రచనలలో ముఖ్యంగా “ఓడ్ ఆన్ ఎ గ్రీషియన్ అర్న్”, “ఓడ్ టు ఎ నైటింగేల్”, “ఆన్ ఫస్ట్ లుకింగ్ ఇంటు చాప్‌మన్స్ హోమర్”, “స్లీప్ అండ్ పొయెట్రీ” మొదలైనవి. కీట్స్ రచనలను చదివిన జార్జ్ లూయిస్ బోర్జెస్ “మొదటిసారి చదవడం అనేది తన జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి” అని  పేర్కొన్నారు.

నేపథ్యం…

లండన్ లో మూర్గేట్‌ అనే ఒక స్థానిక రైల్వే స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ నుండి బయటకు రాగానే “కీట్స్ ఎట్ ది గ్లోబ్” అనే ఒక పబ్ కనిపిస్తుంది. ఆ పబ్ ఉన్న ప్రదేశంలో 250 ఏళ్ల కిందట “స్వాన్ అండ్ బూబ్” అనే గుఱ్ఱపుశాల ఉండేది. ఆ గుఱ్ఱపుశాల ప్రక్కనే “ఇన్” అనే ఒక హోటల్ ఉండేది. ఆ రెండింటికి యజమానులుగా జాన్ అండ్ ఎలిస్ అనే వృద్ధ దంపతులు ఉండేవారు. అయితే “స్వాన్ అండ్ బూబ్” అనే గుఱ్ఱపుశాలలోని గుఱ్ఱాలను చూసుకోవడానికి థామస్ అనే ఒక కుర్రవానికి ఉద్యోగం ఇచ్చారు. అతను ఆ గుఱ్ఱాలను చూసుకోవడమే కాకుండా, తన మేలు జాతి గుఱ్ఱాన్ని కూడా వాటితో పాటే చూసుకుంటూ వస్తున్నాడు. దాంతో అతనిలోని మంచి గుణగణాలను మెచ్చి జాన్ మరియు ఎలిస్ అనే ఆ వృద్ధ దంపతులు తన కుమార్తె ఫ్రాన్సిస్ ను థామస్ కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ విధంగా తమ దగ్గర ఉద్యోగం చేసే అబ్బాయినే తమ అల్లుడిని చేసుకున్నారు.

థామస్ మరియు ఫ్రాన్సిస్ కి కలిగిన మొదటి సంతానమే రచయిత జాన్ కీట్స్. ఈయన 31 అక్టోబరు 1975 నాడు జన్మించారు. జాన్ కీట్స్ జన్మించిన తరువాత తల్లిదండ్రులు వేరే ఇంటికి మకాం మార్చారు. తండ్రి థామస్ ఎప్పటిలాగానే ప్రతీరోజు వచ్చి గుఱ్ఱాల పోషణ చూస్తూ ఉండేవాడు. జాన్ కీట్స్ తరువాత ఆ దంపతులకు 1797 వ సంవత్సరంలో జార్జ్,  1799 వ సంవత్సరంలో థామస్, 1803 వ సంవత్సరంలో ఫ్రాన్సెస్ మేరీ “ఫ్యానీ” సంతానం కలిగారు. 1801 వ సంవత్సరంలో జన్మించిన అబ్బాయి ఎడ్వర్డ్స్ పూర్తిగా రెండేళ్లు కూడా రాకుండానే 20 నెలల వయస్సులోనే చనిపోయాడు. అప్పటికి జాన్ కీట్స్ వయస్సు ఏడు సంవత్సరాలు. అంత చిన్న వయస్సులోనే మరణం అంటే ఏమిటో జాన్ కీట్స్  దగ్గర ఉండి చూడడం ప్రారంభమైంది. అలాంటి సంఘటనలు తన జీవితాంతం వెంటాడడం అనేది జాన్ కీట్స్ జీవితంలో మహా విషాదం అని చెప్పవచ్చు.

క్లార్క్ అకాడమీలో చదువు…

1802 లో ఆ పసివాడు చనిపోయిన విషాదం నుండి తెరుకోకుండానే థామస్ మరియు ఫ్రాన్సెస్ కీట్స్ లకు హోటల్ భాద్యతలు అప్పగించిన థామస్ అత్తమామలు వారు విశ్రాంతి కోరుకుని భాద్యతల నుండి ప్రక్కకు తప్పుకున్నారు. దాంతో కీట్స్ అమ్మ నాన్నలు మళ్లీ గుర్రపుశాలకు వచ్చారు. ఆ క్రమంలో కీట్స్ అమ్మానాన్నలు అయిన థామస్ మరియు ఫ్రాన్సెస్ లకు 1803 వ సంవత్సరంలో చివరి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఆ అమ్మాయికి ఫ్రాన్సెస్ మేరీ “ఫ్యానీ” అని పేరు పెట్టారు. అయితే జాన్ కీట్స్ కుటుంబంలో ఈ అమ్మాయి మాత్రమే 60 సంవత్సరాలు జీవించింది. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న వయస్సులోనే మరణించడం విషాదం. 1803 వ సంవత్సరం నాటికి జాన్ కీట్స్ కి ఎనిమిది సంవత్సరాలు. పెద్ద తమ్ముడు జార్జ్ కి ఆరు సంవత్సరాలు. అయితే వాళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాళ్లను పెద్దపెద్ద పాఠశాలకు పంపించి చదివించలేదు. కానీ వాళ్ళ ఇంటికి పది మైళ్ళ దూరంలో ఉన్న ఎన్ ఫీల్డ్ ప్రాంతంలో క్లార్క్ అకాడమీ అని ఒక బోర్డింగ్ పాఠశాలలో చేర్పించారు. జాన్ మరియు తమ్ముడు జార్జ్ లకు చాలా అభ్యుదయ భావాలతో పాఠశాలలో చదువు చెప్పేవారు. నివాసం, తిండి, చదువు అంతా అక్కడే.

తండ్రి మరణం…

జాన్ కీట్స్ చదువుకునే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని కుమారుడు అయిన చార్లెస్ క్లార్క్ అనే అతను కీట్స్ కంటే పెద్దవాడు. అయినా కూడా ఇద్దరికీ స్నేహం కుదిరింది. అతను కీట్స్ కి చరిత్ర పట్ల, సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించాడు. వాటికి సంబంధించిన పుస్తకాలు కూడా తెచ్చిస్తూ ఉండేవాడు. అయితే ఈ విధంగా క్లార్క్ చేసిన పరిచయాలే ఆ తరువాత రోజులలో కీట్స్ జీవితాన్ని ముఖ్యమైన మలుపులు తిప్పాయి. అయితే కీట్స్ పాఠశాలలో చేరిన మరుసటి సంవత్సరమే ఏప్రిల్ 1804 లో పిల్లలను చూడడానికి తండ్రి పాఠశాలకు వచ్చాడు. వారితో సరదాగా కబుర్లు చెప్పాడు. తిరిగి వెనక్కి వెళ్ళేటప్పుడు అనుకోకుండా మధ్యలో గుర్రం మీద నుంచి పడిపోయాడు. అప్పటికే సమయం రాత్రి 8 గంటలవుతుంది. ఆయన పడిపోయిన విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. కేవలం గుర్రం మాత్రమే వెళుతుంటే చూసి, తీరా ఎవరో ఆరా తీస్తే కీట్స్ తండ్రి గుర్రం మీద నుండి పడిపోయాడని తెలిసింది. ఆయనను ఇంటికి తీసుకువచ్చిన మరుసటి నాటి ఉదయమే కీట్స్ తండ్రి చనిపోయారు. యాదృచ్ఛికమైన విషయం ఏమిటంటే తన చిన్న కుమారుడు రెండు సంవత్సరాల క్రిందటే 1802 లో చనిపోగా, ఆయనను ఖననం చేసిన స్మశాన వాటిక వద్దనే కీట్స్ తండ్రి పడిపోయాడు. చేసేది లేక అదే స్మశాన వాటికలో తనను కూడా ఖననం చేశారు. జాన్ కీట్స్ తన ఎనిమిదేళ్ల వయస్సులో చూసిన రెండో మరణం అది.

క్షయ వ్యాధి సోకి తల్లి మరణం…

జాన్ కీట్స్ మరణించిన రెండు నెలలకే జాన్ కీట్స్ తల్లి ఫ్రాన్సిస్ వేరెవరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్లిపోయింది. దాంతో కీట్స్ ఇద్దరు తమ్ముళ్ళు, చెల్లెలు (చెల్లెలి వయస్సు అప్పటికీ రెండేళ్లే ) సంరక్షణ మొత్తం అమ్మమ్మ, తాతయ్యలపై పడింది. అప్పటికే వాళ్ళు డెబ్భై ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్నారు. జాన్ కీట్స్ ను బోర్డింగ్ స్కూల్ నుండి తీసుకువచ్చి, అమ్మమ్మ తాతయ్యల ఇంట్లోనే ఉంచుకొని అక్కడి నుండి బడికి పంపడం ప్రారంభించారు. అమ్మమ్మ తాతయ్యల వల్ల వారి జీవితం గాడిలో పడింది అనుకుంటూ ఉండగానే 1805లో జాన్ కీట్స్ వాళ్ళ తాతయ్య చనిపోయారు. కీట్స్ జీవితంలో ఇదొక విషాదం. ఇన్ని విషాదాల మధ్యలో కూడా ప్రధానోపాధ్యాయులు గారి అబ్బాయి క్లార్క్ సహాయంతో జాన్ కీట్స్ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఉత్తమ విద్యార్థిగా బహుమతులు కూడా అందుకుంటున్నాడు.

కొంత కాలం తరువాత మూడేళ్లకు 1808 వ సంవత్సరం చివరిలో జాన్ కీట్స్ వాళ్లు అమ్మ వెనక్కి వచ్చేసింది. అప్పటికే ఆమెకు క్షయ వ్యాధి వ్యాప్తి చెంది ఉంది. ఆ వ్యాధితో ఉన్న ఆమెకు సేవలు చేయడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాకపోతే జాన్ కీట్స్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లడం, సాయంకాలం ఇంటికి రాగానే తల్లికి సేవలు చేయడం తన పదమూడు ఏళ్ల వయస్సులో జాన్ కీట్స్ దినచర్య అయ్యింది. క్షయ వ్యాధి అనేది ఆ రోజులలో చాలా భయంకరమైనది. అందుకే క్షయ రోగికి సేవలు చేయడానికి ఎవ్వరూ కూడా ఇష్టపడేవారు కాదు. అంత చిన్న వయస్సులో తల్లికి కీట్స్ ఎన్ని సేవలు చేసినా కూడా ఆ భయంకరమైన క్షయ వ్యాధి ఆమెను మార్చి 1810 లో బలి తీసుకుంది. అప్పటికి జాన్ కీట్స్ వయస్సు 15 సంవత్సరాలు.

వైద్య విద్యార్థిగా…

జాన్ కీట్స్ అప్పటివరకు తన తమ్ముడు, నాన్న, తాత, తల్లి ఇందరి మరణాలు దగ్గరనుండి చూశారు. అయినా కూడా తన పాఠశాల ఆపలేదు. పాఠశాల చదువు పూర్తి చేసుకున్నారు. జాన్ కీట్స్ తల్లి క్షయ వ్యాధితో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు చికిత్స చేయడానికి ఒక వైద్యుడు వారి ఇంటికి వస్తూ ఉండేవారు. ఆయన పేరు హేమంత్. ఆయన దగ్గర సహాయకుడిగా చేరిన జాన్ కీట్స్ శస్త్రచికిత్సలు చేసే గదిలో ఉండే అటక పైన నివాసం ఉండేవారు. హామండ్‌ వద్ద తన ఐదేళ్ల అప్రెంటిస్‌షిప్‌ను పూర్తి చేసిన తరువాత జాన్ కీట్స్ ప్రస్తుతం కింగ్స్ కాలేజ్ లండన్‌లో భాగమైన గైస్ హాస్పిటల్‌లో వైద్య విద్యార్థిగా పేరు నమోదు చేసుకుని , అక్కడ చదువు ప్రారంభించారు.

ఒక నెలలోపే, శస్త్రచికిత్స సమయంలో సర్జన్లకు సహాయం చేసే డ్రెస్సర్‌గా అతన్ని ఆసుపత్రిలో చేర్చుకున్నారు, ఇది నేటి జూనియర్ హౌస్ సర్జన్‌కు సమానం. అది ఒక ముఖ్యమైన పదోన్నతి అని చెప్పవచ్చు. అది వైద్యం పట్ల అతనికున్న విశిష్టమైన ప్రతిభను సూచించడమే కాకుండా తనకు మరింత బాధ్యతను, అధిక పనిభారాన్ని తెచ్చిపెట్టింది. హామండ్ వద్ద మరియు గైస్ హాస్పిటల్‌లో కీట్స్ పొందిన సుదీర్ఘమైన మరియు ఖరీదైన వైద్య శిక్షణ, అతనికి ఆర్థిక భద్రతను కల్పిస్తూ జీవితాంతం వైద్య వృత్తిని కొనసాగిస్తాడని అతని కుటుంబం భావించేలా చేసింది. కానీ అది కాదని అతను తన ప్రస్థానాన్ని సాహిత్యం వైపు మళ్ళించారు.

అమ్మమ్మ మరణం…

1810 నుండి 1814 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాలు జాన్ కీట్స్ జీవితంలో ఏ విషాదం లేకుండా గడిచిపోయింది. వైద్యుని దగ్గర శిక్షణ పొందుతున్న రోజుల్లో కూడా జాన్ కీట్స్ తన పాఠశాల మిత్రుడు క్లార్క్ ను కలుస్తూ ఉండేవారు. వారు ఇరువురు కలిసి సాహిత్య చర్చలు చేస్తూ ఉండేవారు. సాహిత్యం అంటే అభిమానం ఉన్న జాన్ కీట్స్ 1814 లో తన 19 ఏళ్ల వయస్సులో మొట్టమొదటి కవిత “యాన్ ఇమిటేషన్ ఆఫ్ స్పెన్సర్” ను వ్రాశారు. కానీ దానిని ఏ దిన పత్రికకు కూడా పంపించలేదు. అప్పటివరకు అన్నీ తానై చూసుకున్న అమ్మమ్మ కూడా 1914 వ సంవత్సరంలో మరణించింది. అప్పటికి పిల్లలు అందరూ చిన్నవారే. వారంతా చదువుకుంటున్నారు. అమ్మమ్మ వ్రాసిన వీలునామా ప్రకారం నలుగురు పిల్లలకు ఇద్దరు సంరక్షకులను ఏర్పాటు చేశారు. తన దగ్గర మిగిలిన డబ్బులు, వారసత్వంగా వచ్చిన డబ్బులు ఆ సంరక్షకుల ఆధీనంలోనే ఉంచి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వారికి అందజేయాలని వీలునామ వ్రాశారు ఆమె.

రోగుల గాయాలకు కట్లు కడుతూ…

అయితే అమ్మమ్మ వ్రాసిన ఆ వీలునామా వ్రాయించిన న్యాయవాది గానీ, సంరక్షకులుగా ఉన్న ఆ ఇద్దరు కానీ చదువు చెప్పించడం కొనసాగించారు, కానీ తమ దగ్గర పిల్లల డబ్బులు ఉన్నాయని వారికి చెప్పలేదు. ఈ సంఘటన జాన్ కీట్స్ జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేసింది అంటే జాన్ కీట్స్ జీవితాంతం తాను  ఆర్థిక ఇబ్బందులలో కొనసాగడానికి మిత్రుల దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పటిదాకా ఐదేళ్లుగా వైద్యుని దగ్గర తీసుకుంటున్న శిక్షణ ముగించుకొని పక్కనే ఉన్న గైస్ హాస్పిటల్ లో చేరిన 1815 వ సంవత్సరం నాటికి జాన్ కీట్స్ వయస్సు 20 సంవత్సరాలు.  అక్కడ రెండు సంవత్సరాల హౌస్ సర్జన్ చేస్తే డాక్టర్ అయినట్టే. తరువాత వైద్యునిగా పని ప్రారంభం చేసుకోవచ్చు. ఆయన శస్త్రచికిత్సలో శిక్షణ తీసుకుంటూ ఉండేవారు. ఆ రోజులలో శస్త్రచికిత్స అంటే మత్తుమందు ఉండేది కాదు. రోగులను 10 మంది గట్టిగా పట్టుకుంటే శస్త్రచికిత్స చేసే భాగాల దగ్గర డాక్టరు కోత పెట్టి చికిత్స చేసేవారు. అలాంటప్పుడు రక్తం చిందించి అందరిమీద పడుతూ ఉండేది. వారి గాయాలకు కట్లు కడుతూ ఉండేవాడు జాన్ కీట్స్.

“ది ఎగ్జామినర్” లో “ఓ సోలిట్యూడ్” ప్రచురణ…

వైద్య వృత్తిపై శిక్షణ తీసుకున్న జాన్ కీట్స్ ఒకవైపు రాత్రి, పగలు ఇలా శస్త్రచికిత్సలలో సహాయకుడిగా ఉంటూనే, మరోవైపు తన ఆలోచనలు అంతా సాహిత్యం మీదనే ఉండేది. 1816 సంవత్సరానికి కీట్స్ వ్రాస్తున్న సాహిత్యం చదివిన మిత్రుడు క్లార్క్ ఒక సలహా ఇచ్చాడు. తనకు పరిచయం ఉన్న “ఎగ్జామినర్” అనే పత్రికకు ఎడిటర్ సంపాదకునికి కీట్స్ వ్రాసిన కవితలు పంపించమని సలహా ఇచ్చాడు. అలా ఏప్రిల్ 1816  లో మొట్టమొదటిసారిగా ప్రముఖ ఉదారవాద పత్రిక అయిన తన “ది ఎగ్జామినర్” లో జాన్ కీట్స్ వ్రాసిన “ఓ సోలిట్యూడ్” అనే సొనెట్‌ను ప్రచురించడానికి లీ హంట్ అంగీకరించారు. ముద్రణలో కీట్స్ కవిత్వం కనిపించడం ఇదే మొదటిసారి.

చార్లెస్ కౌడెన్ క్లార్క్ దీనిని తన స్నేహితుడి జీవితంలో ఒక చారిత్రాత్మక రోజు అని, కీట్స్ ఆశయాలు నిజమైనవని చెప్పడానికి ఇది మొదటి రుజువు అని పేర్కొన్నాడు. తాను తీసుకుంటున్న హౌస్ సర్జన్ పూర్తయిన తరువాత సర్జన్ కావడానికి ఇంకొన్ని కోర్సులు పూర్తిచేయాల్సి ఉన్న సమయంలో జులై 1816 లో జాన్ కీట్స్ వైద్యవృత్తికి పూర్తిగా స్వస్తి చెప్పి సాహిత్యం వ్రాయాలి అనుకున్నారు. ఈ నిర్ణయం అతడి జీవితంలో చాలా కీలకమైన మలుపు. నిజానికి మిగతా కోర్సులు కూడా పూర్తి చేసి వైద్యుడు అయి ఉంటే జాన్ కీట్స్ ఆర్థిక పరిస్థితి బాగుండేది, జీవితం కూడా ఒక గాడిలో పడడం జరిగి ఉండేదేది, కానీ ఆయన తదనంతరం 200 సంవత్సరాల తరువాత మనం చదువుతున్న ఈ కవిత్వం ఉండేది కాదు, తన గురించి ఇన్ని దశాబ్దాల తర్వాత మనం మాట్లాడుకుని ఉండే వాళ్ళం కాదు.

తమ్ముడికి క్షయ వ్యాధి…

వైద్య వృత్తి మానేయాలని నిర్ణయం తీసుకున్నాక నేను వైద్య వృత్తి నిర్వర్తించలేను, కవిత్వం వ్రాసుకుంటాను అని జాన్ కీట్స్ తన సంరక్షకులకు చెప్పేశారు.  తన తమ్ముళ్లిద్దరినీ తన దగ్గరికే తీసుకొచ్చి ఆమ్ స్టేడ్ అనే ఒక ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. స్నేహితుల దగ్గర తీసుకున్న అప్పులతో తన జీవనం గడుపుతూ వస్తున్నారు. అవే తన బ్రతుకుకు ఆధారం అయ్యాయి. అక్టోబర్ 1816లో క్లార్క్, బైరన్ మరియు షెల్లీలకు సన్నిహిత మిత్రుడైన, ప్రభావశీలుడైన లీ హంట్‌కు కీట్స్‌ను పరిచయం చేశాడు. 1817 వ సంవత్సరంలో కీట్స్ వ్రాసిన కవితలన్నీ “ది పోయెమ్స్” అనే పుస్తకంలో ప్రచురించారు. ఆయన కవితా సంపుటిలో వ్యాసాన్ని పొగుడుతూ లేహంత్ చాలా వ్యాసాలు వ్రాశారు. అయితే ప్రముఖులు మాత్రం విమర్శలు చేశారు. ఈ విమర్శలు దృష్టిలో పెట్టుకొని తన పత్రికలో కీట్స్ కవితలను ముద్రించలేనని లేహంత్ తేల్చి చెప్పాడు. టేలర్ మరియు హస్సి లు కీట్స్ యొక్క కవితలను రెండు, మూడు పుస్తకాలు అచ్చు వేశారు. ఆ రోజుల్లోనే జాన్ కీట్స్ తమ్ముడు థామస్ కి ఆరోగ్యం దెబ్బతింది. కొద్దిరోజుల తరువాత అది క్షయ వ్యాధి కూడా అని తేలింది.

ఇస్సబెల్లా జోన్స్ తో ప్రేమ…

1817 ఏప్రిల్ ప్రాంతంలో తన తమ్ముళ్ళ ఇద్దరినీ తీసుకొని లండన్ కు దూరంగా కాస్త వేడిగా ఉండే ప్రదేశానికి తమ్ముళ్ళు ఇద్దరినీ తీసుకెళ్లాడు జాన్ కీట్స్. అలా 5, 6 నెలలు తిప్పారు. ఆరోగ్యం మెరుగుపడాలని ఒకప్పుడు తల్లికి సేవలు చేసినట్టుగానే తమ్ముడికి సేవలు చేశాడు. అప్పటికి జాన్ కీట్స్ వయస్సు 22 సంవత్సరాలు. అంత విషాదంలో ఉన్న జాన్ కీట్స్ జీవితంలో కొంత ఆహ్లాదకరమైన వాతావరణ సృష్టించిన యువతి ఇస్సబెల్లా జోన్స్. తన తమ్ముడితో కలిసి హేస్టింగ్ అనే ప్రాంతానికి జాన్ కీట్స్ వెళ్ళినప్పుడు ఆమె అక్కడ పరిచయమైంది. ఇస్సబెల్లా మధ్యతరగతికి చెందిన అమ్మాయి, సాహిత్యం బాగా చదువుతుంది. వారి అభిరుచులు కలవడంలో కీట్స్ మరియు ఇస్సబెల్లా దగ్గరయ్యారు. ఆమె సమక్షంలో జాన్ కీట్స్ ప్రేమ పూజారి అయ్యాడు. జాన్ కీట్స్ కు కవిత్వం నుండి వచ్చిన దారుణ విమర్శల గాయాల నుండి ఇసబెల్ల స్నేహం కాస్త ఊరటనిచ్చింది అని చెప్పాలి. కీట్స్ వ్రాసిన కవిత ఇసబెల్లా గురించే వ్రాశారు అంటారు. ఆ రోజుల్లోనే “ఎండుమియాన్” అనే 4000 పంక్తులు ఉన్న దీర్ఘ కవిత్వం వ్రాయడం ప్రారంభించాడు కీట్స్. ఇది నా బావుకతను పరీక్షించే కవిత అని చెప్పుకున్నాడు. ఎండుమియాన్ అనేది ఒక గ్రీకు యువకుడి పేరు. “కింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్” అనేది మొదటి పంక్తి. ఎండుమియాన్ లో మొట్టమొదటి వాక్యం.

క్షయ వ్యాధితో చిన్న తమ్ముడు టామ్ మరణం…

హేస్టింగ్ పర్యటన ముగించుకుని జాన్ కీట్స్ తన తమ్ముళ్ళతో కలిసి తిరిగి వచ్చేశారు. ఆయన చిన్న తమ్ముడు ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడే సూచనలు కనిపించలేదు. ఏప్రిల్ 1818 వ సంవత్సరంలో “ఎండుమియాన్” పుస్తక రూపంలో ప్రచురణ అయ్యింది. ఈ ప్రచురణ మీద కూడా విమర్శల దాడి మొదలైంది. జాన్ కీట్స్ ఒకవైపు రక్తం ధార పోసి కవిత్వం వ్రాస్తున్నా కూడా,  విమర్శకులు కొట్టిపారేస్తున్నారు, ఇంత చెత్త కావ్యాన్ని మళ్ళీ మళ్ళీ వ్రాయడం జాన్ కీట్స్ కు మాత్రమే సాధ్యం అన్నారు విమర్శకులు. స్నేహితులు మాత్రం ఓదారుస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కీట్స్ జీవితంలో మరొక రెండు సంఘటనలు జరిగాయి.

జాన్ కీట్స్ పెద్ద తమ్ముడు జార్జ్ తాను ఒక అమెరికా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమెను తీసుకొని అమెరికా వెళ్ళిపోయాడు. కీట్స్ మరియు చిన్న తమ్ముడు టామ్ కలిసి వారికి దగ్గరుండి వీడ్కోలు చెప్పారు. ఇది జరిగిన రెండు నెలలకు డిసెంబరు 1818 వ సంవత్సరంలో చిన్న తమ్ముడు టామ్ తన 19 సంవత్సరాల వయస్సులో క్షయ వ్యాధికి బలైపోయి కీట్స్ చేతిలోనే ప్రాణాలు వదిలాడు. ఒకప్పుడు తన తల్లి కూడా క్షయ వ్యాధితో అతని చేతులలోనే ప్రాణాలు వదిలింది. అదే క్షయ వ్యాధితో తమ్ముడు టామ్ కూడా కీట్స్ చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. అంతకుముందు నాన్న, ఆ తరువాత తల్లి, తరువాత అమ్మమ్మ, ఆ తరువాత తాత,  ఇప్పుడు తమ్ముడు ఇలా అందరూ వెళ్లిపోయారు. మరో తమ్ముడు వేరే దేశానికి వలస వెళ్లాడు. ఒక్కగానొక్క చెల్లెలు పెళ్లి అయిపోయింది. జాన్ కీట్స్ కు మిగిలింది అతని కవిత్వం,  అతని మిత్రులు అంతే.

ఫ్యానీ బ్రానే తో ప్రేమ…

ఏప్రిల్ 1819 లో మిత్రుల సలహా మేరకు ఆమ్ స్ట్రెడ్ లో ఉన్న వెంట్ వర్క్ ప్లేస్ ఇంట్లోకి మారిపోయాడు. జాన్ కీట్స్ నివసించిన చివరి ఇల్లు అదే, దానిని ఇప్పుడు కీట్స్ హౌస్ మ్యూజియం అంటున్నారు. తాను ఆ ఇంట్లోకి మారిన తరువాత ఫ్యానీ బ్రానే అనే ఒక యువతి పరిచయమైంది. కీట్స్ మరియు ఫ్యానీ బ్రానే పక్కపక్క గదుల్లోనే నివాసం ఉండేవారు. వారి పరిచయం తొందరలోనే ప్రేమగా మారింది. వీరు ఇరువురు గంటల తరబడి కబుర్లు చెప్పుకునే వారు. పుస్తకాలు చదువుకునే వారు. తరుచూ కవిత్వం గురించి చర్చ చేస్తూ ఉండేవారు. 1819 – 1820 సంవత్సరాలలో జాన్ కీట్స్ అమోఘమైన కవిత్వం వ్రాశారు. ఆయన రచించిన కవితల్లో అత్యంత పరిణితి పొందిన కవిత్వాన్ని ఆ సంవత్సరంలోనే వ్రాశాడని పరిశోధకులు, విశ్లేషకులు చెబుతుంటారు. “ఓడ్ టు సైకీ”, “ఓడ్ టు ఎ నైటింగేల్ “, “ఓడ్ ఆన్ మేలాకలి” ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లోనే వ్రాశారు. 1820 లో జాన్ కీట్స్ మూడవ సంపుటి పరిచయమైనప్పుడు విమర్శకులు నిర్భయంగా ఇంత చెత్త కవిత్వాన్ని జాన్ కీట్స్ మాత్రమే వ్రాయగలరని దుమ్మెత్తి పోశాయి. ప్రతీ విమర్శలకు కూడా జాన్ కీట్స్ గుండెల్లో గుణపమై దిగేది. కానీ స్నేహితులు మాత్రం అతడిని ఓదారుస్తూ ఉండేవారు.

జాన్ కీట్స్ కు క్షయ లక్షణాలు…

ఫ్యానీతో రోజురోజుకూ పెరిగిన ప్రేమ మాత్రం ఎప్పటికప్పుడు ఉత్సాహాన్నిస్తూ ఉండేది. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఉంగరాలు కూడా మార్చుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకుంటే ఆ తరువాత జీవించేది ఎలా? జాన్ కీట్స్ కి పుస్తకాల మీద వస్తున్న ఆదాయం చాలా తక్కువ. ఎక్కువగా స్నేహితుల దగ్గర అప్పులు చేయడమే తనకు తెలుసు. ఉద్యోగం చూసుకుందాం అనుకున్నాడు, కానీ 1820 సంవత్సరం మొదట్లో క్షయ లక్షణాల రూపంలో మృత్యుదేవత తనకు హెచ్చరిక ఇచ్చింది. ఆయనకు అంతకు రెండేళ్ల ముందే క్షయ వ్యాధికి బలైన చిన్న తమ్ముడికి సేవలు చేసేటప్పుడు అది తనకు అంటుకున్నదో లేక వంశపారపర్యంగా వచ్చిన వ్యాధినో తెలియదు, కానీ కొద్ది రోజులకే క్షయ వ్యాధి తీవ్రతరం అవుతుందని తెలిసిపోయింది.

జాన్ కీట్స్ ఎలాంటి అవాంతరాలు వచ్చినా, ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా కూడా కవిత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంత దయలేనిదానివా నీవు అని మృత్యుదేవతను ప్రశ్నించారు, నిలదీశారు కూడా. ఆరోగ్యం మెరుగుపడుతుందేమో అని వివిధ ప్రదేశాలకు తాత్కాలికంగా వెళ్లారు. ఫ్యానీ స్నేహం, ఫ్యానీ గురించి ఊహలు మాత్రమే మిగిలి ఉన్న ఆశలు, అతని చివరి జ్ఞాపకాలకు సంకేతాలయ్యాయి. ఆయనకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఫ్యానీకి పక్క గదిలో ఉన్నప్పుడు కూడా ఫ్యానీకి ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవాడు కీట్స్. అయితే లండన్ లో రాబోయేది చలికాలం, కావున కాస్త వేడిగా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్ళమని మిత్రులకు జాన్ కీట్స్ చెప్పారు. అప్పటికే కీట్స్ మిత్రులు అయిన పి.బి. షెల్లీ తాను ఇటలీలో ఉంటున్నాడు. అతని సలహా మీద మిత్రులందరూ కలిసి జాన్ కీట్స్ ను రోమ్ నగరానికి పంపిద్దాం అనుకున్నారు. అందరూ కలిసి చందాలు వేసుకున్నారు.

కీట్స్ కు తోడుగా రోమ్ కు వెళ్లిన సెవర్…

జాన్ కీట్స్ కు ఇంటిదగ్గర ప్రియురాలు ఫ్యానీ బ్రానే చేయగలిగిన సేవలను చేస్తుంది. ఆ సేవలు అందుకున్న అతనికి అదే తొలి పరిచయంలా తోచింది. అతనికి డబ్బులు సమకూరాయి. కానీ కీట్స్ తో బాటు రోమ్ నగరం వెళ్లేదెవరు? దగ్గరుండి చూసుకునేది ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తాయి. మిత్రులు ఎవ్వరూ దగ్గరికి రాలేదు. చాలామంది మౌనంగా ఉండిపోయారు. వారిలో జోసెఫ్ సెవెర్న్‌ అనే చిత్రకారుడు (బొమ్మలు వేస్తుండేవాడు), నేస్తం నేను ఉన్నానని ముందుకు వచ్చాడు. 13 సెప్టెంబరు 1820 వ సంవత్సరం రోమ్ కు బయలుదేరే సమయం ఆసన్నమైంది. ఫ్యానీ బ్రానే తన ప్రియుడు కీట్స్ కి బట్టలు సర్దిపెట్టింది. ట్రావెలింగ్ హాట్ సిల్క్ క్లాత్ ను లైనింగ్ గా కుట్టింది. జోసెఫ్ సెవెర్న్‌తో కలిసి కీట్స్ రోమ్ కు బయలుదేరారు. 

మిత్రులందరూ డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. సామాను మొత్తం బ్యాగులో సర్దుకున్నాక కీట్స్ తన ప్రియురాలు ఫ్యానీ బ్రానే వైపు చూశాడు. మళ్ళీ వస్తారో లేదో తెలియదు. ఫ్యానీ కూడా కీట్స్ వైపు జాలిగా చూసింది. మొదట ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. నిశ్శబ్దంగా తనలో తాను అనుకున్నాడో, లేక పైకి అనుకున్నాడో తెలియదు. బండి బయలుదేరింది. ఆ తరువాత నాలుగు రోజులకు ఓడ ఎక్కారు. ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు తాను సంవత్సరాలుగా వ్రాస్తున్న “బ్రైట్ స్టార్” అనే కవిత్వం పూర్తి చేశారు. అసబెల్లతో స్నేహం ప్రారంభించి, ఫ్యానీ బ్రానేతో ముగించి ముగించి ఆ ఓడలో పూర్తి చేశారు జాన్ కీట్స్. వారి ప్రయాణం మధ్యలో పెను తుఫాను, సముద్రం మధ్యలో కల్లోలం. అసలు గమ్యం చేరుతుందా లేదా అని భయపడ్డారు.

ముదిరిన క్షయ వ్యాధి…

అన్నీ అవాంతరాలను తట్టుకొని 21 అక్టోబరు 1820 నాడు ఇటలీ లోని నేపుల్స్ హార్బర్ ను చేరుకుంది. ఆ రోజుల్లోనే లండన్ లో కలరా చెలరేగింది. వీరు లండన్ నుంచి వచ్చారని కీట్స్ మరియు జోసెఫ్ సెవెర్న్‌ ని క్వారెంటైన్ (రోగ అనుమానితులను విడిగా ఉంచడం) లో ఉంచారు. ఆ సమయంలో కీట్స్ తన ప్రియురాలు ఫ్యానీ బ్రానేకి ఉత్తరాలు వ్రాసేవారు. ఎట్టకేలకు 14 నవంబర్ 1824 నాడు కీట్స్ మరియు సేవర్ లు కలిసి రోమ్ నగరం చేరుకున్నారు. వారు ముందుగానే మాట్లాడుకున్న ఒక ఇంటికి చేరారు. ఆ ఇల్లు కూడా కీట్స్, షెల్లీ హౌస్ అని ఇప్పటికీ కూడా రోమ్ లో ఉంది. జేమ్స్ క్లార్క్ అనే వైద్యుడు కీట్స్ కు వైద్య సహాయం అందించారు. రోమ్ లో వేడిగా ఉంటుంది అనుకున్నారు. కానీ లండన్ నుంచి రావడం ఆలస్యం అవ్వడంతో రోమ్ లో వారు అనుకున్న వాతావరణం లేదు. కీట్స్ ను బాధిస్తున్న క్షయ వ్యాధికి వైద్యం మొదలైంది. 

అక్కడి నుండి మిత్రుడు సేవర్ తన మిత్రులకు వ్రాసిన ఉత్తరంలో కీట్స్ ఇలా చెప్పారు. “రోజురోజుకీ నా పరిస్థితి దిగజారుతుంది. విపరీతంగా వాంతులు అవుతున్నాయి. పొట్ట అంత నొప్పిగా ఉంది. మళ్ళీ లండన్ వాతావరణాన్ని, మిమ్మల్ని చూడనేమో అనిపిస్తుంది. అసలు ఎప్పుడో చచ్చిపోయానేమో? ఇది నా మరణాంతర జీవితమేమో అనిపిస్తుంది” అని కీట్స్ వ్రాశారు. వైద్యం అందిస్తున్నప్పుడు మొదట్లో తనకు కొంచెం మెరుగ్గానే అనిపించింది. డిసెంబరు 1820 లో కాస్త బయటకు వెళ్ళగలిగారు కీట్స్. కానీ జనవరి 1821 నుండి తన పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. వ్యాధి ముదిరిపోయింది. నడవలేని, లేవలేని స్థితికి చేరుకున్నారు కీట్స్. 

ఆ సమయంలో పుస్తకాలు కూడా చదవలేదు, వ్రాయడం కూడా లేదు. పుస్తకాలు చదవడం, వ్రాయడం ఎప్పుడో మానేశారు. తనకు సహాయంగా వచ్చిన సెవర్ అనే మిత్రుడే మిగిలిన తన మిత్రులకు ఉత్తరాలు వ్రాసేవారు. ఆయన వ్రాసిన ఆ ఉత్తరాల ద్వారానే కీట్స్ చివరి రోజుల గురించి చరిత్రకారులు తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి. వ్యాధి బాధ భరించలేక మత్తు మందు ఇవ్వమని స్నేహితులను అడిగేవారు కీట్స్. కానీ తన దగ్గరున్న మత్తుమందు ప్యాకెట్ ను డాక్టర్ తీసుకున్నాడు. కీట్స్ కు మత్తుమందు ఇవ్వొద్దని డాక్టర్ చెప్పారు. కీట్స్ రక్త వాంతులు చేసుకుంటున్నారని, పొట్టకి రక్త ప్రసరణ కోసం ఆహారం కూడా తగ్గించమన్నాడు డాక్టర్. కేవలం ఒక రెండు రొట్టెలు, పాలు మాత్రమే ఇచ్చేవాడు డాక్టర్.

మరణం…

జాన్ కీట్స్ ను కబలిస్తున్న క్షయ వ్యాధి, నీరసం, బాధ ఇవన్నీ కలగలిపి కోపంతో మిత్రుడి మీద, డాక్టరు మీద కీట్స్ అరిచేవారు. ఎన్నాళ్ళు నన్ను బతికించి చంపుతారు? నన్ను చావనివ్వండి అని అరిచి, అరిచి అలా ఎప్పుడో నిద్రలోకి జారుకునేవారు కీట్స్. కానీ మిత్రుడు సెవర్ మాత్రమే తనను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవారు. నిద్రలోంచి లేవగానే కీట్స్ “నేను ఇంకా చనిపోలేదా”? అని బిగ్గరగా ఏడ్చేవారు. ఆయనకు తుది ఘడియలు సమీపించాయి. 23 ఫిబ్రవరి 1821 నాడు సాయంకాలం నాలుగు గంటలవుతుంది. మిత్రుడు సెవర్ ను పిలిచారు కీట్స్.

నన్ను కొంచెం పైకి లేపుతావా? చనిపోయే సమయం ఆసన్నమైంది అని నాకు అనిపిస్తుంది. భయపడకు, నన్ను ఇంకొంచెం పైకి లేపి గట్టిగా పట్టుకో భగవంతుడికి కృతజ్ఞతలు చెబుదాం. చివరి అంకం వచ్చేసింది అని ఆయన అన్నారు. సెవర్ తన మిత్రుడు కీట్స్ ని పైకి లేపి పట్టుకున్నారు. కీట్స్ కి కంఠం మండుతుంది. కొన్ని గంటలు శరీరం పొగలు కక్కుతున్నట్లుగా ఉంది. అలాగే పట్టుకున్నాడు సెవర్. రాత్రి 11 అవుతుంది కీట్స్ నిద్రలోకి జారుకున్నట్లు ఉన్నారు. కానీ అతడికి తెలియకుండానే తాను మృతదేవత ఒడిలోకి జారుకున్నారు. కీట్స్ జీవన ప్రయాణం ఆగిపోయింది. అవే అతని చివరి క్షణాలు. రోమ్ లోనే కీట్స్ ని సమాధి చేశారు. ఆ సమాధి మీద తన పేరు వ్రాయొద్దని చెప్పారు.

30 ఏళ్ళ తరువాత కవితలు వెలుగులోకి…

జాన్ కీట్స్ అనే ఒకతను ఉండేవారు. అతని జీవితం నీటి మీద వ్రాసిన వ్రాతలాంటిదని వ్రాయమన్నారు కీట్స్. రోమ్ లోని కీట్స్ సమాధి మీద అవే రాతలు ఉంటాయి. ఫ్యానీ బ్రానే జ్ఞాపకార్థం కీట్స్ తెచ్చుకున్న ఆమె పర్సును, ఆమె శిరోజాలను తన మృతదేహం మీద ఉంచమన్నారు. వారు అలాగే చేశారు. మిత్రుడు, ప్రాణమిత్రుడు ఎడబాటు గురించి జూలై 1821 లో పి.బి.షెల్లీ స్మృతి గీతం వ్రాశారు. విషాదం ఏమిటంటే కీట్స్ మరణించిన సంవత్సరం తరువాత 30 జూలై 1822 నాడు షెల్లీ పడవ ప్రమాదంలో మరణించారు. అతని జేబులో కాగితాలు ఉన్నాయి. అవి కీట్స్ వ్రాసిన కవితలే. షెల్లీ మృతదేహం కూడా కీట్స్ మృతదేహాన్ని సమాధి చేసిన స్మశాన వాటికలోనే సమాధి చేశారు.

జోసెఫ్ సేవర్ చాలా కాలం జీవించారు. ఆయన మరణం తర్వాత సెవర్ సమాధిని కీట్స్ సమాధి పక్కనే కట్టారు. ఈ రెండింటి మధ్యలో సెవర్ కుమారుని సమాధి ఉంది. కీట్స్ మరణ వార్త లండన్‌కు చేరడానికి ఒక నెల పట్టింది, ఆ తర్వాత ఫ్యానీ బ్రానే ఆరు సంవత్సరాలు సంతాపంలో ఉన్నారు. అతని మరణం తర్వాత 12 సంవత్సరాల తరువాత 1833 లో ఆమె వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను కన్నారు. ఆమె కీట్స్ కంటే 40 సంవత్సరాలకు పైగా జీవించారు. పెద్ద తమ్ముడు జార్జ్ అమెరికాలో రకరకాల వ్యాపారాలు చేసి దెబ్బతిని పేదరికంలో కూరుకుపోయి, దుర్భర పరిస్థితుల్లో 40 సంవత్సరాల వయస్సులో మరణించారు. కీట్స్ మరణించిన ముప్పై సంవత్సరాల తరువాత ఆయన కవితల గొప్పతనం ప్రపంచానికి తెలిసింది.

Show More
Back to top button