క్రెడిట్ కార్డ్ వల్ల రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు, అత్యవసర సమయంలో ఆర్థిక వెసులుబాటు వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం చాలామంది అవసరానికి మించి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ప్రతి కార్డుకు వార్షిక రుసుము ఉండటం, ఉపయోగించని కార్డుల వల్ల అనవసర ఖర్చులు పెరగడం వంటి కారణాలతో కొందరు తమకు అవసరం లేని కార్డులను క్లోజ్ చేయాలని నిర్ణయించుకుంటారు.
క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసే ముందు ఇవి చెక్ చేయండి
అయితే కార్డ్‌ను రద్దు చేసే ముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ముఖ్యంగా కార్డుపై ఉన్న బకాయిలు, EMIలు, పెండింగ్ లావాదేవీలు, రిడీమ్ చేయని రివార్డ్ పాయింట్లు, ఆటో-డెబిట్లు వంటి వాటిని ముందుగానే చెక్ చేసుకోవాలి. కార్డ్‌ను క్లోజ్ చేసిన వెంటనే ఖాతా పూర్తిగా ముగిసిపోయిందని భావించకుండా, బ్యాంకు నుంచి క్లోజర్ కన్ఫర్మేషన్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే కార్డ్ క్లోజ్ చేయడం వల్ల మీ క్రెడిట్ లిమిట్, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో, క్రెడిట్ హిస్టరీపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా చాలా కాలంగా ఉపయోగిస్తున్న కార్డును రద్దు చేసే ముందు ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
క్రెడిట్ కార్డ్ క్లోజర్‌పై RBI నిబంధనలు ఏంటి?
ఆర్బీఐ నిబంధనల ప్రకారం, క్రెడిట్ కార్డ్ హోల్డర్ తన కార్డ్‌ను క్లోజ్ చేయాలని బ్యాంకు లేదా కార్డ్ జారీ సంస్థను కోరినప్పుడు, సంబంధిత సంస్థ ఆ అభ్యర్థనను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, కస్టమర్ అభ్యర్థన అందిన తేదీ నుంచి 7 పని దినాల్లోగా క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలి. ఇందుకు ముందు కార్డుపై ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లించాలి. కస్టమర్‌కు బకాయిలు ఉన్నట్లయితే, వాటిని సెటిల్ చేయకుండా కార్డ్ క్లోజర్ ప్రక్రియ పూర్తికాదు. ఒకవేళ కస్టమర్‌కు ఎలాంటి బకాయిలు లేకపోయినా, బ్యాంకు లేదా కార్డ్ జారీ సంస్థ 7 పని దినాల్లోగా కార్డ్‌ను క్లోజ్ చేయడంలో విఫలమైతే, ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.500 చొప్పున కస్టమర్‌కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల కార్డ్ క్లోజింగ్ అభ్యర్థన చేసిన తర్వాత దాని స్టేటస్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. అవసరమైతే కస్టమర్ కేర్, ఇమెయిల్ లేదా బ్యాంకు అధికారిక ఫిర్యాదు వ్యవస్థ ద్వారా ఫాలోఅప్ చేయాలి.
EMIలు, ఆటో-పేమెంట్లు, రివార్డ్ పాయింట్లు మర్చిపోవద్దు
క్రెడిట్ కార్డ్‌ను సురక్షితంగా క్లోజ్ చేయాలంటే ముందుగా చివరి స్టేట్మెంట్ను పరిశీలించి, బకాయిలు పూర్తిగా చెల్లించాలి. ఏదైనా EMI కొనసాగుతున్నట్లయితే దాని పరిస్థితిని తెలుసుకోవాలి. అలాగే కార్డుకు లింక్ చేసిన విద్యుత్ బిల్లులు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు లేదా ఇతర ఆటో-పేమెంట్లను మరో చెల్లింపు విధానానికి మార్చాలి. రివార్డ్ పాయింట్లు ఉంటే, కార్డ్ క్లోజ్ చేయడానికి ముందే వాటిని ఉపయోగించుకోవడం మంచిది. అనంతరం బ్యాంకుకు కార్డ్ క్లోజర్ అభ్యర్థన సమర్పించి, దానికి సంబంధించిన రిఫరెన్స్ నంబర్ లేదా అభ్యర్థన వివరాలను భద్రపరచాలి. కార్డ్ క్లోజ్ అయినట్లు బ్యాంకు నుంచి లిఖితపూర్వక నిర్ధారణ తీసుకోవాలి. ఆ తర్వాత క్రెడిట్ రిపోర్ట్‌లో కూడా సంబంధిత కార్డ్ ఖాతా ‘Closed’గా చూపిస్తున్నదో లేదో కొంతకాలం తర్వాత పరిశీలించడం మంచిది.






