ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళలాడే హైదరాబాద్ నగరంలో నేడు చిన్నపాటి వర్షానికే ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీల్లో, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు వరదకు గురికాకుండా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి సమన్వయంతో సరైన ప్రణాళిక సిద్ధం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆదాయంపై దృష్టి సారించి మౌలిక వసతుల పెట్టుబడులపై దృష్టి సారించకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడంలో ప్రభుత్వాలు విఫలమవడం ఒక కారణమైతే చెరువులను ఆక్రమించి, నాళాలను మూసేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ప్రధాన కారణం. హైదరాబాద్‌లో 2000 సంవత్సరానికి ముందు లేని వరదలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యకు ప్రధాన కారణం ఏమిటి? హైదరాబాద్ వరదలకు ప్రభుత్వాలు ఎందుకు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నాయి? హైదరాబాద్ చరిత్ర తెలిస్తే తప్ప వీటన్నింటికీ సమాధానం తెలుసుకోవడం కష్టం.
16, 17 శతాబ్దాలలో కుతుబ్ షాహీ కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెరువులు, కుంటలు ఉండేవి. 1970 నుంచి చెరువులు ఒక్కొక్కటిగా ఆక్రమణలకు గురవుతూ కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌కు అనేక నీటి వనరులు ఉండేవి. కానీ వాటిలో 70 నుంచి 500 మాత్రమే నేడు మనుగడలో ఉన్నాయి. తీగల్ కుంట, సోమాజిగూడ ట్యాంక్, మీర్ జుమ్లా ట్యాంక్, పహార్ తీగల్ కుంట, కుంట భవానీ దాస్, నవాబ్ సాహెబ్ కుంట, అఫ్జల్‌సాగర్, నల్లకుంట, మాసబ్ ట్యాంక్ మొదలైనవి పూర్తిగా కనుమరుగవగా, మనుగడలో ఉన్న కొన్ని చెరువులు చిన్న చెరువులుగా మరియు మురికి కాల్వలుగా కుంచించుకుపోయాయి.
అడుగంటిన భూగర్భ జలాలు:
హైదరాబాదీల దాహార్తిని తీర్చేందుకు హుస్సేన్‌సాగర్, ఉస్మాన్ సాగర్ తో పాటు మరెన్నో చెరువులను నీటి వనరులుగా ఉపయోగించేవారు. ఒకప్పుడు హైదరాబాద్ లో నీటి సమస్య లేదు. ఎప్పటినుండైతే చెరువులు, కుంటలు అక్రమాలకు గురవుతున్నాయో అప్పటినుండి నగరంలో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడుతోంది. గత కొంతకాలం నుంచి ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లతో వాటర్ తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరం లోపల మరియు పరిసర ప్రాంతాలలో చెరువులు కుంటలు లేకపోవడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకక పోవడం, వృధాగా మూసినదిలో కలవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.
ఒకప్పుడు హుస్సేన్‌సాగర్ చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. నేడు నగరం లోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చే మురుగు నీరు మరియు పరిశ్రమల నుండి వచ్చే కలుషిత వ్యర్థ జలాలు హుస్సేన్ సాగర్ సరస్సులోకి వచ్చి చేరుతుండడంవల్ల మురుగు వాసనతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువుల సంరక్షణ బాధ్యతను రాజకీయ నేతలు విస్మరించి వాటిని యధేచ్ఛగా ఆక్రమించుకుని కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు.
అందుకే హైదరాబాద్ లో చినుకు పడగానే వరద కారణంగా కాలనీలు మునిగిపోతున్నాయి. నాళాలకు మరమ్మతులు చేయకుంటే భవిష్యత్తులో నగరానికి ప్రమాదం తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో వరదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన తెలంగాణ ప్రభుత్వం ఆక్రమణలు తొలగించి చెరువులను పరిరక్షించడమే పరిష్కారమని భావించింది. నగరంలోని చెరువులను పునరుద్ధరించేందుకు ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) వ్యవస్థను తీసుకొచ్చారు.
కబ్జాకు గురైన చెరువులు:
హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా నగర వాసులకు విస్తృత సేవలు అందించాలనే లక్ష్యంతో హైడ్రా ను ఏర్పాటు చేయడం జరిగింది. విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల ఆక్రమణలను అరికట్టడం, ఆక్రమణల తొలగింపు, అక్రమ నిర్మాణాలు, అక్రమ హోర్డింగ్‌లు, ప్రకటనల తొలగింపు వంటి ప్రధాన బాధ్యతలను ప్రభుత్వం హైడ్రా కు అప్పగించింది.
రోజురోజుకూ వలసలు పెరిగి రియల్ బూమ్ ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, కాలువలు కనుమరుగవుతున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో నగరంలోని అన్ని చెరువుల్లో దాదాపు 80 శాతం ఆక్రమణలకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. కొన్ని చెరువులు, కుంటలు పూర్తిగా ఆక్రమణలకు గురై కాలనీలుగా మారడంతో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 920 చెరువుల్లో 491 చెరువులు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ విస్తీర్ణం కేవలం 30 ఏళ్లలో ఏకంగా 499 ఎకరాలు కబ్జాకు గురై 1359 ఎకరాల నుంచి 860 ఎకరాలకు కుంచించుకు పోయింది.
శామీర్‌పేట్ చెరువు 1989లో 1200 ఎకరాలు ఉండగా 2006లో దాదాపు 568 ఎకరాలు ఆక్రమణకు గురై 632 ఎకరాలకు తగ్గింది. ఇలా ఎన్నో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్ని చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయి.
2010 నాటికి, 500 సరస్సులు హుడా పరిధిలో ఉండగా, మే 2018 నాటికి 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన 169 చెరువులు మాత్రమే ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయబడ్డాయంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు.
కూకట్‌పల్లి, మూసాపేటలో అతిపెద్ద చెరువు మైసమ్మ చెరువు ఒకప్పుడు 280 ఎకరాలు ఉండగా.. ఓ నాయకుడు వెంచర్లు వేసి ప్లాట్లుగా విభజించి విక్రయించాడు. ఇలా ఆక్రమణలతో ఇప్పుడు సగానికి పైగా కుంచించుకుపోయింది. అంతేకాదు కూకట్‌పల్లి సర్వే నంబర్ల పరిధిలోని కాముని చెరువు 50 ఎకరాలు ఉండగా, ఒకవైపు అల్లాపూర్ డివిజన్, బాలాజీనగర్ డివిజన్‌ల ద్వారా రెండు వైపులా చెరువు ఆక్రమణలకు గురై చాలా వరకు కుంచించుకుపోయింది.
నేరేడ్‌మెట్ డివిజన్ పరిధిలోని ఆర్కే పురం చెరువు గతంలో 70 ఎకరాల్లో విస్తరించి ఉండగా నేదు అందులో సగం కూడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
గోల్కొండ మండల రెవెన్యూ పరిధిలోని లంగర్‌హౌస్ చెరువు విస్తీర్ణం దాదాపు 26 ఎకరాలు కాగా ప్రస్తుతం చెరువు 12.5 ఎకరాలకే పరిమితమైంది. దాదాపు 13.5 ఎకరాల చెరువు కబ్జాకు గురైంది.
వినాయకనగర్, మౌలాలి, ఆనంద్‌బాగ్ డివిజన్లలోని బండ చెరువు గతంలో వంద ఎకరాల్లో విస్తరించి ఉండేది. చెరువు పరిరక్షణకు అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం, నేటికీ చెరువు ఎఫ్‌టీఎల్ పరిమితులు ఖరారు కాకపోవడంతో సగానికిపైగా చెరువు కబ్జాకు గురైంది.
ఒకప్పుడు 290 ఎకరాల విస్తీర్ణంలో ఉండే జీడిమెట్ల గ్రామానికి సమీపంలోని కొల్లాచెరువును రాజకీయ నేతల అండదండలతో ఆక్రమించి అక్రమ నిర్మాణాలు, పరిశ్రమలు నిర్మిస్తున్నారు. నేడు 126 ఎకరాల చెరువు మాత్రమే మిగిలి ఉంది. కబ్జాదారులకు ప్రజాప్రతినిధులు అండగా నిలవడం సిగ్గుచేటు.
మాదాపూర్‌లోని దుర్గం చెరువు ఒకప్పుడు 180 ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రస్తుతం 130 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. 50 ఎకరాల చెరువు భూమి ఆక్రమణకు గురైంది. చెరువు ఎఫ్‌టీఎల్ స్థలంలో పలు కాలనీలు ఏర్పడి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. శేరిలింగంపల్లిలోని తారానగర్ సర్వేనెంబర్ 19 వడులకుంట 1.02 ఎకరాల విస్తర్ణంలో ఉండగా, ప్రస్తుతం 200 గజాల మాత్రమే మిగిలింది.
కొన్ని చెరువులు చూద్దామన్నా కనిపించకపోవడం అంతేకాకుండా అవన్నీ ఇప్పుడు కాలనీలుగా మారడం అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది. గ్రేటర్‌లో చెరువుల ఆక్రమణ యధేచ్చగా సాగుతూనే ఉంది. అందుకారణంగా నగరంలో చిన్న వర్షం కురిసినా వరద పోటెత్తుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు భద్రత కల్పించే లక్ష్యంతో హైడ్రా ను ఏర్పాటు చేసి ఎంతటివారినైనా ఉపేక్షించకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది.
హైడ్రా పాత్ర ఏమిటి?
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా విభాగం గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. హైడ్రా ప్రోయాక్టివ్ విధానం కేవలం అక్రమ నిర్మాణాలను తొలగించడమే కాకుండా ప్రభుత్వ భూమిని పునరుద్ధరించడం మరియు హైదరాబాద్ పట్టణాభివృద్ధి చట్టపరమైన మరియు నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం, చట్టానికి ఎవరూ అతీతులు కాదు మరియు పబ్లిక్ ఆస్తులను తిరిగి పొందడం మరియు రక్షించడం అనే లక్ష్యంతో పనిచేస్తుంది. GHMC పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు అక్రమ నిర్మాణాలు, నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగులు, ప్రకటనల తొలిగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాలో హైడ్రా కీలకమైన పాత్ర పోషిస్తుంది.
ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కూల్చివేత చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు నెలల్లో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వెంబడి ఆక్రమణకు గురైన సుమారు 44 ఎకరాల భూమిని విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సాహసోపేతమైన చొరవ 18 అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి దారితీసింది, వాటిలో చాలా వరకు ప్రముఖ వ్యక్తులు మరియు రాజకీయ ప్రముఖులకు చెందినవి కావడం విశేషం.
హైడ్రా కూల్చివేతలు, స్వాధీనం చేసుకున్నవి:
హైదరాబాద్ లో పలు ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఆక్రమణల పై నోటీసులు జారీ చేసింది. హెచ్చరికలు చేసినా నిర్మాణాలు చేస్తున్న వాటిని కూల్చి వేస్తోంది. హైడ్రా ఇప్పటివరకూ మొత్తం 111 ఎకరాల చెరువుల భూములను కాపాడినట్లు ఒక నివేదికలో పేర్కొంది. అత్యధికంగా అమీన్ పూర్ లేక్ 51.78 ఎకరాలు, బుమ్రాక్ డౌలా 12 ఎకరాలు, సున్నం చెరువు 10 ఎకరాలు , గండిపేట్ లేక్ 8.75 ఎకరాలు , గండిపేట్ చిల్కూర్ 6.5 ఎకరాలతో పాటు మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
హైడ్రా ఇప్పటి వరకు మొత్తం 262 నిర్మాణాలు కూల్చివేయగా.. ఒక్క అమీన్‌పూర్ చెరువులోనే 51.78 ఎకరాల్లో 24 నిర్మాణాల కూల్చివేసింది. సున్నం చెరువులో 10 ఎకరాలు రికవరీ చేసింది. సున్నం చెరువులో 42 నిర్మాణాలు కూల్చివేయగా.. కత్వా చెరువు FTL, బఫర్‌జోన్‌లో 2.5 ఎకరాలు రికవరీ అయింది. కత్వా చెరువులో 13 విల్లాలు కూల్చివేసింది. గండిపేట్ చెరువులో 8.75 ఎకరాలు రికవరీ చేయగా.. గండిపేట్ లేక్‌లో చిలుకూరు వద్ద మరో 6.5 ఎకరాలు, తుమ్మిడికుంట చెరువులో 4.9 ఎకరాలు రికవరీ చేసినట్లు హైడ్రా వెల్లడించింది.
WRITER
కోట దామోదర్