Telugu Special Stories

కుబేరుడిని పూజించే అక్షయమైన రోజు..’అక్షయ తృతీయ’!

కుబేరుడిని పూజించే అక్షయమైన రోజు, అక్షయం అంటే క్షయం లేనిది. జీవితంలో అన్నిటినీ అక్షయం చేసేదని అర్థం.. ఈరోజున బంగారం, స్థలం,  పొలాలు వంటి విలువైన వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. మతాలకతీతంగా హిందువులు, జైనులు విశేషంగా జరుపుకునే అక్షయ తృతీయను ‘అఖ తీజ్’ అని కూడా  పిలుస్తారు. గురువులకు దక్షిణ ఇవ్వడం, పేదలకు దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం రెట్టింపు స్థాయిలో దక్కుతుంది. వైశాఖ మాసం శుక్లపక్షంలోని మూడో రోజు(వైశాఖ శుద్ధ తదియ)ను ‘అక్షయ తృతీయ’ లేదా ‘అక్షయ తదియ’గా పిలుస్తారు. పురాణ ప్రాశస్త్యాల ప్రకారం, ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. త్రేతాయుగం ప్రారంభమైంది..ఈరోజునే, పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది..

ఈరోజునేనట. వేదవ్యాసుడు మహాభారత రచనను ఆరంభించింది.. ధర్మరాజుకు అక్షయపాత్ర దొరికింది… కూడా ఇదే రోజున.. సంపదలకు అధిపతి అయిన కుబేరుడుకి అక్షయ తృతీయనాడే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించిందట. అంతేకాక శ్రీమహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడి జననం కూడా ఇదే రోజున కావడం విశేషం.. మరి ఇంతటి ముఖ్యకార్యాలకు కారణమైన ఈరోజునే ఆనాదిగా అక్షయ తృతీయగా జరుపుకుంటున్నాం. అటువంటి పండుగ ప్రాముఖ్యతను తెలిపే మరిన్ని విశేషాలను ఈరోజు మనం తప్పక తెలుసుకుందాం:

అక్షయ తృతీయ(వైశాఖ శుద్ధ తదియ)… సోమవారం లేదంటే బుధవారం వస్తే మరింత పవిత్రమైనదిగా భావించొచ్చు. ఈరోజున చేసే దానాలు అక్షయ ఫలాలను ఇస్తాయని పెద్దలు చెబుతుంటారు. దానాలే కాదు, దేవతల గురుంచి, పితృ దేవతలను గురుంచి చేసే పూజలు కూడా అక్షయ ఫలాన్నీ ఇస్తాయని విశ్వాసం. ఈరోజున చేసే ప్రతి చిన్న సహాయం, పుణ్యకార్యాల ఫలం.. అక్షయంగా పెరుగుతూపోతుందట. అందువల్లే దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది.

ఈరోజున ఏం చేయాలి కొత్త పనులకు శ్రీకారం చుట్టండి.. ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించడం, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు దివ్యమైన రోజు.. కొత్త పనులతో పాటు కొత్త వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. బంగారం కొనలేని వారు, శ్రీమహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఒక అరటి ఆకుపై ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును పోసి నిష్ఠగా పూజిస్తే చాలు.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితుల ఉద్భోద. ఈరోజున జపం, తపస్సు, దానాలు, యజ్ఞయాగాలు, పవిత్ర స్నానాలు, హోమాలు చేయడం పవిత్రంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు నిత్యపూజారాధన కాకుండా.. లక్ష్మీదేవిని పూజించి, అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. పూజ తర్వాత వీలైనంతమందికి అన్నదానం చేయడం వల్ల.. లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మనమీద ఉంటుందట. 

వేటిని దానంగా ఇవ్వాలి గోధుమలు, శనగలు, పెరుగన్నం.. దానం చేసినవారికి సకల పాపాలు హరిస్తాయట. అలాగే గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసేవారికి సైతం పుణ్యం లభిస్తుందని పురాణ గ్రంథాల్లో ఉంది.

అక్షయ తృతీయ నాడు బంగారం కొనాల్సిందేనా.. ఎందుకు..?

అక్షయ తృతీయ అనగానే, బంగారం అమ్మే దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళళకళలాడుతుంటాయి. వీటికి తోడు ఆ షాపులు అందించే ఆఫర్లు, ప్రకటనల హడావుడి అంతా ఇంతా కాదు. ఎందుకంటే, ఆరోజున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల శ్రేయస్సు, అదృష్టం లభిస్తుందని పెద్దల నమ్మకం. పురాణాల ప్రకారం చూసుకున్నా, సంపద, శ్రేయస్సులనందించే లక్ష్మీ దేవి పుట్టినరోజు ఈరోజునే.. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి, ఈరోజున బంగారం కొనడం ఒక మార్గంగా చెబుతారు. అంతేకాక పసిడి.. అనేక సంస్కృతులలో సంపద, హోదాకు చిహ్నంగా భావింపబడుతుంది. అలాంటిది ఈ రోజునే కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం, విజయం ప్రాప్తిస్తుందని నమ్మడం వల్లే, ఈరోజున బంగారం కొనుగోలు చేయడమనే ఆచారం ఆనవాయితీగా వస్తూ ఉంది. అలాగని తాహతుకు మించి బంగారం, వెండి వస్తువులను కొనడంవల్ల ఉపయోగం లేదు.  

పురాణ గాథలు

*కుబేరుడి గాథ.. ఈ విశ్వంలో సంపద.. ఏ రూపంలో వున్నా దానికి అధిపతి మాత్రం కుబేరుడే. ‘నవ నిధులు(పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చస) ఆయన అధీనంలోనే వుంటాయి. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడట. అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఇంతకు కుబేరుడు ఎవరు? ఆయన్న ఎందుకు పూజించాలి? అంటారా..

కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయన మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవాడు. వేదాధ్యయనం గావిస్తూ నిష్టతో తపస్సు చేస్తున్నాడు. ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, రుషికన్యలు, రాజర్షికన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరివల్ల తరచూ తపోభంగం కలుగుతుండేది. అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికంటూ, ఆ ప్రదేశానికి రావద్దనీ, ఒకవేళ ఎవరైనా వచ్చి, తనని చూసినచో గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు. ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి, పులస్త్యుడుని చూడటంతో వెంటనే గర్భం దాలుస్తుంది. భయాందోళనలతో, ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి, తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆయన అంగీకరిస్తాడు. అలా వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కొడుకు కుబేరుడు.

అనేకమంది దేవతలు ఆయన్ను పూజిస్తుంటారు. ఇంతటి తరగని సంపదను తన ఆధీనంలో పెట్టుకుని, తనని పూజించిన వారిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని అంటారు. ఈ కారణంగానే చాలామంది ‘దీపావళి’ రోజున కుబేరున్ని పూజిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో, అంకిత భావంతో కుబేరుడి మనసు గెలుచుకుంటే, అనతికాలంలోనే అపర కుబేరులవ్వొచ్చని నమ్మకం.

కుబేరుడి తల్లిదండ్రులు విశ్రావసుడు, ఇలవిల. ఈ కారణంగానే కుబేరుడిని ‘వైశ్రవణుడు’ లేదా ఐల్వల్యుడు అని పిలుస్తుంటారు. 

తన కఠోరమైన తపస్సుచే బ్రహ్మదేవుడిని మెప్పించి, ఆయన అనుగ్రహంతో అష్టదిక్పాలక పదవిని, నవనిధులకు అధిపతి స్థానాన్ని సంపాదించాడు. కుబేరుడు ఒక చేతిలో గదను కలిగివుండి, మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తాడు. ఆయన చుట్టుపక్కల నవనిధుల రాశులు దర్శనమిస్తుంటాయి. వెంకటేశ్వరస్వామి అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం.

కుచేలుడి వృతాంతం శ్రీకృష్ణుడు ద్వారకకు రాజైన తర్వాత కలిసేందుకు బాల్యమిత్రుడైన కుచేలుడు వచ్చింది ఈరోజునేనట.. కటు పేదరికంలో ఉన్న కుచేలుడి వద్ద అటుకులు మాత్రమే ఉన్నాయి. తాను తీసుకొచ్చిన ఆ గుప్పెడు అటుకులకు సంతుష్టుడైన గోపాలుడు.. కుచేలుడు దరిద్రాన్ని తీరుస్తాడు. అందుచేత ఈ రోజున ఎవరైతే కృష్ణుని ప్రార్థిస్తారో, వారిని కూడా ఆ పరమాత్ముడు కుచేలుని పట్ల చూపిన అనుగ్రహాన్నే ప్రసాదిస్తాడని నమ్మకం.

పరశురాముని జయంతి శ్రీ మహావిష్ణువు పరశురామునిగా అవతరించిన వైశాఖ శుద్ధ తదియను ‘పరశురామ జయంతి’గానూ పిలుస్తారు. క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు.. పరిష్కారం కోసం  ‘పరశురామ స్తుతి’ మండలకాలంపాటు పారాయణ చేసినట్లైతే అద్భుత ఫలితాలు కలుగుతాయని నమ్మకం. పరశురాముడు భృగు వంశానికి చెందినవాడు. అందుచేత “భార్గవ రాముడు” అని పేరు. తండ్రి జమదగ్ని, తల్లి రేణుక. ఈమె క్షత్రియ కాంత. ఒకనాడు పరశురాముడు చిన్నతనంలో.. భృగువు ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఇతని ముత్తాత హిమాలయాలకు వెళ్లి, శివుడి కోసం తపస్సు చేయమని చెప్తాడు. చెప్పినట్లుగానే అక్కడికి వెళ్లి, శివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. శివుడు ప్రత్యక్షమై.. ‘నీవు ఇంకా చిన్నవాడివి, రౌద్రాస్త్రాలు ధరించేంత శక్తి సామర్థ్యాలు నీకు ఇంకా కలగలేదు. కొంతకాలం తీర్థయాత్రలు సాగించి తిరిగి రావాల్సింది’గా చెప్తాడు. యాత్రల అనంతరం తిరిగి తపస్సు చేస్తాడు. అయితే ఒకపక్క రాక్షస బాధలు ఎక్కువైన ఇంద్రాది దేవతలు శివుని వద్దకు వచ్చి శరణు వేడుకుంటారు. అప్పుడు శివుడు, రాముని పిలిచి పరశువు అనే గండ్రగొడ్డలి ఆయుధాన్ని ఇచ్చి, దేవతల మీదకు పంపాడు. ఆ ప్రకారమే ఆయన పరశురాముడయ్యాడు. ఆపై స్వర్గలోకంలో రాక్షసులు లేకుండా చేశాడు. 

ఆ తర్వాత పరశురాముడు తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఒకనాడు తల్లి రేణుక, నీటి కోసం ఏటికి వెళ్తుంది. అక్కడ చిత్రరథుడనే గంధర్వరాజు కుమారుడు తన భార్యతో జలవిహారం చేస్తాడు. అది చూసిన రేణుక.. తనకా అవకాశం లేకుండా పోయిందని మనసులో అనుకుంటుంది. అదే చింతతో ఆశ్రమానికి తిరిగి వస్తుంది. ఆలస్యానికి కారణాన్ని గమనించిన ముని… రేణుకను కళంకితగా భావించి, తనను చంపవల్సిందిగా జమదగ్ని కొడుకులను ఆదేశిస్తాడు. ముగ్గురు కొడుకులు ఆ పని చేసేందుకు ఒప్పుకోరు. నాలుగో కుమారుడైన పరశురాముడు.. వెంటనే ఆమెను ఖండిస్తాడు. ఇది మెచ్చి, తండ్రి ఏదైనా వరం కోరుకోమని అంటాడు. బదులుగా మాతృభిక్ష  పెట్టమని వేడుకుంటాడు. దీంతో రేణుక తిరిగి బతుకుతుంది. 

ఇక ఈయన తరువాతి అవతారం రామావతారం… కాలములో, నామంలో ఇద్దరు స్వారుప్యాన్ని పోలి ఉన్నారు. అయితే శివధనస్సు విరిచిన శ్రీరాముడుని ఎదురించినందుకు పరశురాముడు భంగపడతాడు. ఆఖరికి ఆజన్మ క్షత్రియ కులహంతకుడైన పరశురాముడు.. క్షత్రియుడైన రాముని చేతిలో ఓడిపోతాడు. విచిత్రంగా.. ఇద్దరు విష్ణువు అవతరాలే..

అయితే శ్రీకృషుడు, శ్రీరాముని జయంతిలకున్న విశిష్టత పరశురాముడి జయంతికి లేదు. వారిలానే ఈయన విష్ణువు అవతారం.. కాబట్టి అదే విధంగా జరపవలసిందిగా శాస్త్రాలు చెబుతున్నాయి. మన దగ్గర ప్రచారంలో లేదు. కానీ మధుర, వారణాసిలో మాత్రం ఈయన జయంతి ఘనంగా నిర్వహించడం విశేషం.

అప్పన్న.. చందనోత్సవం.. నర, వరాహ, సింహ అవతారాల కలయికతో త్రిభంగిమూర్తిగా సాక్షాత్తు శ్రీమహావిష్ణువే.. అప్పన్నగా వెలసిన దివ్యధామం సింహగిరి. ఏడాదిలో 364 రోజులు సుగంధ పరిమళ చందనంలో కొలువై ఉంటాడు. ఒక్క వైశాఖ శుద్ధ తదియ అయిన అక్షయ తృతీయనాడు తప్ప.. ఎందుకంటే ఆరోజున చందన ఆచ్ఛాదనాన్ని వీడి, నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అదేరోజు రాత్రి సహస్ర ఘటాభిషేకం పేరుతో, తిరిగి స్వామిని చందనంతో అలంకరిస్తారు. ప్రహ్లాద మందిరంలో కొలువైన అప్పన్నస్వామి చందనోత్సవాన్ని మొదలుకొని శ్రావణ పౌర్ణమి వరకు చందన లేపనంతో శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతాడు. ఇలా ఏడాదిలో నాలుగు మాసాలు వివిధ రూపాల్లో దర్శనమిచ్చి, వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రం నిజరూపంలో కనిపించడం ఈ క్షేత్రం విశిష్టత. మళ్లీ నిజరూప దర్శనం వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది.

కథ హిరణ్యకశిపుడి వధ అనంతరం ప్రహ్లాదుని కోరిక మేరకు మానవ దేహం, వరాహ వదనం, సింహవాలంతో కలిపి సింహగిరిపై స్వామి దర్శనం ఇచ్చాడనీ, అలా దర్శనమిచ్చిన స్వామికి ప్రహ్లాదుడు ఆలయాన్ని నిర్మించి ఆరాధించాడనీ పురాణాలు పేర్కొంటున్నాయి. కాలక్రమంలో స్వామికి ఆరాధన కార్యక్రమాలు నిలిచిపోవడంతో… స్వామివారిని భూదేవి పదిలంగా కాపాడుకుంది.

కొన్నాళ్ళకు.. ఒకనాడు చంద్రవంశ చక్రవర్తి పురూరవుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తుండగా… వరాహ నృసింహస్వామి ఉన్న చోటుకు వచ్చేసరికి అతని విమానం ఆగిపోయిందట. భూమి మీదకు దిగిన పురూరవుడికి ఆకస్మాతుగా అశరీరవాణి వినిపించింది. శ్రీ నరసింహస్వామివారి మూర్తి పుట్టలో ఉందనీ, దానిని వెలికితీసి, ఆలయాన్ని నిర్మించాలనీ చెప్పింది. అంతేకాదు, పుట్ట మీద మట్టిని పురూరవుడు తొలగిస్తూ ఉండగా… స్వామివారి మీద ఉన్న పుట్ట మన్ను ఎన్ని కిలోల బరువు ఉందో, అంతే బరువున్న చందనాన్ని స్వామికి పూత పూసి, అర్చనలు చేయాల్సిందిగా అశరీరవాణి ఆదేశించింది. ఇలా పురూరవ చక్రవర్తికి దర్శన భాగ్యం కలిగిన ఆరోజున మాత్రమే భక్తులకు స్వామి నిజరూప దర్శనం చూసే భాగ్యం కలుగుతుందని చెప్పింది. ఇలా ఆ ఆనతి మేరకు పురూరవుడు చందనసేవను జరిపాడు. ఆ రోజుయే.. వైశాఖ మాస శుక్ల పక్ష తదియ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆరోజు మాత్రమే కొన్నిగంటలసేపు భక్తులకు నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుంది.

ఇతర ప్రత్యేకతలు

* అక్షయ తృతీయ రోజునే.. త్రేతాయుగం ఆరంభం అయిందని చెబుతారు. ఆ రకంగా చూస్తే ఇదీ ఒక ఉగాదే.

* వైశాఖ మాసంలోని రోహిణి నక్షత్రంనాడు.. కృష్ణుని సోదరుడైన బలరాముడు జన్మించాడని దక్షిణాదివారి నమ్మకం. అక్షయ తృతీయ అటుఇటుగా కృత్తిక లేదా రోహిణి నక్షత్రం ఉన్న రోజునే వస్తుంటుంది. కాబట్టి ఈ రోజును ‘బలరామ జయంతి’గా కూడా జరుపుకొంటారు.

* ఈరోజునే వేదవ్యాసుడు చెబుతుండగా, గణేశుడు మహాభారతాన్ని రాశాడు. ఆ ప్రకారం చూస్తే ఇద్దరూ కూడా ఈ రోజున ఇద్దరు పూజనీయులే కదా.

* జైనుల తీర్థంకరుడైన రిషభనాథుడు.. ఈరోజునే తన ఉపవాసాన్ని విరమించాడట. ఆ కారణంగా జైనులు కూడా అక్షయతృతీయను ఘనంగా నిర్వహించుకుంటారు.

* యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు అక్షయపాత్రను పొందినది ఇదే రోజునట. ఆ పాత్రతో తన రాజ్యంలోని వారి అవసరాలన్నీ తీర్చాడని మహాభారతం చెబుతోంది.

* దుర్యోధనుని ఆజ్ఞానుసారం దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణం కావించగా, శ్రీకృష్ణుడు అక్షయంగా చీరలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడింది కూడా ఈ రోజే.

* ఆదిశంకరాచార్యుల వారు కనకధారాస్తవం చేసిన రోజు.. ఒకనాడు పేద బ్రాహ్మణ దంపతులు శంకరాచార్యులకు భిక్ష వేయడానికి ఇంట్లో ఎం లేకపోవడంతో, ఉన్న ఒక ఉసిరికాయను మాత్రమే ఆయనకు భిక్ష వేయగా… ఆయన పఠించిన కనకధారస్తవానికి ఉసిరికాయలు అక్షయంగా కురిశాయని ప్రతీతి.

* శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజును సైతం ‘అక్షయ తృతీయ’గా పిలుస్తున్నట్లు పురాణాల్లో ఉంది.

* పూరీ జగన్నాథుని వార్షిక రథయాత్ర సైతం ఈ రోజునే ప్రారంభమవుతుంది.

Show More
Back to top button