Telugu Special Stories

సైకిల్ ప్యూర్ అగర్ బత్తులు..ఎందుకంత ప్రత్యేకం..!ఆ బ్రాండ్ వెనుక అసలు కథ..!

శుభకార్యమైన.. పర్వదినమైన.. పుట్టినరోజు అయిన.. వేడుక ఏదైనా.. ధూప, దీప, నైవేద్యం తప్పనిసరి.. మన తెలుగు లోగిళ్లలో నిత్యం పూజ చేయడం ఆనవాయితీగా వస్తున్నది.. అందులో మనం ధూపం వెలిగించే సమయంలో అగర్ బత్తిలు చాలా కీలకం అవుతాయి. పూజకు సరైన శోభను, ఇంట్లో పాజిటివిటిని పెంచేది ప్రత్యేకమైన సువాసనలతో కూడిన ఈ అగరొత్తులు…

ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అగర్ బత్తుల్లో నేడు ఎన్నో బ్రాండ్ లు.. రకాలు వచ్చి ఉండొచ్చు.. కానీ స్థాపించిన నాటి నుంచి నేటికీ తన మార్క్ ను చూపిస్తూ.. దేశ విదేశాల్లో అత్యధిక అమ్మకాలు సాగిస్తున్న బ్రాండ్ మాత్రం ఒక్కటే.. అదే సైకిల్ ప్యూర్ అగర్ బత్తిలు.. 

బిస్కెట్లు అమ్మి.. తర్వాత సైకిల్ మీద ఇంటింటికి తిరుగుతూ తన అగర్ బత్తిలను అమ్మి.. నేడు అదే సైకిల్ బ్రాండ్ గా కోట్లాది ఇళ్ళల్లో స్థిరపడిపోయిన వ్యక్తి.. వ్యాపారవేత్త అయిన ఎన్. రంగారావు.. ఆయన స్థాపించిన ఈ బ్రాండ్ ఎలా ఎదిగిందో ఇప్పుడు చూద్దాం..

ఎన్. రంగారావు సొంతూరు.. మైసూరు.. తండ్రి నారాయణ్ ఆచార్య, ఉపాధ్యాయుడు.. రంగారావు 6 సంవత్సరాల వయసులోనే తన తండ్రి మరణించారు. అప్పటినుంచి అతని కుటుంబంలో ఇబ్బందులు ఎక్కువయ్యాయి. చదువు కొనసాగడం కష్టమైంది.. అయినా సరే చదువుపై విపరీతమైన ఆసక్తితో పట్టుదల వదలకుండా తన చదువు కొనసాగించేందుకోసం తన స్కూల్ బయట బిస్కెట్లు అమ్మడం మొదలు పెట్టాడు. బిస్కెట్లు అమ్మగా వచ్చిన డబ్బుతో ఫీజు కట్టుకునేవాడు.. అవి పోగా ఇంటి అవసరాలకు ఇంట్లో ఇచ్చేవాడు. ఇలా తన విద్యాభ్యాసం పూర్తైంది. వీరిది బ్రాహ్మణ కుటుంబం కావడంతో.. అప్పట్లో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మగపిల్లలకు రెండే దారులు ఉండేవి.. ఒకటి పౌరోహిత్యం లేదా పాఠాలు చెప్పే పంతులు అవ్వడం. కానీ ఈయన ఆ రెండు కాదని మరో దారిని ఎంచుకున్నారు.. అదే వ్యాపారం.. తనకు వచ్చిన చిన్న ఆలోచనతో.. మంచి పునాదులు వేసి.. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ.. నేడు భారత్ లోనే తిరుగులేని బ్రాండ్ గా మారి.. ఇప్పుడు1500 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీగా మార్చారు.

తొలుత వ్యాపారం చేయాలనే తృష్ణతో ఉన్న ఉద్యోగం మానేశాడు.. ఆయన 1930లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మరొక ఉద్యోగం వెతుక్కుంటూ అరువ్‌కండు వెళ్లారు. అక్కడ ఓ ఫ్యాక్టరీలో గుమాస్తాగా పనిచేయడం ప్రారంభించారు. కానీ ఆ ఉద్యోగం నచ్చక 1948లో మానేశారు. ఇక తనకు ఉద్యోగాలు తగవని.. వ్యాపారం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తన తల్లి నగలు అమ్మేశాడు. కేవలం రూ. 4000 రూపాయలతో పెట్టుబడి పెట్టి, వ్యాపారం ప్రారంభించాడు.1947లో స్వాతంత్య్రం వచ్చాక బిజినెస్ పెట్టాలనే ఉద్దేశంతో తన కుటుంబంతో కలిసి మైసూర్ వెళ్లిపోయాడు.

ఏడాది కాలంలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని.. టూత్ పౌడర్, శిక్కాయ్, అగర్ బత్తి లాంటివి తయారు చేసి.. అమ్మడం మొదలు పెట్టాడు. వ్యాపారం చేయడం ప్రారంభించిన కొత్తలో సైకిల్‌పై వీధి వీధి తిరుగుతూ అగరబత్తులు అమ్మేవాడు. ఇలా చేయడం వల్ల తన అగర్బత్తిలు సామాన్యులను ఎంతో ఆకర్షించాయి.. అంతేకాదు మహిళలకు ఉపాధి కల్పించేందుకు.. వారికి అగరబత్తీలను తయారు చేయడం కూడా నేర్పారు. అలా మహిళలతో అగరబత్తిలను తయారు చేయించి.. వారిని ఉపాధి మార్గంలో పయనించే విధంగా అడుగులు వేయించారు. అంతేకాదు “ఎన్ ఆర్ గ్రూప్” పేరుతో ఒక కంపెనీని కూడా ప్రారంభించారు. అనంతరం సబ్బు-గింజల పొడి (షికాక్కాయ్) అగరుబత్తీలు (అగర్బత్తీలు) తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాడు.

అతని పెద్ద కొడుకు గురు.. అతని పెద్ద సోదరితో కలిసి అగర్బత్తీలు ప్యాక్ చేయడంలో తండ్రికి సహాయం చేసేవారు. ఇలా ఇంటిల్లిపాదీ ఈ రంగంలో ఆరితేరారు. 1950 చివరి నాటికి అతని వ్యాపారం మరింత పుంజుకుంది. 1956లో గ్రీజుప్రూఫ్ పేపర్ రోల్స్‌లో అగర్బత్తీలను ప్యాక్ చేసి విక్రయించడం మొదలుపెట్టారు. ఇందులో 25 స్టిక్‌లు ఉండేవి.. ఒక అణా అంటే బ్రిటీష్ రోజుల్లో రూపాయిలో పదహారవ వంతు) ధర అన్నమాట. ఆయన తయారుచేసిన 

వాటిల్లో అగర్బత్తిలకు ఎక్కువ గిరాకీ ఉండడంతో వాటినే ఎక్కువగా తయారు చేసి అమ్మేవారు. అగరుబత్తిని మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు తనకంటూ ప్రత్యేకత ఉండేందుకు ఒక సొంత ఫ్రాగ్నెనెన్స్ మార్కెట్ లో రన్ అవ్వాలని కోరుకున్నాడు. ఒక క్రియేటివ్ ల్యాబ్ ని ఏర్పాటు చేసి మరింత క్వాలిటీగా వాటిని తయారు చేయడం మొదలు పెట్టాడు. ఇలా ప్రత్యేక సువాసనలతో కూడిన అగర్ బత్తిలకు మార్కెట్ లో ఒక ప్రత్యేకమైన డిమాండ్ వచ్చింది. అప్పటివరకు దానికి ఒక పేరు అంటూ ఏం లేదు. కేవలం అగర్బత్తిలను ప్యాకింగ్ చేసే రంగును బట్టి ఆయా వాటిని గుర్తించేవారు.. అలానే పిలిచేవారు.

దీంతో తన అగర్బత్తిలకు ‘సైకిల్’ అనే పేరును ఖరారు చేశారు.. ఎందుకంటే తాను మొదట సైకిల్ పైన వెళ్లి అగర్బత్తిలను అమ్మేవాడు కాబట్టి అందరూ సులువుగా గుర్తుంచుకుంటారనే ధోరణిలో ఆ పేరు పెట్టాడు. అగర్బత్తిల తయారీలో ఎక్కువగా ఆడవాళ్లే పని చేసేవారు.. 1978 వరకు ఎన్. ఆర్ గ్రూప్ కంపెనీ బాధ్యతలను చూసుకున్న రంగారావు గారు 1980లో చనిపోయారు. దాంతో ఆ వ్యాపారం తన  కొడుకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆయన మనవళ్ల చేతుల్లో కొనసాగుతుంది. 

వారు కూడా ఈ అగరబత్తీల కంపెనీని విజయవంతంగా నడుపుతున్నారు. ప్రస్తుతం కంపెనీ వ్యాపారం రూ. 7వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. నాడు రంగారావుగారు పునాదులు వేసిన ఈ వ్యాపారం 75 దేశాలలో సంవత్సరానికి సుమారు 1000 కోట్ల అగర్బత్తీలను ఉత్పత్తి చేస్తోంది. సైకిల్ ప్యూర్ అగర్బత్తీస్‌లో 40 సేల్స్ డిపోలు ఉన్నాయి.. ఇందులో 5,000 డిస్ట్రిబ్యూటర్‌లకు, 2,000 మంది కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్‌ల ద్వారా ఎనిమిది లక్షల రిటైల్ అవుట్‌లెట్‌లకు సేవలు అందిస్తున్నాయి.

‘ఇండియా ప్రెస్ విత్ సైకిల్’ అనే ప్రచారానికి అమితాబ్ బచ్చన్, సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖులు సైకిల్ అగర్బత్తికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.

NR గ్రూప్ 1948లో కర్ణాటకలోని మైసూర్‌లో అగరబత్తి (అగర్బతి) తయారీ సంస్థగా స్థాపించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అగరుబత్తీల తయారీదారుగా ఎదిగింది. అలానే సంబంధిత ఉత్పత్తులు.. ఎలక్ట్రానిక్స్ తయారీలో మరో ఆరు కంపెనీలుగా విస్తరించింది.

1983లో స్థాపించబడిన, Rangsons మార్కెటింగ్ అనేది సైకిల్ ప్యూర్ అగర్బత్తీస్, రిప్పల్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే ఒక స్వతంత్ర, వృత్తిపరమైన సంస్థగా ఎదిగింది. ఇది భారతదేశంలో అంతటా తన బ్రాండ్ ను విస్తరిస్తూ.. అన్ని ఉత్పత్తులను మార్కెట్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి 800 మంది మార్కెటింగ్ అండ్ సేల్స్ నిపుణులున్నారు. 1993లో స్థాపించబడిన రంగ్‌సన్స్ ఎలక్ట్రానిక్స్ CEO పవన్ రంగా నేతృత్వంలో ఉంది.  2016 నాటికి, సైకిల్ భారతదేశంలోని ధూప పరిశ్రమలో 15% వాటాను కలిగి ఉంది. దీని విలువ అక్షరాల రూ.1500 కోట్లు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా భారతదేశంలో ఇతర చోట్ల వివిధ క్రికెట్ టోర్నమెంట్‌ల స్పాన్సర్‌షిప్ ఒప్పందాల ద్వారా బ్రాండ్ ప్రకటనలు సైతం చేస్తుంది.

రంగారావుగారికి 7గురు కుమారులు, 2 కుమార్తెలున్నారు. 1948లో స్థాపించబడిన, సైకిల్ ప్యూర్ అగర్బత్తీల తయారీదారులైన ఎన్. రంగారావు అండ్ సన్స్, 6 దశాబ్దాలకు పైగా అగరబత్తి పరిశ్రమలో అగ్రగామిగా ఉన్నారు. ఇప్పుడు అర్జున్ రంగా నాయకత్వం వహిస్తున్నారు. సైకిల్ ప్యూర్ అగర్బత్తిలో 500 సువాసనల రకాలు ఉన్నాయి.. 65 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మూడు ప్రధాన బ్రాండ్లు మార్కెట్ లో నడుస్తున్నాయి.. సైకిల్ – త్రీ ఇన్ వన్, లియా, రిథమ్, వుడ్స్, ఎన్ఆర్, ఫ్లూట్.

NR ఫౌండేషన్, వికలాంగుల కోసం రంగారావు, మెమోరియల్ స్కూల్, ప్రాజెక్ట్ ప్రేరేపణ, సైకిల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, మహిళా సాధికారత కోసం వృత్తి శిక్షణ, రంగ జ్ఞాన వినిమయ కేంద్రం (RJVK), సపోర్టింగ్ ఆర్ట్ & కల్చరల్ ఈవెంట్స్, సైకిల్ హెరిటేజ్ లాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన పేరు మీద నడిపిస్తున్నారు.

ఒక చిన్న కుటీర పరిశ్రమగా మొదలైన సైకిల్ అగర్బత్తి కాలక్రమంలో అంచలంచెలుగా ఎదిగి.. నేడు దేశంలోనే పాపులర్ బ్రాండ్‌గా మారింది.. రంగారావు గారి కృషి, పట్టుదలతో పాటు ఆయన తెలివితేటలు, సామర్థ్యంతో.. కోట్ల టర్నోవర్ కంపెనీగా ఎదిగింది. ఇది ఈరోజు కథ..

Show More
Back to top button