Telugu Special Stories

‘భారతీయకవికోకిల’.. సరోజినీనాయుడు!

ప్రముఖ కవయిత్రి, ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధురాలు, గొప్ప వక్త కూడా…

స్వాతంత్య్ర ఉద్యమం తొలినాళ్లలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించినవారిలో ఆద్యులు ఆమె…

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేసిన మొదటి భారతీయురాలు.

భారతదేశంలోని ఒక రాష్ట్రాని(ఉత్తరప్రదేశ్‌)కి గవర్నర్‌గా పనిచేసిన తొలి మహిళ.

స్వీయకవిత్వంతో.. ‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా(భారతీయ కవికోకిల)’గా ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన సరోజినీ ఛటోపాధ్యాయ. ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది. నైజాం నవాబును సైతం తన రచనలతో ఆశ్చర్యపరిచింది.

గాంధీజిని ‘మహాత్మా’ అని సంబోధించింది. ఆయనకు అనునాయిగా వ్యవహరించింది. 

మహిళా సమస్యలు, అంటరానితనంపై తీవ్ర పోరాటం చేసింది..

‘హిందూ-ముస్లీం భాయిభాయి’ అంటూ సఖ్యతను చాటేలా నినదించింది. అటువంటి పేరెన్నిక గల నాయకురాలు.. 144వ జయంతి(ఫిబ్రవరి 13న) సందర్భంగా ఆమె జీవిత విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

జననం

1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌ లోని బెంగాలీ బ్రాహ్మణ కుంటుంబంలో జన్మించారు సరోజినీ నాయుడు. ఆమె తండ్రి అఘోరనాథ్ ఛటోపాధ్యాయ.. శాస్త్రవేత్త, తత్వవేత్త. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలను స్థాపించి, చాలాకాలం ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఈయనే మొదటి ప్రిన్సిపాల్ కూడా. తల్లి వరద సుందరిదేవి, కవియిత్రి. ఈమె బెంగాలీలో కవిత్వం రాశారు. ఎనిమిది మంది తోబుట్టువుల్లో.. ఈమె పెద్ద. అమ్మనాన్నలు ఇద్దరూ అక్షరాస్యులవ్వడం.. సాహిత్యాభిరుచిని కలిగి ఉండటంతో పుస్తకాలు ఎక్కువగా చదివేవారట. ఆ మక్కువతోనే ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ, పర్షియన్ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. పిబిషెల్లీ కవిత్వమంటే ఆమెకు ఎక్కువ ఇష్టమట.

పన్నెండేళ్ల వయసులో.. 1891లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్ లో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయి ఖ్యాతిని పొందారు. మహిళా విద్యపై అనేక ఆంక్షలున్న ఆరోజుల్లోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సరోజిని ఉన్నతవిద్యను అభ్యసించడం గర్వకారణం. ఆమె తెలివితేటలకు, కవితా రచనకు ముగ్ధుడైన నిజాం నవాబు ఆమెను విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్ షిప్ ఇప్పించాడు. 1898 వరకు ఇటలీ, స్విట్జర్లాండ్‌ లో ఉండి అపారమైన విజ్ఞానాన్ని సంపాదించిన ఆమె ఎందరో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయితల కవిత్వాలు, గ్రంథాల్ని ఔపోసన పట్టారు.  

ఎన్నో ఆంగ్ల కవితలను రాసి, అక్కడి విదేశీయుల ప్రసంశలను సైతం అందుకున్నారు.

అదే యేడు, స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత డిసెంబర్‌ 2న, తన పంతొమ్మిదో యేట, డాక్టర్‌ గోవిందరాజులు నాయుడును ప్రేమవివాహాం చేసుకున్నారు. వారి విహహాన్ని ఆనాటి సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించడం విశేషం. 

అప్పట్లో కులాంతర వివాహలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రోజులవి.. అయినా ఆమె తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఎందరికో ఆగ్రహాన్నీ తెప్పించినా, సరోజిని వాటిని లెక్కచేయకుండా ధైర్యంగా నిలిచారు. వీరికి జయసూర్య, పద్మజ, రణధీర్, లీలామణి నలుగురు సంతానం.

సాహిత్య కృషి

ఓసారి, ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వచ్చిన లెక్కల మాస్టారు ఇచ్చిన లెక్కతో విసుగెత్తిన సరోజినీ.. కాస్త విరామం కోసం లేడీ ఆఫ్ ది లేక్ అనే పేరుతో ఏకంగా 1300 లైన్లతో కూడిన పద్యం రాసిందంటే.. ఆమెకు సాహిత్యమంటే ఎంత మక్కువో విడిగా చెప్పనవసరం లేదు..

అది మొదలు, తండ్రితో కలిసి ‘మెహర్ మునీర్’ అనే పద్య నాటకాన్ని రచించింది. ఇదే ఆమె ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉపయుక్తమైంది. 

మహిళల విద్యకోసం, అంటరానితనం నిర్మూలన కోసం రాజీలేని పోరాటం చేసింది. 1905లో గోల్డెన్‌ థ్రెషోల్డ్‌, 1912లో దబర్డ్‌ ఆఫ్‌ టైమ్‌, 1917లో ది బ్రోకెన్‌ వింగ్‌, ద పోయెమ్స్‌ ఆఫ్‌ లైఫ్‌ అండ్‌ డెత్‌, క్వీన్స్ రైవల్, ది ఫిదెర్ ఆఫ్ డాన్ తదితర కవితాసంపుటాలు వచ్చాయి. 

ఆమె కవితకు ‘కెయిజర ఇ హింద్‌’ స్వర్ణ పతకం లభించింది. 

బజార్స్ ఆఫ్ హైదరబాద్, ది రాయల్ టూంబ్స్ ఆఫ్ గోల్కొండ, బాంగిల్ సెల్లర్స్, ఇండియన్ వీవర్స్.. అనేవి భారతీయతను చాటేలా రాసిన ఇతర కవితలు.

స్వాతంత్ర్య ఉద్యమంలో

1905లో బెంగాల్ విభజన జరుగుతున్న నేపథ్యంలో భారత జాతీయ ఉద్యమంలో చేరారామె… 

అప్పట్లో గోపాల్ కృష్ణ గోఖలే, రవీంద్రనాథ్ ఠాగూర్, మహమ్మద్ అలీ జిన్నా, అనిబిసెంట్, సి.పి.రామస్వామి అయ్యర్, గాంధీజి, జవహర్‌లాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవ్య వంటి ప్రముఖ స్వాంతంత్ర సమరయోధులతో పరిచయం ఏర్పడింది. 

హిందూ- ముస్లింల సఖ్యత గురించి ప్రజలకు వివరించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఈ ప్రకారమే, 1912, మార్చి 22న లక్నో నగరంలో జరిగిన ముస్లింలీగ్‌ మహాసభలో ‘హిందూ- ముస్లీం భాయిభాయి’ అంటూ ఆమె చేసిన ప్రసంగం ఎందరినో ప్రభావితం చేసింది. ఆమె వాగ్ధాటికి మంత్రముగ్ధులైన ప్రజలు చేసిన నినాదాలు అక్కడి సభలో మిన్నంటాయి. హిందూ ముస్లీంల ఐక్యపోరాటం వల్లనే ఆంగ్లేయులను తరిమికొట్టగలమని ఆమె ఇచ్చిన సందేశం ఎందరిలోనూ మార్పు తీసుకువచ్చిందని చెప్పాలి. 

1914లో జాతిపిత మహ్మాతగాంధీని కలిసిన సరోజిని… ఆయనకు ముఖ్యఅనుచరురాలిగా, అనుయాయిగా మారింది. 1916లో లక్నోలో జరిగిన ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో పాల్గొ నడంతో ఆమె రాజకీయజీవితం మొదలైంది. 1930లో దండయాత్ర, ఉప్పు సత్యాగ్రహలే కాక.. సహాయ నిరాకరనోద్యమం, ఇండిగో కార్మికుల కోసం నడిపిన ఉద్యమంలోనూ ముఖ్య భూమిక పోషించింది. ఇందుకు ఆమె ఎన్నోసార్లు జైలుకు వెళ్ళింది. ఆ క్రమంలోనే ఆరోగ్యం దెబ్బతింది. 1931లో లండన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో గాంధీజితో పాటు సభ్యురాలిగా పాల్గొన్నారు సరోజినీ. అనంతరం రాయల్‌ సొసైటీకి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 

1949 వరకు యునైటెడ్‌ ఫ్రావిన్సెస్‌కు గవర్నర్‌గా పనిచేసి, మహిళలు రాజకీయరంగంలోనూ రాణించగలరని నిరూపించారు. ఇదే ఏడాది(1949, మార్చి 2న), తన డెబ్బైవ ఏటా లక్నోలో ఆమె తుదిశ్వాస విడిచారు. 

సరోజినీ నాయుడు నివసించిన ఇంటికి.. ఆమె రాసిన మొదటి కవితాసంపుటి గోల్డెన్‌ థ్రెషోల్డ్‌ పేరును పెట్టగా, అదే హైదరాబాద్‌ యూనివర్సిటీ కార్యాలయంగా ఏర్పాటైంది. 

ఈమె జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న ఈమె చిత్రంలో తపాలా బిళ్ళను విడుదల చేసింది. అభిమానంతో హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో ఒక వీధికి సరోజినీ దేవి రోడ్డు అనే నామకరణం చేశారు. అలానే సరోజినీ కంటి ఆసుపత్రిని కూడా స్థాపించారు. ఈమెకు సంబంధించిన విలువైన వస్తువులు నేటికీ, సాలార్ జంగ్ మ్యూజియంలో, జాతీయ పురావస్తు శాఖలోనూ భద్రంగా ఉన్నాయి.

‘కవికోకిల’గా ప్రసిద్ది పొందిన సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా.. ఆమె సాహిత్య, రాజకీయ కృషిని గుర్తు చేసుకుంటూ నేడు మనందరం నివాళి ఆర్పిద్దాం. 

Show More
Back to top button